30, ఆగస్టు 2014, శనివారం

ఇప్పుడైనా చెప్పనీయమ్మా…

 



 
 
“ఈరోజు ఇంతటి గురుతరమైన బాధ్యత, యింతటి గౌరవించదగిన ఉద్యోగం నాకు లభించిందంటే దానికి ముఖ్యకారణం మా అమ్మగారు. ఆవిడ కడుపున పుట్టడం నా అదృష్ట మయితే, ఆవిడ ప్రవర్తన నాకు స్ఫూర్తి అయింది.” టీవీ ముందు కూర్చుని, కొడుకు యిస్తున్న ఇంటర్వ్యూ చూస్తున్న శంకర్రావు, పార్వతి ముందుకువంగి యింకాస్త శ్రధ్ధగా వినసాగారు.
 
అమెరికాలో ఒక పెద్ద సాఫ్ట్ వేర్ సంస్థకి సీ.ఈ.వో.గా ఎంపికయిన విజయ్ హుందాగా కూర్చుని యాంకర్ అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలిస్తున్నాడు. నలభై అయిదేళ్ళ విజయ్ పరిపూర్ణ వ్యక్తిత్వంతో ఆ ఫ్లడ్‍లైట్లముందు వెలిగిపోతున్నాడు. అమెరికాలో ప్రముఖసంస్థల జాబితాలో మొదటి నాలుగుస్థానాల్లో నిలబడే ఆ సంస్థకి సి.ఈ.ఓ.గా ఎంపిక కావడమంటే సామాన్యమైన విషయం కాదు. విజయ్ ఆ బాధ్యాతాయుతమైన ఉద్యోగంలో జేరేముందు తల్లితండ్రుల్ని కలవడానికి ఇండియా వచ్చాడు. ఒక భారతీయునికి దక్కిన గౌరవం అందరికీ చూపించాలనే ఉద్దేశ్యంతో లోకల్ ఛానల్ వాళ్ళు అతనిని ఇంటర్వ్యూ చేసారు.

అమెరికాలో దిగ్గజాల్లాంటి పోటీదారులతో పోటీపడి విజయ్ ఆస్థానాన్ని దక్కించుకున్నాడు. మిగిలినవాళ్ళు కూడా తక్కువవాళ్ళేమీకాదు. వారు చదివిన యూనివర్సిటీలు, తెచ్చుకున్న మార్కులు ఇతని కన్న యెక్కువే. కాని ఆస్థానానికి విజయ్ ఎంపికయ్యాడు. దానికి ముఖ్యకారణం తన తల్లి అని చెపుతున్నాడు.

“యెవరైనా విజయం సాధించినప్పుడు ఈ మాటే చెపుతుంటారు. మీరు దీనిని ఇంకాస్త వివరించగలరా? అంటే మీ అమ్మగారు యెంతవరకు చదువుకున్నారు, యేమి ఉద్యోగం చేసేవారూ, మిమ్మల్ని చదివించడంలో ఆవిడ చూపించిన ప్రత్యేకమైన పధ్ధతులు యేమిటి.. ఇలాంటివన్నీ మీద్వారా వింటే కొంతమందైనా ఆ స్ఫూర్తి పొందుతారుకదా.. ”

విజయ్ మనోహరంగా నవ్వాడు. “మా అమ్మగారి చదువు హైస్కూల్‍తోనే ఆగిపోయింది. కాలేజీలో అడుగు పెట్టకుండానే పెళ్ళైపోయింది. అమ్మగా నన్ను ఆవిడ పెంచిన తీరే నాకు స్ఫూర్తి”.

చాలా శ్రధ్ధగా వింటున్న శంకర్రావు మొహంలో భావాలు మారిపోయాయి. తనకన్న, తన భార్య కొడుకు అభివృధ్ధికి సాయపడిందని అతను చెప్పడం ఆయనని చిన్నబుచ్చింది. పార్వతి వంక చూసాడు. ఆవిడ ఇంకా ఆ ఆనందంనుంచి తేరుకోలేదు. కాని భర్త తనని చూడగానే ముఖమ్మీద కనపడే భావం మార్చేసుకుని, మొహం ఉదాసీనంగా పెట్టేసింది.

“చూసేవా.. చూసేవా నీ కొడుకూ..యేవిటో.. మాట్లాడితే ఈ కొడుకు లందరూ అమ్మ అమ్మ అంటూ అమ్మ భజన మొదలెడతారు. తొమ్మిదినెలలు మోసి, కని, పెంచి పెద్దచేసింది అంటూ దండకాలు చదూతారు. కడుపుతో వున్నాక కనక మాన్తారా. పిల్లలంటూ పుట్టేక ఆమాత్రం ఇంత అన్నం వండి వడ్డించడంకూడా ఘనకార్యమేనా? యేం.. వాడికి తండ్రిగా నేనేమీ చెయ్యలేదా.. పుడుతూనే ఇన్ని డిగ్రీలు తెచ్చేసుకున్నాడా.. వాడిని మంచి స్కూల్లో చేర్పించడం దగ్గర్నుంచి అప్పు చేసి అమెరికా పంపేవరకూ యెంత తాపత్రయపడ్డానో వాడికి తెలీదా? ఇంట్లో కూర్చుని అన్నం వండిపెట్టిన అమ్మని అంత అందలం యెక్కిస్తున్నప్పుడు పక్కన నాపేరు కూడా కలిపి అమ్మా, నాన్నా అనొచ్చుకదా..” లోపలినుంచి ఉబికివస్తున్న ఉడుకుమోత్తనం ఆపుకోలేకపోయాడు శంకర్రావు.

“యేదో అందర్లాగే వాడూ చెప్పేడేమోనండి. ఇప్పటికి కూడా వాడు మీ యెదుట యెప్పుడైనా తలెత్తి మాట్లాడేడా..” సమాధానపరచబోయింది పార్వతి.

సరిగ్గా అదేమాట అంది విజయ్ భార్య నీలిమ కూడా అమెరికాలో విజయ్‍తో కలిసి ఫామిలీరూమ్‍లో కూర్చుని ఈ ఇంటర్వ్యూ చూస్తూ.

“పోనీ పెద్దాయన. ఆయన్ని చిన్నబుచ్చకుండా అమ్మానాన్నలిద్దరి పేర్లూ చెప్పొచ్చుకదండీ.”

నీలిమ అడిగినదానికి తన లోపల యెప్పట్నించో వున్న భావాలని ఆమె ముందు వెళ్ళగక్కేసాడు విజయ్. “నీలూ, నాతోపాటు మరో ఇద్దరు ఇదే పొజిషన్‍కి పోటీ పడ్డారు. గుర్తుందా..?”

“లేకేం.. వాళ్ళు చదివిన స్కూల్స్, తెచ్చుకున్న గ్రేడ్స్ కూడా మీకన్నా యెక్కువే అని మీరే అన్నారుగా. మరి వాళ్లని కాదని మిమ్మల్ని యెన్నుకున్నారంటే ఆ కంపెనీవాళ్ళు మీలో యేదో ప్రత్యేకతని చూసేవుంటారు. బహుశా మీ నాన్నగారినుంచి మీకు ఆ జీన్స్ వచ్చాయేమో..” అంది.

“కాదనలేను. వంశంలో వున్న ప్రత్యేకతలు యేడుతరాలదాకా వస్తాయంటారు.. కానీ విత్తనం ఒక్కటీ సరిపోదు నీలూ.. విత్తనం యెంత ముఖ్యమో క్షేత్రం కూడా అంతే ముఖ్యం.. యెంత గొప్ప విత్తనమైనా దానికి అనుకూలమైన వాతావరణం లేకపోతే మొలకెత్తదూ, ఫలించదూ కూడా. కాశ్మీర్‍లో పండే ఆపిల్స్ ని నువ్వు హైద్రాబాదులో పండించగలవా.. యెడారిలో పండే ఖర్జూరాలని కోనసీమలో పండించగలవా..అందుకే కేవలం విత్తనాన్ని బట్టే దేని అభివృధ్ధీ వుండదు..”

యేదో కొత్తవిషయాన్ని వింటున్నట్టు ఆసక్తిగా చూసింది నీలిమ. యేదో గుర్తు చేసుకుంటూ అన్నాడు విజయ్, “నేను యెప్పుడో యెక్కడో చదివాను నీలూ.. జీవుడు జన్మించడానికి ముందు తనకి యేక్షేత్రం కావాలో చూసుకుంటాడుట. ముందుజన్మలో కలిగిన సంస్కారాలనిబట్టి క్షేత్రాన్ని యెన్నుకుంటాడుట. అలా యెన్నుకుని ఆ గర్భాన పుట్టడంవల్ల ముందరి జన్మ సంస్కారాలన్నీ ఆ తల్లి పెంపకంలో వృధ్ధి పొందుతాయట. అలాగ మా అమ్మ కడుపున పుట్టడం నేను ఒకరకంగా అదృష్టంగా భావిస్తే, ఆ తల్లి పెంపకంలో నేను పొందిన స్ఫూర్తి ఇంకోరకంగా నాకు కలిసొచ్చింది.”

“నాకేమీ అర్ధం కావటంలేదు..” అంది నీలిమ. నవ్వాడు విజయ్. నీలిమ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ,
“అందరమ్మల్లాగా మా అమ్మ కని పెంచడమొక్కటే చెయ్యలేదు. నేను ఈ పొజిషన్‍లో నిలబడడానికి కారణం మా అమ్మ మా ఇంటిని నడిపిన తీరు. అది గుర్తించగలగడం నా అదృష్టం. పిల్లలు తండ్రి దగ్గర్నుంచి చాలా నేర్చుకుంటారు. నిజమే. కానీ అవి వాళ్ళు నేర్చుకునేవి కాస్త వయసు వచ్చాక. కానీ పుట్టినప్పటినుంచీ వి షయాలు నేర్చుకునేది తల్లి పొత్తిళ్ళనుంచే. తనకి తెలీకుండానే బిడ్ద తల్లిని గమనిస్తాడు, అనుకరిస్తాడు.”

“అత్తయ్యగారు చేసిన అంత గొప్ప పనేవిటో నాకు తెలీలేదు.” అంది నీలిమ.

“చెప్తాను. సరిగ్గా విను. నువ్వు కూడా కొడుకును కన్న తల్లివే. పిల్లలను పెంచేటప్పుడు తల్లులు యెంత ప్రమత్తతతో వుండాలో నీకే తెలుస్తుంది.” అంటూ కార్పెట్ మీద కాళ్ళు జాపుకుని కూర్చుంటూ మొదలెట్టాడు విజయ్.

“నీలూ, ఒక సంస్థకి సి.ఈ.ఓ. అంటే ఆ సంస్థని అభివృధ్ధి వైపు నడిపించగలగాలి. అందుకోసం ఎంతోమందితో, ఎన్నోరకాల పరిస్థితులలో పని చేయించగలగాలి. దానికి సబ్జెక్ట్ ఒక్కటే వస్తే సరిపోదు. రకరకాల వ్యక్తుల్లో వున్న ప్రతిభని గుర్తించి, ప్రోత్సహించి, సముదాయించి, సమాధానపరచి అలా యెన్నోరకాలుగా ఆ ప్రతిభని వారినుండి రాబట్టి సంస్థను పెద్దది చెయ్యాలి. ఇలా యెలా చెయ్యాలన్నది నేను కేవలం మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను.”
తెల్లబోయింది నీలిమ. “కానీ, అత్తయ్యగారు యేమీ చదువుకోలేదు కదండీ.!”

“నిజవే. అమ్మ కాలేజీ చదువులు చదవలేదు. హైస్కూల్ చదువు పూర్తవకుండానే ఒక ఉమ్మడికుటుంబంలోకి పెద్దకోడలిగా వెళ్ళింది.” విజయ్ చిన్నప్పటి ఙ్ఞాపకాలన్నీ ఒకటొకటిగా నీలిమకి చెప్పసాగాడు.

“నీలూ, మా అమ్మ ఆమె పదహారేళ్ళకే అత్తగారు, మామగారు, అత్తగారి అత్తగారు, ఇంట్లోనే వుండే ఒక విధవాడపడుచూ, పెళ్ళికాని మరో ఇద్దరు ఆడపడుచులూ, ముగ్గురు మరుదులూ వున్న ఉమ్మడికుటుంబంలోకి కాపరానికొచ్చిందిట. మా ఆఖరి మేనత్త పెళ్ళిటైమ్‍కి నాకు పదేళ్ళు. అప్పుడే నేను మా అమ్మలోని మరో మనిషిని చూసాను. అప్పటికింకా మేం మా చదువులకోసం హైద్రాబాదు రాలేదు. మా ఊళ్ళోనే ఉండేవాళ్లం.

ఆ రోజుల్లో మా అత్తకి చూసిన సంబంధం చాలా పెద్దింటి సంబంధం. ఆ సంబంధమే చెయ్యాలని మా మామ్మ పట్టు పట్టి కూర్చుంది. అంత తూగలేనని మా తాతగారు ససేమిరా అన్నారు. నీకు తెలుసుకదా. మా నాన్నకి మేం నలుగురు పిల్లలం. అప్పటికి మా పెద్దబాబయ్య ఒక్కడే యెక్కడో గుజరాత్‍లో యేదో బట్టలమిల్లులో అక్కౌంటెంట్‍గా చేసేవాడు. మిగిలిన బాబయ్య లిద్దరూ యింకా చదువుకుంటున్నారు. మా మండువాలో యింట్లోవాళ్ల మధ్య అంత పెద్ద మాటల యుధ్ధం జరగడాన్ని చూడడం నేనదే మొదటిసారి. అంతా గట్టిగా యెవరికి తోచినట్టు వాళ్ళు అరిచేసి వెళ్ళిపోయారు.

ఒక్క మా అమ్మ మాత్రం నోరిప్పి ఒక్క మాటనలేదు. అలా అందర్నీ చూస్తూ కూర్చుంది. ఆఖర్న అందరూ మా అమ్మ దగ్గరకొచ్చి ..మా తాతగారేమో “ఇదిగో కోడలుపిల్లా చెప్పు మీ అత్తగారికి. ఈ పెళ్ళి చెయ్యడంతో అవదు. తర్వాత పురుళ్ళకీ పుణ్యాలకీ యింతకింత అవుతుంది. నావల్ల కాదని ఖచ్చితంగా చెప్పెయ్యి” అంటే.. మా మామ్మేమో “ఒసేవ్, పిల్లని కలిగినింట్లో పడెయ్యాలని మీ మావగారితో చెప్పు. ఇప్పుడు గంతకు తగ్గ బొంతని యేదో ముడెట్టేస్తే రేప్పొద్దున్న దాని పిల్లలకి పాలడబ్బా ల్దగ్గర్నుంచీ మనవే కొనాలని చెప్పు” అంటే, ఇంక మా నాన్నేమో “యేదో.. కొంతవరకు సాయం చెయ్యగలను కానీ నా స్తోమతుకి మించి నేనేమీ ఇవ్వలేను.

 నాకూ నలుగురు పిల్లలున్నారు కదా..” అన్నారు. మా బాబాయిలిద్దరూ యేం మాట్లాడకుండా జరుగుతున్నది చూస్తూ కూర్చున్నారు.

నాకు బాగా గుర్తు. ఆరోజు సాయంత్రం పొలంనుంచి వచ్చి, కాఫీ తాగి, వీధరుగు మీద విశ్రాంతిగా కూర్చున్న మా తాతగారితో సింహద్వారం లోపలగా నిల్చుని మా అమ్మ యేదో మాట్లాడింది. ఆ తర్వాత దేవుడి దగ్గర సంధ్యదీపం వెలిగిస్తున్న మా మామ్మతో మాట్లాడింది. రాత్రి భోజనం వడ్డిస్తూ మా నాన్నగారితో మాట్లాడింది. మరి యేం మాట్లాడిందో యేమో ఆ వయసులో నాకర్ధం కాలేదు కానీ మర్నాడు పొద్దున్నే ముహూర్తం బాగుందంటూ మా తాతగారు మా నాన్నగారిని వెంటపెట్టుకుని వెళ్ళి అదే సంబంధాన్ని ఖాయం చేసుకొచ్చారు. వాళ్లందరికి అమ్మేదో చెప్పిందని తప్పితే యేం చెప్పి అందర్నీ ఒప్పించిందో ఆ వయసులో తెలీలేదు.

కాని ఒకటి మాత్రం బాగా అర్ధమయ్యింది. వాళ్లంతా ఆవేశంగా వున్నపుడు యెదురుచెప్పకుండా సాంతంగా వాళ్ల మాటలన్నీ మా అమ్మ వింది. తర్వాత వాళ్ల వాళ్ల ఆవేశాలు తగ్గాక ఒకరిమాట ఇంకొకరికి అర్ధం అయ్యే వాళ్ల వాళ్ల భాషలో చెప్పింది. అందరు కోరుకునేదీ మా అత్త సుఖమేకదా.. ఆ లక్ష్యం దృష్టిలో పెట్టుకుని యెవరు యెలా చెపితే ఒప్పుకుంటారో అలా వాళ్ల దగ్గర మాట్లాడి ఆ పెళ్ళి స్థిరపడేలా చేసింది మా అమ్మ. అంతే కాదు.. ఆ పెళ్ళిలో కూడా యెటువైపునుంచీ మాటరాకుండా అందర్నీ యెంతో సమర్ధవంతంగా ఒకే లక్ష్యం వైపు నడిపించింది. ఆ వయసులో అమ్మ యెలా చేసిందో నాకు తెలీలేదు కాని యేదో గొప్పపని చేసిందనిమటుకు అర్ధమైంది. ఆ తర్వాత నుంచి అమ్మని నిశితంగా పరిశీలించడం అలవాటు చేసుకున్నాను.” విజయ్ చెపుతున్నది శ్రధ్ధగా వింటున్న నీలిమ గబుక్కునలేచి, “ఉండండి. చింటూ స్కూల్‍బస్ వచ్చే టైమైంది. వాణ్ణి తీసుకొచ్చేక స్థిమితంగా చెప్దురుగాని” అంటూ డ్రైవ్‍వే వైపు పరిగెట్టింది. చింటూ లోపలికి రాగానే తండ్రిని ఫామిలీరూమ్‍లో చూసి సంతోషంతో విజయ్ ఒడిలో చేరిపోయేడు. చింటూకి స్నాక్ తీసుకొచ్చి పక్కనే కూర్చుని “ఊ ఇంక చెప్పండి” అంది నీలిమ.

“నీలూ, నీకు తెలీనిదేవుంది..మూడుతరాల మనుషులు ఒక యింట్లో వుంటున్నప్పుడు తరాల మధ్య సంఘర్షణ తప్పదు. అందులోనూ వయసు పెరిగేకొద్దీ చాదస్తాలు కూడా యెక్కువవుతాయంటారు. అలాగే మా తాతగారూ, నాన్నమ్మా వాళ్ల పట్టుదలలు అస్సలు వదిలేవారు కాదు. యెదుగుతున్న ఆడపిల్లల్ని మా అమ్మ సరిగ్గా పెంచటం లేదని అస్తమానం మా అమ్మని, చెల్లెళ్ళని యేదో ఒకటంటూ సాధించేవారు. వాళ్ళలా అంటుంటే మా చెల్లెళ్ళు విసుక్కునేవాళ్ళు. కాని మా అమ్మ మటుకు ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర మరొకర్ని కించపరచలేదు. మా చెల్లెళ్ళ దగ్గర పెద్దవాళ్ల మాటలని యెలా గౌరవించాలో చెప్పేది. మా తాతగారు, నాన్నమ్మల దగ్గర మారుతున్న కాలంలో చదువుకుంటున్న పిల్లల మనస్తత్వం యెలా వుంటుందో వివరించేది. మరి ఆ మధ్యవర్తిత్వం యెలా నెరిపేదో కానీ ఒకరంటే ఒకరికి ప్రేమాభిమానాలు రెండింతలయ్యేలా చూసింది. అందరికన్నా యెక్కువ సాధించేది ఇంట్లోనే వుండే మా పెద్దమేనత్త. ఆవిడ జీవితంలో యేమీ అనుభవించలేకపోయింది. ఆ బాధ మరొకరిమీద ద్వేషంగా మారకుండా మా అమ్మ ఆవిడ నెప్పుడూ యేదో ఒక ఆధ్యాత్మిక చింతనలో వుంచేది. అలా వుంచడానికి మా అమ్మ యెన్నిరకాలుగా సమర్ధించుకోవాల్సి వచ్చేదో నేను గమనిస్తుండేవాణ్ణి. నీలూ, నీకోవిషయం తెలుసా?” ఆడిగాడు విజయ్. యేమిటన్నట్టు ఆసక్తిగా ముందుకు వంగింది నీలిమ.

“రక్తసంబంధీకులయితే ఎప్పుడైనా ఒకమాటనుకున్నా అదేమీ మనసులో పెట్టుకోకుండా కలిసిపోతారు. కాని బైటనుంచి వచ్చినవాళ్ళు? అంటే మా పిన్నిలు ముగ్గురూ కూడా వేరే వేరే ఇళ్ళనుంచి వచ్చినవారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పధ్ధతి. పెద్ద బాబయ్య దూరంగా గుజరాత్‍లో వుంటున్నా ప్రతియేడూ వచ్చి ఫలసాయంలో తన వాటా పట్టికెళ్ళేవాడు. మిగిలినవాళ్ళు ఇద్దరూ దగ్గర ఊళ్ళలోనే పనిచేస్తుండడం వల్ల ప్రతి పండక్కీ పబ్బానికీ ఇంటికొచ్చేవారు. మా పిన్ని లిద్దరికీ ఒకరంటే ఒకరికి పడేదికాదు. మాటలు బాణాల్లా విసురుకునేవారు. ఆ మాటల్లో మా తాతగారు, నాన్నమ్మల్ని కూడా దులిపేసేవారు. మా నాన్నమ్మ అయితే ఆ మాటలు వినలేక తలపట్టుకు కూర్చునేది. ఒక్కొక్కసారి మా తాతగారైతే ఇంక ఇంట్లో అడుగు పెట్టొద్దని కూడా వాళ్లమీద అరిచేసేవారు. అలాంటి ఉత్తర దక్షిణ ధృవాలని మా అమ్మ యేం మంత్రం వేసేదో కానీ యేకతాటికి తెచ్చేది. నేను కాస్త పెద్దవాణ్ణయేక వాళ్ళని యెలా కలిపేవమ్మా అనడిగితే అమ్మ నవ్వేసి ఇలా అంది.

“నాన్నా, దేనికైనా ఒక లక్ష్యమంటూ వుంటుంది. ఇక్కడ మన లక్ష్యం మనిల్లు అభివృధ్ధిలోకి రావడం. అదెలా వస్తుందీ.. పిల్లలు మీరందరూ జీవితాల్లో బాగా స్థిరపడినప్పుడు వస్తుంది. మీరు యెలా స్థిరపడతారూ. మీరైనా బాబయ్యల పిల్లలైనా నలుగురిలో మన కుటుంబం గురించి గౌరవమర్యాదలుంటే మీకు అలాంటి ఇళ్లనుంచి సంబంధాలొచ్చి చక్కగా స్థిరపడతారు. ఒక కుటుంబగౌరవం నిలబడాలన్నా, కూలిపోవాలన్నా కారణం ఆ ఇంటి ఇల్లాలే. ఆ ఇల్లాలి లక్ష్యం పిల్లల అభివృధ్ధి అయినప్పుడు మిగిలిన విషయాలన్నీ చాలా చిన్నవైపోతాయి. పిన్ని లిద్దరికీ వాళ్ల కర్ధమయ్యేటట్టు దీన్ని చెప్పడమే నేను చేసింది.

నీకింకో విషయం చెప్పనా నాన్నా..మనుషులు సాధారణంగా దుర్మార్గులు కారు. ఒక్కొక్కసారి పరిస్థితులు వారినలా స్వార్ధపరులుగా, దుర్మార్గులుగా మారుస్తాయి. మనం ఆ పరిస్థితిని సరిదిద్దాలి తప్పితే మనుషులని తప్పు పట్టకూడదు. ఇక్కడకూడా అంతే.. పిన్నిలిద్దరూ మంచివాళ్ళే. యెటొచ్చీ పెద్దవారైన తాతగారు తీసుకునే నిర్ణయాలవల్ల వాళ్ళ పిల్లలకి యెక్కడ అన్యాయం జరుగుతుందోనన్న భయం వాళ్లనలా మాట్లాడిస్తోంది. వారిలో ఆ భయం పోగొడితే యెంతో కలివిడిగా వుంటారు.”

అమ్మ అన్న మాటలకి నాకు కోపం వచ్చింది. “అందుకోసం నువ్వు వాళ్ళనంత బతిమాలాలా? నీలాగే వాళ్ళు కూడా కోడళ్ళే కదా.. నీలాగే వాళ్ళకి కూడా బాధ్యతలు లేవా? నువ్వెందుకు అందరిచేతా మాటలనిపించుకోవాలీ..?” అన్నాను. అమ్మ నవ్వింది.

“నేను ఈ ఇంటికి పెద్దకోడలిని. అందర్నీ ఒకేతాటిమీద నడిపించడం నా బాధ్యత. యెవరి దగ్గర యే సమర్ధత వుందో తెలుసుకుని, సామరస్యంగా దానిని బైటికి తీసి ఇంటి అభివృధ్ధికి వాడుకోవడంలోనే నా సమర్ధత వుంటుంది. నువ్వే చూడు. బైట అందరితోనూ మర్యాదగా మాట్లాడి కార్యాన్ని సాధించుకొచ్చే లౌక్యం చిన్నపిన్ని దగ్గర వుంది. అందుకని ఆవిడని కథలూ కార్యాలూ అయినప్పుడు మధ్యవర్తిగా కనక వుంచితే మనం కావాలనుకున్నవి సాధించుకొస్తుంది. అదే బుల్లిపిన్నిని చూడు. మార్కెట్‍లో సరుకులుకానీ, బట్టలూ, బంగారం కానీ యేవి యెక్కడ నాణ్యంగా, సరసంగా వుంటాయో బాగా తెలుసు. అటువంటి పనులు ఆవిడకి అప్పగించితే మనకి నిశ్చింత. ఇంక మీ అత్త అంటావా.. యేయే పూజలూ, వ్రతాలూ యెలా, యెప్పుడు, యెక్కడ చెయ్యాలో.. అన్నీ తెలిసిన శాస్త్రవేత్త. ఆ పెత్తనం ఆవిడకి అప్పగించామనుకో..ఇంక ఊరూవాడా పదినాళ్ళు చెప్పుకునేలా బ్రహ్మాండంగా చేయించేస్తుంది. ”

ఆసక్తిగా వింటున్న నీలిమ “యెంత బాగా చెప్పారండీ అత్తయ్యగారూ..!” అంది.”నీలూ, నీకు ఆ మాటలు బాగున్నాయేమో కానీ అప్పుడు నాకు నచ్చలా.. అందుకే అమ్మని అడిగేసాను.” “యేమని..?” ఆతృతగా అడిగింది నీలిమ.
“యేవనంటే.. మగవాళ్ల ప్రమేయమే లేకుండా ఆడవాళ్ళు ఇల్లు నడిపించెయ్యగలరంటావ్..” అన్నాను.”అప్పు డత్తయ్యగారే వన్నారు?”
నీలిమ నెత్తిమీద చిన్నగా మొడుతూ, “అయ్యొ పిచ్చినాగన్నా .. అంది.” కిసుక్కున నవ్వింది నీలిమ విజయ్ అన్నతీరుకి.
“ఇంకా యేవందంటే…ఇలా ఆడవాళ్ళూ, మగవాళ్ళూ అంటూ ఈ రోజుల్లో తేడాలు చేస్తున్నారు కానీ.. నిజంగా ఆలోచిస్తే ఇంట్లో ఆడవారి సలహా తీసుకోనిదే యే మగవాడూ నిర్ణయం తీసుకోడు. అలాగే ఇంట్లో నిర్ణయం తీసుకునేది ఆడవారైనా బయటికి దానిని ప్రకటించేది మటుకు మగవాడే.. అది మన సంప్రదాయం.” అంది అమ్మ.

ఇదంతా యెదో గందరగోళంగా అనిపించి నేను పెట్టిన తెల్లమొహం చూసి అమ్మ అక్కడే వున్న ఒక పౌడరుడబ్బా చేతిలోకి తీసుకుని చెప్పింది. “నీకు అర్ధమయ్యేలా చెప్పాలంటే.. ఇప్పుడు మనం పౌడరు కొనుక్కోవాలనుకో..బజారుకెళ్ళి మంచి పౌడరుడబ్బాకోసం మనం యెప్పుడూ వాడే మంచి కంపెనీపేరు చెప్పి అదే డబ్బా ఇమ్మని అడుగుతాం. ఆ కొట్టువాడు అంతకన్న తక్కువధరలోవి వున్నాయని చూపించినా సరే మనం మంచిదనుకున్నదే అడుగుతాం..యెందుకూ…దానికున్న పేరుని బట్టీ.. అదిగో అలాంటి పేరే సంఘంలో మంచికుటుంబాని క్కూడా వుంటుంది. ఆ పేరే.. బైట అందరూ చెప్పుకునే ఫలానావాళ్ల కుటుంబం. అలాగే ఇంట్లో ఆడవారి సామర్ధ్యాన్ని మగవాడు గౌరవిస్తే ఆ ఇంటిపేరు గొప్పగా వినిపిస్తుంది. ఆడవారు మగవాళ్ళని కాదని వాళ్ళే బైటకొచ్చిస్వతంత్రం ప్రకటిస్తే అది అంత గొప్పగా అనిపించదు. యెందుకంటే కుటుంబమంటే ఇంట్లోవారందరూ పొరపొచ్చాలు లేకుండా కలిసిమెలిసి వుండడం. అలా వున్నప్పుడే సంఘంలో ఆ కుటుంబగౌరవం పెరుగుతుంది. దానిని ఆడా, మగా యిద్దరూ తెలుసుకోవాలి అన్న అమ్మ మాటలవల్లే నేను ఇక్కడ టీమ్‍లీడర్‍గా రకరకాలైన వ్యక్తులను ఒకేతాటికి తేగలుగుతున్నాను. “

శ్రధ్ధగా వింటున్న నీలిమ “యెంతా బాగా చెప్పారో అత్తయ్యగారు..ఇంకా యేమన్నారండీ..” అంది చింటూకి వాడు ఆడుకునే లాప్‍టాప్ ఇచ్చి. విజయ్‍కి ఇంకా చెప్పాలనే ఉత్సాహం ఇనుమడించింది.

“నీలూ, అమ్మ చేసిన పనుల్లో అన్నింటికన్న నాకు బాగా నచ్చింది ఒకటి చెప్పనా?” నీలూ ఆసక్తిగా చూసింది.
“మా పెద్దచెల్లెలు లక్ష్మి తెల్సుకదా.. చాలా తెలివైంది. అన్నింట్లోనూ ఫస్ట్ మార్కులే దానికి. బాగా చదువుకుని, ఉద్యోగంచేస్తూ, దాని కాళ్లమీద అది నిలబడాలని లక్ష్మి ఆశయం. కానీ డిగ్రీపరీక్షలవగానే ఒక మంచి సంబంధం చూసి పెళ్ళి నిశ్చయించేరు మా నాన్నగారు. ఇంక చూస్కో దాని బాధ..నాన్నగారి ఎదురుగా నిలుచుని మాట్లాడలేదు.. భయం. అమ్మని పట్టుకుని సతాయించేసింది. ఆఖరికి ఆ వయసులో వుండే ఆవేశంతో పెళ్ళి చేస్తే చచ్చిపోతానని కూడా బెదిరించింది. దాని మాటలన్నీ ఓపిగ్గా వింది అమ్మ. లక్ష్మిని నెమ్మదిగా మాటల్లో పెట్టింది. పెళ్ళనేది యే వయసులో చేసుకుంటే బాగుంటుందో చెప్పింది. ఇదివరకటి రోజులు కావనీ, పెళ్ళయాక కూడా చదువుకుని, ఉద్యోగం చేసుకోవచ్చనీ, అందుకోసం తను అన్నివిధాలా లక్ష్మికి సహాయంగా వుంటానని మాటిచ్చి, పెళ్ళికొప్పించింది.”
విజయ్ చెప్పింది ఆసక్తిగా వింటున్న నీలిమ “లక్ష్మి చదువుకి అత్తయ్యగారెలా సాయం చెసేరు?” కుతూహలంగా అడిగింది.

” చాలా చేసింది. పెళ్ళైన మొదటి రెండేళ్ళూ లక్ష్మికి అత్తవారింటి పరిస్థితులకి అలవాటు పడడానికి సరిపోయింది. తర్వాత రవిగాడు పుట్టాడు.వాడు పుట్టాక ఎమ్.ఎ.పరీక్షలు రాసింది లక్ష్మి. సత్య పుట్టాక బి.ఇడి,. ఎమ్.ఇడి. కూడా చేసింది. అన్నింట్లోనూ మంచిమార్కులు తెచ్చుకుంది. అన్ని పరీక్షలప్పుడూ కూడా అమ్మ లక్ష్మి పక్కనేవుండి, పిల్లల్ని తను చూసుకుని, చాలా రకాలుగా సాయం చేసి తన మాట నిలబెట్టుకుంది. లక్ష్మి పిల్లలు స్కూలుకి వెళ్లడం మొదలెట్టాక అది ఓ కాలేజిలో లెక్చరర్‍గా చేరింది. రెండేళ్ళు అక్కడ చేసేక అమ్మే సలహా ఇచ్చి లక్ష్మి చేత ఒక స్కూల్ పెట్టించింది. అలామొదలుపెట్టిన ఆ స్కూలే ఇప్పుడు శారదా విద్యాలయం.. కె.జి. టు పి.జి. అనే పెద్ద విద్యాసంస్థ అయింది. వీటన్నింటి వెనకా లక్ష్మి వెన్నంటే అమ్మ కూడా వుంది. అలాగ ఇంట్లో గొడవలేమీ జరగకుండా సరైన సమయంలో లక్ష్మికి పెళ్ళిచెయ్యడం, లక్ష్మి కోరిక తీరడానికి తన వెన్నంటే వుండడం ఇవన్నీ అమ్మ చేసినవే నీలిమా. అదే స్ఫూర్తి నాక్కూడా. మన ముందున్న అవకాశాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవడమన్నది నేను అమ్మ దగ్గర నేర్చుకున్నదే. .” భావోద్వేగంతో అన్నాడు విజయ్.

ఒక అద్భుతాన్ని వింటున్నట్టు వింది నీలిమ. “అత్తయ్యగారి గురించి మీరీ విషయాలేవీ ఇన్నాళ్ళూ చెప్పలేదేవండీ..?” అంది.

తేలిగ్గా ఊపిరి విడుస్తూ, “మగవాణ్ణి కదా నీలూ..”అన్నాడు. అర్ధం కానట్టు చూసింది. “యెంత కాదన్నా మగవాడికి ఆ ఈగో వుంటుందనుకుంటాను. అందుకే అమ్మ గురించి ఎవరు చెప్పినా నవమాసాలూ మోసి కంది..అని చెపుతారు తప్పితే వారి వ్యక్తిత్వం తల్లి వల్ల రూపు దిద్దుకుందని చెప్పలేరు. ఎందుకంటే అలా చెపితే తండ్రి యేమైనా ఫీలవుతాడేమోననుకుంటారు. అలా తండ్రిని చిన్నబుచ్చడం తల్లికి కూడా ఇష్టముండదు కనక ఆ గొప్పదనాన్నంతా తండ్రికే ఆపాదిస్తారు. నవమాసాలూ మోసి కనడం గొప్ప విషయమే కానీ దానితోపాటు ఆ తల్లి నేర్పిన పాఠాలు కూడా వ్యక్తి జీవితాన్ని నిర్దేశిస్తాయి.”

“కాని ఈ విషయాలు నాకిన్నాళ్ళు తెలీవండీ.” అంది నీలిమ.

“నీలాగే చాలామంది దీన్ని గురించి ఆలోచించరు. అందుకనే నీలూ చెప్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కుటుంబమనే బండి సజావుగా సాగి ప్రయాణం సాఫీగా సాగాలంటే కుటుంబం అందరూ కూర్చునే బండి తొట్టె అనుకో, ఇంటి యజమాని చక్రం అనుకో.. ఆ చక్రాన్నీ, బండినీ సరిగ్గా సమన్వయపరచే ఇరుసే ఆ ఇంటి ఇల్లాలు. బండికి చక్రం మరీ బిగుసుకుపోయినా బండి నడవదు. వదులైపోయినా రెండింటి బేలన్స్ కుదరదు. అలా కాకుండా బండినీ, చక్రాన్నీ బాలన్స్ చేసి నడిపేదే అమ్మ. అలాగే యే కంపెనీ అయినా కూడా. కంపెనీ బండి అయితే, అందులో ఉద్యోగులు చక్రం అయితే రెండింటినీ సమన్వయపరచి నడిపించేవాడే సీ.యీ.వో. ఇలా అమ్మ దగ్గర నేర్చుకున్న పాఠాలు యే బిజినెస్ స్కూల్‍లోనూ చెప్పరు
.
ఇప్పుడిప్పుడే కంపెనీల పేర్లతోపాటు ఆ కంపెనీల సి.ఈ.వో ల పేర్లు కూడా చెప్పుకుంటున్నట్టే తండ్రిపేరుతోపాటు తల్లిపేరు కూడా గుర్తించే రోజులొచ్చాయి. దానికి యెవరో ఒకరు నాంది పలకాలి కనక నేను మొదలెట్టాను అంతే.. ”
నీలిమ ఆలోచించింది. “మరి మీ నాన్నగారు చిన్నబుచ్చుకోరూ..”

విజయ్ ఆలోచించి నెమ్మదిగా అన్నాడు. “ఊహు.. చిన్నబుచ్చుకోరు. ఆయనకీ ఈ విషయం తెలుసు. కాని తనంతట తను బైట పెట్టలేరు. నేను పెట్టాను కదా. సంతోషిస్తారు తప్పితే యేమీ అనుకోరు. ఒకవేళ వెంటనే కాస్త చిన్నబుచ్చుకున్నా అర్ధం చేసుకుంటారు.” అన్నాడు.

ఇంతలో ఫోన్ మోగింది. ఆ రింగ్ ఇండియానుంచే. విజయ్ వెంటనే తీసి “అమ్మా..” అన్నాడు. అటునుంచి పార్వతమ్మ నిశ్శబ్దంగా వుండిపోయింది. అర్ధమైపోయింది విజయ్‍కి. “ఇంటర్వ్యూ చూసేరామ్మా..?” అనడిగాడు.

సమాధానం చిన్నగా వినిపించింది. “చూసాం నాన్నా.. కానీ…నువ్వలా చెప్పకుండా వుండాల్సింది.”
గదిలోంచి మాట్లాడుతున్న పార్వతమ్మకి హాల్లో ఎక్స్ టెన్షన్ ఫోన్లో వింటున్న శంకర్రావు కనిపిస్తున్నాడు.
“ఫరవాలేదమ్మా. ..నాన్నగారి గురించైతే నీకేమీ బెంగక్కర్లేదు. ఆయనకన్నీ తెలుసు. అర్ధం చేసుకుంటారమ్మా..” అన్నాడు విజయ్.
“కానీ..” అంది పార్వతమ్మ.
“అమ్మా, అమ్మ గురించి కనీసం నన్ను యిప్పుడైనా చెప్పనీయమ్మా..!” అన్నాడు విజయ్ ప్రాధేయపూర్వకంగా.
కొడుకు మాటలకి హాల్లోంచి వింటున్న శంకర్రావు మొహంలో చిన్ననవ్వు తొంగిచూసింది.
ఆ చిరునవ్వు చూసిన పార్వతమ్మ మొహం మందారంలా విచ్చుకుంది.
*** ** ***
(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)
 

30, జులై 2014, బుధవారం

విముక్త

 



“మామ్మగారూ! ఇంక నేను బతకడం వృధా ” అంటూ ఒక్కసారిగా ఆవిణ్ణి పట్టుకుని వల వలా ఏడ్చేశాను. ఆ క్షణంలో నాకు పరిసరాలన్నిటా నా ‘బంగా’రుకొండ, ముద్దుగా ‘బంగా’ అని మేమిద్దరం పిలుచుకునే మూడేళ్ళ బుజ్జిబాబు తప్ప ఇంకేమీ కనిపించడం మానేసింది. నేనేం చేస్తున్నానో అర్ధం కాని ఒక అయోమయం … అనుక్షణం నా కొంగు పట్టుకుని తిరుగుతూ బూరెబుగ్గలతో ముద్దులొలికిపోయే బంగా, కనిపించకుండా పోయి నాలుగ్గంటలు దాటిపోయింది. వీధి చివరి కిరాణా షాపు కెళ్లి, అక్కడున్న కూరగాయల బండి దగ్గర కూరలకోసం ఆగినప్పుడు నా కొంగు పట్టుకు నిలుచున్న బంగా అలా ఎలా మాయం అయ్యాడో నాకు అర్ధం కావడం లేదు. ఎవరో కావాలని ఎత్తుకు పోయి ఉండాలి. ఈ పసివాడిని వాళ్ళు ఏం చేస్తారో అనే ఆలోచన నిలువెల్లా వణికించేస్తోంది. పుట్టి బుధ్ధెరిగిన నాటి నుంచి ఈ నాటి వరకు విన్న తప్పిపోయిన పిల్లల గాధలన్నీ బుర్రలో తిరగడం మొదలెట్టాయి.

నా జీవితం, బంగా తప్పిపోక ముందూ, తప్పిపోయిన తర్వాతా అనేలా, రెండుగా విడిపోతున్నట్టనిపించింది. వాడి కోసం వెతుకుతూ వెర్రిదానిలా పక్క వీధులన్నీ తిరిగాను. పక్కవాళ్ళు కూడా వేర్వేరు దిక్కులలో వెతికేందుకు వెళ్ళారు. ఆలస్యమైపోతున్న కొద్దీ ఆశ సన్నగిల్లిపోతోంది, ఆందోళన పెరిగిపోతోంది. లోపల్నించి ఒక దుఖసముద్రం నన్ను ముంచేస్తోంది. ఇంక ఎప్పటికీ నా బంగారు తండ్రినింక చూడలేనేమో, వాడి బూరె బుగ్గల్నిముద్దాడ లేనేమో, పుత్ర పరిష్వంగ సుఖాన్నిక అనుభూతించలేనేమో, ఇక జీవితాంతం పంచ ప్రాణాలూ పోగొట్టుకుని కూడా బతికే ఉన్నశవంలా బతుకీడవడమే, బతికేడవడమేనేమో! … బతుకేడవడమేనేమో !

ఆలోచనలన్నీ బంగా కేంద్రంగా లుంగలు చుట్టుకుపోతున్నాయి. వాడి మీద కేంద్రీకరించబడ్డ నా జీవిత శేషభాగం వాడు లేకుండా ఎలా గడుస్తుందో కళ్ళముందు కనిపిస్తూంటే, ఆ వేదన ఒక మహాగ్ని లాగా నన్ను కాల్చేస్తోంది. ఆ మంటకి నాలో పేరుకుంటున్న ఆవిరులు, నన్ను సరిగా ఊపిరి పీల్చలేని స్థితికి తెచ్చాయి. రాజీవ్ కాంపులో ఉండడంతో మా అపార్ట్ మెంట్ కాపలాదారుని వెంట తీసుకుని వెళ్లి, పోలీస్ రిపోర్ట్ ఇచ్చి, సమస్తం కోల్పోయిన దానిలా వెనక్కొచ్చిన నాకు వీధి గుమ్మంలో అరుగు మీద కూర్చుని, ఆందోళనగా ఎదురుచూస్తున్న మామ్మగారు కనిపించారు. వాళ్ళ గేటూ, మా అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ గేటూ పక్కపక్కనే .

ఆవిణ్ణి చూడగానే నా లోపలి దుఖమంతా సునామీలా నన్ను కుదిపేస్తూ బయటికి ప్రవహించింది. గేటు తెరిచి ఒక్కంగలో ఆవిడ ముందు నేల మీద కూలబడి, ఆవిడ నడుం చుట్టూ చేతులేసి, ఒడిలో తలపెట్టి పొగిలి పొగిలి ఏడ్చాను .

“మాటలు కూడా సరిగా రాని పసివెధవ మామ్మగారూ ! టైముకి అన్నం కలిపి పెడితే, అటూ ఇటూ పరుగులు పెడుతూ, మూతి తిప్పేస్తూ, తను తినడం కూడా అమ్మకి ఫేవర్ అన్నట్టు బ్రహ్మ ప్రయత్నం మీద రెండు ముద్దలు తినే చంటి ముండ , ఆకలేస్తే నసపెట్టి ఏడవడమే గాని ఇది కావాలీ అని అడగడం కూడా తెలీని పసి వాడు, నాలుగ్గంటలైంది ఇప్పటికి, కనపడకుండా పోయి … ఆకలికి అల్లల్లాడి పోతూ ఉంటాడు మామ్మగారూ, అమ్మ కనపడక పొతే బెంగటిల్లి పోతాడు … నేను రోజూ పూజించే దేవుడు నాకింత గర్భ శోకం పెడతాడని కల్లో కూడా అనుకోలేదు.. వాడినేం చేద్దామని పట్టుకు పోయారో మామ్మగారూ .. తనని తాను కాపాడుకోవడం తెలీని చంటి వాడు, బయటి లోకంలో ఎన్ని దుర్మార్గాలున్నాయో ఊహకూడా లేని పసి వెధవ … నాకింక ఎలా దొరుకుతాడు .. మా ఆయనకి నామొహం ఎలా చూపించను? వాణ్ని తీసుకెళ్ళి బిచ్చమెత్తుకుందామనుకున్నారో, కళ్ళూ కాళ్ళూ … ” మాట పైకి రాక పెద్ద పెట్టున బావురుమంటుంటే మామ్మ గారు నా మొహం పైకెత్తి ” అపశకునం మాటలు మాట్టాడకు తల్లీ .. నా మాట నమ్ము. పిల్లాడు క్షేమంగా వస్తాడు” అన్నారు.

వెర్రిగా ఆమె మొహం చూస్తూ “వస్తాడా ? నా కన్నయ్య క్షేమంగా వచ్చేస్తాడా ?” అన్నాను కడుపు లోంచి దుఃఖ కెరటాలు ఎగసిపడుతుంటే .

“వస్తాడమ్మా మా రాజా రాలేదూ? అలాగే వస్తాడు” అన్నారు. రాజా అంటే మామ్మగారబ్బాయి డాక్టర్ రాజారావు గారు.

” వాడపుడు మూడేళ్ళ పిల్లాడమ్మా. మా ఆడబడుచు ఏలూరు నించి వచ్చింది. ఎగ్జిబిషన్ చూడాలనుందంటే వెళ్లాం. అప్పట్లో వీఐపీ సూట్కేసులు కొత్తగా వస్తున్నాయి. అలాంటిది కావాలనుకుంది. బేరం చేసినంతసేపూ వాణ్ని చేత్తో పట్టుకునే ఉన్నాను … కొనేటపుడు రెండు నిమిషాలు పిల్లాడి చెయ్యి వదిలానంతే. ఆ రెణ్ణిమిషాల్లోనే నా కొంగు పట్టుకుని ఉన్న పిల్లాడు కాస్తా ఎటువైపు వెళ్లి పోయాడో. ఆ జన సముద్రంలో వెర్రిగా వెతుకులాడాను, మా ఆడబడుచుని అక్కడే నిలబడమని చెప్పి. పదినిముషాలు పది యుగాల్లా గడిచాయి తల్లీ.. ఆ రోజుల్లో ఎగ్జిబిషన్ లో ఇల్లా పిల్లలు తప్పిపోవడం మామూలే. ఇక వాడు ఎప్పటికీ దొరకడేమో అనే భయంతో, అమ్మ లేని పిల్లాడి బతుకు ఎలా నడుస్తుందో అని విలవిల్లాడిపోయాను ఆ కొంచెం సేపట్లోనే. అనుక్షణం కదిలిపోయే జనసమ్మర్దంలో ఏ వైపు వెళ్లినా మిగిలిన అన్ని దిక్కులూ వదిలేసినట్టేగా .. అదృష్టం కొద్దీ మా ఇలవేల్పు నాయందుండి ఆ పక్కనే కొంచెం దూరంలో బెలూన్ల షాపు దగ్గర పిల్లల మధ్య నిలబడి ఉన్నాడు, వెర్రి మొహం వేసుకుని. అప్పుడే కొంచెం అనుమానం వచ్చిందేమో అమ్మ కనపడడం లేదేమిటా అని, ఇంతట్లోకే మేం వాణ్ని చూడ్డం జరిగింది”
మామ్మగారి మాటలు సగం సగమే నాకు బుర్రకెక్కుతున్నాయి. వాళ్ళబ్బాయి ఆవిడకి దొరికారు గాని నా కన్నయ్య నాకు దొరుకుతాడని నమ్మకమేమిటి ? పావుగంటసేపు నేను కనిపించకపోతే బెంగ పెట్టేసుకునే చంటి వాడు ఇంతసేపు నేలేకుండా ఎంత కక్కటిల్లిపోతున్నాడో .. ఎలాంటి షాక్ కి గురయ్యాడో? నా తల వేడెక్కిపోయింది.


ఇంతలో నా వెనక రిక్షా బెల్లు గణ గణా మోగింది. ఒక్కుదుటున లేచి గేటు వైపు తిరిగాను .. గేటు ముందాగిన రిక్షాలోంచి నా వైపు చూపిస్తూ ‘అమ్మ అమ్మ’ అంటున్న బంగా ! నాకు వెర్రి ఆనందంతో ఒళ్ళు తెలియలేదు. నాలుగంగల్లో గేటు దాటి రిక్షా దగ్గరకెళ్లాను .. ఏడ్చేడ్చి వడిలిపోయిన బంగా నీరసంగా నావైపు చేతులు చాచాడు .. వెంటనే వాణ్ని లాక్కోకపోతే మాయమైపోతాడేమో అన్నట్టు అమాంతం వాణ్ని ఎత్తుకుని హత్తుకున్నాను. వాడు నన్ను కరుచుకుపోయాడు. వర్షిస్తున్న కళ్ళతో వాడి పక్కనే కూర్చున్న ముసలాయనని చూశాను … ‘ఏమిటమ్మా మాటలు కూడా సరిగా రాని పసివాడిని అలా వదిలేస్తారా ? ‘ అంటూ ఏదో అడుగుతున్నారాయన. అమాంతంగా, ఎడం భుజం మీదున్న బంగాతో సహా రిక్షా లోకి వంగిపోయి, ఆయన పాదాలు కుడిచేత్తో తాకి, నెత్తికి రాసుకున్నా. ఆ క్షణంలో నా కృతజ్ఞతని అంతకన్నా ఎలా చెప్పాలో తెలియలేదు.

వెనక నించి ” ఎక్కడ దొరికాడు బాబూ ? దేవుడే పంపినట్టు వచ్చారు మా పిల్లాణ్ణి మా కప్పగించడానికి ! లోపలికి రండి ” అన్నారు మామ్మగారు .

” లేదమ్మా..నే వెళ్ళాలి. ఇంటి దగ్గర మా ఆవిడ ఒక్కత్తే ఉంది. ఎదురుచూస్తూ ఉంటుంది నా కోసం ” అన్నారు.
“బాబాయి గారు! ఒక్క నిముషం .. రిక్షా కైనా డబ్బులివ్వనివ్వండి ” అన్నాను కంగారుగా.
” మరి ఇంతసేపు తిరిగాను, నాకేమీ ఇవ్వవా తల్లీ ? ” కళ్ళు చికిలిస్తూ అన్నారు పరిహాసంగా .
నేనేమనాలో తెలీక ఇబ్బందిగా చూసాను .

ఆయన నవ్వి “తల్లి దగ్గరికి పిల్లాడిని చేర్చిన ఆనందాన్ని మించింది ఏముందమ్మా … కానీ జాగ్రత్త తల్లీ .. నీ ఆదుర్దాలో పిల్లాడెక్కడ దొరికాడో కూడా కనుక్కున్నావు కాదు… పక్క వీధిలో కమ్యూనిటీ హాల్లో బ్రైట్ స్కూలు వార్షికోత్సవం జరుగుతోంది. పిల్లలకి పోటీలు జరుగుతున్నాయి. మా మనవడు కూడా ఉన్నాడని నేనూ మా ఆవిడా వెళ్లాం. ఈ రిక్షా అబ్బాయి మా అవుటుహౌసు లోనే ఉంటాడులే.. ఎక్కడికెళ్లాలన్నా ఇతని రిక్షా లోనే వెళ్తూంటాం. ఉత్సవం అయిపోయి అంతా వెళ్ళిపోయారు. మా అమ్మాయీ వాళ్ళని పంపించి, నేనూ మా ఆవిడా కూడా వెళ్లబోతుంటే వీడు ఏడుస్తూ కనిపించాడు. ఈ పసివాడు ఎవరి తాలూకు అని అక్కడున్న వాళ్ళెవరినడిగినా తెలీదన్నారు. ‘ఇల్లెక్కడ నాన్నా’ అనడిగితే చెయ్యి చూపించాడుగాని ఏమీ గుర్తులు చెప్పలేకపోయాడు. రిక్షాలో ఎక్కించుకుని, వాడు అటూ ఇటూ చేతులు చూపిస్తుంటే తిరుగుతూ వస్తున్నాం. చివరికి ‘చాకోలేట్లూ, బిక్కీలూ ఎక్కడ కొనుక్కుంటావు ‘ అంటే ‘ సీరామా లో కొంతుంది అమ్మ’ అన్నాడు. అయితే దగ్గరలోనే ఉంటారని నమ్మకం కలిగి, మా ఆవిడని ముందు ఇంట్లో దింపి ‘శ్రీ రామా’ షాపు కి తీసుకొచ్చా. అక్కడి నుంచి చక్కగా చూపించాడు ఇల్లు! ” నవ్వుతూ చెప్పేసి, “ఇంక నే వెళ్తానమ్మా, పిల్లాడు జాగర్త ! ” అన్నారు తర్జని చూపిస్తూ .
“బాబాయి గారూ! కొంచెం మజ్జిగ తీసుకోండి” ప్రాధేయ పడుతూ అడిగాను .

“ఇల్లు తెలిసిందిగా మళ్ళీ వస్తాలేమ్మా, ముందు పిల్లాడిని కళ్ళారా చూసుకో! వాడికేదైనా తినిపించు, స్కూలు ఫంక్షన్ కదా, వాళ్ళేవో బిస్కెట్లూ, చాకోలేట్లూ పెట్టారనుకో …. జాగ్రత్త తల్లీ .. పిల్లాడు జాగ్రత్త ! నువ్వు పోనీవోయ్ ” అన్నారు.
రిక్షా కదిలిపోయింది. మనసు కృతజ్ఞతతో భారమయింది ఒక్క క్షణం. మరుక్షణం బంగాని గాఢంగా హత్తుకుని ముద్దుల్లో ముంచెత్తాను.

” ఏడ్చేడ్చి సోలిపోయాడమ్మా. వాడినేం మాట్లాడించకు. లోపలికి తీసుకెళ్ళి అన్నం తినిపించు” అన్నారు మామ్మగారు. అప్పుడేసింది వెర్రి ఆకలి. పొద్దుటి నుంచి ఏమీ తినలేదని గుర్తొచ్చింది.

“సాయంత్రం కనిపిస్తాలెండి మామ్మగారూ” అంటూ మా ఇంటికి వెళ్ళిపోయాను.
అలా నాకే అతుక్కు పోయిన పిల్లాడితో రోజంతా ఇల్లు కదలాలనిపించలేదు. తెల్లారి లేచేసరికి రాజీవ్ వచ్చేశారు. తనకి ఆవేళ, మర్నాడూ సెలవు. వాడూ స్కూలుకి డుమ్మా. రోజంతా ఆయన వొళ్ళో వాడూ, భుజాలకి వేళ్ళాడుతూ నేనూ. జరిగిందంతా రాజీవ్ కి చెప్పాం ఎవరి భాషలో వాళ్ళం. మళ్ళీ ఇలా జరక్కుండా ఎలా ఉండాలో వాడికి జాగ్రత్తలు చెపుతూ, నాకు నేను చెప్పుకుంటూ, మూడో నాటికి మళ్ళీ మామూలు స్థితికి వచ్చాం. సోమ వారం నాడు వాడిని స్కూలులో దింపేసి, రాజీవ్ ఆఫీసుకి వెళ్ళిపోయాడు. ఇద్దరూ వెళ్ళాక అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని సర్దుకుని బాల్కనీ లో కొచ్చేసరికి, మామ్మగారి ఒళ్ళో తలపెట్టుకుని ఏడవడం గుర్తొచ్చింది. ఇల్లు తాళం పెట్టి కిందకొచ్చి, వాళ్ళ గేటు తీసుకుని అలవాటైన చనువుతో లోపలికెళ్ళాను.

ముందు గది దాటి డైనింగ్ హాలు గుమ్మం దగ్గరకెళ్ళేసరికి ఒక్కసారిగా లోపల్నించి వినపడ్డ కటువైన మాటలు ఉలిక్కిపడేలా చేశాయి. లోపల రాజారావు గారు మామ్మగారితో మాట్లాడుతున్నారు. విషయమేమిటో అర్ధం కాలేదు గాని ” బుద్ధిలేకపోతే సరి… ఏళ్ళొచ్చాయి ఎందుకూ ” విసురుగా అన్నమాట చెవిలో పడింది. ఇంతలో ఆయన ఫోను మోగింది .

“డాక్టర్ రాజారావ్ హియర్” అంటూ ఆయన ఒక పక్కగా ఉన్న క్లినిక్ గదిలోకి వెళ్ళిపోయారు. ఇబ్బందిగా వెనక్కి అడుగేసిన నన్ను ఆయన చూడలేదు. ఎవరో పేషంట్ కాబోలు ‘ బయల్దేరుతున్నాననీ, పదిహేను నిముషాల్లో ఆసుపత్రి చేరుకుంటా’ననీ చెప్పి,” అమరావతి గారూ! తలుపేసుకోండి” అంటూ వంటావిడని పిలిచారు.
తల్లికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆయన కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోవడం చూస్తే చివుక్కుమనిపించింది. కారు వెళ్ళిన చప్పుడూ, గేటు మూసిన చప్పుడూ వినపడ్డాక నేను లోపలి వెళ్లాను.

నిశ్శబ్దంగా లోపలికి అడుగేస్తుంటే మామ్మగారు కనిపించారు. డైనింగ్ టేబుల్ వెనకగా దేవుడి గది పక్కనున్న కుర్చీలో కూర్చున్న ఆవిడ, కిటికీ లోంచి బయట తోటలోకి చూస్తున్నారు మౌనంగా. గంధం రంగు పాత పట్టుచీర, నుదుట గంధం బొట్టు, పూర్తిగా నెరిసిపోయి వేలి ముడిలో ఒదిగిపోయిన జుట్టు. విచారంగా ఉన్నా తేజస్సుతో వెలుగుతున్న ఆవిడ కళ్ళ నుంచి, ముడతలు పడ్డ చెంపల మీదుగా కారుతున్న కన్నీటి తడి, కిటికీ లోంచి లోపల పడుతున్న వెలుగులో మెరుస్తూ కనిపించింది. ఆ దృశ్యం నన్ను చకితురాలిని చేసింది. మృదు స్వభావీ , భయస్తురాలూ అయిన మామ్మగారు, రావుగారు ఎపుడేనా ఈసడించినట్టు తీసి పారేస్తే ఆ బాధకి విలవిలలాడతారేగాని కంటి వెంట ఒక చుక్క నీరు రానీరు. మామూలుగా చిన్న బాధ కలిగినా కన్నీరు కార్చే ఆవిడ, కొడుకు మాటలకి మాత్రం ఎంత కష్టం కలిగినా కంట తడి పెట్టరు. తల్లి కంట నీరు తెప్పించిన కొడుక్కి ముక్తి దొరకదుట ! తల్లి క్షమించినా కూడా ఆ బిడ్డకి శాపం తగులుతుందిట ! అది ఆవిడ గాఢ నమ్మకం! అందుకే ఎంత దుఖం వచ్చినా కన్నీరు కారకుండా ఆపుకుంటారు! ఆవిడ ఈ విషయం చెప్పగానే ‘కొడుకు మీద ఎంత ప్రేమ ఈవిడకి!’ అని ఆశ్చర్యం కలిగింది. భార్య కోరిందని తల్లి గుండె కాయని తీసుకెడుతున్న కొడుకు, జారి పడితే, అతని చేతిలోని తల్లి గుండె ‘ నాయనా దెబ్బ తగిలిందా ‘ అనడిగిన కథ గుర్తొచ్చింది. బంగా కూడా పెద్దయ్యాక ఇలాగే ఉంటాడా అని సందేహం, బెంగా కలిగాయి.

అలాంటిది ఇవాళ ఆవిడ తడి కళ్ళు చూడగానే నా గుండె తరుక్కు పోయింది.
అలికిడి వినపడగానే చటుక్కున కళ్ళు తుడుచుకుని, వివర్ణమైన మొహాన్ని చిరునవ్వుతో అలంకరిస్తూ “దామ్మా! జయా! ఎలా ఉన్నారు తల్లీ ? ” అన్నారు .

“బావున్నాం మామ్మగారూ, తుఫాను వెలిసి పోయిందిగా, మా ఇల్లూ వాకిలీ సజావుగా ఉన్నాయి. ఇంకేం కావాలి మాకు ? ” నవ్వుతూ వెళ్లి ఆవిడ పక్కనే డైనింగ్ కుర్చీ మీద కూర్చున్నా.

” అవును తల్లీ .. ఎంత గండం తప్పింది ! ఏడీ చిన్ని తండ్రి ? బడికి పంపేశావా ? ” అన్నారు .
” అవును మామ్మగారూ, పన్నెండింటికి వెళ్లి తీసుకు వస్తా” అన్నా .

“ఇదుగో చూడూ, నిన్ననే అబ్బాయి పేషెంట్లెవరో తిరుపతి నించీ స్వామి అభిషేక జలం, ప్రసాదం తెచ్చారు. వాడి మీద చల్లి, మీరూ చల్లుకోండి, ప్రసాదం తీసుకోండి. రక్ష ! ” అన్నారు, నా చేతిని తన రెండు చేతుల మధ్యా పట్టుకుంటూ.
ఆ ప్రేమకి మనసు నిండిపోయి, కుర్చీ ఆవిడ దగ్గరగా జరుపుకున్నాను. ముడతలు పడి నరాలు పైకి తేలిన ఆవిడ చేతుల్ని పట్టుకుని “మామ్మగారూ! ఆవేళ హడావుడిగా వెళ్ళిపోయాను కదా .. రెండు రోజులూ నన్నస్సలు వదలలేదు పిల్లాడు. భయపడిపోయాడు పాపం. దానికి తోడు వాళ్ళ నాన్న కూడా వచ్చారుగా… టైము తెలీకుండా గడిచిపోయింది. నిన్నే వచ్చి మీతో ఒక్క మాట చెప్పి వెళ్ళాల్సింది ” అన్నా .

“అయ్యో పర్లేదమ్మా ” అని ‘వాడు ఎలా వెళ్ళాడో , వచ్చాక ఏం వివరాలు చెప్పాడో’ అన్నీ తరిచి తరిచి అడిగి, ” పోన్లే తల్లీ అదృష్టవంతురాలివి. నీ కొడుకు నీకు దొరికాడు .. .. మా రాజా లాగే వీడూ దొరుకుతాడని నే చెప్పలేదూ?” అన్నారు.
“అవును మామ్మగారూ! మీ దీవెన ఫలించి నా బిడ్డ నాకు దొరికాడు. లేకపోతే ఇలా ప్రాణాలతో ఉండేదాన్నా?” అన్నా.

ఆవిడ నిర్లిప్తంగా నవ్వి ” అంతేనమ్మా, అడ్డాల నాడైనా, గడ్డాల నాడైనా తల్లికే బాధ! తప్పిపోయిన పిల్లాడు ఎలాగో ఒకలా బతకనేరుస్తాడు గాని, ఆ తల్లి జీవచ్చవమై బతుకీడుస్తుంది .. తనే ఆధారమైనవాడు తను లేనిదే బతకలేడని అమ్మలంతా అనుకుంటారు. కానీ ముసలిదై కొడుకు మీద ఆధారపడి జీవించే తల్లికి ఎదురయ్యే అనుభవాలు చెప్పనలవి కాదు ” అన్నారు.

ఇందాకటి దృశ్యం కళ్ళలో మెదిలింది. రాజారావు గారి పరుష వాక్యాలు గుర్తొచ్చాయి. నాలుగేళ్లుగా వాళ్ళింటితో అనుబంధం నాది. అప్పటికి బంగా ఇంకా పుట్టలేదు. రాజీవ్ ఉద్యోగ రీత్యా ఈ మహా నగరానికి వచ్చి, శ్రీ నగర్ కాలనీ లో ఇల్లు తీసుకుని కాపురం మొదలుపెడుతుంటే అమ్మ ఒకటికి పది సార్లు చెప్పింది, శ్రీనగర్ కాలనీ లోనే మా దూరపు బంధువులున్నారనీ, వీలుచూసుకుని పలకరించి రమ్మనీ. పెద్దావిడ కొడుకూ కోడలూ ఇద్దరూ డాక్టర్లనీ , వాళ్ళ పిల్లలు అమెరికాలో స్థిర పడిపోయారనీ చెపుతూ, వాళ్ళకి విశాలమైన పెద్ద ఇల్లూ, తోటా ఉన్నాయనీ, ఒక అవుట్ హౌసు కూడా ఉందనీ చెప్పి, వాళ్ళకీ మాకూ నచ్చితే అందులో ఉండచ్చని కూడా అంది. రాజీవ్ ఆసక్తి చూపించక పోయేసరికి నేనూ ఊరుకున్నాను. అప్పట్లో కాలనీ ఇంకా అపార్ట్మెంట్ల తో నిండి పోలేదు. అక్కడక్కడ పెద్ద చెట్లు ఆవరించిన ఇండిపెండెంట్ ఇళ్లు ఉండేవి. మొదటి అంతస్తులో ఉన్న మా ఫ్లాట్ లో బాల్కనీలోకొస్తే పక్కింటి పెరడంతా కనిపించేది.

బంగా పుట్టాక నేను ఉద్యోగం మానేసెయ్యడంతో, వాడూ, నేనూ చాలా సేపు ఆ బాల్కనీ లో గడిపేవాళ్ళం. వాడు నేర్చుకున్న మొదటి మాటలన్నీ వాళ్ళ తోట చూస్తూనే. పూల తీగలూ, కూర పాదులూ, పెరటి గుమ్మానికి ఎదురుగా తులసి కోటా, పై నించీ కనిపిస్తూ ఉండేవి. విచ్చిరాలిపోయే పూలని చూస్తుంటే నా మనసు ఆగేది కాదు. బాల్కనీ లోంచి వాళ్ళ పెరటి వైపు తొంగి చూస్తూ నేనూ, గ్రిల్ లోంచి తన ఆట వస్తువులేవో కింద పడేస్తూ, వాళ్ళ తోటవేపు చూపించి ఏవో ప్రశ్నలడుగుతూ బంగా …. ఇద్దరికీ ఆ తోటతో ఏదో బంధం ఏర్పడి పోయింది. నేల మీద ఒక్క మొక్క కూడా పెరిగే అవకాశం లేని మా కాంప్లెక్స్ పక్కనే, దాదాపు వెయ్యి గజాల ఆవరణ లో అందమైన చిన్ని మేడ, చుట్టూ ఫల వృక్షాలూ, పూల తీగెలూ నన్నాకర్షిస్తే, చెట్ల కొమ్మల మీద తిరిగే ఉడతలూ, రెక్కలు టపటప లాడిస్తూ ఎగిరే పక్షులూ బంగాని ఆకట్టుకునేవి. వద్దనుకున్నా వాళ్ళ ఆవరణలో తిరిగే పనివాళ్ళూ, వంట మనిషీ, అప్పుడపుడు హడావుడిగా నాలుగడుగులేసి వెళ్ళిపోయే డాక్టర్ దంపతులూ, ముఖ్యంగా పసిడి వర్ణంలో మెరిసిపోతూ, కచ్చాపోసిన తేలికైన పట్టు చీరల్లో పొద్దుటి పూటా, పల్చని నేత చీరల్లో సాయంత్రం పూటా మెల్లిగా అడుగులేసే మామ్మగారూ మా దృష్టి నాకర్షిస్తూ ఉండేవారు .

ఒక రోజు మామ్మగారు తులసి కోట దగ్గర పడిపోవడం చూసి, వంటింట్లో ఉన్న నా దగ్గరకి పరిగెత్తుకొచ్చాడు బంగా .
“తాతమ్మ పప్పోయింది … అక్కల ” కంగారుగా విషయం చెప్పడానికి ప్రయత్నిస్తుంటే బాల్కనీ లోకి పరుగు తీశా. పెరట్లో తులసికోట దగ్గర పడిపోయి లేవడానికి ప్రయత్నిస్తున్నారు మామ్మగారు. వెంటనే బంగానెత్తుకుని, వీధి తలుపు తాళం పెట్టి, మా కాంప్లెక్స్ బయటి కొచ్చి, వాళ్ళ గేటు దాటి పెరట్లోకి పరుగెత్తాను. అదే మొదటిసారి వాళ్ళింటికి వెళ్ళడం. మేం చుట్టూ తిరిగి వెళ్తుంటే, డైనింగ్ హాలు కిటికీ లోంచి మమ్మల్ని చూశారు డాక్టర్ దంపతులు. మామ్మగారు పడిపోయారని చెప్తూ నేను వెనక్కి వెళ్లేసరికి వాళ్ళూ పెరట్లోకి వచ్చారు. అప్పటికావిడ లేచి కూచున్నారు. కాలు చీల మండ దగ్గర బుస బుసా పొంగి ఉంది. మా నాన్నమ్మ గుర్తొచ్చి నా కళ్ళంట నీళ్ళు తిరిగాయి .

“మామ్మగారూ, బాగా నెప్పిగా ఉందా ” అంటూ ఆవిడ దగ్గరగా మోకాళ్ళ మీద కూర్చున్నా.
ఈ లోపు రాజారావు గారు, మేఖల గారూ పెరటి మెట్లు దిగి వచ్చారు. ఆయన ఎర్రబడిపోయిన మొహంతో భార్య వైపు తిరిగి, ఎడమ అరచేతిని మామ్మగారి వైపు చూపిస్తూ ” ఎనభై ఏళ్ళొచ్చి చిన్నపిల్లలా ఈ మెట్లు ఎక్కుతూ, దిగుతూ తిరగద్దని లక్ష సార్లు చెప్పాను … వింటుందా ? ” అన్నారు కఠినంగా .

మేఖల గారు, జరిగింది తనకేం నచ్చలేదన్నట్టుగా, అయినా అది తనకు సంబంధించిన విషయం కాదన్నట్టుగా మొహం పెట్టి ” నాగేష్ ! ” అంటూ డ్రైవర్ ని పిలిచి ప్లాస్టిక్ కుర్చీ తెమ్మన్నారు .

ఇంతలో మామ్మగారు లేవడానికి ప్రయత్నిస్తుంటే ” మళ్ళీ పనికిమాలిన అభిమానం ఒకటి. వాడూ నేనూ లేవదీస్తున్నాం కదా, మాట్టాడకుండా ఊరుకోదు .. ఇష్టం వచ్చినట్టు తిప్పితే, ఆ కాలు పనికి రాకుండా పోతుంది… ఇప్పుడే చెప్తున్నా ” అన్నారు గదిమినట్టు .

అంత నెప్పినీ పళ్ళ బిగువున భరిస్తూ కళ్ళు మూసుకున్నారు మామ్మగారు .
రాజా రావు గారు, నాగేష్ కలిసి ఆవిడని కుర్చీ లోకి చేరవేశారు. బంగా భయపడిపోయి, నా కుచ్చిళ్ళు పట్టుకుని చూస్తూండి పోయాడు. వాళ్ళిద్దరూ జాగ్రత్తగా కుర్చీని లోపలికి తీసుకెళుతుంటే మేఖల గారు నా వైపు ‘నువ్వెవరు’ అన్నట్టు చూశారు. అక్కడి నుంచే మా ఇంటి వైపు చూపించి, నా పరిచయం చేసుకుని, మామ్మగారు పడిపోయినట్టు వీడే చూసి నాకు చెప్పాడంటూ బంగాని చూపించాను. తలూపి లోపలికెళ్ళి పోయారావిడ. నేనెలా వచ్చానో అలాగే చుట్టూ తిరిగి, గేటు వైపు వెళ్లాను చంకలో పిల్లాడితో .

గేటు తెరుస్తుంటే ఇంట్లోంచి రాజా రావు గారు వచ్చి, “థాంక్సమ్మా … థాంక్స్ ఫర్ ది కన్సర్న్” అని, మేము బయటికి వెళ్ళగానే గేటు వేసుకున్నారు.

మర్నాడు మామ్మగారిని పలకరించడానికి వెళ్ళినపుడు అమ్మ ఇచ్చిన వివరాలు చెపితే ” మా పాపక్కయ్య మనవరాలివా నువ్వూ? “అంటూ ఆవిడ ఆనంద పడిపోయారు .

రాజారావు గారు కూడా కాస్త ప్రసన్నంగా కనిపించి, ‘అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండమ’ని చెప్పి తోటలో పువ్వులూ, కాయలూ కావాలంటే పట్టుకెళ్లమని చెప్పారు .

మామ్మగారి కాలి కట్టు విప్పేదాకా తరచూ వెళ్తూ ఉండేవాళ్ళం నేనూ బంగా. వాడికి తాతమ్మ ఎంతో నచ్చేశారు. ఆవిడ ముడతలు పడ్డ చేతులు పట్టుకుని ‘బోమీతా చేతులు’ అనేవాడు ముద్దుగా. బోర్నవిటా పాలపై మీగడ తరకలా ఉంటాయిట ఆ ముడతలు. అలా మొదలు పెట్టిన రాక పోకలు కొన్నాళ్ళకి అలవాటుగా మారిపోయాయి. ఆవిడతో ఒక ఆత్మీయ బంధం ఏర్పడింది. మామ్మగారమ్మాయి శారద గారు కూడా నన్ను వాత్సల్య దృష్టితో చూసేవారు. బంగాని ఎంతో ముద్దు చేసేవారు. వాళ్ళ బంధువులంతా నాకూ బాగా పరిచయమై పోయారు.

రాజారావు గారికి సర్జన్ గా, శస్త్ర చికిత్సలో నిపుణులుగా మంచి పేరుంది. ఆయన పనిచేసే చోట స్టాఫ్ అందరికీ ఆయన మాటంటే వేద వాక్కు. అనవసరమైన కండని, నైపుణ్యంతో కోసి తీసేసినట్టే, అక్కర్లేదనిపించే సంభాషణనీ, సెంటిమెంట్లనీ చులాగ్గా కత్తిరించేయడం ఆయన పధ్ధతి. తల్లిని చూసుకోవడం తన బాధ్యతగా ఆయన స్వీకరించినా, అది విధి నిర్వహణ లాగే గాని అందులో ప్రేమా, ఆప్యాయత కనపడనివ్వరు. రోజులో ఒక్కసారైనా ఆవిడ దగ్గరగా కూర్చోవడం, ఆప్యాయంగా మాట్లాడడం, ఒంట్లో బావుండకపోతే ప్రేమగా స్పృశించడం కనిపించదు. పెద్దగొంతుతో అరవడం గాని, తిట్టడం గాని అలవాటు లేని ఆయనకి కోపం వస్తే, ఎదుటి వ్యక్తికి మధ్యాహ్న మార్తాండుడు కనిపిస్తాడు. ఎప్పుడూ ముక్తసరిగా మాట్లాడే ఆయన, తన అభిప్రాయాలకి విరుద్ధంగా ఏదైనా జరిగితే సహించలేరు. ఆయన మాట తీరు కూడా ఆయన వృత్తికి తగినట్టే, మెత్తగా కత్తి దించి కోసినట్టు ఉంటుంది. ఓసారి ఆయన కసురుకుని వెళ్ళిపోయాక చిన్నబోయి ఉన్నమామ్మగారితో అదే అంటే “అవునమ్మా… కాపోతే ఎనస్థీసియా ఉండదు గనక భరించడం కష్టం ” అన్నారు.

ఆలోచనల్లోంచి వర్తమానంలోకి వచ్చి, దిగులుగా ఉన్న ఆవిడ మొహం చూస్తూ “మామ్మగారూ , ఎందుకో కోపంగా ఉన్నారు బాబాయి గారు ” అన్నాను మెల్లిగా, ఎక్కడో ఒకచోట తన మనసులో భారాన్ని దించుకుంటే ఆవిడకి మంచిదనిపించి .

“ఎందుకేమిటమ్మా ? పేషెంటులైతే వాడు చెప్పినట్టు మందులేసుకోవడం అవసరం. ఆసుపత్రి స్టాఫ్ అయితే డాక్టర్ గారి ఆర్డర్స్ తుచ తప్పకుండా పాటించడం అవసరం! మరి ఇంట్లో వాళ్ళయితే వాడి మనసులో ఏమనుకున్నాడో దానికి అనుగుణంగా నడుచుకోవద్దూ. వాళ్ళక్కూడా మనసుంటే ఇబ్బందే ” అన్నారు నిష్ఠూరంగా .
“మరి మేఖల గారు ఎలా మానేజ్ చేస్తారో ” అన్నాను.

“మా కోడలా ? ఇద్దరూ సమ ఉజ్జీలేగా … బాధలేదు. నా అవసరం వాళ్లకి లేదన్న విషయం తెలిసిందే. నాకు తిండికి లోటు చెయ్యరు, బట్టకి తక్కువ చెయ్యరు. వేళకింత తిని కృష్ణా రామా అనుకుంటూ పడి ఉంటే వాళ్లకి బావుంటుంది. మాటా మంతీ లేకుండా బొమ్మలా ఎంత సేపని ఉండను? ఏ విషయంలోనూ ఆసక్తీ , కుతూహలం లేకుండా ఎలా బతకడం ? పోనీ ఆ పైవాడైనా, ‘నీ పనులన్నీ చేసేశావు కదే ముసలిదానా .. ఇంక రా ‘ అని వెనక్కి రప్పించుకోడు .. శరీరానికి ఏ ఇబ్బంది వచ్చినా, అపర ధన్వంతరి నా కొడుకే .. వెంటనే మందూ, మాకూ పడిపోతాయి. ఆ యముడైనా ఎలా పట్టుకుపోతాడు పాపం ” అక్కసుగా అన్నారు.

ఆవిడని చూస్తుంటే చిన్న పిల్లలా కనిపించారు. మళ్ళీ కళ్ళలో సన్నగా కదిలిన నీటి పొర, ఆవిడ నిగ్రహ శక్తికి లోబడి అక్కడే ఆగిపోయింది.

దగ్గరగా జరిగి ఆవిడ భుజాల చుట్టూ చేతులేసి ” మామ్మగారూ, ఎన్నో పుస్తకాలు చదువుతారు. ఈ వలయం కొత్తదేమీ కాదుగా. మీరలా బాధ పడుతుంటే ఏమీ బాలేదు” అన్నా ఆవిడనెలా ఓదార్చాలో తెలీక.
ఒక్క క్షణం నావైపు చూసి, చిన్నగా నవ్వి, నా చేతిని ఆపేక్షగా పట్టుకుని, “అప్పుడప్పుడిలా అనిపిస్తుంది గానీ నాకేం తక్కువమ్మా ? కాకపొతే … ఆ భగవంతుడు ముసలాళ్లందరికీ కావాలనుకున్నపుడు వెళ్ళిపోగలిగే ఇచ్చాశక్తి ఇస్తే బావుండేదనిపిస్తుంది ” అన్నారు దేవుడి గది వైపు చూపు తిప్పి.
మళ్ళీ తనే ” పాపిష్టి దాన్ని! అనవసరంగా కంట తడి పెట్టాను. ఇలాంటి కొడుకు అందరికీ దొరుకుతాడా ? దేనికీ తక్కువ చెయ్యడు ! నెత్తి మీద పెట్టుకు చూసుకుంటాడు నా తండ్రి ” అన్నారు !
ఇంతలో పదకొండున్నర అయిందని చెపుతూ గోడ గడియారం గంట కొట్టింది. బంగాని తీసుకు రావడానికి స్కూలుకి బయల్దేరాను.
* * *
అలా వచ్చేశాక మళ్ళీ వెళ్ళడం పడలేదు. తర్వాత నాలుగు రోజులకి మామ్మగారి భర్త ఆబ్దికం. ఆవిడ కూతురూ, పిల్లలూ కాక దగ్గరి బంధువులు ముగ్గురు నలుగురు వచ్చారు. శారదగారు వస్తూనే నాగేష్ తో కబురు పంపించారు ‘సాయంత్రం వచ్చి తాతగారి ప్రసాదం తీసుకోమనీ, బంగా కోసం ఏవో బొమ్మలు తెచ్చా’ననీ. ఆ సాయంత్రం నేను వెళ్లేసరికి మామ్మగారు పెరటి గట్టు మీద కూర్చుని ఉన్నారు. మొహం ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఉంది. ఎక్కువ మాట్లాడలేదు గాని, చల్లని నవ్వు ఆవిడ మొహమంతా పరుచుకుని ఉంది. బంగాని దగ్గరగా పిలిచి, బుగ్గలు పుణికి ముద్దాడారు. కాసేపు కూర్చుని, శారద గారితో మాట్లాడి వచ్చేశాం .
మర్నాడూ, మూడోనాడూ కూడా నే వెళ్ళినపుడు మామ్మగారి వదనంలో వింతైన ప్రశాంతత కనిపించింది. అంతకు ముందు చాలాకాలంగా ఆవిడ మొహంలో చోటు చేసుకున్న విచారరేఖ ఒక్కసారిగా మాయమవడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. శారద గారు మాత్రం ఆవిడ సరిగా తినడం లేదనీ, మాటలు కూడా తగ్గించేశారనీ చెప్పి బాధ పడ్డారు.
నాలుగో రోజు పొద్దున్న కాఫీ కప్పులతో బాల్కనీ లోకి వెళ్లేసరికి వాళ్ళ పెరట్లో నిండా జనం. పని మనిషి చేతులు తిప్పుతూ అమరావతి గారితో పెద్దమ్మగారు ఎలా పోయారో చెపుతోంది. బంగాని చూస్తూండమని రాజీవ్ తో చెప్పి, నేను పరుగులతో వాళ్ళింటికి వెళ్లాను. అప్పటికే మామ్మగారి భౌతిక కాయాన్ని ఆఖరి చూపులకోసం తయారు చేస్తున్నారు.
ఆవిడ నిష్క్రమణ నన్నెంతగా ప్రభావితం చేస్తుందో నేనెపుడూ ఊహించలేదు. వారం రోజుల పాటు ఒళ్ళెరగని జ్వరంతో మంచానికంటుకు పోతే అమ్మా, నాన్నగారూ వచ్చారు నాకు సాయంకోసం, రాజీవ్ కి తోడుగా పిల్లాడిని చూసుకోవడం కోసం. పన్నెండో రోజుకి కాస్త తేరుకున్నాను కదా అని వైకుంఠ సమారాధనకి వెళ్తుంటే అమ్మా, నాన్నగారూ మా వెంట వచ్చారు.
మామ్మగారి అందమైన ఫోటో ఒకటి టేబుల్ మీద పెట్టి, మల్లెపూల మాలలతో, గులాబీ విడి పూలతో అలంకరించారు. సన్నని అగరు ధూపం ఆవిడ చుట్టూ మెలికలు తిరుగుతూ వందనం చేస్తోంది.
పిండి వంటల వాసనలూ, వచ్చిన బంధుమిత్రుల సరదా సంభాషణలూ, నవ్వులూ … అక్కడంతా పండగ వాతావరణం కనిపించింది.
నొచ్చుకుంటూ “ఇదేమిటమ్మా ఆవిడ పోయినందుకు ఎవరికీ బాధే లేనట్టుంది? ” అన్నాను అమ్మతో .
“ఎనభై దాటిన మనిషి సహజ మరణం పొందితే అది పండగగా చేసుకోవాలంటారు జయా! ఎవరూ మంచాన పడి తీసుకుని, తీసుకుని పోకూడదు. అనాయాస మరణం ఒక వరం! అది అందరికీ దొరకదు. ఆవిడకేం మహారాణిలా వెళ్ళిపోయింది. పోయినప్పుడు ఆవిడ మొహం ఎంతో ప్రశాంతంగా ఉందని నువ్వే అన్నావుగా. అంటే ఆ స్థితిలో ఆవిడకేదో సుఖం, శాంతీ దొరికాయన్న మాట ! ” అంది నెమ్మదిగా.
నిజమే. ఆఖరి రోజే కాదు అంతకు నాలుగు రోజుల ముందు నించీ, కారణం ఏమిటో గాని ఆవిడ చాలా స్థిమితంగా, తేటనీటి కొలనులా అనిపించారు. నీరెండలో కమలంలా వెలుగుతూ కనిపించారు.
ముందు అందరితో పాటు పలకరించినా, భోజనాలయ్యాక శారద గారు నా దగ్గరగా వచ్చి”జ్వరం పూర్తిగా తగ్గిందా?” అని అడిగి, “ఆవిడకీ నీకూ ఏమిటో ఆ బంధం… అమ్మ వెళ్ళిపోయిన వెంటనే ఒక్కసారిగా డీలా పడిపోయావు ” అన్నారు ఆప్యాయంగా.
చేతిలో ఉన్న సన్నని నూలు సంచీ తెరిచి ఒక మెత్తని షాల్ తీసి నా చేతిలో పెట్టారు. అది మామ్మగారు తరచుగా కప్పుకుంటూ వచ్చిన పష్మినా శాలువా. లేత గోధుమ రంగులో ఉన్న ఆ శాలువా అంచు అంతా సున్నితమైన ఎంబ్రాయిడరీ చేసి ఉంది. ఆ స్పర్శ నాకేదో సుఖాన్నిచ్చింది. ఏదో ప్రేమని అందించింది.
“జయా ! ఈ శాలువా తన గుర్తుగా నీకిమ్మని అమ్మ చెప్పింది” అన్నారు .
నేను నిర్ఘాంతపోయి ” ఎప్పుడు చెప్పారు ?” అన్నాను.
” చెపితే ఆశ్చర్య పోతావ్. సరిగ్గా ముందురోజు సాయంత్రం చెప్పింది ” అన్నారు నా కళ్ళలోకి చూస్తూ.
నేను అవాక్కుగా ఉండి పోయాను.
“నాన్నగారి తద్దినం తర్వాత అంతా వెళ్ళిపోయాక, నేనూ అమ్మా తన గదిలో పడుకుంటున్నాం కదా. ఆ రోజు కొంచెం నీరసంగా కనిపించింది గాని, మనిషి సంతోషంగానే ఉంది. అసలు ఊహకూడా కలగలేదు అదే తన ఆఖరి రోజని. మాటలు తగ్గించేసింది కదా అంతకు ముందే. ఆవాళ రాత్రి మాత్రం, ఎప్పుడో రాసి ఉంచిన చిన్న నోటు పుస్తకం నాకిచ్చి, తన తర్వాత అందులో ఉన్నట్టుగా చెయ్యమంది. ఆ పుస్తకంలో తన వస్తువులు ఎవరెవరికి ఏమివ్వాలో వివరంగా రాసి ఉంచింది. అదంతా ఎప్పటి నుంచో నాలుగైదు విడతలుగా రాసి పెట్టినట్టుంది. నీకు ఈ శాలువా ఇవ్వమని మాత్రం నాతో చెప్పింది ” అన్నారు. నాకు కళ్ళు చెమర్చాయి.
ఆత్రంగా “ఇంకా ఏమైనా చెప్పారా?” అన్నాను .
“ఇంకేమీ చెప్పలేదు జయా! ఎందుకూ ? ” అనడిగారు .
” ఒక్కసారి ఆ పుస్తకం నేను చూడచ్చా?” అన్నాను అభ్యర్దిస్తూ.
“దానిదేముంది… అలాగే చూడు” అన్నారు .
ఇద్దరం మామ్మగారి గదిలోకి నడిచాం. ఆవిడ మనోభావాలకి గుర్తుగా మిగిలి పోయిన ఆ విలువైన పుస్తకం, ఆ గదిలో చిన్న పుస్తకాల అలమారలో, మిగిలిన పుస్తకాలతో పాటు ఉంది. ఆవిడ పిల్లలకోసం వదిలిన వస్తువులు పెద్ద విలువైనవి కాకపోవచ్చు. ఆ పుస్తకాన్నినా చేతిలోకి తీసుకుంటే ఆవిడ మెత్తని చేతుల స్పర్శ అనుభూతి లోకి వచ్చింది. అందులో పేజీలు గబా గబా తిరగేస్తుంటే ఎప్పటి నుంచో ఆవిడ రాసుకున్న పాటలూ, పద్యాలూ, ఏవో అంత ప్రాముఖ్యత లేని విషయాలూ రకరకాల ఇంకులతో కనిపించాయి. ఒక చోట కొత్త ఇంకుతో రాసిన వాక్యాలు వీటిలో కలిసి పోయి ఉన్నాయి .. అవే నేను వెతుకుతున్న వాక్యాలు .. నా సందేహానికి జవాబిస్తున్నట్టు కనపడ్డాయి .

“వాడేమి పసివాడా, అమ్మ కనపడక పొతే బెంగ పడడానికి ? వాడి గురించి నాకింత వ్యాకులత అవసరమా ? బంగా వయసులో అయితే వదిలి వెళ్ళరాదు. ఎప్పుడైతే తల్లి కోసం పిల్లవాడు బెంగపడడని ఖరారుగా తెలుస్తుందో అప్పుడు ఆ తల్లి తన బిడ్డని, తన పాశం నుంచి విముక్తుడిని చెయ్యాలి. అతడినే పట్టుకు వేళ్ళాడుతూ వెనక్కి లాగరాదు. నేను పోతే ఇతడెట్లా బతుకుతాడు అనేంతగా ఒక ఎదిగిన బిడ్డ, తల్లి పట్ల ప్రేమ కలిగి ఉంటే, అది ఆ తల్లి ఇహ పరాలకి మంచిది గాదు. సంతానం, తల్లి పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉంటే, ఆ తల్లి ముక్తిని పొందడమెలా ? ” మామ్మగారి చేతి రాతలో ఆవిడ రాసేటపుడు ఉపయోగించే భాషలో ఆ వాక్యాలు చదవగానే, నా శరీరంలో ఒక మెరుపు తీగ సర్రుమని పాకినట్టు ఒళ్ళు జలదరించింది!
అంతసేపు వాడిని వదిలేసినందుకు అలుగుతూ బంగా మా దగ్గరకి పరిగెత్తుకొచ్చాడు. నా కుచ్చిళ్ళు పట్టుకు లాగుతూ “అమ్మా! దా… ఎంత సేపూ ? ” అంటూ మారాం మొదలెట్టాడు. శాలువా భుజం మీద వేసుకుని, బంగా నెత్తుకుని, మౌనంగా కదిలాను.

Painting: వారణాసి నాగలక్ష్మి
(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)

21, జూన్ 2014, శనివారం

కొన్ని నక్షత్రాలు…కాసిని కన్నీళ్ళు


విమల గారు రాసిన ఈ కధ కి  రమ సుందరి గారు రాసిన పరిచయం.



కొన్ని నక్షత్రాలు.. కాసిన్ని కన్నీళ్ళు. …. కధ చదివాక కాసిన్ని కన్నీళ్ళా? హృదయపు పొరలు చిట్లి, దుఃఖం అవిరామంగా స్రవించినట్లు గుర్తు. మాటలు కరువై ఆ అక్షరాలను ప్రేమతో తడిమినట్లు గుర్తు. నలభై ఏళ్ళ గోదావరీ లోయా విప్లవ పోరాటం వెనుక మనసు ఆగక పరుగులు పెట్టినట్లు గుర్తు. నాకు తెలిసిన తెలంగాణ పల్లెలు, గరిడీలు సృతిపధంలో నడచినట్లు గుర్తు. చైతన్య గనులైన పి.డి.ఎస్.యు విధ్యార్దులు గుండె గదుల్లో కవాతు చేసినట్లు గుర్తు. ఈ కధ తెలంగాణ, అందులోను కరీంనగర్ విప్లవోద్యమ నేపధ్యంలో రాసింది. రాసింది ఆ ఉద్యమంలో ఊపిరి పోసుకొని ఎదిగిన విమల గారు. మొదట పాలపిట్ట మాసపత్రిక లో ప్రచురించబడి కధ 2012 లో కనిపిచ్చిన ఈ కధ ఒక ఆణిముత్యం.

కధా స్థలం కరీంజిల్లాలోని ఒక పల్లె. కాలం తొంబ్భైవ దశకం ప్రారంభం. ఆ పల్లెలో ప్రధాన భాధ్యతలు వహిస్తున్నది ఒక మహిళ. ఎన్నికల సందర్భంగా వచ్చిన వెసులుబాటును విప్లవ రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోవాలను కొంటారు. అప్పుడు ఆమె ముందుకు వస్తారు ఇద్దరు నవ యువకులు. ఒకరు పెళ్ళై చంటి బిడ్డకు తండ్రి అయిన తిరుపతి, ఇంకొకరు అనాధ అయి ప్రేమ తప్ప ఇంక ఏమి లేని మాధవ. యాధృచ్చికంగా మాధవ ప్రేమ కధని వింటుంది ఆమె. ఒక గంట ప్రేమికుడిని కలవటానికి తొమ్మిది గంటలు ప్రయాణం చేసి వెళ్ళిన తన తొలి ప్రేమను జ్ఞాపకం చేసుకొంటుంది. అతను తన చేతి మీద వేయించుకొన్న వెలుగుతున్న దీపం పచ్చబొట్టు చూసి కదిలి పోతుంది.

” నాకు మొక్కలంటే యిష్టం. ఎప్పటికన్నా పొలంగొంటె ఏటివడ్డున ఒక రెడకరాలనా- అందులో చిన్న గుడిసేసుకొని చుట్టూ పూల మొక్కలు పెట్టుకొని ఉండాల. మేమిద్దరం గల్సి చిన్న పిల్లల కోసం ఒక మంచి స్కూల్ బెడ్తం. క్లాసులు చెట్ల క్రింత- అదేంది. ఆ(… శాంతి నికేతన్ లెక్క” అంటూ అతడు చెప్పే కలలను వెన్నెల్లో నులక మంచం మీద పడుకొని వింటుంది. అతనికి తప్పక సాయం చేయాలనుకొంటుంది. “ఆ చల్లటి వెన్నెల రాత్రి, ఆ పిల్లవాడి ముఖంలో ఏదో అవ్యక్తపు ఆనందం. నక్షత్రపు కాంతి. ప్రేమ, అది ఎంత అధ్బుత అనుభవం!”

తెల్లవారి మసక చీకటిలో, మసక కళ్ళతో వారికి వీడ్కోలు పలికి, మధ్యాహ్నానికి ఇద్దరి ఎన్ కౌంటర్ వార్త వింటుంది. ఒకరు తిరుపతి. ఇంకొకరు? ” కట్టెలు చేర్చిన ఆ చితి మధ్య-విగత జీవిగా ఎవరో పిల్లవాడు. వాడికీ కల ఉందా? ఒక ప్రేమ కధ ఉందా? ఒక వెన్నెల రాత్రి వాడూ వాడి జీవకాంక్షని- ఎవరికైనా చెప్పాడా? ఎవరా పిల్లవాడు…మాధవా నువ్వు బతకాలరా” అని రోదిస్తుంది. ఎవరు మరణించారు? ఎవరు బతికారు? ఆ క్షణం నేను కూడ మరణించానా వాళ్ళతో పాటు? అని ప్రశ్న వేసుకొంటుంది. కాని చనిపోయింది మాధవానే. కూంబింగ్ చేసి వస్తున్న పోలిసులను చూసి భయపడిన పారిపోతుంటే ఇద్దర్ని కాల్చి వేసారు. గాయాలతో తూములో దాక్కొన్న నిరాయుధుడైన మాధవాను చంపబోమని చెప్పి బయటికి పిల్చి కాల్చేసారు.

కధ మొత్తం ఆమె జ్ఞాపకాల ఉద్విఘ్నతలతో సాగుతుంది. మానేరు ఒడ్డున కూర్చొని “మానేరా, మానేరా! నను వీడని మనియాదా” అని పలవరిస్తుంది. “చీకట్లు ముసురుతున్న అసాయంవేళ, నాల్కలు చాచుతున్న ఆ మంటల్ని నిర్ఘాంతపడి చూస్తూ, పెనుగులాడి, పెనుగులాడి నా లోపల నేనే పొడి పొడిగా రాలుతూ…” అంటూ ఆ నాటి విషాదాన్ని ధ్యానించుకొంటుంది . రచయిత్రికి విప్లవం పట్ల నిబద్దత, అది అందుకోలేని బాధ కధ పొడవునా వ్యక్తం అవుతాయి. “ఏదీ ఆ మరో ప్రపంచం, ఎర్ర బావుటా నిగనిగలు, ప్రళయ ఘోషలు, ఝుంజా మారుతాలు, జనన్నాధ రధ చక్రాలు, ఆకాశపు ఎడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలా , జాబిల్లు? ఏవి, ఏవి తల్లి నిరుడు కురిసి హిమసమూహలు?”

ఈ కధ ఒక ఎన్ కౌంటర్ దుఃఖాంతాన్ని వర్ణించే కరుణ రస ప్రధానమైన కధగా కనిపిస్తున్నా, కధ వెనుక అప్రకటిత భాష్యం (అన్-టోల్డ్ టెక్స్ట్) చాలా ఉంది. “ఈ కధ నాలో అంతరంతరాలలోఅనేక ఏళ్ళుగా దాగిన దుఃఖం.” అని రచయిత్రి చెప్పుకొన్నారు. ఆ దుఃఖం వైయుక్తమైనది కాదు. అది ఉద్యమాల దుఃఖం. సమ సమాజం నిజమైన అర్ధంలో స్థాపించటానికి బలై పోయిన వందలాది యువతీ యువకుల మృత్యు కేళి కలిగించిన వగపు.
మాధవా కన్న కలలు భారత దేశంలోని ప్రతి లేబ్రాయపు యువతి యువకుడు కనే ఉంటారు. చిన్న ఇల్లు, చేయటానికి పని; ఇవి ఇచ్చిన భరోసాతో ఇతరుల కోసం ఏదైనా చేయాలనే తపన. బహుశ మాధవ లాంటి వాని ఊహలలో ఈ రాజ్యహింస తాలూకూ పీడ కలలు ఉండి ఉండక పోవచ్చు. ఈ ఎన్ కౌంటర్లు అలాంటి కనీస కోరికలు కోరే, వాటి కోసం పోరాడే వాళ్ళకు ఈ భూభాగంలో చోటు లేదని చెప్పేతీర్పులు. కాలే చితి పై మండుతున్న శవాల తాలూకూ పొగలు అదే సందేశాన్ని మోసుకొని పోయి ఉంటాయి. తన ప్రియుడు మరణం తెలుసుకొని వచ్చి ఏడ్చి వెళ్ళిన జ్యోతి, ఈ మరణాలను ప్రశ్నించలేని, ఎవరినీ తప్పు పట్టలేని అమర వీరుల కుటుంబాల ప్రతినిధి.

ఈ కధలో ఒకప్పుడు ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగసిన ప్రాంతాలలో మారిన పరిస్థితుల వర్ణన అత్యద్భుతం గా చేసారు. క్షీణించిన సాంస్కృతిక, ఆర్ధిక జీవనాల గురించి , ముగిసి పోయిన పోయిన జమిందారీ వ్యవస్థ గురించి, కొండెక్కిన ఉద్యమాలు, ప్రపంచీకరణ సునామి ఉధృతిలో పడిపోయిన గ్రామీణ ఉపాధులు ఒక్క వాక్యంలో దృశ్యీకరించారు.
“శిధిలమైన మట్టి గోడలు, జాజు నీలం రంగులు పూసిన దర్వాజాలు, చెదిరి పోయిన నినాదాలు, రెక్కలు చాచిన రాబందుల్లా యాంటీనాలు, కోకో కోలాలు, బిస్లరీ వాటర్లు, మద్యం సీసాలు, జిల్లెళ్ళు మొలుస్తున్న గరిడీలు, పలకని రాతి దేవుళ్ల గుడులు, చదువు చెప్పని బడులు, విరిగిన మగ్గాలు- ఆకు – తంబాకు చేటలు….” .

మారిన సామాజిక ఆర్ధిక పరిస్థితులను అందుకొని చేయవలసిన కర్తవ్యాలను మరిచిన ఉద్యమవైఫల్యాలను కూడ ఎత్తి చూపారు. వచ్చిన మార్పులను స్వీకరించి ఉద్యమాలను పునర్నిర్మాణం చేయని అశక్తతను కూడ పేర్కొన్నారు.

  “పెరిగిన మధ్య తరగతి మనుషులు- నీటివసతి- కొత్త వ్యాపారాలు పెరిగి- ఒకప్పటి – కరీంనగర్ కాదది- జరిగిన మార్పులను అంచనా వేసే వాళ్ళెవరు – ఏ చేయాలో ఎలా చేయాలో – మళ్ళీ కొత్తగా ప్ర్రారంభిచేది ఎవరు?”
ఈ ఘటన జరిగిన పద్దెనిమిదేళ్ళ తరువాత మాధవ ప్రియురాలు జ్యోతిని అనుకోకుండా కలిసిన ఆమె, జ్యోతి చేతిపై మాధవ గుర్తు గా వేయించుకొన్న పచ్చబొట్టును చూస్తుంది. తన రిక్త హస్తాలను చూసుకొంటుంది. ఉద్యమ వైఫల్యాలు, మిగిలిపోయిన కర్యవ్యాలు ఈ చివర వాక్యం ద్వారా మనకు వ్యక్తమౌతాయి. ఎంత ఉదాత్తమైన ముగింపు? కధ నంతటిని ఈ చిన్న వాక్యంలో కుదించి మనకు సందేశమిచ్చినట్లైంది.

పూర్తి కధ కోసం ఈ క్రింద లింక్ ని చూడండి .
http://magazine.saarangabooks.com/2013/05/29/%e0%b0%95%e0%b1%8a%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-%e0%b0%95%e0%b0%be%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8/
.











 

31, మే 2014, శనివారం

మూలింటామె





నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు రాసిన అద్బుతం అయిన కధే ఈ మూలింటామె.  రచయిత కధ ని
చిత్తూరుయాస లో రాశారు. తేలిగ్గా అర్ధం కాదేమో అనుకున్నాను గాని చదువుతూ ఉంటె సులువుగా సాగిపోయింది. నామిని గారు మూలింటామె లోకి పరకాయ ప్రవేశం చేసినట్టు అనిపించింది. ఉత్తమ పురుషలో చెప్పకపోయినా ఒక స్త్రీ కోణం లోంచి కథని నడిపించడంలో గొప్ప నేర్పు చూపిస్తూ ఒక కుగ్రామాన్ని , అందులోని మనుషుల్ని, వాళ్ళ జీవితాలని ఎలాంటి కల్తీ లేకుండా కళ్ళకి కట్టించారు.
రచయిత కి మానవ సంబందాల గురించి మనసు లోతుల గురించి గొప్ప అవగాహనా వున్నా వ్యక్తి గా ఈ కధ  చదివాకా మనికి అనిపిస్తారు.


ఇక కధ విషయానికి వస్తే  చిత్తూరు  జిల్లా లో ఒక మారుమూల  కుగ్రామం పేరు మిట్టూర్. ఊరి చివర మూలలో వాళ్ళ అడ్డాపింట్లో  కుంచమామ్మ తన  కూతురు మొగిలమ్మ , కొడుకు నారాయణ సామీ నాయుడు  మనమరాలు/కోడలు  ిన రుపావతి తో వుంటుంది.  రూపవతి కి ఇద్దరు బిడ్డలు . ఊరిలో అందరు కుంచమామ్మ ని  ములింటి మొదటామె అని  మొగిలమ్మ ని నడిపామే  అని రూపవతి ని కొనమ్మి అని  పిలుస్తునాటారు.

కొనమ్మి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం తో కధ  మొదలవుతుంది. కాసేపటికి  కళాయి వాడితో ( మాట్లు  వేసుకొనేవాడు)
తిరప్తి ( తిరుపతి) కి పోయిందని తెలిసి ఊరువాడా  ఇంటి ముందు పొగవుతారు. ఒక మనిషి తప్పు చేస్తే అ తప్పు కి కారణాలు వెదకరు. అ తప్పు ఎందుకు చేసారో అస్సలు అలొచించరు. ఎప్పుడు తప్పు చేస్తారా అని కాచుకుకుర్చున్న జనం ఇక కాకుల పొదిచెస్తరు. ఈ కధ లో  మొలకమ్మ,రంజకం  మొదలిన వాళ్ళు వీలు దొరికినప్పుడల  వినడానికి వీలుకాని పదాలతో ములింటి వాళ్ళకి ఊపిరి సలపనివ్వరు .

మొదటామె కి  మనమరాలు అంటే పంచ ప్రాణాలు. కొనమ్మి ఎప్పటికిన  తిరిగి వస్తది అని ఎదురుచూస్తూ వుంటుంది . కొనమ్మి వెల్లిపొఇన రాత్రి కొనమ్మి ఫోటో ముందుపెట్టుకొని బాధపడుతుంది తను అడిగే మాటలు మనసుని హత్తుకుంటాయి. భీమారం నుంచి వచ్చిన అక్క నడిపమే ఇద్దరు కలిసి నారాయుడి కి ఇంకో పెళ్లి చేస్తారు.

అ కోడలి పేరు వసంత. లావుగా ఉంటుందని అందరు పందోసంత  అంటారు. కోడలి చేత గంజినీలు కూడా ముట్టుకోదు. అంత పట్టుదల మొదటామేకి.మనవరాలి చోటు ఆక్రమించుకుందని బాధ పందోసంత  పనులు చిత్రహింసలకి గురిచెస్తయి.  పందోసంత  ఇంటిముందు చెట్లు అన్ని కొట్టించి  అంగడి పెదుతున్ది. డబ్బు వడ్డిలకిస్తూ వుంటుంది .  గుడు గుడు చంద్రుడి తో ఎఫైర్ పెట్టుకొని బిడ్డను కంటుంది . పందోసంత ఇచ్చే డబ్బు కి  ఆశపడి తన తప్పు ని సమర్దిస్తువుంటారు. జీవితంలో ఒకే ఒక తప్పు చేసిన మనమరాలిన అన్ని మాటలు అంటుంటే సహించలెకపోతుంది.  అవును మరి ఇవాల్టి రోజున బలమున్నోడిది ఫై చెయి. నేటి సమాజంలో వున్నా కొంతమంది  మనుషులకి సింబాలిక్ గా రచయిత ఈ పాత్ర ని సృష్టించారు అని అనిపిస్తుంది .

మొదటామె   పిల్లుల్లు ని ప్రాణం గ పెంచుకుంటుంది. పందోసంత కి పొలం అమ్మి తండ వ్యాపారం ( వడ్డీ) కి డబ్బు ఇవ్వాలని వుటుంది.  మొదటామె  సంతకం పెట్టను  అంటుంది . ఆమె ని బెదిరించడానికి  2 పిల్లులిని చంపుతుంది.
ఇక చూడలేక వోడిసాకు  తిని చచ్చిపోతు చిమంతమ్మ చెవిలో  "నా మనమరాలు మొగుణ్ణి వదిలేసినిది కానీ మియం మియం అంటూ ని కాళ్ళ కాడ నా  కాళ్ళ కాడ  చుట్టుకులాడే పిల్లిని చంపలేదే"  అంటుంది.  ఈ మాటలు పుస్తకం చదివాకా కూడా మన చెవుల్లో రింగ్ రింగు మంటూ తిరుగుతూనే వుంటాయి. ముసలి అమ్మమ్మ పాత్ర నాకు బాగా నచ్చింది. ఆమె లో ఆమె చెప్పుకొనే మాటలు ఇతరుల ప్రశ్నలకి మనసులోనే చెప్పుకొనే సమాధానాలు చదివి తీరలిసిందే.

ఈర్ష్య ,అసుయలికి సింబాలిక్ గా  రంజకం ,మొలకమ్మ, రంగాబిల్ల పాత్రలు  వున్నయి .  ఇంకా కాస్త మంచి మిగిలే వుంది అని చెప్పటానికి  చిమంతమమ్మ  పాత్ర వుంది . 

మనమరాలు చేసిన తప్పుని అర్ధం చేసుకొని క్షమించే గుణం విద్యవంత్లో కూడా వుండదు. రచయిత సమాజం లో పరిస్తితుల్ని ఎంత బాగా అర్డంచేసుకొని రాసాడో అనిపిస్తున్ది.మనసున్న ప్రతి మనిషి కి నచ్చే కధ  ఇది.

















 

4, మే 2014, ఆదివారం

మాన్యత


ఎంతో మానసిక విశ్లేషణ  తో రాధా గారు రాసిన అద్బుతమైన  కధ .

ఎవరి కళ్ళల్లో నైనా అసూయ కనబడిందంటే మనం బాగున్నట్లు. సంతోషం కనబడిందంటే మనం కష్టాల్లో ఉన్నట్లు
ఎంత నిజం ఈ  వాక్యం .  ఈరోజుల్లో చాలా  మంది ఇలానే వున్నారు. 



అమ్మని దహనం చేసి వచ్చాక నాన్న,నేను నట్టింట్లో ఉన్న ఉయ్యాల బల్ల మీద పడుకుని ఉన్నాము. పెద్దక్కయ్య వంటింట్లో నాయనమ్మకి సహాయం చేస్తోంది. తాత మూలన ఉన్న నులక మంచం మీద పడుకుని ఉన్నాడు. తమ్ముడు తాత పక్కన కూర్చుని ఉన్నాడు. చిన్నక్క మేము పడుకున్న ఉయ్యాల బల్ల పక్కనే కూర్చుని చెల్లికి జడలు వేస్తుంది.

ఇప్పుడు దాకా మేం ఏడవడం చూసినది చాలలేదేమో ఇళ్ళకిపోయిభోజనాలుచేసుకోనిమళ్ళీ వచ్చారు ఊళ్ళోని నలుగురైదుగురు. పడుకున్న నాన్న, తాత లేచి కూర్చున్నారు. అందరూ తాత మంచం మీద కూర్చున్నారు. రేపు చిన్న దినం ఎట్లా చేయాలో,ఎవరెవరికి కబురు పంపాలో మాట్లాడుతున్నారు. నాన్నకి,తాతకి ఉచిత సలహాలు చెప్తున్నారు. వాళ్ళని చూస్తే నాకు మండిపోతుంది. వాళ్ళ నోళ్ళు 'పాపం'అంటున్నాయి. కళ్ళల్లో మాత్రం సంతోషం.

నిన్న గాక మొన్న మా పొలం గట్లను దున్ని తన చేలో కలుపుకున్న చలమడూ, ఆడపిల్లలు పెద్దవాళ్ళయ్యారని నీళ్ళు పోసుకోవడానికి దొడ్లో తడికలు అడ్డం పెట్టుకుంటుంటే నీళ్ళు మా ఇంటి వైపుకి రానీయబాకండి,వాటం అటు పెట్టండిఅంటూ కట్టినంతసేపూ అక్కడే కాపలాగా నిలబడ్డ పక్కింటి రాడూ -వీళ్ళా మాకు సలహాలు ఇచ్చేది.

"అబ్బబ్బ!అరవబాకండి. మా అమ్మ ఇక్కడే ఉంది. ఇదిగో నా దగ్గర ఉంది. అరవకుండా అందరూ లేచి వెళతారా వెళ్ళరా" అని అరిచాను వాళ్ళని కోపంగా చూస్తూ. వాళ్ళు నా మాటలకు ఏం జవాబు చెప్పాలో అర్థం కానట్టు మా తాత వైపు, నాన్న వైపు చూశారు. నేను చూసిన చూపులో వాళ్ళ మీద నాకున్న అసహ్యాన్ని కనిపెట్టాడు తాత.

"ఏదో చిన్నపిల్ల. నిద్రలో అమ్మ గుర్తొచ్చినట్టుంది. మళ్ళీ మాట్లాడుకుందాం. ఏమైనా కావాలంటే అడుగుతాంలే రామయ్యా"అని వాళ్ళని పంపించాడు తాత.

అప్పుడు నాకు పదిహేనేళ్ళు. ఎవరి కళ్ళల్లో నైనా అసూయ కనబడిందంటే మనం బాగున్నట్లు. సంతోషం కనబడిందంటే మనం కష్టాల్లో ఉన్నట్లు అని ఆ వయసులోనే నాకు అర్థం అయింది. అప్పుడే ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. ప్రతి వాడి కళ్ళల్లో నేనన్నా,నా కుటుంబం అన్నా అసూయ కనబడాలి. దాని కోసం ఏమైనా చేస్తాను. ఎంత కష్టమైనా భరిస్తాను.
***

చదువుకుంటాను గాని గొప్పగా చదవాలని పెద్ద ఆసక్తి ఏమీ ఉండేది కాదు నాకు ఇంతకుముందు. ఇప్పుడు ఎలాగైనా 10 వ తరగతిలో స్టేట్ ర్యాంక్ కొట్టేయాలి. అందరి కళ్ళల్లో అసూయని చూడాలి -అంతే -రాత్రింబవళ్ళూ మరో ధ్యాస లేకుండా చదువుకుంటున్నాను.

నాన్న ఇల్లు విడిచి పెట్టి వెళ్ళాడు. కుటుంబ భారమంతా తాత మీద పడింది. ఊళ్ళో వాళ్ళ కళ్ళల్లోని సంతోషాన్ని భరించలేక నాన్న మీద అసహ్యం కలిగింది. మంచంలోదిగులుగాకూలబడిపోయినతాతకి నేనే ధైర్యం చెప్పాను. పేద్ద నాపసానిగా మాట్లాడుతున్న నన్ను చూసి అశ్చర్యపోయాడు. నా కళ్ళల్లో ఉన్న పట్టుదలని తదేకంగా చూశాడు. ఎక్కడనుండి వచ్చిందో అంత ధైర్యం -ఒక్క ఊపున మంచం మీద నుండి లేచి "ఎంత కష్టంచేసైనాసరే నిన్ను చదివిస్తాను మాన్యతా" అన్నాడు తాత.

నాకు10 వ తరగతిలో స్టేట్ ర్యాంక్ వచ్చింది. అందరి కళ్ళల్లో అసూయ. నా మనసు మెట్టమొదటిసారిగా గర్వంతో ఉయ్యాల లూగింది. 'ఇదే కావాలి నాకు. దీని కోసం ఏమైనా చేస్తాను' మరోసారి అనుకున్నాను గట్టిగా.

పదవ తరగతిలో మా ఊళ్ళో చాలా మంది ఫెయిల్ అయ్యారు. అందరూ ఫెయిల్ అయిన సబ్జెక్ట్ లలో డౌట్లు ఉన్నాయిచెప్పమని అడుగుతున్నారు. ఎందుకు చెప్పాలి ఊరికే? ప్రైవేట్ చెప్తాను ఫీజు ఇస్తేనేఅన్నాను. ఆ సెలవల్లో ఫెయిల్ అయిన వాళ్ళే కాక చాలా మంది నా దగ్గరకి ట్యూషన్ కి వచ్చారు. అందరి దగ్గరా ఫీజులు వసూలు చేశాను. సంపాదనతోపాటు తాత మరికొంత డబ్బు వేసి నా కాలేజీ ఫీజు కట్టాడు.

***

ఊళ్ళో వాళ్ళ కళ్ళల్లో బాగా చదువుతానని అసూయ కనబడుతుంది కాని నా బట్టలను చూసి వ్యంగ్యంగా"ఇదేమిటే మాన్యా! మీ తాత టౌన్లో కాలేజీకి పోయే పిల్లకి మంచి బట్టలు కూడా కొనియ్యలేకపోతే ఎట్టా"అని సాగదీస్తూ అడుగుతుంటే కోపం వస్తోంది. ఇంట్లో పరిస్థితులు నాకు మంచి బట్టలు కొనిచ్చే విధంగా లేవని నాకు తెలుసు. ఎలాగైనా సంపాదించాలి. కాలేజీలో మా క్లాసులో చదివే పిల్లల గురించి ఆరా తీశాను. ఎవరు మొద్దులో- ఆ మొద్దులు కూడా ఎవరు బాగా డబ్బున్న వాళ్ళో కనిపెట్టి వాళ్ళతో స్నేహం చేయసాగాను.

ఈ సారి డౌట్ లు తీర్చినా,రికార్డులు రాసిపెట్టినా డబ్బు అడగకుండా డ్రస్ లు గిఫ్టుగా ఇవ్వమని అడిగాను. వాళ్ళ ఇళ్ళకు వెళ్ళినపుడు వాళ్ళ అమ్మలకి వంటింట్లో సహాయం చేసి వాళ్ళ అభిమానాన్ని చూరగొన్నాను. వీలైనంత వరకూ వాళ్ళ ఇళ్ళల్లోనే భోజనాలు కానిచ్చేదాన్ని. అలా భోంచేస్తున్నపుడు నాకో ఆలోచన కలిగింది.

"మా ఇంట్లో మేము పచ్చళ్ళు,పొడులూ,వడియాలూ పెట్టి అమ్ముతాం ఆంటీ. తెచ్చివ్వనా? " అన్నాను. ఎవర్ని అడిగినా "అలాగే మాన్యా. తప్పకుండా తీసుకురా" అన్నారు అందరూ. "చాలా మంది అడుగుతున్నారండీ. అంత పెద్ద మొత్తంలో పెట్టాలంటే కొంచెం అడ్వాన్స్ కావాలి ప్లీజ్"అన్నాను తెలివిగా. అందరూ అడ్వాన్స్ లు ఇచ్చారు. ఇంట్లో ఏడవ తరగతి వరకూ చదివి మానేసిన పెద్దక్క, పదవ తరగతి ఫెయిల్ అయి ఇక చదవను అని కూర్చున్న చిన్నక్కల సహాయం తో నాన్నమ్మ వ్యాపారం మొదలు పెట్టింది. వాళ్ళు పెట్టిన పచ్చళ్ళు నా స్నేహితుల తల్లులే కాదు ఇంకా వాళ్ళ స్నేహితులూ,వాళ్ళ ఇంటి చుట్టు పక్కల వాళ్ళూ కొంటున్నారు. మా లెక్చరర్స్ కి చెప్పొచ్చు కాని వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని అడగలేము కదా అనుకుని వాళ్ళకి చెప్పలేదు.

మాకు ఉండటానికి 5ఎకరాలు పొలం ఉంది కాని ఏమి వేసినా నష్టమే వస్తుంది. తాత దిగులు పడసాగాడు. మా ఊళ్ళో భవానీ వ్యవసాయం గురించి బాగా తెలిసిన వాడు. ఏ కాలంలో ఏ పంటలు వేస్తే లాభమో అతనికి బాగా తెలుసు. "భవానీ ఏం పంటలు వేస్తే నువ్వూ అవే వెయ్ తాతా మన పొలంలో"అని చెప్పాను.భవానీ దగ్గర పని చేసే వెంకటేశు గాడికి పచ్చళ్ళూ, సంగటీ పెట్టి మంచి చేసుకున్నాము. భవానీ పొలంలో ఏం వేయబోతున్నాడో తెలివిగా మాట్లాడి రాబట్టేదాన్ని. తాతా ,నేను మాట్లాడుకుని ఆ పంటలే వేసేవాళ్ళం.

ఇంటర్ లో కాలేజీ ఫస్ట్ వచ్చాను. డిగ్రీలో చేరడానికి ఇప్పుడు నాకు డబ్బు ఇబ్బందేమీ లేదు. పచ్చళ్ళు బాగా పోతున్నాయి. షాపుల నుంచి, హోటళ్ళ నుంచి ఆర్డర్స్ సంపాదించాను. ఒక్కోసారి పెళ్ళిళ్ళకి కూడా సప్లై చేస్తున్నాము. తాతకి కూడా పొలంలో ఆదాయం బాగానే వస్తుంది. తమ్ముడు నాలాగే పట్టుదల కలిగిన వాడు. 10 వ తరగతికి వచ్చాడు. వాడి సహాయంతో ప్రైవేట్లు ఇంకా ఎక్కువ మందికి చెప్తున్నాను. కాలేజీకి వెళ్ళి రావడానికి,పచ్చళ్ళ ఆర్డర్ల కోసం స్కూటీ కొనుక్కున్నాను.

***

నేను చాలా అందంగా ఉంటాను. నా అందానికి ఇంకా మెరుగులు దిద్దుకొని డిగ్రీలో అడుగుపెట్టాను. ఇక్కడ నా అందమే నాకు ప్లస్ పాయింట్ అని నాకు తెలుసు. మగ పిల్లలతోస్నేహంగామాట్లాడటం అలవాటు చేసుకున్నాను. ఇక ఆడపిల్లలతో ఎవరికేం కావాలో తెలుసుకుని వాళ్ళకు తగ్గట్లుగా మాట్లాడతాను. ఒక స్థిరమైన అభిప్రాయాన్ని ఏర్పరుచుకొని దాన్నే పట్టుకుని వేళ్ళాడటం కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది నేను ఉన్నతంగా బ్రతకడం. డబ్బు కోసం నా కుటుంబం ఇబ్బంది పడకూడదు - అంతే- 'అదే నాకు కావాల్సింది. దాని కోసం నేనేమైనా చేస్తాను' అనిమరోసారి అనుకున్నాను.

సాగర్ గాడు ఈ మధ్య ఏదో ఒక రకంగా మాట్లాడుతున్నాడు. వీడు నామీద ప్రేమ పెంచుకుంటున్నట్లున్నాడు. ఇక రెండు మూడు రోజుల్లో నాకు "నిన్ను ప్రేమిస్తున్నాను"అని చెప్తాడని వాడి కళ్ళు చూసి గ్రహించాను. సాగర్ గురించి ఎంక్వయిరీ మొదలు పెట్టాను. పల్లెటూరు నుండి వచ్చాడు. ఇద్దరు అన్నలు. ఉన్న పొలాన్ని పంచుకుంటే వీడికి5 ఎకరాలు కూడా రాదు. వీడి చదువూ అంతంత మాత్రమే. వీడిని చేసుకుంటే - ఛీ!ఛీ!తలుచు కోవడానికి కూడా నాకు అసహ్యమే. ఏమీ బయట పడకుండా సాగర్ ని చూడగానే ఏదో పెద్ద పనిలో ఉన్నట్లు,దేని గురించో ఆలోచిస్తున్నట్లు సీరియస్ గా ముఖం పెట్టడం చేయసాగాను.

పెద్దక్కకి మంచి సంబంధం వచ్చింది. కలెక్టర్ ఆఫీసులో గుమాస్తా. పెద్ద కట్నం ఏమీ లేకుండానే ఆమె నెమ్మదితనం,పనితనం చూసి కావాలని అడిగారు. పెళ్ళయ్యాక మా ఊళ్ళోనే వేరే ఇల్లు తీసుకుంది. బావ ఆఫీసుకి వెళ్ళాక ఇంటికి వచ్చి పచ్చళ్ళు పెడుతుంది. పచ్చళ్ళ వ్యాపారం బాగా పెరిగింది. తాత,నాన్నమ్మలు బాగా ఆరోగ్యంగా ఉండాలి. అందరి కంటే ఎక్కువ కాలం బ్రతకాలి. అమ్మకి మందులు, బలమైన తిండి ఇప్పించలేక చనిపోయిన సంగతి నేను ఎన్నటికీ మర్చిపోలేను. కాలేజీ నుండి వచ్చేప్పుడు వాళ్ళకి కావలసినవి తెచ్చి పెట్టేదాన్ని. తమ్ముడికి నేనే ఇన్స్పిరేషన్. 10 వ తరగతిలో స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు మా ఊళ్ళో ఆ మాన్యతని చూడండిరా. చిన్న పిల్ల అయినా బాధ్యతని ఎట్టా భుజాల మీదకు వేసుకుందోఅంటారు. అందరి కళ్ళల్లో అసూయ. 'అదే నాకు కావాల్సింది. దాని కోసం నేనేమైనా చేస్తాను' మరోసారి అనుకున్నాను.

***

"మాన్యా!లత,మధు సినిమాకి వెళుతున్నారు. మనం కూడా వెళదామా" అని సార్ అడిగాడు. మధు చాలా అందగాడు. కోటీశ్వరుడు. కార్లల్లో కాలేజీకి వచ్చేవాళ్ళల్లో మధు ఒకడు. చాలా బాగా చదువుతాడు. నాకు పోటీ అతనే. మధు లతని ప్రేమిస్తున్నాడా? లేకపోతే సినిమాకి ఎందుకు ప్లాన్ చేస్తారు? కనిపెట్టడం ఎంతసేపు? వాళ్ళ కళ్ళు చూస్తే తెలియదా -నేరుగా మధు సీట్ దగ్గరకి వెళ్ళాను. నేను మధు దగ్గరకి వెళ్ళడం చూసిన లత ఆసక్తిగా పక్కనుండి చూస్తుంది.

"మధూ! సినిమాకి ప్లాన్ చేశావుట. ఎవరెవరు వస్తున్నారు? ఏం సినిమాకి వెళదాం?అని క్యాజువల్ గా అడిగాను. ఓరగా లత వైపు చూస్తూ ఇంకా ఏం అనుకోలేదు మాన్యా. చూద్దాంలేఅన్నాడు.
నాకర్థం అయింది. ఇప్పుడిప్పుడే వాళ్ళిద్దరి మధ్యా ఏదో మొగ్గ తొడుగుతోందని. లాభ నష్టాలు ఆలోచించే నా మనస్సు మధుని నావైపుకి తిప్పుకోమంది.

అవకాశాన్ని ఎలా చేజిక్కించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. తర్వాత రోజు సాగర్ "మాన్యా!ఫ్రెండ్ షిప్ డేకి మధు లతకి ఇవ్వాలని భలే గ్రీటింగ్ కొన్నాడు. నేను కూడా నీ కోసం అలాంటి గ్రీటింగ్ కొనాలనుకుంటున్నా" అన్నాడు. "ఏం గ్రీటింగ్ అది"అని అడిగాను అనాసక్తతను నటిస్తూ. "పూలు అందించే చేతుల గ్రీటింగ్. ఎంత బావుందో" అన్నాడు.

"చూడు సాగర్! నాకు ఇలాంటివి నచ్చవు. దయచేసి నన్ను అలా అనుకోకు. నేను నీకు చెల్లెలిని అనుకో"అన్నాను. వాడి ముఖం ఎలా మారిందో కూడా చూడకుండా గ్రీటింగ్ కార్డ్స్ షాప్ కి పరిగెత్తాను.

పూలు అందించే చేతుల గ్రీటింగ్ కార్డు కొన్నాను. రేపే ఫ్రెండ్ షిప్ డే. రేపటి దాకా ఆలశ్యం చేయడం వల్ల మధు తను కొన్న గ్రీటింగ్ లతకి ఇవ్వొచ్చు. అది జరగకూడదు. సాయంత్రమే మధుని కలుసుకున్నాను.

"మధూ!రేపు నేను కాలేజీకి రాను. చిన్నక్కకి పెళ్ళి చూపులు. నాకు నువ్వంటే ఎంతో ఇష్టం. మన స్నేహం చిగురించాలనే ఆశతో ఈ గ్రీటింగ్ నీ కోసం" అంటూ ఆ గ్రీటింగ్ ఇచ్చాను. గ్రీటింగ్ ని కవర్లో నుండి తీసి చూసిన మధు కళ్ళు అనందంతో వెలిగాయి.

"వావ్!మాన్యా!. నేను కూడా ఇలాంటి గ్రీటింగ్ కార్డే కొన్నాను" అన్నాడు.

"అవునా! నా కోసమేనా? అబ్బ!మధూ! మనిద్దరి టేస్ట్స్ ఎంత బాగా కలిశాయి. ఏదీ చూపించు. నాకిప్పుడే ఇవ్వు" అని గారాలు పోయాను మధు పైన వాలుతూ.

తడబడిపోయిన మధు "ఇప్పుడొద్దులే. రేపు నేను మీ ఇంటికి వచ్చి ఇస్తాను సరేనా! " అన్నాడు.

"ఎందుకు నన్ను చూడాలనా" అన్నాను మరింత కవ్వింపుగా -అంతే మధు నా ప్రేమలో పడిపోయాడు.

తర్వాత రోజు గ్రీటింగ్,పూలు,పండ్లతో సహా మా ఊరు వచ్చాడు. కారు మా ఇంటి ముందు ఆగడం చూసిన జనం కళ్ళల్లో ఎంత కుళ్ళో! వచ్చింది ఎవరో తెలుసుకోవాలని ఎంత ఆత్రమో.

'ఎవరే మాన్యా వచ్చిందీ కార్లో'అని ఆరా తీయడం. మా ఇంట్లో వాళ్ళని ఇప్పటికే ఎన్నో సార్లు అడిగి ఉంటారని నాకు తెలుసు. మా వాళ్ళకి తెలియదు. తెలిసినా చెప్పరు. 'మా మాన్యని అడగండి' అంటారు. "మా చిన్నక్కకి సంబంధం వచ్చింది కదా! వాళ్ళ చుట్టాలు లెండి" అని చెప్పాను.

***

చిన్నక్కకి పెళ్ళయింది. బావ కంప్యూటర్ ఇంజనీర్. కట్నం లేకుండా చిన్నక్క అందానికి మెచ్చి పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళయినవెంటనేహైదరాబాద్కివెళ్ళిపోయింది. నాయనమ్మకిపనిఎక్కువయింది. ఆమెకిరెస్ట్కావాలి. పచ్చళ్ళురుబ్బడానికి,పొడులుకొట్టడానికివెంకటేశుపెళ్ళాన్నిపెట్టాను. దానికిసినిమాలపిచ్చి.
వారానికిరెండుమూడుసార్లుపనిఎగ్గొట్టిటౌన్కిసినిమాలకివెళుతుంది.దాన్నిటౌన్ కివెళ్ళకుండాఆపడానికిటి.వికొనుక్కొచ్చాను.
వంటింటికి,ముందుగదికిమధ్యఉన్నఅలమరాపగలకొట్టించిఎటుకావాలంటేఅటుతిప్పుకునేట్లుగాటి.విపెట్టించాను. టి.వి.చూస్తూఎంతపనిచెప్పినాకిక్కురుమనకుండాచేస్తుంది.వెంకటేశపెళ్ళాన్నిమాఇంటికిరాకుండాచేయాలనిఎంతమందిప్రయత్నించారోనాకుఅదిచెప్పేది. ఇప్పుడికఇదిమాఇల్లువదిలిపెట్టదు. బాగాపనిలోకుదురుకుంది.దానికిబదులుగావెంకటేశు కొడుక్కి ఫీజు లేకుండా ప్రైవేటు చెప్పి 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేట్లు చేశాను.

తమ్ముడుకాలేజీలోచేరాడు. చెల్లితొమ్మిదవ తరగతికివచ్చింది. నాకుమధుకిమధ్యప్రేమగాఢంఅయింది. డిగ్రీఫైనలియర్పరీక్షలుదగ్గరకొచ్చాయి.పనులవత్తిడిలో,ప్రేమమత్తులోచదువువెనకపడింది. మధుకిబాగాచదువుకోవాలనిచెప్పాను. ప్రయివేట్లుచాలావరకుతమ్ముడిచేత,చెల్లెలిచేతచెప్పించిబాగాచదువుకోసాగాను.డిగ్రీలోగోల్డ్మెడల్సాధించాను. బిజినెస్మేనేజ్మెంట్లోచేరాను.

***


మధుతోనాపెళ్ళిజరగాలంటే, అతడిపేరెంట్స్మాపెళ్ళికిఒప్పుకోవాలంటేఫాల్స్ప్రిస్టేజ్చూపించాలి-తప్పదు. పొలం లోన్ పెట్టించి,బ్యాంక్లోఉన్నడబ్బుతీసి,బావలదగ్గరకొంతఅప్పుచేసిపెద్దఇల్లుకట్టించాను. ఇంటిలోపలగదుల్లోసామాన్లులేకపోయినాహాలులోమాత్రం సోఫాసెట్,పెద్దటి.వి,ఫ్లవర్వాజ్లతోఅలంకరించాను.

మధుతల్లిదండ్రులనితీసుకునిమాఇంటికివచ్చాడు.మధునాన్నపెద్దబిజినెస్మాగ్నెట్.చాలాతెలివైనవాడని కనిపెట్టాను.నాఅందం,చదువు,ముఖ్యంగానాకళ్ళల్లోపట్టుదలగమనించాడు. ఒక్కమాటకూడామాట్లాడకుండాపెళ్ళికిఒప్పుకున్నాడు.

రంగరంగవైభవంగాజరిగిననాపెళ్ళికివచ్చినఊరివాళ్ళు,మా క్లాస్ స్మేట్స్అందరికళ్ళల్లోఅసూయనిచూసిననేను'ఇదేనాకుకావలిసింది. దీనికోసంనేనేమైనాచేస్తాను' అనిమరోసారిఅనుకున్నాను.

ఇప్పుడునేనుకోటీశ్వరుడికోడలినేకానిఇంటిమీదనాకుఅధికారంరావడానికి,నిజంగాకోట్లునాకుఅందడానికినేనుచాలాకష్టపడాలనినాకుతెలుసు. హనీమూన్లోనాఅందాన్నిఆరబోసినాభర్తనుపూర్తిగానావాడినిచేసుకున్నాను.మధునామాటగీటుదాటడు. ఇకమామగారిఅభిమానాన్నిసంపాదించాలి.

తమ్ముడినిఇంజనీరింగ్లోచేర్పించాను.చెల్లి పదవతరగతి60%తోఏదోఫస్ట్క్లాస్లోపాసయింది. సెకండ్క్లాస్వచ్చినట్లయితేమళ్ళీఅందరికళ్ళల్లోసంతోషంచూడవలసివచ్చేది. ఫస్ట్క్లాస్లోపాస్అయిందిఅంతేచాలుఅనుకున్నాను.

మామగారుచేసేవ్యాపారాల్లోజీడిపప్పునిఎక్స్పోర్ట్చేసేవ్యాపారంబాగాలాభాలనుఆర్జించిపెడుతోందనిగమనించాను. జీడిపప్పుతోపచ్చళ్ళుకూడాప్యాక్చేసిపంపడానికిమామగారినిఒప్పించిలక్షలరూపాయలుపెట్టుబడిగాపెట్టి'నాయనమ్మపికిల్స్'అనేపేరుతోలైసెన్స్సంపాదించాను. నాదశతిరిగింది.విపరీతంగాఆర్డర్స్రాసాగాయి. దేశ  విదేశాల్లోనాయనమ్మపికిల్స్కిబ్రాండ్నేమ్వచ్చేసింది. మామగారికిహఠాత్తుగాగుండెపోటురావడంతోడాక్టర్స్రెస్ట్కావాలన్నారు. పూర్తిగానామీదనమ్మకంఉంచినఆయనబిజినెస్వ్యవహారాలన్నీనాకుఒప్పచెప్పారు.

చిన్నబావకిఅమెరికాలోతెలిసినవాళ్ళకంపెనీలో ఉద్యోగం వచ్చేట్లు చేశాను. తాత పూర్తిగా మంచాన పడిపోయాడు. నాయనమ్మ మాత్రం పచ్చళ్ళు కలుపుతానే ఉంది. పెద్దక్కప్పుడు మా పచ్చళ్ళ ఎక్స్ పోర్ట్ కంపెనీకి పార్టనర్. అసలు మా పెద్దక్క నాకు ఎంతో సపోర్ట్. ఇంట్లో తాతని,నాన్నమ్మని,పచ్చళ్ళని అంతా మానేజ్ చేసింది అక్కే.చెల్లికి చదువు రాదు అని తెలుసు.అందుకే మధు చిన్నాన్న కొడుక్కి ఇచ్చి పెళ్ళి చేశాను. తమ్ముడికి ఎం.టెక్ పూర్తి అయింది. ఎం.ఎస్ కోసం అమెరికాకి వెళుతున్నాడు.

***

పిల్లలు కావాలని మధు,అత్తగారు పోరు పెడుతున్నారు. పెళ్ళయి అయిదేళ్ళు అయింది. బాధ్యతలు కూడా తీరినట్లే. నేను అనుకున్నది సాధించగలిగాను. ఇప్పుడిక నాకు,నా కుటుంబానికీ ఏ బాధలూ లేవు. పిల్స్ తినడం ఆపేశాను. నాకు ఏడో నెల రాగానే మామగారితో,మధుతో చెప్పి టెక్స్ టైల్స్ కంపెనీ మూసేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ కంపెనీలో పని ఎక్కువ. లాభాలు తక్కువ. ముఖ్యంగా పర్యవేక్షణ చేసేవాళ్ళు లేరనే ఈ నిర్ణయం తీసుకున్నాను. కంపెనీ అమ్మేస్తున్నట్లు నోటీసు పెట్టగానే వర్కర్స్ అందరూ మా బంగళాకి వచ్చారు. అందరి కళ్ళల్లో నీళ్ళు. మామగారు నా వైపు ఏం చేద్దాం అన్నట్లు చూశారు.నాకు వాళ్ళని చూస్తే బాధ కలగలేదు కాని వీళ్ళంతా రకరకాలుగా మాట్లాడతారు. చేయలేక కంపెనీ మూసేసుకున్నారు అని చెప్పుకుంటారని బాధ కలిగింది. అలా అనుకోకూడదు. అది నాకిష్టం ఉండదు.

"సరే-లాభాల్లో మీరు షేర్ తీసుకోండి. కంపెనీని లాభాల దిశగా నడిపించే బాధ్యత మీదే ఇక"అన్నాను. అందరూ సంతోషపడ్డారు. మామగారు మెచ్చుకోలుగా చూశారు నా వైపు.

నాకు అబ్బాయి పుట్టాడు. అమ్మ పేరు వైష్ణవి. ఆ పేరు కలిసేట్లుగా మా అబ్బాయికి విష్ణు అని పేరు పెట్టుకున్నాను. మామగారికి,అత్తగారికి వాడితో బాగా కాలక్షేపం. వాడికి కావలసినవన్నీ వాళ్ళే చూసుకుంటారు. నేను మళ్ళీ పూర్తిగా బిజినెస్ వ్యవహారాల్లో పడిపోయాను.

***

తాతకి బాగా లేదని కబురొచ్చింది. ఊరికి వెళ్ళాను. అందరూ పలకరించే వాళ్ళే. వాళ్ళ కళ్ళల్లో అసూయ లేదు. మెచ్చుకోలు తప్ప. ఆశ్చర్యపడ్డాను. "తాతా!"అని పిలిచాను ఆయన మంచం మీద కూర్చుని. తాత కళ్ళల్లో నీళ్ళు. నా కళ్ళల్లోనూ నీళ్ళే. అవి ఆనంద బాష్పాలని ఇద్దరికీ తెలుసు. తాత నా చేతుల్లో ప్రశాంతంగా కళ్ళు మూశాడు.

తాత దినం మూడు రోజులు వైభవంగా పెళ్ళిలాగా చేశాను. అందరూ నన్ను గౌరవంగా చూసేవాళ్ళే. ఒక్కరి కళ్ళల్లో కూడా నేను అసూయని చూడలేదు. నాకు ఆశ్చర్యం ఎక్కువవుతోంది. నా ఫీలింగ్స్ చెప్పుకోవడానికి నాకెవరూ లేరు. ఎవరితో చెప్పుకోను? అసలు ఎలా చెప్పను?నాకు కావలసింది అందరి కళ్ళల్లో అసూయ. కాని ఇదేమిటి అందరూ సంతోషంగా,గౌరవంగా,మెచ్చుకోలుగా,ఆప్యాయంగా చూస్తున్నారు? ఇది నాలో వచ్చిన మార్పా? లేక వాళ్ళల్లో వచ్చిన మార్పా? నాకెవరు చెప్తారు?

దిగులుగా ఉన్న నన్ను చూసి మధు,తాత కోసం దిగులు పడుతున్నాననుకున్నాడేమో-"పెద్దవాళ్ళయ్యాక చనిపోకుండా ఎలా ఉంటారు మాన్యా"అంటున్నాడు.


ఆరు నూరయినా ఉదయాన్నే లేచి కంపెనీ పనులు చేసుకునే నేను ఆరోజుపది అయినా నా గదిలో నుండి బయటకు రాలేదు. మధు ఆశ్చర్యంగా చూశాడు. "కంపెనీకి వెళ్ళాలనిపించడం లేదా మాన్యా?" అని అడిగాడు. మధు కళ్ళలోకి నిస్తేజంగా చూస్తూ నా భావాలని,నా ఆలోచనలనీ,వాటిని సాధించడం కోసం నేను చేసిన పనులనీ ఆఖరికి గ్రీటింగ్విషయం కూడాదాచకుండాచెప్పాను.

"మధూ!ఇదంతానేను,నాకుటుంబంఉన్నతస్థాయిలోఉండాలనీ, సరైన మందులు ఇప్పించుకోలేక మాఅమ్మకోసం పడ్డ అవస్థ ఇక రాకూడదనిచేశాను. బాధలనుతట్టుకోలేక, బాధ్యతలనుండితప్పించుకోవడానికిఇంట్లోనుండివెళ్ళిపోయిచనిపోయాడోలేదోతెలియకుండాఉన్నమానాన్నబాధ్యతలనునెత్తినవేసుకునిచేశాను. మాతాతకళ్ళల్లోగర్వాన్నిచూడాలనుకునిచేశాను.అయితే నాకు అర్థం కానిది ఏమిటంటే ఇన్నాళ్ళూ మేము ఎదుగుతుంటే అసూయ వ్యక్తం చేసే వాళ్ళ కళ్ళల్లో ఈ రోజు అసూయ స్థానంలో గౌరవం ఎలా వచ్చింది అనే" అన్నాను.

మధు కళ్ళల్లో కలవరం స్పష్టంగా తెలుస్తుంది. నాకు దగ్గరగా వచ్చి మంచం మీద కూర్చున్నాడు. నా వీపు మీద చేయి వేసి నిమురుతూ"మాన్యా!ఏదో ప్రోద్బలం,మోటివ్ లేకుండా మనం మనుషులం సాధారణంగా ఏ పనీ చేయం. ఎదుగుతున్న వయసులో నీకు తగిలిన దెబ్బల వలన నీ ఆర్థిక పరిస్థితులను ఉన్నత స్థాయికి తెచ్చుకోవాలనే పట్టుదల నీలో కలిగింది. సాధించావు. ఈ ప్రయాణంలో కొంతమందికి సహాయాలు,మరికొంత మందికి గాయాలూ చేసి ఉండవచ్చు. అంతవరకు బాగానే ఉంది. కాని మాన్యా! వీటి వెనుక ఉండి నిన్ను నడిపించింది ఎదుటి వాళ్ళల్లో 'అసూయని కలిగించడం'అన్న కోరిక-అది మాత్రం అర్థం లేనిదేమో"అన్నాడు.

"నేను ఎదగడానికి ఆధారమే అది. అర్థం లేనిది ఎలా అవుతుంది"అన్నాను మధు వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ.

"మనం అసూయ పడగలిగేది మనకి దగ్గరగా మన వర్గంలో వాళ్ళని చూసే. మనకన్నా మరీ ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి అసూయ పడటం, మనకన్నా మరీ తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి గర్వపడటం జరగదు మామూలుగా. మీ ఊరి వాళ్ళు నిన్ను చూసి అసూయ పడటానికి అవకాశం పెద్దగా లేదు. వాళ్ళ వర్గం నుండి నువ్వు ఎప్పుడో పైకి తన్నేసుకుని ఎగిరిపోయావు. ప్రస్తుతం నీ స్థాయిలో ఉన్న వారిని నువ్వు గమనిస్తే వాళ్ళ కళ్ళల్లో అసూయని చూడగలవు.ఈ స్థాయినీ మించి నువ్వు మరో స్థాయికి వెళ్ళినపుడు అక్కడా అదే చూస్తావు.నువ్వు వెతుక్కుంటున్నది అదే అయితే నీ ప్రతి వర్గంలోనూ కొంతమంది మనుషుల దగ్గర అది తప్పకుండా దొరుకుతుంది.ఇతరుల మెప్పుకోసమో లేదా అసూయని కలిగించడం కోసమో నువ్వు ఎదిగినప్పుడు ఆ ఎదుగుదల పరిపూర్ణమైనదికాదు. జీవిత చరమాంకంలో 'నేను సాధించిందేమిటి'అని చూసుకుంటే నీకంటూ ఏమీ ఉండదు" నా వైపే చూస్తూ నిదానంగా చెప్తున్న మధు మాటల్లోని నిజాన్ని గ్రహించాను.
ఎందుకునేనెప్పుడూనెగిటివ్గాఆలోచిస్తానో,ఎందుకునాకంటూస్నేహితులులేరోకూడానాకుఅర్థంఅయింది.మధుని కౌగలించుకుని చాలా సేపు ఏడ్చాను. ఒంటరిగా ప్రయాణిస్తున్న నా మనసుకు ఏదోఆలంబనలభించినఅనుభూతికలిగింది.

ఇంతకు ముందు నా ప్రస్తుత స్థాయి వర్గం వారితో కలవలేదు.కలవాలనిప్రయత్నించలేదుకూడా.వీళ్ళను కూడా చూద్దామనే ఆ రోజు సాయంత్రం మధు స్నేహితుడి ఇంట్లో పార్టీకి వెళ్ళాను. ఎప్పుడూ ఏ పార్టీలకీ రాని నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు కాని కాసేపట్లోనే కొంతమంది కళ్ళల్లో ఆశ్చర్యం స్థానంలో అసూయ చోటు చేసుకోవడం గమనించాను.

నాకిప్పుడు ఆ అసూయ సంతోషం కలిగించట్లేదు.
                                                                                                                             _ మండవ  రాధ