15, మార్చి 2014, శనివారం

అమ్మాయిలూ ఆలోచించండి !



                                                                                                                     —-మండువ రాధ


“శైలా! ఓ శైలా! మీ ఎంకమ్మత్త నిన్ను రమ్మంటంది” ప్రహరీ గోడకి ఆనుకుని ఉన్న అరుగుమీదకెక్కి కేకలు వేస్తూ నన్ను పిలిచి చెప్పింది నాగరత్నమ్మ.

“ఎందుకంటా? సిగ్గూ, ఎగ్గూ లేకుండా అది నా కూతురిని పిలవమంటే నువ్వెట్టా పిలుస్తున్నావు? పైగా అరిచి చెప్తుంది చూడు నలుగురూ వినలేదని” అంది మా అమ్మ ఈసడింపుగా.

”నాకెందుకులే తల్లా మీ మద్దెన. ‘పాలు పిండుకు రావడానికి కొట్టం సాయ పోతున్నావు గదా! అట్టా మా శైలజని రమ్మని చెప్పు నాగరత్తమ్మా’ అంటే వచ్చా. ఏందో అమెరికా దేశం నుండి కోడలు వచ్చిందంటే చూడాలని ఉండదా? చిన్నప్పుడు ఎత్తుకుని పెంచిన మురిపం ఎక్కడకు పోద్దీ” అనుకుంటా అరుగు దిగి వెళ్ళిపోయింది నాగరత్నమ్మ.

“మురిపం అంటా మురిపం. లేచిపోయింది పోయినట్లుండక ఆస్తి కోసం పుట్టింటి పైనే కేసు వేసింది. మొగుడ్ని వదిలేసి లేచిపోయిన దానికి ఆస్తి ఎట్టా వచ్చిద్దని కోర్టు బాగా బుద్ధి చెప్పింది. అయినా దరిద్రం వదల్లా. కూతురు సక్కరంగా కాపరం చేసిద్దని ఊళ్ళో ఇల్లు కట్టి పోయిందిగా ఆ మహాతల్లి. ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ ఇంటికి చేరింది. 
 తూరుప్పక్క బజారుకి పోదామంటే సిగ్గేత్తంది దీని మొకం చూడలేక” అంది అమ్మ మజ్జిగ చిలుక్కుంటూ.
 
అమ్మ మాటలకి నాకు బాధ కలిగింది. అమ్మ ఆవేదనలో కూడా అర్థం ఉంది. మామని వద్దని లేచిపోయిన ఎంకమ్మత్త ఎవరి ప్రోద్బలంతో మా మీద కేసు వేసిందో, ఎందుకు వేసిందో నాకు అర్థం కాని ప్రశ్న. తాతని ఫోన్లో అడిగాను కాని ‘నువ్వు ఇండియాకి వచ్చినపుడు మాట్లాడుకుందాంలే తల్లీ’ అన్నాడు. అత్తని కలిసినపుడు తప్పకుండా అడగాలి. ‘అమ్మకి తెలియకుండా అత్త దగ్గరకి వెళ్ళాలి ఈరోజు’ అని అనుకున్నాను.
అత్త జ్ఞాపకాలు నా మనస్సు నిండా…
                                         
***
మోకాళ్ళ పైదాకా బుట్టబొమ్మ లాంటి గౌనులు కుట్టేది నాకు అత్త. అవి వేసుకుని స్టీలు పెట్టెలో పుస్తకాలు, పలక పెట్టుకుని స్కూలుకి వెళ్ళే నన్ను చూసి ‘నువ్వెవరి పిల్లవే’ అని అడిగే వారు నాకు మామ వరస అయ్యే వారు. ‘ఎంకమ్మత్త కోడలిని’ అనేదాన్ని. ఎప్పుడూ కూడా మా నాన్న పేరో, అమ్మ పేరో చెప్పేదాన్ని కాదు. ‘బాగా చదువుకుని పెద్ద డాక్టర్ వి అవ్వాలి బంగారూ! అమెరికాకి వెళ్ళి పై చదువులు చదవాలి‘ అనేది అత్త.

అత్త భలే బాగుండేది. సినిమాల్లోని భానుమతి లాగా. మోచేతి దాకా ఉండే జాకెట్టూ, ఆ జాకెట్టుకి మెడ చుట్టూ అంచూ, పూసలూ వేసి కుట్ట్టుకునేది. ఒంటిపొర పైట వేసుకుని పిన్ను పెట్టుకునేది. అంత అందమైన అత్తని పన్నెండేళ్ళప్పుడే తనకంటే ఇరవై ఏళ్ళు పెద్దవాడైన మామకిచ్చి పెళ్ళి చేశారు. అత్తేమో రాణి లాగా పొడవు, పొడవుకి తగ్గ అందమూ. మామేమో పొట్టి. బుడ్డోడులాగా ఉండేవాడు. అయినా నాయనమ్మకి మనసు ఎట్లా ఒప్పిందో అంత అందమైన కూతురిని అనాకారి తమ్ముడికిచ్చి కట్టపెట్టడానికి? తన పుట్టింటి ఆస్తిని కూడా తనింట్లోనే కలుపుకోవచ్చనో, కూతుర్ని తన దగ్గరే ఉంచుకోవచ్చు అనో చేసి ఉంటుంది. రోజుకో రకంగా అలంకరించుకుని పొగాకు గ్రేడింగ్ కి పోయేది అత్త. అక్కడ ఒక పొగాకు బయ్యర్ తో స్నేహం చేసింది. నాన్నకి, తాతకి తెలిసి, కట్టడి చేసి ఇంట్లో కూర్చో పెట్టారు. కొన్నాళ్ళు బాగానే ఉన్నట్లు నటించి తన నగలన్నీ తీసుకుని ఆ పొగాకు బయ్యర్ తో లేచి పోయింది.
అతడైనా సరైన వాడా అంటే అదీ లేదు. అతనికి అప్పటికే పెళ్ళాం, కూతురు ఉన్నారు. ఊళ్ళో అందరూ తాత నాయనమ్మల ముఖం ఎదుటే తుపుక్కు తుపుక్కు మని ఊశారు. నాన్న అయితే చాలా రోజులు బయటికి రాలేకపోయాడు. మామకివేమీ పట్టలేదు. ఆయనకి మొదటినుండీ కూడా పొలమే పెళ్ళాం, గొడ్లే బిడ్డలు. 
 
చాన్నాళ్ళ తర్వాత నేను ఏడో తరగతిలో ఉండగా స్కూలు నుండి వస్తున్న నన్ను దారిలో జువ్వి చెట్టు కింద కలుసుకుంది మా నాయనమ్మ. “మీ అత్తొచ్చిందే. దానికి నిన్ను చూడాలని ఉందంట దా” అని నన్ను చెరువు కట్ట దగ్గరకి తీసుకెళ్ళింది. అబ్బో! ఎంకమ్మత్త ఎంత బాగుందో. అచ్చం పట్నం దొరసాని లాగా ఉంది. మిన్నాగు చర్మం లా ఆమె చర్మం ఆ సాయంత్రపు ఎండలో మిల మిలా మెరుస్తుంది. అత్తని చూస్తే అప్పుడు నాకు భలే గర్వం కలిగింది. అత్త తన హాండ్ బ్యాగ్ లో నుండి బంగారు కాగితపు అట్టలో పెట్టిన హల్వా, చేగోడీలు ఇచ్చింది. నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని కన్నీళ్ళు కారుస్తూ వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చేప్పుడు నాయనమ్మ “ఎవరికీ చెప్పొద్దేయ్. మీ అమ్మకి అస్సలు చెప్పబాక తిట్టిద్ది” అంది. చెప్పనని అడ్డంగా తలూపాను.

నేను ఏడునుంచి పదో తరగతికి వచ్చిందాకా అప్పుడప్పుడూ నాయనమ్మతో వెళ్ళి అత్తని కలుస్తూనే ఉన్నాను. అత్త ఎందుకో చాలా దిగులుగా ఉన్నట్లు నాకు తెలుస్తోంది. నాయనమ్మ అత్త వచ్చినప్పుడంతా చక్రాలో, పులిబొంగరాలో, అరెసెలో చేసి నీళ్ళ బిందెలో పెట్టుకుని తెచ్చి కూతురికి పెట్టేది. అమ్మకి నాన్నకి తెలిసినా తెలియనట్లు ఉండేవారు. తాత కూడా మాతో వచ్చి చెరువు కట్టకింద అత్తని కలుసుకునేవాడు. ఆ రోజుల్లో అతని గురించో లేక మరేం బాధలో తెలియదు కాని తాతకి, నాయనమ్మకి ఏదో చెప్పి అత్త ఏడుస్తూ ఉండేది. ఒకసారి అత్త ఒక రెండు జళ్ళ పిల్లని వెంటబెట్టుకుని వచ్చింది. అతని కూతురట. పది పన్నెండేళ్ళుంటాయేమో. ఎంత బాగుందో ఆ పిల్ల. మూతి బిగించుకుని మా వైపు చూస్తున్న ఆ పిల్ల చాలా తెలివైనదని అనిపించింది నాకు. అక్కడ ఉన్న కొద్దిసేపులో ఆ అమ్మాయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ‘రోజా! వదినతో ఆడుకో‘ అంది అత్త నావైపు చూపిస్తూ. ఆ పిల్ల నా వైపు కూడా చూడకుండా కింద పడ్డ చింతకాయలను ఏరుతుంది. వెళ్ళేటప్పుడు మాత్రం అత్త ‘టాటా చెప్పు‘ అంటే యాంత్రికంగా చెయ్యి ఊపింది. అంతే ఆ తర్వాత నేను అత్తని చూడలేదు.

నా పదవ తరగతి తర్వాత అత్త ఇక మా ఊరికి రాలేదు. నాయనమ్మ కూతురి మీద బాగా దిగులేసుకుంది. పొగాకు నారుకి వెళ్ళేవారో, మా ఊరి బయ్యర్లో అత్తని ఒకసారి రాజమండ్రిలో చూశామని, మరోసారి కాకినాడలో చూశామని చెప్పేవారు. చనిపోయే ముందు రాదని తెలిసీ నాయనమ్మ కూతురిని చూసుకోవాలని ఆఖరి నిమిషంలో కూడా ఎదురు చూసింది.

కాలప్రవాహం అత్తని గురించి పూర్తిగా మరిచేట్లు చేసింది. నేను ఎం. ఏ ఫైనల్ లో ఉండగా మాకు అత్త నుండి లాయర్ నోటీసు వచ్చింది. ఇంట్లో ఆ రోజు తాత మీద, నాన్న మీద అమ్మ అరిచిన అరుపులు ఇప్పటికీ నా చెవుల్లో మోగుతున్నాయి. పుట్ట్టింటి ఆస్తిలో తనకూ హక్కు ఉందనీ, తన భర్త ఆస్తి కూడా తనకే రావాలనీ ఆ నోటీసు సారాంశం. భర్తతో కాపురం చేయకుండా లేచిపోయిందని చెప్పడానికి బోలెడంత మంది సాక్షులు బయలుదేరారు అత్త నోటీసు అయితే ఇచ్చింది కాని వాయిదాలకి రానే లేదుట. కోర్టు ఆమెకి ఆస్తిలో హక్కు లేదని తీర్పు ఇచ్చింది.
నాకు పెళ్ళి సంబంధం వచ్చింది. అత్తకు రావలసిన ఎనిమిదెకరాలూ నాకు కట్నంగా ఇచ్చి నా పెళ్ళి చేశారు. నేను డాక్టర్ ని అవ్వాలనే అత్త కోరిక తీర్చలేకపోయినా నాకు అమెరికాలో పనిచేసే డాక్టర్ మొగుడే దొరికాడు. పెళ్ళయ్యాక నేను అమెరికాకి వెళ్ళిపోయాను. రెండేళ్ళ క్రితం తాతకి ఫోన్ చేసినపుడు “అత్త మనూరికి వచ్చిందమ్మా!” అని చెప్పాడు. నాకు చెప్పాలని నా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడని ఆయన కంఠంలోని ఆతృత వల్ల అర్థం చేసుకున్నాను. “అత్తకి కట్టించిన ఇంట్లో ఉంటుంది. అత్త పరిస్తితి ఏమీ బాగా లేదు. వ్యవసాయం చేసేటప్పుడు నా చేతుల్లో డబ్బు ఆడేది. పొలం కౌలుకి ఇచ్చాం గా అమ్మా! దాన్ని డాక్టరుకి చూపిద్దామన్నా నా దగ్గర డబ్బు లేదు.

తినడానికి మాత్రం బియ్యం మీ అమ్మకి తెలియకుండా ఇస్తున్నా“ అన్నాడు. కళ్ళ నీళ్ళు తిరిగాయి. వెంటనే గుంటూరులో ఉండే నా స్నేహితురాలు విజ్జికి ఫోన్ చేసి దాని ద్వారా తాతకి బ్యాంక్ అక్కౌంట్ ఓపెన్ చేయించి డబ్బు పంపాను. చాలానే పంపాను ఆయన ఏ బాధా పడకుండా. ఈ రెండేళ్ళలో అత్త ఆరోగ్యం బాగయింది. సరియైన తిండి లేకనో, దిగులుతోనో శుష్కించిపోయిన ఆమె తేరుకుంది. 
 
ఊళ్ళో అందరూ అమ్మతో సహా అత్తని లేవదీసుకుపోయినతను అత్తకి బాగా డబ్బు మిగిల్చి చనిపోయాడని అనుకుంటున్నారనీ, అత్త చేతిలో నాలుగు డబ్బులున్నాయని తెలియడంతో పలకరించే వాళ్ళు ఎక్కువయారనీ తాత సంతోషంగా చెప్పాడు. తాత కూడా ఎవరికీ భయపడకుండా కూతురికీ మంచీ చెడ్డా చూసుకుంటున్నాడంట. మామ మాత్రం తన మేనకోడలి మీద ప్రేమతో అత్త ఎదురైతే పలకరిస్తాడంట.
***
పది గంటలప్పుడు అమ్మ పొలం వెళ్ళాక తాత, నేను అత్త దగ్గరకి వెళ్ళాం. అత్త నన్ను వాటేసుకుని ఏడ్చింది. నాకు ఆమె ఎవరో అనిపించింది. ఈమె మా అత్తేనా అనిపించేట్లుగా మారిపోయింది. నేను ఆమెకి కొత్తగా అనిపించకపోవడానికి కారణం – ఆమె నా ఫొటో చూసి ఉంటుంది. కాని నాకు మా అత్తని చూస్తే చెప్పలేని ఏదో భావం. తెల్లజుట్టుని పీట ముడేసుకుని ఉంది. ఏమయింది ఆ భానుమతి అంత అందం? అందం ఇంత అశాశ్వతమా అనిపించింది.

“ఏంటత్తా! ఇలా అయిపోయావు? ” అన్నాను. అత్త నిర్లిప్తంగా నవ్వింది.
“డాక్టర్ దగ్గరకి తీసికెళ్ళకూడదా తాతా” అన్నాను.
“రాకపోతే నేనేం చేసేది? ఎందుకులే బాగానే ఉన్నాను అంటుంది ఎన్ని సార్లు రమ్మన్నా” అనుకుంటా బయటికి వెళ్ళిపోయాడు తాత. నేను అత్త జీవితాన్ని గురించి అడుగుతానని ఊహించి మమ్మల్నిద్దరినీ అలా వదిలేసి వెళ్ళిపోయాడని అత్త, నేను గ్రహించాము.

“ఎట్టుండేదానివి ఎట్లా అయిపోయావత్తా” అన్నాను.
అత్త కళ్ళల్లో ఆగకుండా కన్నీరు. “ఊరుకో అత్తా! ” అన్నాను.
ఏడుపు ఆపుకుని పైటతో కళ్ళు తుడుచుకుంటూ “మీ ఆయన బాగున్నారా? నీతో రాలేదే? చాలా మంచి వాడంటగా అమ్మా – తాత చెప్పాడు“ అంది.

“ఔనత్తా! బాగా చూసుకుంటాడు నన్ను. చాలా బిజీ. అమెరికాలో డాక్టరు గదా మరి. నేను నిన్ను చూడాలని ఒక్కదాన్నే వచ్చానత్తా” అన్నాను. నా మాటలకి అత్త కళ్ళల్లో అమిత సంతోషం కదలాడింది. తనకంటూ ఎవరూ ఉండరని భావం కొంత, ఆత్మ న్యూనతా భావం కొంతా ఉన్న వాళ్ళల్లో ‘తన కోసం ఒకరున్నారని తెలిస్తే కలిగే సంతోషమా అది అనిపించింది. ఏమో!? అత్త గురించి నాకు తెలిస్తే నా మాటలకి ఆమెకెందుకంత సంతోషం కలిగిందో చెప్పగలనేమో!

“పిల్లల గురించి ఏమీ ఆలోచించలేదా? ” అంది.
“పెళ్ళయి మూడేళ్ళేగా అత్తా. వచ్చే సంవత్సరం చూద్దాంలే. నాకు అమ్మాయి పుడితే చిన్నప్పుడు నాకు కుట్టిచ్చినట్లు బుట్ట బొమ్మ గౌన్లు కుట్టియ్యాలత్తా నువ్వూ!” అన్నాను.

“నేను నిన్ను మర్చిపోయానురా బంగారూ! కాని నువ్వు నన్ను మర్చిపోలేదు. నీ మీద ఉండే ప్రేమ నంతా రోజా మీద చూపించాలనుకున్నాను. ‘నువ్వొద్దు – నీ ప్రేమా వద్దూ‘ అంటూ అది నన్ను అసహ్యంచుకునేది. అది అసహ్యించుకునే కొద్దీ నాకు దాని ప్రేమను సంపాదించుకోవాలని పట్టుదల కలిగేది. ఆఖరికి అది నన్ను బానిసను చేసి ఆడించినా ఏమీ అనలేని స్థితిలో పడ్డాను. బహుశా దాని తండ్రిని తల్లిని విడదీశానన్న బాధ దానికన్నా నాకు ఎక్కువగా ఉండటం వల్లనే నేను అది ఆడించినట్లుగా ఆడానేమో!“
అత్త ఇంకా ఏదో చెప్పబోతుంది కాని ‘రోజా ఎవరా‘ అని ఆలోచిస్తున్న నాకు అత్త చెప్పిన చివరి వాక్యం వినగానే రెండు జళ్ళ క్లవర్ గర్ల్ రోజా గుర్తొచ్చి “ఇప్పుడెక్కడుందత్తా ఆ అమ్మాయి?“ అన్నాను ఆతృతగా – అరె! ఇన్ని రోజులూ ఆ అమ్మాయి అస్సలు గుర్తుకు రాలేదే అనుకుంటూ. వేటగాడి బాణం గుండెల్లో గుచ్చుకున్నప్పుడు పక్షి కళ్ళల్లో కనపడే వేదన – కాదు నిస్సహాయత - కాదు కాదు నేను వర్ణించలేను నాకు మాటలు రావు – అలాంటి చూపుతో అత్త నన్ను నిశ్చేష్టపరిచింది. నేను గొంతు పెగుల్చుకుని మాట్లాడబోయేంతలో అత్త లేచి వెళ్ళి మంచం క్రింద నుండి సూట్ కేస్ బయటకి లాగింది. లోపల జిప్ లో నుండి ఒక కవర్ తీసి “చదువు. నీకు అన్ని విషయాలూ తెలుస్తాయి” అంది ఏడుస్తూ. ఆ ఏడుపు హృదయ విదారకంగా ఉంది. ఆతృతగా కవర్ లో నుండి కాగితాలు బయటకి లాగాను.

                                  
***
ఎంకీ –
ఎలా ఉన్నావు? నిజానికి నువ్వు ఎలా ఉన్నావు అని అడగాలని లేదు నాకు. నువ్వు అంటే నాకు అసహ్యం. ఇన్నాళ్ళ తర్వాత కూడా, నా జీవితం నాశనం అవడానికి కారణం నువ్వు కాదు – నేనే – కేవలం నేనే – అని తెలిసే వయసు, అనుభవం వచ్చాక కూడా నువ్వంటే నాకు అసహ్యం తగ్గకపోగా పెరిగింది. మా నాన్న నన్ను, అమ్మని వదిలి వెళ్ళే నాటికి నాకు ఏడేళ్ళు. నాకు పన్నెండేళ్ళప్పుడు మా అమ్మ చనిపోయింది. ఈ ఐదేళ్ళలో మా అమ్మ ఏడవని రోజు లేదు అంటే నమ్ముతావా? దానికి కారణం అయిన నీ దగ్గరకి నాన్న నన్ను తీసుకొచ్చాడు. నిన్ను ‘అమ్మా! ‘ అని పిలవాలట. నిన్ను ప్రేమగా మాట్లాడాలని నాన్న కట్టడి చేశాడు. నీ వల్ల మా అమ్మ చనిపోయిందని తెలిసిన దాన్ని నేను నిన్ను అమ్మా అని పిలవడమా? ప్రేమించడమా? ఛీ! ఛీ - నేను అసహ్యించుకుంటున్నానని తెలిసీ నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చూశావు. మా అమ్మ కంటే ఎక్కువగా ప్రేమించావేమో కూడా. కాని నాకు మీ దగ్గరున్నంత కాలం జైల్లో ఉన్నట్లుగా ఉండేది. బయటికి వెళ్ళలేని వయసు. ఏం చేయాలో తెలియని నిస్సహాయత. ఆ కసి నాన్న లేనప్పుడు నీ మీద చూపించేదాన్ని. మీ దగ్గర నుండి స్వేచ్ఛగా ఎగిరిపోవడానికి త్వరగా పెద్ద దాన్ని అవాలని కోరుకునే దాన్ని. నా కోరిక తీరింది ఎంకీ. చాలా పెద్ద దాన్నయిపోయాను. త్వరలో ఈ లోకం నుండే శాశ్వతంగా వదిలి పోయేంతగా.

మీ గురించి హీనంగా మాట్లాడి స్నేహితుల దగ్గ్గర అభిమానం సంపాదించాను అనుకున్నాను కాని నా జీవితాన్ని గోప్యత లేకుండా ఆరబోసుకుంటున్నానని గ్రహించలేకపోయాను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నా చుట్టూ భ్రమా వలయాలు ఏర్పరుచుకున్న నన్ను వంచించడానికి శరత్ కి ఎక్కువ సమయం పట్టలేదు. వాడికి దుబాయ్ వెళ్ళాలని కోరిక. ప్రేమించానని, పెళ్ళి చేసుకుంటానని, నన్ను కూడా తనతో మీకు దూరంగా దుబాయ్ కి తీసుకెళతానని నన్ను నమ్మించాడు. నమ్మాను ఎంకీ. జంతువులు అమ్మే అంగడి నుండి ఒక పిల్లవాడు వచ్చి పక్షిని కొనుక్కుపోతుంటే ఆ పక్షికెంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలిగింది నాకు. పక్షి మళ్ళీ మరో పంజరంలోకి వెళ్ళబోతుందని ఊహించదు కదా!

నన్ను వాడి మోహం తీరేవరకు అనుభవించి ఈ కంపెనీ వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బుతో దుబాయ్ వెళ్ళిపోయాడు. అయితే వీడు మా నాన్న కంటే చాలా నయం ఎంకీ. వీడికి పెళ్ళాం లేదు. నా లాంటి కూతురూ లేదు. నన్నే మోసం చేశాడు. నా పట్ల కూడా నాకు జాలి కలగడం లేదు. ఎందుకంటే నీలా నేను మరో ఆడదాని జీవితాన్ని, మరో చిన్నపిల్ల జీవితాన్ని నాశనం చేయలేదు. దానికి నేను భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
ఎంకీ నా ఒళ్ళు హూనం అయింది. జబ్బు ముదిరిపోయి ఆఖరి దశకు చేరుకున్నాక నేడో రేపో కుప్పతొట్టి దగ్గరకు విసిరివేయబడతాను. ఇప్పుడు ఈ ఉత్తరం రాయడానికి కారణం నన్ను మీ దగ్గరకి తీసికెళ్ళమని చెప్పడానికి రాయడం లేదు. నువ్వు నాకేమీ చేయక్కర్లేదు. మనిద్దరి జీవితాల గురించి పదిమందికీ తెలియచెయ్యి. ‘పెద్దలు తప్పులు చేసినా మనం మన జీవితాన్ని సరియైన విధంగా మలుచుకోవాలి కాని వాళ్ళు తప్పు చేశారని వాళ్ళ మీద ద్వేషం పెంచుకుని అదే తప్పు మనం చేయడం, మన జీవితాలని నాశనం చేసుకోవడం సబబా‘ అని ఈ అమ్మాయిలను ఆలోచించుకోమంటున్నానని చెప్పు. ‘మీరు ఇప్పుడు చేసే పనుల వల్ల రేపు మీ పిల్లల జీవితాలు ఏమవుతాయో తెలుసుకోమని‘ నువ్వూ నీ జీవితాన్ని విప్పి చెప్పు.

అంతే ఎంకీ, నాలా మరో ఆడపిల్ల జీవితం నాశనం అవకూడదనే ఆవేదనతో ఈ ఉత్తరం రాశా. నిన్ను క్షమించి మాత్రం కాదు. నిన్ను అసహ్యించుకుంటూనే మరణిస్తా.
మరణించాక కూడా నిన్ను క్షమించలేని
నీ రోజా.

ఉత్తరం పట్టుకుని దాని వైపే చూస్తూ మంచంలో కూలబడ్డాను నిస్సత్తువగా. ఎందుకింత అమాయకంగా ఉన్నారు ఈ అమ్మాయిలు. ప్రేమిస్తున్నాను, పెళ్ళిచేసుకుంటాను అని అంటే నమ్మవచ్చు. అంతకంటే మంచి వాళ్ళు దొరకరు అని అనుకుంటే పెళ్ళి చేసుకోవచ్చు. తప్పులేదు. ఎందుకంటే పెళ్ళి తర్వాత ఎక్కువ శాతం మందిలో ప్రేమ కలుగుతుందని, బంధం ఏర్పడుతుందనీ నమ్ముతాం కనుక. కాని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వాళ్ళని నమ్మి ఎలా వెళ్ళిపోతున్నారు? సమాజంలో సాటి స్త్రీలకి జరుగుతున్న అన్యాయాలని చూసి కూడా స్త్రీ మళ్ళీ మళ్ళీ ఎలా మోసపోతుంది? అయినా మనల్ని ఇంతగా నమ్మి వచ్చిన స్త్రీని మోసం చేయడానికి, వంచించడానికి మగవాడికి మనసెలా ఒప్పుతుందో!!?

ఉత్తరం వల్లో, జెట్ లాగ్ వల్లో తెలియలేదు కడుపుని ఎవరో కెలికినట్లుగా వాంతి. దొడ్లోకి పరిగెత్తి వాంతి చేసుకున్నాను. దొడ్డి వాకిట్లో వీరడి సహాయంతో తాళ్ళు పేనుతున్న తాత, ఇంట్లో నుండి అత్త ఇద్దరూ నా దగ్గరకి పరిగెత్తారు. “ఏమయింది తల్లీ!” అన్నాడు తాత ఆందోళనగా. అత్తకి ఏడ్చీ ఏడ్చీ మాట పెగలడంలేదు. “వీరడిని పంపి ఫకీరు షాపులో కాఫీ తెప్పించు తాతా! తలనొప్పిగా ఉంది. అమెరికా నుండి వస్తే వారం రోజులు ఇలాగే ఉంటుందని నీకు తెలుసుగా. కంగారేం లేదు“ అన్నాను. వీరడు నీళ్ళు తెచ్చి ఇచ్చాడు. శుభ్రం చేసుకుని అత్త, నేను లోపలకి వెళ్ళాం. ఉత్తరం అత్త చేతికిస్తూ తర్వాతేమయింది అన్నట్లుగా ఆమె వైపు చూశాను.

“ఉత్తరం వచ్చాక పోస్టల్ అడ్రస్ పట్టుకుని రోజాని అతి కష్టం మీద ఇంటికి తీసుకొచ్చాం. చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అది ఇంటికి వచ్చిన నాలుగు రోజులకే వాళ్ళ నాన్న గుండె ఆగిపోయింది దాన్ని గురించిన ఆలోచనలతో. దాన్నైనా బ్రతికించుకోవాలని డబ్బు కోసం తాతకి, మీ నాన్నకి చాలా ఉత్తరాలు రాశాను. ఆఖరికి సిగ్గు విడిచి మీ అమ్మకి కూడా రాశాను. సమాధానం లేకపోతే నేను నేరుగా మన ఇంటికి రావలసింది. అది చేయకుండా ఆవేశంతో – అది చచ్చిపోతుందన్న భయంతో - లాయరు నోటీసు ఇస్తే డబ్బు పంపుతారని నోటీసు పంపాను. మళ్ళీ మరో తప్పు చేశాను. నా పుట్టింటి వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు నన్ను మొదటిసారి కంటే ఎక్కువగా అసహ్యించుకున్నారు. ‘ఎంకీ! నాకు బ్రతకాలనుంది‘ అని అది అంటుంటే ఏమీ చేయలేక తల బాదుకుని ఏడ్చాను. వాళ్ళ నాన్న పోయిన కొన్ని రోజులకే అది – నన్ను ఎక్కువ బాధించకుండానే - రోజా చనిపోయింది.

బంగారూ! అది కోరిన కోరిక నేను తీర్చలేను. నాకు ఆ శక్తి లేదు. నువ్వే మా ఇద్దరి జీవితాలని గురించి స్త్రీ జాతికి తెలియచేయి. మరో ఆడది మాలా బాధ పడకూడదనే నేను నిన్ను ఈ పని చేయమంటున్నానురా బంగారూ!“ అంది అత్త.
అత్త మాట్లాడుతుండగానే ఏం చేయాలా అనే నా ఆలోచనలు ఒక రూపు దిద్దుకున్నాయి. “తప్పకుండా తెలియచేస్తానత్తా. కాని అదేంటో మరి కథలు చదివీ, ఇంకొకరి జీవిత అనుభవాలు తెలిసీ కూడా స్త్రీ మోసపోతూనే ఉంది. వంచింపబడుతూనే ఉంది. తెలియచేయడం సంగతి కన్నా ముఖ్యంగా మనం కొంత మందికైనా మన పరిథిలో సహాయం చేద్దామత్తా. నీ పొలానికి చాలా విలువ వచ్చింది. పొలాన్ని అమ్మి తక్కువ ధర ఉన్న చోట స్థలం కొని స్త్రీ సదనం కడదాం. అభాగ్యులని చేరదీసి నీ జీవితాన్ని సార్థకత చేసుకుందువుగాని“ అన్నాను.

మెరుస్తున్న కళ్ళతో అత్త నన్ను వాటేసుకుని కిందకు నా కాళ్ళ మీదకు జారింది. “తప్పు అత్తా! పెద్దవాళ్ళు పిల్లల కాళ్ళు పట్టుకోకూడదు“ అంటూ అత్తని లేవదీశాను.

మా అమ్మకీ, మా ఊరి వాళ్ళకీ నా పొలాన్ని అత్తకి ఎక్కువ ధరకి అమ్మినట్లుగా చెప్పాను. అత్త ఇప్పుడు స్త్రీ సదనంలోని వారందరికీ తల్లి. ఇప్పుడు అమ్మ కూడా అత్తని బాగా పలకరిస్తుందట. అత్త నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఆమె గొంతులోని సంతోషం వల్ల ఆమె అణువణువులో వెలుగుతున్న మెరుపుని చూడగలుగుతున్నాను.

మా అత్త ఎప్పుడూ మెరుస్తూనే ఉండాలి. నాకు గర్వాన్ని కలిగించాలి - ఇది నా కోరిక.

                                                                                                                              

***

 
 

5, మార్చి 2014, బుధవారం




యామిని

  

ఆకాశం కాస్త మబ్బుపట్టి మిట్ట మధ్యాహ్నమే సాయంత్రంలా అనిపిస్తోంది. చల్లగాలి వీస్తూ ఉండటంతో వాతావరణం తేలిగ్గా ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఆ రోజు ఇంటిలోనే ఉన్నాను. నేను పని చేసుకుంటూ ఉండటంతో నా భార్య మధు పక్క ఫ్లాట్‌లో ఉన్న తన ఫ్రెండ్స్‌తో మాట్లాడటానికి వెళ్ళింది. లాప్‌టాప్ పక్కనపెట్టి కిటికీలో నుండి బయట మెల్లగా కదులుతున్న చెట్లను, ఆ చలికి వణుకుతున్న పక్షులనూ చూస్తూ నిలుచున్నా. ఇంతలో నా సెల్ మ్రోగింది.
“సార్ కూకట్‌పల్లిలో 2 బి.హెచ్.కె. అడిగారు. మీరే కదా.”
“అవును. మీరు శ్రీనివాస్ గారా?”
“అవునండీ. కె.పి.హెచ్.బి.లో ఒక అపార్ట్‌మెంట్ ఉంది. ఫుల్లీ ఫర్నిష్డ్, రెడీ టూ ఆక్యుపై. నేను అడ్రెస్ మెసేజ్ పెడతాను. ఆ అపార్ట్‌మెంట్‌లో 302 వెళ్ళి చూడండి. 301 లో యామిని అనే మేడం ఉంటారు. ఆమె మీకు తాళాలు ఇస్తారు. నేను సాయంత్రం మిమ్మల్ని కలుస్తా” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. ఫోన్ పెట్టేసిన వెంటనే మెసేజ్ వచ్చింది.
నేను, మధుని తీసుకుని కారులో బయలుదేరాను. మధు ఇల్లు ఎలా ఉండాలని తను కోరుకుంటుందో నాకు వర్ణిస్తూ ఉంది. మధ్యమధ్యలో తనకి తెల్సిన వాస్తు విజ్ఞానం ప్రదర్శిస్తూ ఉంది. తనని చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. కాలేజుల్లో ఈ అమ్మాయిలు పోటాపోటీగా చదువుతూ వేరే విషయాలే పట్టించుకోరు. కెరీర్, మార్కులు , రాంకులు తప్ప వేరే విషయాలే మాట్లాడరు. అలాంటిది ఒక్కసారి పెళ్ళయ్యాక కానీ తెలీదు వీళ్ళకు ఎన్నేసి విషయాల మీద అవగాహన ఉంటుందో !!

మధుకి, నాకు పెళ్ళై 6 నెలలు కావొస్తుంది. మేమిద్దరం ప్రేమించి పెళ్ళిచేసుకున్నాం. ఇద్దరం క్లాస్‌మేట్స్. కానీ కాలేజ్‌లో ఉండగా నేను క్లాసులో తక్కువ, మిగిలిన విషయాల్లో ఎక్కువగా ఉండేవాడ్ని. మధు పూర్తిగా సిన్సియర్ స్టూడెంట్. అలాంటిది నన్నెలా ప్రేమించిందో తెలియదు. కాలేజు వదిలి వెళ్ళిపోయిన రెండేళ్ళకి ఒకరోజు ఫోన్ చేసి నన్ను పెళ్ళి చేసుకుంటావా అని అడిగింది. నిజానికి ఈ రెండేళ్ళలో తనెక్కడుందో నాకు, నేనెక్కడున్నానో తనకి తెలియనే తెలియదు. తనకి ఆ రోజు ఇంట్లో పెళ్ళిచూపులు. ఎదురుగా పరిచయంలేని ఒకబ్బాయిని చూస్తూ, తనని పెళ్ళిచేసుకోవాలి అనే ఆలోచన రాగానే తనకి నేను గుర్తొచ్చానంట. ఆ రోజే నా నంబర్ సంపాదించి నాకు ఫోన్ చేసింది. జరిగిన విషయాలు తను అలా చెప్పేసరికి నాకోసమే పుట్టిన తోడనిపించింది. వెంటనే ఒప్పేసుకున్నా.
“చిన్నా, ఆవిడ పేరేంటి?.. చిన్నా ఏం ఆలోచిస్తున్నావ్?” మధు గట్టిగా అరిచింది.

నేను కార్ పార్క్ చేస్తూ ఈ లోకంలోకి వచ్చాను
“ఏం లేదులే. ఏంటి అడిగావ్”
“ఆవిడ పేరేంటి?”
“యామిని”
301 దగ్గరకి వెళ్ళి మధు బెల్ కొట్టింది. నేను బయట నేమ్ బోర్డ్ చూసాను. యామిని ఇలాంటి పేరెందుకు పెట్టుకుంటారో అనిపించింది. పూర్తి పేరు “యామిని నిష్టల”. తలుపు తెరుచుకుంది. ఆమే అనుకుంటా ఏం కావాలి అన్నట్టు చూసింది. మధు విషయం చెప్పింది. ఆమె లోపలికి వెళ్ళి తాళాలు తెచ్చి ఇచ్చింది. మధు, నేను 302 వైపు నడిచాం. మధు ఇళ్ళంతా తిరిగి చూస్తూ ఉంది. నేను బాల్కనీ లోకి వచ్చి అశ్విన్‌కి ఫోన్ చేసాను.

“హ్మ్ చెప్పరా”
“రేయ్ అశ్విన్ యామిని, ఈ పేరు ఎక్కడన్నా విన్నావా?”
“మాంచి అమ్మాయి కనిపించిందా? ఐ మాక్స్ లోనా?, రెస్టరెంట్లోనా?”
“అడిగిన దానికి సరిగ్గా చెప్పుబే”
“ఏమోరా నా గర్ల్‌ఫ్రెండ్స్ లిస్టులో ఆ పేరు లేదు”
“యామిని నిష్టల”
“యామిని నిష్టల.. రేయ్ మన శరత్‌గాడి వైఫ్ పేరు యామిని అనుకుంటా. ఏం ఎందుకు?”
“ఏం లేదు తర్వాత చెప్తా”
నాకు రెండేళ్ళ క్రితం ఎదురైన ఒక చేదు అనుభవం గుర్తొచ్చింది. కొన్నాళ్ళు షికాగోలో ఆన్‌సైట్‌లో గడిపి అప్పుడే ఇండియా వచ్చాను. దాదాపుగా అయిదు సంవత్సరాలుగా కలవని నా ఫ్రెండ్స్ సాగర్,అశ్విన్ ఆ రోజు కలుద్దామని ప్లాన్ చేసారు.
“ఇంకేంటి కబుర్లు. ఎలా ఉన్నాయి బర్గర్ బ్రతుకులు?” అని అడిగాడు అశ్విన్.
“బానే ఉందిరా చీజ్‌లా రిచ్‌గా, జిడ్డుగా రుచి పచి లేకుండా”
“అర్ధమవుతుందిరా నీ బాడీ చూస్తుంటే. అమెరికాలో చీజ్‌కి ఎక్కడ కరువొస్తుందో అని నిన్ను సెలవుల పేరుతో ఇండియా తగిలేసారా?”
“నువ్వసలేం మారలేదురా. ఏంటి ఇంతకీ ప్రోగ్రామ్?”
“ఈ రోజుకయితే నా కొంపకి పోదాం. తర్వాత సంగతి అక్కడ చూద్దాం.”
బయటకి వచ్చి కారెక్కుతుంటే దూరంగా ఎవరో శరత్‌గాడిలా అనిపించి “రేయ్ వాడు మన శరత్‌గాడిలా లేడూ?” అన్నాను.

సాగర్ నా వైపు క్వశ్చన్‌మార్క్ చూపు చూసి “ఏంటిరా నీకు తెలియదా? శరత్ చనిపోయాడుగా.” అన్నాడు.
“ఏ శరత్‌రా, నేను చెబుతున్నది మన క్లాస్‌మేట్ శరత్ గురించి. వాడు నాకు టచ్‌లో ఉన్నాడు నెల క్రితం కూడా నాతో చాట్ చేసాడు. ఇండియా వచ్చాక కలుస్తా అన్నాడు”

” అరె,అవునా? నీకెలా చెప్పలేదు మేమెవరమూ? వాడు చనిపోయి ఇరవై రోజులవుతోంది . సూసైడ్”
“వ్వాట్? “నిర్ఘాంత పోయాను
“ఆర్ యూ సీరియస్? నాతో ఈమధ్యే మట్లాడాడురా.”
“నెల రోజులయ్యింది అంటున్నావుగా. ఇది జరిగి ఇరవై రోజులే అయ్యింది”
“నమ్మలేకపోతున్నా. అయినా సూసైడ్ ఏంటిరా? ఏమయ్యింది వాడికి?” ఇంకా నమ్మలేక పోతున్నాను
“సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటో తెలియటం లేదు. మంచి జాబ్ ఉంది. డూప్లెక్స్ హౌస్ కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్నాడు. అందమైన భార్య ..పెళ్ళయ్యి కనీసం రెండేళ్ళు కూడా కాలేదు”
మనసంతా భారంగా అయిపోయింది. అవే ఆలోచనలతో అశ్విన్ ఇంటికి చేరాం. డిన్నర్ అయ్యాక ముగ్గురం బాల్కనీలో నిల్చున్నాం. ఆలోచనల మధ్యలో నాకొక విషయం గుర్తొచ్చింది. శరత్‌కి కాలేజులో ఉండగా నేనే మెయిల్ ఐడి క్రియేట్ చేసాను. నా పేరే పాస్వర్డ్‌గా పెట్టాను. ఇప్పటికే అదే పాస్వర్డ్ ఉంటుందని గ్యారంటీ లేదు. కానీ ఒకసారి ట్రై చేస్తే అనిపించింది.
“నాకు శరత్ జీమెయిల్ పాస్వర్డ్ తెలుసురా. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా?”
“బ్రతికున్న మనుషుల విషయంలో ఎలాగూ లేదు. కనీసం చనిపోయినవాళ్ళ విషయంలో అయినా కాస్త మర్యాద పాటిద్దాం రా. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించకు! అయినా అయిందేదో అయ్యింది ..ఇవన్నీ ఎందుకిప్పుడు” అన్నాడు సాగర్.
“నాకూ తెలుసుకోవాలని ఉందిరా. ఈ మధ్యవి మెయిల్స్ చూస్తే, ఏదైనా క్లూ దొరుకుతుందేమో! కారణం తెలియొచ్చేమో” అన్నాడు అశ్విన్.

మెయిల్ ఓపెన్ చేసాం. పాస్వర్డ్ మార్చలేదు. రిసెంట్ మెయిల్స్, చాట్స్, ట్రాష్ ఫోల్డర్స్ వెతికినా ఉపయోగపడేలా ఏం కనిపించలేదు. కానీ డ్రాఫ్ట్స్‌లో రెండు మెయిల్స్ ఉన్నాయి. అందులో ఒక మెయిల్‌లో టూ నా మెయిల్ఐడికే ఉంది. ఆతృతగా ముగ్గురం చదవటం మొదలుపెట్టాం.

హాయ్ క్రిష్ణా,
ఎలా ఉన్నావురా? నిన్ను చూసి చాలాకాలమయ్యింది. ఇకముందు చూడనేమో కూడా. అర్ధంకాలేదా? రేపో, ఎల్లుండో తెలుస్తుందేమోలే !!ఎందుకో నీతో మాట్లాడాలనిపించింది. కానీ మాట్లాడితే నా మనసులో ఉన్న విషయాలు చెప్పలేను. అందుకే ఈ మెయిల్ వ్రాస్తున్నా.
నీకు ఎప్పుడు తెలియలేదేమో కానీ నువ్వు నా జీవితంలో చాలా స్పెషల్‌రా. నీకెప్పుడూ చెప్పలేదు కానీ నిన్ను నేను చాలా ఆరాధించే వాడిని! . జీవితంలో కొన్ని ముఖ్యమైన మలుపుల్లో కొందరు వ్యక్తులు ప్రత్యేకంగా మనం తలుచుకోవాల్సిన అవసరం లేకుండానే గుర్తొస్తారు. అందుకేనేమో ఈ రోజు నువ్వు గుర్తొచ్చావ్. చిన్నప్పుడు నేనెప్పుడూ నీలా ఉండాలనుకునేవాడ్ని. వచ్చే జన్మంటూ ఉంటే నీలా పుట్టాలనుకునేవాడ్ని. ఎందుకో నిన్ను చూసిన ప్రతిసారి నా జీవితం కూడా ఇలా ఉంటే బాగుంటుంది కదా అనిపించేది. నీ లైఫ్‌స్టైల్‌లో కనిపించేది. ఒక అందమైన నిర్లక్ష్యం కనిపించేది ! అది నాకెంతో నచ్చేది ! కాని నిజానికి నీకే లైఫ్ విలువ బాగా తెలుసు.
మేమంతా క్లాసులు, పుస్తకాలు అని చచ్చిపోతుంటే నువ్వు హ్యాప్పీగా సినిమా, క్రికెట్ అని తిరిగేవాడివి. ఎగ్జామ్స్ ముందు మాత్రమే చదివేవాడివి. టాప్‌లిస్టులో వచ్చేసేవాడివి. అందుకే ఫ్రెండ్సంతా నీ చుట్టూ తిరిగేవారు. అందరిలానే నేను కూడా నీతోనే ఉండాలనుకునేవాడ్ని. కానీ నా షోడాబుడ్డి కళ్ళద్దాలు, పొట్టి పొట్టి పాంటులు మీకు నచ్చేవి కావు. నేను ఎందుకలా ఉండేవాడినో మీకు తెలియదు. తెలుసుకోవాలి అనేంత మెచ్యురిటీ ఆ వయస్సులో ఎవరికీ ఉండదులే.

నా మీద చాలా జోకులేసుకునేవాళ్ళు కదా. దిస్ డంబో కాంట్ అండర్‌స్టాండ్ అనుకునే వాళ్ళు. అర్ధమయ్యేవిరా, కానీ నాకు అర్ధమవుతుంది అని మీకు తెలిస్తే నేను మీకింకా లోకువైపోతాను. అందుకే ఏం అర్ధంకానట్టు నటించేవాడ్ని. ఐయామ్ గ్లాడ్ ఐ హేడ్ సమ్ ఇగో. మీ ప్రపంచం అమ్మాయిలు, లవ్, గ్రీటింగ్ కార్డ్స్… చాలా అందంగా, రంగుల ప్రపంచం లా ఉండేది. నేను మాత్రం ఎప్పుడూ పుస్తకాలు పట్టుకుని ఏదో ఆలోచిస్తూ… ఎందుకిలా? నేనే ఎందుకిలా? ఇంతవరకూ ఎవరూ అడగలేదు. కానీ నాకు చెప్పాలని ఉంది. ఎవరికి చెప్పాలా అని ఆలోచిస్తుంటే నువ్వు గుర్తొచ్చావ్.

చిల్లులు పడి, జల్లెడలా కనిపించే ఒక పూరి గుడిసెలో పుట్టాను నేను. పండగకో, పుట్టినరోజుకో బట్టలు తియ్యమని అడిగితే కలిసొస్తుందని స్కూల్ యూనిఫామే కొత్త బట్టలుగా తీసేవాడు మా నాన్న, పాపం చిన్న గుమస్తా. కడుపు నిండా తినటం ఎలాగూ లేదు జీవితంలో కనీసం ఒక్కసారైనా కుండ నిండా వండటానికి కూడా నోచుకోలేదు మా అమ్మ.

స్కూల్లో ఉండగా అనుకుంటా ఒకరోజు ఆడుకుని అలసిపోయి ఇంటికి వచ్చాను. అమ్మ అన్నం పెట్టింది. ఆకలితో త్వరగా తినేసి ఇంకొంచెం పెడుతుందేమో అని చూస్తున్నా. అమ్మ నా వైపు చూడలేదు. ఎదురుగా కుండలో అడుగంటిపోయిన అన్నం. ఆకలికి ఇంకొంచెం అన్నం పెట్టమ్మా అని అడగాలనిపించినా అడగలేకపోయాను. అదే చివరిసారి నేను ఆటలకి వెళ్ళటం. ఆకలిని గెలవటానికి మొదట ఆటలు మానేసాను.

అప్పటి నుండి జీవితాన్ని సీరియస్ గా తీసుకోవటం మొదలుపెట్టాను. అందుకేనేమో నా జీవితం చివరి వరకూ సీరియస్ గానే మిగిలిపోయింది. ఎంత ఆలోచించినా బాగా చదవటం తప్ప నా జీవితంలో ఎదగటానికి మరో మార్గం కనిపించలేదు. అందుకే కష్టపడి చదవటం మొదలుపెట్టాను. క్రికెట్, సినిమా, గర్ల్స్..వీటిని ఇష్టపడే స్థోమత నాకు లేదు. వాటికి బదులుగా చదువుని మరింత ప్రేమించాను.

సాధించిన మార్కులు జీవితంలో ఆనందంగా ఎలా బ్రతకాలో నేర్పించకపోయినా ఒక ఉద్యోగాన్నయితే సంపాదించిపెట్టాయి. ఉద్యోగం వచ్చేసాక నేను ఆనందానికి ఇంక ఒకే ఒక్కఅడుగు దూరంలో ఉన్నా అనుకున్నా. అందుకే రిలాక్స్ అవ్వలేదు. తిండి,నిద్ర మానేసి పనిచేసాను. కారు కొన్నాను, ఇల్లు కొన్నాను. పొట్టి ఫేంట్లుపోయి, బ్రాండేడ్ బట్టలొచ్చాయి. షోడాబుడ్డి కళ్ళద్దాలు పోయి కాంటాక్ట్ లెన్స్ వచ్చాయి. చాలా అందమైన చదువుకున్న అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను. నా జీవితం ఒక్కసారిగా రంగులమయం అయిపోయింది. నేను నా జీవితాన్ని మార్చేసుకున్నాను అనుకున్నా, కానీ ఇది పై వాడు వ్రాసిన జీవితం కదా. మారటానికి ఆయన ఒప్పుకోలేదు.
తల తిప్పాను

“మెయిల్‌లో ఇంతవరకే ఉందిరా”
“వాడు ఇంకా ఏదో చెప్పాలనుకున్నాడురా. కానీ ఏదో కారణంతో ఆగిపోయాడు”
“డ్రాఫ్టులో ఇంకో మెయిల్ ఉన్నట్టుంది ఎవరో యామిని కి పర్సనలేమో. చదవటం మంచిదికాదేమోరా” అన్నాను
సాగర్ లాప్‌టాప్ నా చేతి నుండి లాక్కొని చదవటం మొదలుపెట్టాడు.

యామిని,
నేను మీకు చేస్తున్నది న్యాయమో, అన్యాయమో నాకు తెలియదు. నేను బాగా అలసి పోయాను. జీవితంతో ఇక యుద్ధం చేసే ఓపిక లేదు నాకు !! కానీ ఇంతకు మించి నేనేమీ చెయ్యలేకపోతున్నా. .ఆనందమనేది నేను సాధించుకునేది అనుకున్నా ఇంతకాలం. కానీ డెస్టినీ డిసైడ్ చేస్తుందని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. అండ్ దిసీజ్ వాట్ డెస్టిని డిసైడెడ్ ఫర్ మి. నాకు తెలుసు ఇందులో మీ తప్పేమీ లేదు. మిమ్మల్ని కాకుండా మరొకర్ని చేసుకుంటే నా జీవితం బాగుండేదేమో అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇది నా జీవితం! పుట్టటమే దురదృష్ట వంతుడిగా పుట్టానేమో నేను! మన పెళ్ళిలో అందరూ నా అంత అదృష్టవంతుడు లేరని అన్నారు. ఆ రోజు జనాల కళ్ళల్లో అసూయ చూసాను. ఇన్నాళ్ళ నా ప్రార్ధనలకు ఫలంగా ఆ దేవుడు నాజీవితానికిచ్చిన కొత్త వెలుగు మీరే అనుకున్నాను. కానీ నేను మీ జీవితంలో చీకటి నింపుతున్నానని తెలుసుకోలేకపోయాను. మీరు మరొకరిని ప్రేమించారని, మీ ఇష్టం లేకుండా మన పెళ్ళి జరిగిందని నాకు ముందే తెలుసుంటే మీ ఆనందాన్ని దూరం చేసేవాడ్ని కాదు. అప్పటికీ మీరు కోరుకున్నవాడితో మీ పెళ్ళి చేద్దామని మనస్పూర్తిగానే అనుకున్నాను. కానీ మీరే మీ ఫ్యామిలీ పరువుపోతుందని ఆపేసారు.

మీరు కోల్పోయిన ప్రేమకి బదులుగా ప్రపంచమంతా నిండి ఉన్న ప్రేమని మీ కాళ్ళ దగ్గర పెట్టాలనుకున్నాను. మీరు దూరమైందనుకుంటున్న ఆనందాన్ని తెచ్చి మన వాకిట పువ్వులుగా నింపేద్దామనుకున్నాను. కానీ అందుకునేందుకు మీరు సిద్ధంగా లేరు. ఈ ప్రేమలేమితో నేను బ్రతకలేకపోతున్నాను.. తాళి కట్టిన భార్యకి కూడా సొంతంకాలేని ఒంటరి దరిద్రుడ్ని నేను. పెళ్ళికి ముందే మీ మనసు మరొకరి సొంతమైందని తెలిసిన క్షణాన్నే నేను మనసు రాయి చేసుకుని ఉండాల్సిందేమో!

నా జీవితంలో ఆనందానికి ఆస్కారం లేదు. ఎంతకాలం బ్రతికినా పోరాడినా మిగిలేది నిరాశే. ఒంటరిగా పోరాడలేకే మీ చేతుల ఆసరా కావాలని, జీవితాన్ని ఆనందంతో నింపుకోవాలని నా జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానించాను. కానీ ఇప్పటికీ నేను ఒంటరినే. ఇక పోరాడటం నావల్ల కాదు. కనీసం మీ జీవితమైనా మార్చలనుకున్నాను. అదీ కుదరలేదు. ఏం చెయ్యలేని నిస్సహాయతతో వెళ్ళిపోతున్నా. మీకు చివరగా ఒకే ఒక్క సహాయం చెయ్యగలుగుతున్నా. మీరు ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తే, మీకు ఇబ్బంది కలగకుండా మొత్తం నా ఆస్తులన్నీ అన్నీ మీ పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేసాను.

ఇది ఎవరినో ద్వేషిస్తూ కాదు. నన్ను నేను ద్వేషిస్తూ, నాకు నేను వేసుకుంటున్న శిక్ష.
బై ఫరెవర్

ముగ్గురి కళ్ళలో నీళ్ళు నిండాయి. ” ఆమెను వదల కూడదురా. ఈ మెయిల్ చాలు ఆమె చేసిన అన్యాయం ప్రూవ్ చెయ్యటానికి. పదండిరా అంతు చూద్దాం!! ఇష్టం లేనప్పుడు ఎందుకురా చేసుకుంది?” అన్నాడు సాగర్ ఆవేశంగా.
“వాడు ఈ రెండు మెయిల్స్ రాసి కూడా …పంపలేదు అంటే వాడుపోయాక వాడి వల్ల ఎవరికీ ఇబ్బంది రాకూడదు అనుకున్నాడు. అదే వాడి చివరి కోరిక. పోయినవాడు ఎలాగూ తిరిగి రాడు. ఇప్పుడు మనం అల్లరిచేస్తే, అల్లరిపాలయ్యేది ఆ అమ్మాయి మాత్రమే కాదు, పదిమందిలో శరత్‌గాడి చావే నవ్వులపాలవుతుంది. అందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు. చనిపోయిన తర్వాత వాడికిలాంటి అవమానం అవసరమా? ఇక్కడితో వదిలేద్దాం” అని అప్పటికి చెప్పాను కానీ చాలాకాలం ఆ ఆలోచనలు నన్ను వదల్లేదు.

వెనుక తలుపుకొట్టిన చప్పుడికి వెనక్కితిరిగి చూసాను. తలుపు దగ్గర నిల్చుని పలకరింపుగా నవ్విందామె. మధు వెళ్ళి మాట కలిపింది. వాటర్ సప్లై గురించి, పనివాళ్ళ గురించి వాకాబు చేసింది. “కాఫీ త్రాగుతూ మాట్లాడొచ్చు రండి” అని వాళ్ళింటికి పిలిచింది. ఇష్టం లేకపోయినా మర్యాద కోసం వెళ్ళాను. ఇంటిలో దండ వేసిన పెద్ద ఫోటో ఫ్రేమ్‌లో శరత్ నా వైపే చూస్తున్నట్టుగా అనిపించింది.

“మిమ్మల్ని ఎక్కడో చూసినట్టనిపిస్తుంది. మీది ఏ ఊరు?” అని అడిగిందామె. మధు మా వివరాలు చెప్పింది.
“శరత్ కాలేజ్ ఫోటోల్లో చూసుంటారు నన్ను” కావాలనే చెప్పాను. శరత్ ఫోటో చూసాక ఎందుకో కంట్రోల్ కోల్పోయాను నేను.

“శరత్ మీకు తెలుసా?”
ఆమె అప్పటికే నా ప్రవర్తనలోనూ, బాడిలాంగ్వేజ్‌లోనూ తిరస్కార భావాన్ని గ్రహించిందని తెలుస్తూనే ఉంది. నాకు కావాల్సింది కూడా అదే. ఆమె చేసిన తప్పులకి ఏ దేవుడూ వెయ్యని శిక్ష నేనే వేసెయ్యాలన్నంత ఆవేశం నా ఆలోచనల్లో పరిగెడుతుంది. ఆ నిమిషానికి చాలా రెస్ట్‌లెస్ ఫీలింగ్ నన్ను తొందరపెడుతుంటే మర్యాద అనే ముసుగుని తీసి పక్కన పడేసాను.
“వాడు ఎందుకు చనిపోయాడో కూడా తెలుసు”
నన్నెప్పుడూ అలా చూడని మధు కంగారుగా “క్రిష్ణా, దేవుడిగది చూడలేదు వెళ్దామా?” అని లేచింది.
“యామిని అంటే రాత్రి కదా. రాత్రిని ప్రేమించి జీవితాన్ని చీకటి చేసుకున్న పిచ్చోడు వాడు” అని కసిగా అనేసి నేను కూడా లేచాను. ముక్కూ మొహం తెలీని ఒక వ్యక్తి తో అలా మాట్లాడవచ్చో లేదో ఆ క్షణాన ఆలోచించలేదు. ప్లెయిన్ గా ప్రశాంతంగా అమాయకంగా ఉండే శరత్ మరిక లేడనే వాస్తవం మాత్రమే నా మనసు నిండా, మెదడు నిండా ఆక్రమించింది !

ఆమెకు నా ఆవేశం అర్ధంకావటానికి, అర్ధమయ్యాక అందులో నుండి తేరుకోవటానికి కొంత సమయం పట్టింది. ఈలోగానే నేను,మధు గడప దాటి బయటకి వచ్చేసాం.
“ఒక్క నిమిషం” అని ఆమె పిలిచింది. ఆగాలనిపించకపోయినా ఆగాను. మధుకి కంగారు ఎక్కువయ్యింది.
“మీకేం తెలుసో ఎలా తెలుసో నాకు తెలియదు. మీకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ శరత్‌కి అన్యాయం జరిగిందని మీరు బాధపడుతున్నారంటే ఆయన మీకు ఎంత మంచి ఫ్రెండో అర్ధమవుతుంది. నావల్లే ఇది జరిగింది అని చెప్పగలిగారంటే మీకేం తెలుసో నాకర్ధమయ్యింది” అని మధు వైపు చూసింది. నేను దూరంగా నిలబడి చూస్తున్నాను.
“శరత్ ఈయనతో ఎప్పుడూ ఏం చెప్పలేదు” అని మెల్లగా చెప్పింది మధు.
“చెప్పటానికి తనకి మాత్రం ఏం తెలుసు” అని నిర్లిప్తంగా నవ్విందామె.
“ఒకరోజు ఉదయం కాలేజికి వెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చేసరికి. ఇంట్లో ఎవరో తెలియని ఒకబ్బాయి సోఫాలో కూర్చుని ఉన్నాడు. కొనుక్కోబోయే ప్రాపర్టీని తనిఖీ చేస్తున్నట్టుగా, పట్టి పట్టి నన్నే చూస్తున్న ఒక కుటుంబం, మా ఇంటిలో నేనే అపరిచితురాలిలా అనిపించింది ఆ క్షణం. ఏంటనడిగితే పెళ్ళి చూపులన్నారు. ఒక పది నిమిషల తర్వాత నా గదిలోకి వెళ్ళిపొమ్మన్నారు. బయట ఏవో మాట్లాడుకున్నారు. అబ్బాయికి పెద్ద ఉద్యోగం,లంకంత ఇల్లు,కారు,పైసా కట్నంలేదు. అంతే పెళ్ళి నిశ్చయించేసి ఉదయానికి ముహుర్తాలు కూడా ఖాయం చేసారు. పెళ్ళి హడావుడి మొదలయిపోయింది. అందరూ పెళ్ళి పనిలో బిజీ. నాతో ఎవరూ ఏం మాట్లాడలేదు.


నా మనసులో ఉన్న వ్యక్తి గురించి , కనీసం అమ్మకైనా చెప్పాలనుకున్నాను
“ఛీ నోర్ముయ్యి” అని తన నోరు నొక్కుకుని, నా గొంతు నొక్కేసింది అమ్మ.
“మంచబ్బాయమ్మా నీ అదృష్టం” అని చెబుతున్న నాన్నతో, “కాపురం మంచిగా ఉండాలంటే ఇద్దరు మనుషులూ మంచోళ్ళయితే సరిపోదు నాన్నా” అని చెప్పాలనుకున్నా, కానీ నేనేమి మాట్లాడకుండా అమ్మ జాగ్రత్తపడింది.
మధుగారూ, మీకు తెలియంది కాదు. ఆడపిల్లలు స్వేచ్ఛగా బ్రతుకుతున్నట్టే కనిపిస్తారు కానీ కళ్ళకు కనిపించని గొలుసేదో మన మెడకు చుట్టుకుని మనల్ని నియంత్రిస్తూనే ఉంటుంది. ప్రేమగా పెంచుకునే కుక్కపిల్లకి మనకి ఆ గొలుసొక్కటే తేడా. అది గొలుసు కాదు పరువు, నియంత్రణ కాదు బాధ్యత అని నమ్మించటమే ఆడపిల్లను పద్దతిగా పెంచటం. పద్దతిగా పెరిగిన నేను తలొంచాను. అసలు అంతకంటే ఏమి చేయాలో నాకు తెలియలేదు. ఆలోచించే శక్తిని నా మెదడు ఈ హటాత్పరిణామం తో పూర్తిగా కోల్పోయింది

నేనొచ్చి కలుస్తా అని ఒకడు కాలేజి గార్డెన్లో సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఎదురుచూస్తూ ఉంటే, వాడితో ఒక్కమాట చెప్పే అవకాశం కూడా లేకుండానే నా పెళ్ళి జరిగిపోయింది. నా కోసం, నేను కలలుకన్న జీవితం కోసం ఏడ్చే ప్రివిలేజ్ ఎలానూ లేదు. కానీ నిర్ధాక్షిణ్యంగా నేను ఒకడ్ని మోసం చేసాను. వాడి గురించి ఏడ్వాలి కదా. నా చేతులతో నేను నాశనం చేసిన వాడి జీవితం గురించి ఏడ్వాలి కదా. కానీ నాకు ఆ అవకాశం కూడా లేకపోయింది.
పెళ్ళయిన మరుక్షణం నుండీ శరత్ నామీద విపరీతమైన ప్రేమ చూపించారు. ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. నా దగ్గర నుండి కూడా అంతే ప్రేమ ఎక్స్‌పెక్ట్ చేసారు. ముందురోజు వరకూ ఒకర్ని ప్రేమించి తనే జీవితం అనుకుంటున్న మనసుని ఒక్కసారిగా మార్చటం ఎలా? అలా అని నటించలేను. మోసం చేస్తున్నానేమో అని బాధ మరో పక్క. నరకం అనుభవించాను. దానికంటే చావు చాలా చిన్నది.

యామినిగా చచ్చి శరత్ భార్యగా నేను బ్రతకాలంటే నాకు కొంత టైమ్ కావాలి. కానీ శరత్ నాకు ఆ అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు. జరిగింది ఒక యాక్సిండెట్ అనుకుని మరిచిపోదామనుకున్నా. యాక్సిడెంట్‌లో చెయ్యో, కాలో పోతే ఆ విషయం డైజెస్ట్ చేసుకోవటానికి, అలవాటు చేసుకోవటానికి కొంత టైమ్ పడుతుందిగా. నేను అలాంటి హీలింగ్‌లో ఉండగా శరత్‌కి నా ప్రేమ గురించి తెలిసింది. ఆయన ఒక్కసారిగా కృంగిపోయారు. రోజుల తరబడి తన గదిలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ గడిపారు.

ఒకరోజు నువ్వు ప్రేమించిన అబ్బాయితో పెళ్ళి చేసేస్తా అని చెప్పారు. నాకు విరక్తిగా అనిపించింది. రెక్కలు కత్తిరించేసిన పక్షికి పంజరమే రక్ష, పంజరం నుండి వదిలేస్తా అంటే ఏమనగలుగుతుంది? ఆయన ధోరణి చూసి మనసు విప్పి మాట్లాడాలనుకున్నా. “ఫలానా వ్యక్తితోనే వ్రాసిపెట్టి ఉందని తెలిస్తే ఏ ఆడపిల్ల మరో వ్యక్తిని ప్రేమించదు. ఆ తెలియనితనమే నాది కూడా. ఈ సమస్య నుండి బయటపడటానికి నాకు కావల్సిందల్లా కాస్త టైమ్, అర్ధంచేసుకునే తోడు” అని చెప్పాలనుకున్నాను. కానీ మాటల్లో నా ప్రేమ పస్తావన వచ్చిన ప్రతిసారి ఆయన దెబ్బతిన్న పక్షిలా అయిపోయేవారు. లోకమంతా కలిసి తననే మోసంచేసిందన్నట్టుగా డిప్రెస్ అయ్యేవారు. నేనేమనుకుంటున్నానో తెలుసుకునే ప్రయత్నం తనెప్పుడూ చెయ్యలేదు. అందుకే ముభావంగా ఉండటం అలవాటు చేసుకున్నాను. రోజూ కన్‌ఫ్యూజ్డ్‌గా కనిపించేవారు. ఏం మాట్లాడాలన్నా తనని బాధ పెడుతున్నానేమోనని భయం, గిల్టీ. తన నిశ్శబ్ధం నిరాశ అనుకున్నానే కానీ, ఇలాంటి నిర్ణయానికి సన్నద్దం చేసుకుంటున్నారనుకోలేదు. ఈలోపే అంతా జరిగిపోయింది.

ఆమె గొంతు కాసేపు మూగబోయింది. మధు కళ్ళు చెలమలయ్యాయి. నేను నిస్సహాయంగా నిలబడిపోయాను.
“తనకి జరిగిన అన్యాయానికి కారణంగా నన్ను నిందిస్తున్నారు. నాకు జరిగిన అన్యాయానికి ఎవరిని నిందించాలి? తొందరపడి నన్ను బెదిరించి పెళ్ళి చేసి ఇప్పుడు నిస్సహాయంగా చూస్తున్న అమ్మా నాన్నలనా?? ప్రేమ కావాలి కావాలి అని తపించి నాకు ఏ తోడుని ప్రేమని మిగల్చకుండా వదిలేసి వెళ్ళిపోయిన శరత్‌నా?”
యామిని తన కంటనీరు కళ్ళుదాటి బయటకు వస్తుందని గుర్తించగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది. మధు, నేను ప్రాణంలేని శిలల్లా నిలబడిపోయాం.

అనంతమైన సాగరఘోషకు అలలు, అంతులేని ఆమె దుఃఖానికి కన్నీళ్ళే సాక్ష్యం !!

 నా అభిప్రాయం : 

కాస్త ఓపిగ్గా ఎదురు చూస్తే కాలం మాన్పేగాయాలు మాత్రం చాలానే ఉంటాయ్.

ఈరోజు ల్లో  అ కాస్త సహనం మనషుల్లో ఉండటం లేదు.   ఈ కధ  లో శరత్  తన జీవితం తో యుద్ధం  చేశాడు కాని మద్యలో నే ఆపేసాడు అ యుద్దన్ని.

"మనిషి జీవితంలో ‘యుద్ధం’ అనివార్యం. అవసరాల కోసం... అవకాశాల కోసం... గుర్తింపు కోసం... బంధాల రక్షణ కోసం... బాధ్యతల నిర్వహణ కోసం... సమరం సాగించాల్సిందే. ఇలా మనిషి జీవితం నిత్య కురుక్షేత్రం. "



 

1, మార్చి 2014, శనివారం



వినిపించే గొంతుల వెనక తలుపులు తెరవని హృదయాలు



  'రయిక ముడి ఎరుగని బతుకు’ మీద పుస్తక పరిచయం

కధ 2012లో ఈ సారి కధలన్నీ ఆణిముత్యాలే. చాలా వరకు చదివిన కధలే. నాకిష్టమైన ‘రయిక ముడి ఎరుగని బతుకు’ కధ చూసి సంబర పడిపోయాను. ఈ కధలో ఒక ఆడబతుకు ఉంది. దానిలో అగాధమైన దుఃఖం ఉంది. ఆ దుఃఖానికి రమేశు భాష్యం ఉంది. ఆ భాష్యం అతని కరిగిన గుండె నుండి స్రవించిన జీవధార. అందులో కొన్ని సంవత్సరాల వెనుక దాదాపు ప్రతి ఇంట్లో బోడి తలలతోనూ, తుంటి దోపుతోనూ కనబడి; ఆ ఇంటి సుఖశాంతులకు, సౌకర్యాలకు పనిముట్లుగా మారిన ‘మొగుడు చచ్చిన’ ఆడోళ్ళ అలిఖత వేదన ఉంది. వాళ్ళ కూడూ, గుడ్డే కాదు; జ్ఞానం, దేహం కూడ నిరాకరించిన క్రూరత్వం నుండే చలం ప్రవక్తగా పుట్టాడు. ఇప్పుడు రమేశు అదే బాట పట్టాడు.

ఎనిమిదో ఏటనే భర్తను పోగొట్టుకొని విధవరాలైన కన్నెమ్మను, పూజలు (డిజైన్) లేని కారికం గుడ్డతో కుట్టించిన రెండుపావళ్లు, రెండు రయికలతో చుట్టింటికి (వంటిల్లు) పరిమితం చేసారు. “తొలిముట్టుకు మూడునెలల ముందు కన్నతల్లిని పోగొట్టుకొనింది. మారుతల్లి ఆ ఇంటికి వస్తానే కన్నెమ్మ చేత ఎర్రకోకను కట్టించి, రయికను విప్పించింది. అప్పుడు ఎడమయిపొయిన రయిక మరలా ఆయమ్మ ఒంటిని తాకనే లేదు. పాముపడగ నీడలో కప్ప బతికినట్టు బతికింది మారుతల్లి ఒడిలో కన్నెమ్మ. కూచుంటే తప్పు, నిలబడితే తప్పు, నోటినిండా నవ్వితే తప్పు, గొంతెత్తి మాట్లాడితే తప్పు, కడుపుకు కావలసింది అంత తింటే తప్పు, కన్నారా కునికితే తప్పు.”

అలాంటి కన్నెమ్మను నిండు యవ్వనంలో మడేలు మురుగుడు వలచాడు. కన్నెమ్మ బతుకులో వసంతం వచ్చింది. “మర్రిమాను కింద ఆ గబ్బు చీకటిలో మురుగడి పక్కన చేరి ఒళ్లంతా వెలుగును నింపుకొనేది కన్నెమ్మ.” మురుగుడు తెచ్చిన జిలేబినీ ఒకరికొకరు తినిపించుకొంటుండగా వెనుకనుండి గొడ్డలి తో పొడిచి అతని ప్రాణం తీసాడు తమ్ముడు రాజిరెడ్డి. ఏమీ ఎరగనట్లు భార్యతో, కన్నెమ్మతో అత్తారింటికి చేరాడు. ఆ రోజు నుండి కడదాక, కన్నెమ్మ బతుకు పొంత కడవ బతుకయ్యి వదినె పుట్టింటికి ఊడిగం చేయటంలోనే గడిచిపోయింది. “అయిదు బారల ఎర్రప్రసను కోకను తుంటిదోపు (మొగుడు చనిపోయిన వాళ్లు కుచ్చిళ్లు పోయకుండా కట్టే కట్టు) కట్టుకొని, ఇంకొక కోకను చుట్టి చంకలో పెట్టుకొని వాళ్ల వెనకాలనే కన్నెమ్మ కూడా ఈ ఇల్లు కడప తొక్కింది”
ఎవరీ కన్నెమ్మ?

“కన్నెవ్వ మా మేనత్త ఆడబడుచు. ఆ ఇంట్లో పని చేయడం తప్ప ఎవరితో మాట్లాడటం నేను చూడలేదు, నా బాల్యంలో. ఎవరూ లేనప్పుడు నన్ను దగ్గరకు లాక్కొని ముద్దులు పెట్టుకొనేది.” అప్పుడు ఆమె కంట్లో తడికి సమాధానం స.వెం. రమేశుకు ఆమె ఎత్తుబడి (కర్మకాండలు) తరువాత తల్లి నుండి తెలిసింది.

ఈ కధ కాలం యాబ్భై అరవై యేళ్ళ క్రితమయి ఉండాలి. తెలుగు దేశాన ఉత్తరాదిన పుట్టిన చలం దక్షిణాన ఉన్న చదువురాని కన్నెమ్మను చేరలేదు. మడేలు మురగడితో ఆమె అనుభవానికి చాలా మూల్యం చెల్లించింది. ఈ దేశంలో పెళ్ళై భార్యలు ఉన్నఅన్ని వయసుల మగవాళ్ళు కూడా యధేచ్చగా, సునాయాసంగా కొనుక్కోగల, క్రీడించగల అతి చౌకైనా శృంగారం; యవ్వనంలో ఉన్న వితంతువు కన్నెమ్మకు నిషేధం. సహజాతిసహజమైన ఆమె మేని దాహం, ఆమె అనాధ మనసు కోరిన స్నేహం తన ప్రియ ప్రాణాన్ని బలిగొని ఆమెను కడదాక జీవన్మృతురాల్ని చేసింది.

ఇలాంటి ఇతివృత్తంతో కధలు కొన్ని వేలు వచ్చి ఉంటాయి. ఇక సినిమాలు చెప్పనక్కరలేదు. అందులో చాలా వరకు మనకు సంబంధం లేని లోకాల్లో, పరాయి వ్యక్తుల గురించి విన్నట్లు, చూసినట్లు ఉంటుంది. కాని రమేశు కధ నడక అసాధారణంగా ఉంటుంది. ఒక మగ రచయిత స్త్రీ పాత్రను సృష్టించినపుడు; ఆమె అంతరంగ ఆవిష్కరణ, కృతిమత్వం లేకుండా, బండతనం లేకుండా మాటలకందించటం కత్తి మీద సామే. అందుకోసం ఆడవాళ్ళ వగపు పట్ల దయ, ఔదార్యం ఉంటే సరిపోదు. వాళ్ళ హృదయపు లోతులను సృజించగలగాలి. వాళ్ళ గుండె చప్పుళ్ళు వినగలగాలి. వాళ్ళ మనసు సంవేదనలను భ్రాంతులు, భ్రమలు అంటించకుండా నికార్సుగా మన పరం చేయ గలగాలి. ఆ పని రమేశు అత్యధ్భుతంగా చేసి కూర్చున్నాడు ఈ కధలో.

ప్రకృతి లోని అన్ని జీవ రాశుల సృష్టి కార్యాలను అంగీకరించే మనుషులచేత; ఒక స్త్రీ మోహాన్ని, వాంఛనీ అంతే సహజంగా ఆమోదింపచేయటం సులభమైన పని కాదు. అందుకే మనుషులు అందుకోలేనీ, అందుకొన్నా అంగీకరించిన ఆడదాని దేహ కాంక్షలను మట్టితో చెప్పించాడు రమేశు. “ఎవరికీ పట్టనట్టు, ఊరంతా కలిసి వెలేసినట్టు ఆ మూలన పడి ఉండే నా దగ్గరకు పోతయ్య వచ్చి, నన్ను తాకి చూసినాడు. ఎన్నో నాళ్ల తరువాత ఒక మగోడి చెయ్యి తగిలేసరికి ఎంత నెమ్మది పడినానో. నీకు నేను ఉండానులే తొప్పర (బాధ) పడవద్దు అన్నట్టు నన్ను నిమిరినాడు. రెండు చేతుల నిండుగా నన్ను జవురుకొని జల్లలో పండుకోవెట్టి, ఇంటికి తీసుకొని వచ్చినాడు. ఈ కానగమాను కింద చోటు చూపించినాడు. ఈ పొద్దో రేపో నాకొక కొత్త బతుకును ఇవ్వపోతా ఉండాడు.” అని నల్లమట్టి కుమ్మరి పోతయ్య స్పర్శకు పులకరించి పోతూ చెబుతుంది. “ఎవరు ఏమన్నా అనుకోండి, ఈ మాటను చెప్పే తీరాల. కుమ్మరోడి కింద తొక్కుడు పడిన చేరుమన్ను బతుకే బతుకు. ఆ ఇమ్ము (సుఖం) చవికొన్న వాళ్లకే తెలుస్తాది. కొవ్విన పుంజుకోడి కొప్పరించి మిందకు వస్తే ఒదిగి తోవ చూపిస్తాదే పెట్టకోడి, అట్ట మెదిగి పోయినాను పోతయ్య కాళ్ల కింద నేను.”

వస్తువులు తమను మనుషులుగా వ్యక్తీకరించుకోవటం ఈ కధకు గల ప్రత్యేకత. కధ జరుగుతున్న స్థలంలో, కాలంలో తను లేని లోటును పూడ్చటానికి, రచయిత అక్కడ వున్న గృహ పరికరాల ద్వార కధను చెప్పించాడు. కడుపులో దాచుకొన్న క్షోభని, బ్రతుకంతా నోరు విప్పి చెప్పని కన్నెమ్మ కధను చెప్పుకొన్నది పొంతకడవ, ఎత్తు బొట్ట, దొంతిగుడవ,బియ్యం జల్లెడ, చింకి చాప, రాగి చెరవ, అంబటి బాన, ఊదర బుర్ర, తూకు వెళుకు (తూర్పు వెలుగు). “ఇంకా సాకలి సొలుపు తీరలేదా” అనే దెప్పిపొడుపు మాట వెనుక అంతరార్ధం అంచలంచలుగా చెప్పుకొన్నాయి ఈ వస్తువులు. మధ్యలో ‘అయ్యో కూతురా, మడేలుకు ఒళ్లు అప్పగించేసిందా కన్నెమ్మ’ అన్న ఊదర బుర్రను తీవ్రంగా మందలించాయి. ‘ఒసే ముయ్యే. మనుసులు నిన్ను ఊది ఊది, వాళ్ల లోపలి కువ్వాళం అంతా నీలో చేరిపొయినట్టు ఉండాది.’ అని ఎకసెక్కం చేసాయి. ఆమె దుఃఖాన్నీ తమ సొంతంగా భావించి వల వలా ఏడ్చాయి. పొంత కడవ మాత్రం ఆమె కధ విన్న తరువాత తల్లడిల్లిపోయింది. ‘పగలు పొద్దుగూకులూ కాగికాగి కాలిపోయే నాకు, కడకు మిగిలేది మసే కదా. పండగపూట కూడా పొంతకడవకు అంత పసుపూకుంకుమా పెట్టరే. ఇంటిల్లిపాదికీ ఇంత ఊడిగం చేసే నన్ను, కడాన ఉలవరించుకొని పొయిననాడు దిబ్బలోనే కదా వేసేది. ఓటి మంగలానికి ఉండే మతింపు కూడా పొంతకడవకు ఉండదే.. నా బతుకు మాదిర బతుకే కదా ఆయమ్మది కూడా.’ అని తల పోసి వగచింది.

మేనల్లుడు కూడ ‘సాకలి సొలుపు తీరితే కదా’ అనగానే దినమంతా కూడూనీళ్ళు ముట్టకుండా అర్ధరాత్రి పుట్టినింటి నుండి తెచ్చుకొన్న రాగిచెరవను కావలించుకొని పొగిలి పొగిలి ఏడుస్తుంది కన్నెమ్మ. ఆ ఏడుపును చూసిన పొంతకడవ తను కూడ ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చి చుక్క పుట్టే పొద్దుకు పగిలిపోతుంది.

‘ఓస్ ఆడోళ్ళు చేసే ఎలాంటి పనైనా మేము చేసేయగలం’ అనే అహంకారం ఎంత అమానుషమో, ‘ఆడది ఎంత పనైనా తన కుటుంబం కోసమే కదా చేసేది’ అంటూ దాన్ని సహజ సూత్రంగా స్వీకరించటం కూడా అంతే అన్యాయం. స్త్రీ శ్రమని ఉపరితలం నుండి చూడటం, తేలిక చేయటం ఇక్కడే మొదలౌతుంది. ప్రతిపని మర నొక్కి చేసే రోజులు కావవి. నడుమును విల్లులా వంచాలి, భుజ కండరాలను పూర్తి స్థాయిలో ఉపయోగ పెట్టాలి. చేతులు, కాళ్ళు నిరంతరం శ్రమించాలి. పొద్దు పొడిచింది మొదలు, ఊరు గురకలు పెట్టేవరకు ఎడతెరిపిలేని, సృజనాత్మకత లేని వెట్టి చాకిరి అది. ‘దేవత, అనురాగమయి, త్యాగమయి’ పిలుపులు మాత్రమే (అదీ పొదుపుగా) భత్యంగా వచ్చే దగాకోరు దోపిడి. (కన్నెమ్మకు ఆ జీతం, భాగ్యం కూడ లేవనుకోండి). రచయిత చుట్టింట్లో పీట వేసుకొని దినమంతా కూర్చొన్నా కూడ ఆ శ్రమను అంత సజీవంగా అక్షరాల్లో పెట్టటం అసాధ్యం. ఒక రోజులో ఒక స్త్రీ చేసే కష్టాన్ని రచయిత తను కూడ చేసి ఉంటేనే అలా రాయగలడు అన్పిస్తుంది ఆ వర్ణన చదివితే. ఆ భాగం మాత్రం మీరు చదవాల్సిందే.

ఇక రచయిత భాషా, వస్తుపరిజ్ఞానం అపరిమితం. గతంలో విరివిగా వాడి, ఇప్పుడు సాహిత్యంలోను, మ్యూజియం లోనూ మాత్రమే కనిపిస్తున్న గ్రామీణ శ్రమలను, వస్తుసంపదను ఆయన మన కళ్ళకు కట్టించాడు. ముఖ్యంగా కుమ్మరి కుండలు చేసిన చేసే వైనం మన ముందు సాక్షాత్కరింపచేసాడు.

“మరునాడు తెల్లవారి లేచి మబ్బు (తొక్కి పెట్టిన మట్టి ముద్ద) పక్కనే సారెను పెట్టి, సారెను గిరగిర తిప్పుతా దాని మీద నన్ను పెట్టి చేతి ఒడుపును చూపించినాడు. ఆ ఒడుపుకు పులకరించిపొయిన నా ఒళ్ళు తీరుతీరున సాగింది. నేను పంతెను అయినాను, పటువను అయినాను, పాలడ, పాలిక, మూకుడు, జల్లి మూకుడు, చట్టి, అటిక, రాళ్లటిక, గండివార్పు అటిక, బుడిగ, గిడిగ, పిడత, ముంత, దుత్త, పంటి, చల్లపంటి, సవక పంటి, కడవ, కలి కడవ, పొంత కడవ, బాన, చాకలి బాన, లోవ, గుడువ, బొట్ట, తొట్టి, మంగలము,పంటసాల, గుమ్మి, కులిమి, గాదె, గోలెము… ఒక తీరు కాదు ఒక తెన్ను కాదు, వాడు చేతిలో ఏమి మరులమందు పెట్టుకొని నన్ను ముట్టుకొన్నాడో, నేను ఇన్ని పెడలుగా పొడలు కట్టినాను.” ఇవి మట్టి చేత రచయిత పలికించిన పలుకులు.

నెళవు (పరిచయం), పసను (రంగు), రెయ్యికోళ్ళు(కీచురాళ్ళు), ఇర్లనాటికో వెల్లనాటికో (అమావాస్యకో పౌర్ణమికో), కడంగి (ప్రయత్నించి), ఉల్లము (మనసు) లాంటి అచ్చతెలుగు పదాలు పాఠకులను ఉర్రూతలూగిస్తాయి.
ఈ కధను స్మరించుకొంటున్న సందర్భంలో కధ గురించి కొందరి అభిప్రాయాలు కూడ ఉటంకిస్తే బాగుంటుందనిపించింది.

“వినిపించే గొంతుల వెనక తలుపులు తెరవని హృదయాలు,కనిపించే చిత్రం చాటున మూసుకు పోయిన కళ్ళని చూసి నమ్మకాల దారపు పోగులు తెగిపోతున్నసమయంలో, తాను నమ్మినదాన్ని శ్వాసించి, జీర్ణించి, అనుభవించి వ్యక్తీకరించే కృషి చేస్తున్నాడు రమేష్. పిచుకల కధలుతోనో, రయికముడి ఎరుగని బ్రతుకుల వ్యధలనో తన గొంతుకతో వినిపించాడు.కొత్త వడ్లతో చేసిన మొలక బియ్యం సారం అనుభవిస్తున్నత ఆనందం వుంది రమేశ్ కథలలో.” రమేశ్ కధల గురించి ఒక పాఠకురాలు హరిత అభిప్రాయం.

“ఒకమనిషిని మరొక మనిషి చెప్పుచేతల్లో పెట్టుకోడానికి ఆ మనిషిలో ఒక లోపాన్ని వెతికి దాన్ని తురుఫు ముక్కలా వాడుకుని ఆమెని ఆ ఒక్క మాటతో కుప్పకూలేలా చెయ్యడం అనే రాజకీయం ఎంతకాలంగానో నడుస్తూనే వుంది . మానవజీవితావసరమైన ఒకానొక సుఖాన్ని ఒక లిప్త కాలం అనుభవించడం నేరం అయిపోయిన అస్వతంత్ర కన్నెమ్మ అనగా ఎంత? ఏడ్చి ఏడ్చి పొంతకుండ పగిలిపోయింది .కన్నెమ్మ ఇంకా ఎంతకాలం అట్లా కన్నీళ్ళు ఇగరబెట్టుకుంటూ బ్రతకాలి? జీవితం, తిండి ,వస్తువులు.అన్నిటా స్థానీయత తొణికిసలాడే కథ. ‘రవిక ముడి ఎరగని బ్రతుకు’ అక్షరాలను దృశ్యాలుగా మలిచే చిత్రకారుడు రమేష్ .పాఠకులని తన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయించే మాంత్రికుడు.అచ్చతెలుగు అతని స్వంతం.” -సత్యవతి పి. (రచయిత్రి)

“అది ఒక కన్నీటి గాధ.’రయిక ముడి ఎరుగని బ్రతుకులు’ లో నా చిన్నప్పటి మహనీయ స్త్రీమూర్తులు ఎందరో నా మనసులో మెదిలాడారు.వేకువనే లేచి గబగబ అన్నం వండి, పొద్దున్నే పిల్లలకింత పెట్టి తానింత టిపినులో పెట్టుకొని పొలం కూలీకి పరుగులు తీసిన అమ్మ,గర్భాశయ కేన్సర్ తోనే ఇంటిల్లిపాదికీ వండివార్చిచాకిరీ చేసిన అమ్మమ్మ,తలజడ వేసుకోటం మాని, ముడి తోనే దూది ఉన్ని నేకి తనవాళ్ళ కడుపులు నింపిన నాయనమ్మ,ఎన్నని చెప్పేది ఎందరిని తలుచుకునేది?ఆ దృశ్యాలెన్నో రమేశ్ మన కళ్ళకు కట్టాడు.”- నూర్ భాషా రహంతుల్లా (డిప్యూటి కలెక్టర్, విజయవాడ).

మట్టిని తవ్వితే మాణిక్యాలు దొరుకుతాయి. పల్లెటూర్లలో నులకమంచాల్లో ముడుచుకొని ఉన్న ముసలమ్మలను కదిలిస్తే నాణ్యమైన జీవితాలు లభిస్తాయి. ఎటొచ్చి వినదగ్గ వారే వినాలి.రాయదగ్గ వారే రాయాలి. మరుగున పడ్డ, మసిగుడ్డలుగా మారిన మహోన్నత స్త్రీ మూర్తుల చీకటి గాధలను, ధవళ హృదయాలను సమస్త లోకానికి ఎరిక పర్చవా రమేశు! నీ సత్యమైన తీక్షణ దృష్టితో,నీ కధనా కౌశలంతో, నీ విశిష్ట భాషా పరిజ్ఞానంతో!

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం




రెక్కలున్న పిల్ల
-ఎస్.జయ.
“నీకేమన్నా పిచ్చా! ఉండుండి ఆశనా పెళ్ళి చేసుకునేది? ప్రేమా పిచ్చి ఒకటే అన్నారు కానీ పెళ్ళీ పిచ్చీ ఒకటనలేదు.” రవిశంకర్ మురళిని ఎగతాళి చేశాడు.
“……”
“ఆశ గురించి ఒక విషయం చెప్పనా, నొచ్చుకోకు మరి. ప్రేమ కోసమై వలలో చిక్కుకున్నావేమో”నని మురళి కళ్ళల్లోకి చూశడు రవిశంకర్. ఆ కళ్ళల్లో ఏ ఉత్సుకత కనిపించలేదు. మాట్లాడ్డానికి కాసేపు తటపటాయించాడు రవిశంకర్. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈలోగా సిగరెట్ వెలిగించాడు.
రవిశంకర్, మురళి మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే కాలేజీలో లెక్చరర్లు. ఒకరు ఎకనామిక్స్. మరొకరు పొలిటికల్ సైన్స్. ఒకే యూనివర్సిటీలో చదువుకున్నారు. ఒకే స్టూడెంట్ యూనియన్లోనూ పని చేశారు. వారి మధ్య దాపరికాలు లేవు.
“ఆశకు రెక్కలున్నాయి. ఎప్పుడైనా నీ చేతుల్లోంచి ఎగిరిపోవచ్చు” రహస్యం చెబుతున్నట్టు చెప్పాడు రవిశంకర్.
మురళి మందహాసం చేస్తూ “ఆశ రెక్కల్ని చూశావా?” అడిగాడు.
“చూళ్ళేదు కాని, రెక్కల చప్పుడు చాలాసార్లు విన్నాను. ఆమె దగ్గరగా వచ్చిందంటే చాలు. రెక్కల చప్పుడు వినిపిస్తుంది. భయంతో వణకిపోతాను. ఆశ వైపు చూడాలన్నా భయమే. నువ్వు చూశావా?” ఎదురు ప్రశ్న వేశాడు.
“………….”
మురళి వైపు జాలిగా చూస్తూ రవిశంకర్ మళ్ళీ అన్నాడు. “నువ్వు చూసి ఉండవు. విని ఉండవు. ప్రేమ మైకంలో ఉన్నావు కదా!”
“అట్లా జాలిగా చూడకు. నేనేమీ చిక్కుల్లో పడలేదు. ఆశకు రెక్కలున్నాయని తెలుసు. ఆమె వ్యక్తిత్వం చూసి స్నేహం చేశాను. ఆమె రెక్కల్ని చూసి ప్రేమించాను. కలిసి ఉందామనుకుంటున్నాం.”
“ఇది..ఆశ నిర్ణయమే కదా!”
“పెళ్ళంటే ఏమిటి. ఒక ఇంట్లో ఇద్దరిని బంధించి కాపురం చేయండి అని అందరూ అమోదించడమా! మా మధ్య ప్రేమ ఉన్నన్ని రోజులు కలిసి వుంటాం. లేనప్పుడు ఇంత సింపుల్ గానూ విడిపోతాం. కలిసి వుండటానికి పెళ్ళిపీటలు, మంగళ వాయిద్యాలు అక్కర్లేదు. విడిపోతున్నప్పుడు లాయర్లు, కోర్టులు, తీర్పులు అక్కర్లేదు.”
“ఇంట్లో చెప్పావా మీ అమ్మా నాన్న ఇష్టపడ్డారా?”
“ఆశను మా అమ్మానాన్నకు పరిచయం చేశాను. చాలా మంది తల్లితండ్రుల్లాగే మా వాళ్ళూ అభ్యంతరం చెప్పారు.” విషయాన్ని చాలా క్లుప్తంగా స్నేహితునికి చెప్పాడు మురళి.
మురళికి తన అమ్మానాన్నల సంగతి తెలుసు. ఆంగీకరించరని కూడా తెలుసు. కానీ తనేం తప్పు చేయడం లేదు. వారికి విషయం తెలియకుండా రహస్యం గా ఉంచాల్సిన పనేమీ లేదు అనుకున్నాడు.
ఒక రోజు ఆశను ఇంటికి తీసుకెళ్ళాడు. ఆశను చూడగానే మురళి తల్లి “అందమైన పిల్ల. భాగా చదువుకున్న అమ్మాయి.” అని సంబరపడింది. కానీ, ఆశను చూస్తున్న కొద్దీ ఆమెలో ఆందోళన పెరగసాగింది. ముందు ఆశ కళ్ళల్లో మెరుపు చూసి తొట్రుపడింది. మరి కాసేపటికి మాటల్లో సూటిదనం, స్పష్టత చూసి జంకింది.
ఆశ ఒక గంటలోనే ఆ ఇంటితో, ఆ మనుషులతో ఎన్నో ఏళ్ళ పరిచయం వున్నట్లు కలివిడిగా మాట్లాడుతూ, ఉల్లాసంగా ఒకసారి తన రెక్కల్ని విప్పి ఆనందంగా ఆడించి, ముడిచింది. అంతే, మురళి తల్లి భయంతో వణికిపోయింది.
ఆశ వెళ్ళిపోయాక, “ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు. ఎక్కడో పెళ్ళి చేసుకుని ఆమెను ఇంటికి తెచ్చావా నా శవాన్ని చూస్తావు.” అని బెదిరించింది తల్లి.
“మేము ముందే నిర్ణయించుకున్నాం. వేరే ఇల్లు తీసుకుంటున్నాం.”
“నువ్వు కాక మాకు ఇంకెవరున్నారు. రెక్కలున్న పిల్ల పెళ్ళయిన వెంటనే వేరే కాపురం పెట్టిస్తుందేమోనని భయపడి ఈ పెళ్ళి వద్దంటున్నాం. కానీ, పెళ్ళి కాకుండానే వేరే పోతావా?” మురళి తండ్రి అడిగాడు.
“పుట్టింటి నుంచి మెట్టినింటికి వలసపోవడానికి ఆమె మామూలు ఆడపిల్ల కాదు. అందుకే మా ఇల్లు మేం ఏర్పాటు చేసుకున్నాం.”
“ఈ ఇల్లు, అవీ, ఇవీ, ఏవీ వద్దంటున్నావు. కనీసం మేము నీ తల్లితండ్రులమనైనా ఒప్పుకుంటావా? అడిగింది తల్లి.
“ఆశకు ఆమె తల్లితండ్రులు ఎంతో, నాకు మీరు అంతే. అమ్మాయిలకు పుట్టిల్లు తాత్కాలికమనే కదా చెబుతుంది మీ సంప్రదాయం. ఒక తల్లి కడుపున పుట్టిన అమ్మాయికి ఒక సంప్రదాయం, అబ్బాయికి మరో సంప్రదాయం. ఈ తేడా ఒద్దంటున్నాం. అందుకనే వేరే ఇల్లు చూసుకున్నాం. మీకిష్టమైనప్పుడు మీరు మా ఇంటికి రావొచ్చు. మా కిష్టమైనప్పుడు మేము మీ ఇంటికి వస్తాం.”
మురళి వెల్లడించిన భావాలు అతని తల్లికి, తండ్రికి పూర్తిగా కొత్త. వారికి ఎంత అర్ధమయ్యాయో వారికే తెలియదు. ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వమనో, చచ్చిపోతామనో బెదిరించి ప్రేమ పెళ్ళిళ్ళను ఆపగలిగిన సంప్రదాయం తెలుసు కాని, వాటికి ఏ మాత్రం విలువివ్వని వారితో ఎట్లా గొడవపడాలో, బెదిరించాలో తెలియదు. సరి కదా, మురళి మాటలు వారి మనసుల్ని కలవరపెట్టాయి. ఈ కొత్త దనం ఎట్లా ఉంటుందో చూడాలన్న కుతూహలం కూడా వారిలో కలగక పోలేదు.
***
“నీకు రెక్కలు వచ్చేట్లుగా పెంచిన మీ అమ్మను చూస్తే నాకు చాలా గౌరవం. మా అమ్మ మా అక్కను ఎప్పుడూ ప్రతి చిన్న పనికి కోప్పడుతూ, సరి దిద్దుతూ వుండేది. పెళ్ళి కాకముందే మా అక్కను ఓ మంచి గృహిణి గా తయారుచేసింది మా అమ్మ.” అన్నాడు ఒకరోజు మురళి వంట సమయంలో.
మురళి, ఆశ వారంలో రెండుసార్లు మాత్రమే వంట చేసుకుంటారు. ఎవరికిష్టమైనవి వారు నాలుగు రకాల కూరలు చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటారు.ఇద్దరు కలిసి ఒక గంటలో వంట పూర్తి చేసేలోగా, తరచుగా వాళ్ళు చిన్నప్పటి ఆటపాటల గురించి, చిన్ననాటి స్నేహితుల గురించి, తల్లితండ్రుల గురించి, ఒక్కోసారి ఫక్తు వంటల గురించి మాట్లాడుకునేవాళ్ళు.
మురళి మాటలకు పగలబడి నవ్వింది ఆశ.
“నాకు రెక్కలు రావడానికి మా అమ్మ కారణమని అంత ఖచ్చితంగా ఓ నిర్ణయానికి ఎట్లా వచ్చావు?” అంది.
“మరి!…”
మా శ్యామల టీచర్ స్నేహం వల్లనే నాకీ రెక్కలు వచ్చాయి.” అని తన రెక్కల్ని చాపి, వాటివైపు మురిపెంగా చూసుకుంది. మురళి లాలనగా ఆశ రెక్కలను సుతారంగా నిమిరాడు. ఆశ కళ్ళు గర్వంతో వెలిగిపోయాయి.
**
నేను ఎని మిదో తరగతి చదువుతున్నప్పుడు, శ్యామల టీచర్ మాకు ఇంగ్లీషు టీచ్ చేసేది. ఆమె మాకు ఎన్నెన్నో కొత్త కథలు చెప్పేది. అవి ఏ పుస్తకాల్లో ఉంటాయో, ఆ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో అడిగాను. ఒకసారి ఇంటికి రమ్మంది. ఛాలా పుస్తకాలు వున్నాయి. నాకప్పుడే తెలిసింది. నాక్కూడా పుస్తకాలంటే ప్రాణమని. నేను ఇంటర్లో చేరాక కూడా మా టీచర్ ఇంటికి వెళ్ళి బుక్స్ తెచ్చుకొని చదివేదాన్ని. రంగనాయకమ్మ రాసిన ‘జానకి విముక్తి’ నవలను బట్టీయం వేశానంటే నమ్ము ఆ బుక్స్ నాలో కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తించేవి.
ఎవరు ఏం మాట్లాడినా, ఏదో లోపం ఉన్నట్లు, అనిపించేది. నేను అమ్మ చెప్పినట్లు నడుచుకోవడం లేదని, దీనికంతా కారణం శ్యామల టీచరేనని మా అమ్మ అనుకొంది.” అని చెప్పింది ఆశ.
“కాలేజీలో చేరావు. శ్యామలా టీచర్ ఇంటికి ఎందుకు వెళతావు? ఆ పుస్తకాలు చదవడం మానేసేయ్.” ఒక రోజు ఆశ తల్లి అనూరాధ అంది.
“ఆ బుక్స్ చదవడం నాకిష్టం. చదువుతాను. నా తప్పేమీ లేకపోయినా, నన్ను కోప్పడితే, గంగిరెద్దులా తలాడిస్తూ వుండలేను.”
“ఈ తలబిరుసుతనమే వద్దనేది. ఏ తప్పు లేదంటూనే ఎట్లా మాట్లాడుతున్నావో చూడు. పక్కింటి సీతను చూసి నేర్చుకో. ఎంత అణకువ గల పిల్ల! ఈ వీధికే వన్నె తెచ్చే పిల్ల.” అంది అనురాధ.
“నిజమే. ద్వాపర యుగం సీతకు, ఈ సీతమ్మకు పిసరంతయినా తేడా లేదు. చెప్పినట్లు వినే మంచి పిల్ల. తనకిష్టమైన పని ఏదీ చేయదు. అందరి చేత మంచి అనిపించుకోవడానికి, ఎన్ని బాధలొచ్చినా భరిస్తూ బతకడానికి తయారవుతోంది. జీవితమంతా du a@hఖిస్తుంది.”
సతీమ తల్లి సీతను కూడా తిరస్కరిస్తున్న ఆశ, తన చేతులు దాటి పోయిందని గుర్తించింది అనురాధ. ఈ విషయాన్ని అంగీకరించే స్థితిలో ఆమె లేదు. ఆశను లొంగదీఎయడానికి తనలో ఎక్కడలేని కాఠిన్యాన్ని బయటపెట్టింది. మొరటుగా తిడుతూ, కొట్టడానికి ఆశ మీదికి చేయి ఎత్తింది.
చెంప మీద దెబ్బ పడకుండా తప్పించుకోగలిగింది ఆశ. కానీ, తల్లి తనను అవమానించడం భరించలేకపోయింది. తన తల్లి ప్రవర్తనను అసహ్యించుకుంది. తల్లి వైపు నిర్లక్ష్యం గా చూసింది. ఆ చూపుతో ఆ తల్లి కూడా సిగ్గుతో కుంచించుకుపోయింది.
మరునిమిషంలో ఆశ రెండు మూడు పుస్తకాలు తీసుకొని, “శ్యామల టీచర్ ఇంటికి వెళ్తున్నాను. ఉదయం వస్తాను.” అంటూ వెళ్ళబోయింది.
అనురాధ – ఆశ వైపు వింతగా చూసింది. “ఏమిటి ఈ పిల్ల ఇంత జరిగాక కూడా టీచర్ ఇంటికి వెళ్తానంటోంది.” అనుకుంది.
“ఒకటి గుర్తుంచుకో అమ్మా! నేనేం చిన్నపిల్లను కాను. మంచి చెడు నిర్ణయించుకోగలను. ఇంకెప్పుడూ నా మీదకి చేయి ఎత్తొద్దు.” ఆశ చాలా మామూలు విషయంలా చెప్పి వెళ్లిపోయింది. ఆశ ప్రవర్తనకు ఆ తల్లి ఆశ్చర్యపోయింది.
శ్యామల టీచర్ ఇంటికి వెళ్లిన ఆశ, రోజు కన్నా ఎక్కువసేపు చాలా శ్రధ్ధగా పాఠాలు చదువుకుంది. అర్ధరాత్రి దాటినా నిద్ర రావడం లేదని, చదువుకోవడానికి ‘రెక్క విప్పిన రెవల్యూషన్’ బుక్ తీసుకుంది. ఫ్రాన్స్ లో 1968 లో జరిగిన విద్యార్ధుల ఉద్యమం గురించి విద్యార్ధుల పై ప్రభుత్వ దమనకాండ గురించి ఏంజిలా కాట్రొచ్చ రాసిన పుస్తకం అది. ఆ పుస్తకం చదువుతూ, ఆ సంఘటనలు ఇప్పుడే అరుగుతున్నట్టు ఆ విద్యార్ధుల్లో తను ఉన్నట్లు అనిపించింది ఆశకు. ఊపిరి తీసుకోవడం కూడా మరిచిపోయి, ఏకబిగిన ఆ పుస్తకం పూర్తిచేసింది. ఒక కొత్త ఉత్సాహం, ధైర్యం వచ్చినట్లు అనిపించింది. నిద్రలోకి ఒరిగిపోయింది.
అందమైన కల. ఆద్భుతమైన ఆనందమేదో తనలోకి పొగమబ్బులా దూసుకుపోయింది. తనకు రెక్కలు మొలుచుకొచ్చాయి. ఆకాశంలోకి ఎగిరిపోయింది. తెల్ల మబ్బుల మధ్య గిరికీలు కొడుతోంది తను. ఆశ సంతోషంతో కళ్ళు తెరిచింది. భుజాలను తడుముకొని ఉలిక్కిపడింది. ఇప్పుడు తనకు రెక్కలున్నాయి. రెక్కల్ని చూసుకొని ఆశ్చర్యపోతుంటే, శ్యామల టీచర్ కాఫీ కప్పుతో వచ్చి
‘మంచి కలతో మేల్కొన్నట్టున్నావ్?” అని అంది.
“అవును టీచర్. రెక్కలొచ్చినట్టు కల కన్నాను. మెలకువ వచ్చి చూసుకుంటే నిజంగానే నాకు రెక్కలొచ్చాయి.” అని, చూపించింది.
శ్యామల టీచర్ వాటిని చూసి ఆనందంతో పొంగిపోయింది. “ఎంత అందంగా వున్నాయి ఈ రెక్కలు.” అంది రెక్కలను సుతారంగా నిమురుతూ.
ఆశ తన రెక్కల్ని చూసుకోవడంలో మునిగిపోయింది. కాఫీ తాగడం మరిచి,
“ఎందుకైనా మంచిది. రెక్కల్ని ఎవరికంటా పడకుండా జాగ్రత్త చేసుకో. నీ కాళ్ళ మీద నీవు నిలబడగలిగే పరిస్థితి వచ్చేవరకు జాగ్రత్త తీసుకో.”
శ్యామల టీచర్ మాటలతో ఆశకు ముందు తన తల్లి, తండ్రి గుర్తొచ్చారు. ముందు వారికంట పడకుండా చూసుకోవాలి అనుకుంది.
ఆశ భయపడినట్టే జరిగింది. ఒకరోజు చదువుకుంటూ మైమరచి రెక్కలు చాపింది ఆశ. అనూరాధ ఎందుకనో అప్పుడే ఆ గదిలోకి వచ్చి కూతురిని చూసి భయపడింది. మరుక్షణంలో ఆశ తన తప్పు తెలుసుకొని, రెక్కల్ని ముడిచి, ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త చేసుకొంది. మళ్ళీ ఏమీ ఎరగనట్టు ఏకాగ్రతతో చదువుకుంటూ కూర్చుంది. అనూరాధ ఆందోళనగా వెళ్ళి భర్తకు విషయం చెప్పి, వెంట తీసుకొని ఆశ వున్న గదిలోకి వెళ్లింది. వారు వచ్చిన అలికిడికి ఏ మాత్రం చలించకుండా చదువుకుంటూ వుంది ఆశ. చదువులో నిమగ్నమైపోయిన కూతురిని చూసి, ఆ యన భార్య చెప్పింది నమ్మలేదు. గది బయటకు వెళ్ళి, “నువ్వేదో భ్రమ పడ్డావు. మనుషులకు ఎక్కడైనా రెక్కలుంటాయా? ఒక్క రోజులో ఆశకు రెక్కలు ఎట్లా వస్తాయి?” అని వెళ్ళిపోయాడు.
ఆ రోజు నుంచి తల్లి తనను గుచ్చి గుచ్చి చూస్తోందని ఆశ గమనించింది. తన రెక్కల్ని దాచడానికి మరిన్ని జాగ్రత్తలు తీసుకొంది. ఆలా రెండేళ్ళు నెట్టుకు రాగలిగింది. ఒకసారి బాగా జ్వరం వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది ఆశ.
అనూరాధ మందులు ఇస్తూ, సపర్యలు చేస్తూ ఒక రోజు ఆశ భుజాలు తడిమి చూసింది. రెక్కలున్న విషయం నిర్ధారించుకుంది. భర్తకు చూపించింది. జ్వరంలో వున్న కూతురిని ఏమీ అడగలేకపోయారు. తల్లి అండ్రికి తన రెక్కల సంగతి తెలిసిపోయిందని ఆశ కూడా గుర్తించింది.
ఒకరోజు ఆశ ఆదమరచి నిద్రపోతుండగా అనూరాధ, ఆమె భర్తతో కలిసి ఆశ రెక్కల్ని కత్తిరించడానికి ప్రయత్నించారు. రెక్కల మీద కత్తి పెట్టారో లేదో ఆశకు మెలకువ వచ్చింది.
తన రెక్కల్ని కత్తిరించవద్దని ఏడుస్తూ ఒక్క ఉదుటున మంచం దిగి పక్క గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది.
తల్లారాక, పనిమనిషి తలుపుకొడితే తలుపు తీసింది ఆశ. స్నానం చేసి, కాలేజీకి వెళ్లడానికి తయారైంది. తన బుక్సన్నీ రెండు సంచుల్లో సర్దుకొని, నాలుగైదు డ్రస్సులు ఒక సూట్కేసులో సర్దుకొంది. వాటిని చూసి ‘ఎందుకవన్నీ’ అని అనూరాధ అడిగింది.
“నాకు రక్షణ లేని ఇంట్లో నేనుండలేను. ఒకర్నొకరం అనుమానంతో చూసుకుంటూ దొంగల్లాగా బతకడం నాకిష్టం లేదు. పరీక్షలు అయ్యేదాక శ్యామల్ టీచర్ ఇంట్లో ఉంటాను. టర్వాత ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను.” అని విసవిసా వీధిలోకి నడిచి, ఆటొ రిక్షా పిలిచింది. తల్లి, తండ్రి చూస్తుండగానే ఆటోలో ఎక్కి వెళ్ళిపోయింది. ఆశతో ఒక్క మాట మాట్లాడలేకపోయారు.
రెక్కల్ని చూసి తామెందుకు అంత కిరాతకంగా ప్రవర్తించామా అని పశ్చాత్తాప పడ్డారు. ఆశను అదుపులో పెట్టాలని ప్రయత్నించి చివరికి తాము తప్పు చేశామని గుర్తించారు. ఆ సాయంత్రమే శ్యామల టీచర్ ఇంటికి వెళ్లి ఆశను ఇంటికి రమ్మని బతిమాలారు.
“వద్దు. మీరు నన్ను అర్ధం చేసుకోలేరు. ఈ ప్రేమ చాలు. అప్పుడప్పుడు కలుసుకుంటూ వుందాం. నేనిక్కడ సంతోషంగా వుంటానని మీకు తెలుసు. నా ఫురించి బెంగ పెట్టుకోవద్దు.” అని తల్లిని ఓదార్చింది. ఆశ ఓదారుస్తుంటే అనూరాధ గుర్తించింది. “ఆశ ఏనాడు తొందరపడి తనను ఒక్కమాటా అనలేదు. తనే ప్రతిసారీ – తను తల్లినని, తన మాట నెగ్గితీరాలని అనాలోచితంగా ప్రవర్తించానని అనూరాధ గుండెలవిసేలా ఏడ్చింది.
ఆ కన్నీళ్ళు ఆమెలోని కాఠిన్యాన్నంతా కడిగేసినట్టున్నాయి. ఆ రోజునుంచి ఆమె ఆశను అమితంగా ప్రేమించింది. ఆశ బి.ఏ.పూర్తి చేశాక ఉద్యోగంలో చేరాలనుకుంది. కానీ శ్యామల టీచర్ ఒప్పుకోలేదు. ఆశ తల్లి తండ్రి కూడా ఆశ చదువుకోవాలని చెప్పారు. వారిలో ఈ మార్పు చూసి ఆశ సంతోషపడింది. ఎం.ఎ. పూర్తి చేసి కాలేజీలో లెక్చరర్ గా చేరింది. అక్కడే ఆమెకు మురళితో పరిచయమైంది.
***
“అమ్మ నాకు జన్మనిచ్చింది. మా శ్యామల టీచర్ నాలో చైతన్యం కలిగించారు. చైతన్యం వున్నప్పుడే కదా నిజంగా జన్మించినట్టు.” అంది ఆశ. ఆ క్షణం లో ఆశలో మరికొన్ని అందాలు చూసి మురళి ఆనందంతో పొంగిపోయాడు.
శ్యామల టీచర్ని నాకింతవరకు పరిచయం చేయలేదు.” అన్నాడు మురళి.
వంట పూర్తి చేసి ఇద్దరూ చేతులు కడుక్కున్నారు.
“ఒక్క నిమిషం.” అంటూ గబగబా చేతులు తుడుచుకొంది నాప్ కిన్ తో. దాన్ని తిరిగి మురళి చేతుల్లో పెట్టి, ఫోటో ఆల్బం తీసుకొచ్చింది. మురళి కూడా గబగబా చేతులు తుడుచుకొని నాప్ కిన్ ను ఫ్రిజ్ కు తగిలించి, ఆల్బంలోకి తొంగిచూశాడు.
“ఇంతకు ముందే ఈ ఫోటో చూపించి, నాకిష్టమైన టీచర్ అని చెప్పావు కానీ, మీ మధ్య ఇంత అనుబంధం వుందని చెప్పలేదు. నాకు ఇప్పుడే శ్యామల టీచరును చూడాలని వుంది. వెళదామా” అన్నాడు మురళి.
“ఆమె లేదు. నేను ఎం.ఎ.లో వుండగా చనిపోయారు.”
“సారీ! ఆమెను గుర్తు చేసి బాధపెట్టాను.”
“అదేం కాదు. మన దగ్గర లేని వాళ్ళను గుర్తు చేసుకొని కొత్త ఉత్సాహం నింపుకోవాలి. నాకెప్పుడు దిగులు వేసినా శ్యామల టీచర్ను గుర్తు చేసుకుంటాను.”
“అవునా! అయితే ఆ ఫోటో ఇటివ్వు.”
“దేనికి” అంటూనే ఆల్బంలోంచి ఫోటొ తీసి ఇచ్చింది ఆశ.
“ఫోటో ఎన్ లార్జ్ చేయించి, లామినేషన్ చేయిస్తాను. బుక్స్ అల్మెరాలో కనిపించేట్టు పెట్టుకుందాం.”
“భలే మంచి ఐడియా.” ఆశ రెక్కల్ని చాపి మురళిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది.
***
ఎంత రెక్కలుంటే మాత్రం రాత్రి పదకొండు గంటలైంది. ఇంకా ఇంటికి రాలేదు టీచర్! మీరైనా చెప్పండి ఆశకు. ఈ భయాన్ని భరించడం క్షణక్షణానికి కష్టమవుతోంది.” ఫొటోలోని శ్యామల టీచరుకి ఫిర్యాదు చేసాడు మురళి.
అప్పుడే డోర్ బెల్ ట్రింగ్ మని మోగింది. పరుగున వెళ్ళి బోల్ట్ తీశాడు మురళి. ఎదురుగా ఆశ.
“హమ్మయ్య! ఏమైందోనని భయపడి చస్తున్నాను. ఎట్లా వచ్చావ్? ఎక్కడికెళ్లావ్. ఓల్డ్ సిటీలో కమ్యూనల్ టెన్షన్స్ మొదలయ్యాయి. నీ గురించి ఎంత ఆందోళన పడుతున్నానో, నీ కోసం స్వప్నకు, రాధికకు ఫోన్ చేశాను. నువ్వెక్కడికి వెళ్లింది వాళ్లు చెప్పలేకపోయారు.
“భార్గవి పూణేకు మకాం మారుస్తోందని చెప్పాను కదా! ఈ రోజు ఫ్రెండ్సందరికీ పార్టీ ఇచ్చింది. తొమ్మిదికంతా వస్తాననుకున్నాను. నీక్కూడా ఏదో మీటింగ్ వుందన్నావు కదా!” భుజానికున్న బ్యాగ్ అల్మె రాలో పెడుతూ అడిగింది.
“ఓల్డ్ సిటీలో టెన్షన్ గా వుందని మీటింగ్ రద్దు చేశారు. ఏడుకంతా ఇంటికి వచ్చాను. అప్పట్నుంచీ నీ కోసం ఎదురు చూస్తున్నాను.”
“ఏమన్నా చదువుకోవచ్చు కదా!” అంది కేన్ కుర్చీలో చేరగిలపడుతూ.
“నీకోసం ఎదురుచూస్తూ వంట చేశాను. ఫోన్ చేస్తావేమోనని నిన్ను తీసుకు రావొచ్చని ఎదురుచూస్తున్నాను. ఫోన్ చేయొచ్చుకదా.”
“నేను రాగలను కదా! నీ టైం పాడుచేయడం ఎందుకని ఫోన్ చేయలేదు. నేను తినే వచ్చాను. నువ్వు తిను.” డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచారు ఇద్దరు. మురళి వడ్డించుకొన్నాడు.
“రెండుమూడు నెలలుగా చూస్తున్నాను. బాగా పనులు పెట్టుకుంటున్నావు. ఇంటికి వెళ్ళి హాయిగా కబుర్లు చెప్పుకుందామని కలలు కంటూ వస్తానా నువ్వు కనిపించకపోయే సరికి దిగులు వేస్తుంది. ఇక వస్తుంది. ఇక వస్తుంది అనుకుంటూ ఎదురుచూస్తుంటాను. ఉదయమే ఏదన్న మీటింగ్ వుంటే చెప్పొచ్చు కదా. నేను వచ్చి పికప్ చేస్తాను. త్వరగా ఇల్లు చేరుకుంటాం.”
“ఎందుకిలా తయారవుతున్నావ్ మురళీ. నేను పనులు కల్పించుకుంటున్నట్లు నువ్వూ ఏమైనా పనులు పెట్టుకోవచ్చు కదా!”
“నన్నంటున్నావ్. నువ్వెందుకు మారిపోయావు. నువ్వెక్కడికి వెళ్ళేదీ నాకెందుకు చెప్పడం లేదు.”
“ప్రతిదీ ఎందుకు చెప్పాలి?”
“తప్పేమిటి.”
“నాకిష్టంలేదు. కొన్నికొన్ని పనులు నేను చేసుకుంటేనే నాకు హాయిగా వుంటుంది.”
“నేను వెంట వుండడం నీకు ఇబ్బందిగా వుంటుందా?” మురళి అన్నాడు.
“ఎందుకుండదు. లేకపోతేనీకు బోర్ కొట్టకుండా నేనూ, నా ఫ్రెండ్స్ చూసుకోవాలి. అదీ కాక, నీకు నీ ఎప్పుడూ ఎవరో ఒకరికి నష్టం కలుగుతుంది. నీ ష్నేహితులు, నీ పనులు వేరే వుండాలి లేకపోతే ఎట్లా?”
“నీకూ నాకూ అంటూ ప్రత్యేకంగా ఎందుకు.. నీ ఫ్రెండ్సే నాకు ఫ్రెండ్స్.”
“అంత ఇరుకుగా జీవించవద్దు మనం. అన్నిట్ట్లో పూర్తిగా కగలిసి పోవడంలో ఎప్పుడూ ఎవరో ఒకరికి నష్టం కలుగుతుంది. నీ స్నేహితులు, నీ పనులు వేరే వుండాలి. రవిశంకర్ నీకు మంచి ఫ్రెండే కదా. ఎన్నాళ్లయింది మీరు కలుసుకొని?”
“ఇప్పుడవన్నీ ఎందుకు – నీకు ఇబ్బంది కలక్కుండా చూడ్డం కోసమే నేను నీకోసం వస్తానంటున్నాను.”
“అది నాకిష్టం లేదు. నువ్వు నాకోసం డ్రైవర్ గానో, పి.ఆర్వోగానో పనిచేయడం నాకిష్టంలేదు. నాకు రెక్కలున్నాయి. నా పనులు నేను చేసుకోగలను.”
ఆశ అభిప్రాయాలు ముందు కఠినంగా కనిపించాయి మురళికి. ఆలోచిస్తున్న కొద్దీ అందులో అర్ధం చాలా వుందనిపించింది. నిజమే ఒకరి స్వేచ్చ మరొకరికి అడ్డంకి కాకూడదు అనుకున్నాడు మురళి.
*** * ***

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

 

రయికముడి ఎరగని బతుకు

స.వెం.రమేశ్‌



‘చుక్క పొడిచేసింది లెయ్యండమ్మో’ అంటూ గొంతు చించుకొనింది పుంజుకోడి. ఆ అరుపువిని ఉలిక్కిపడి లేచినాను నేను. నామీద వెచ్చంగా పండుకొని ఉండిన ఎర్రకుక్క లేచి, ఒక్క నీలుగు నీలిగి, చెవులు టపటప తాటించుకొంటూ అవతలకు పోయింది. సర్రుసర్రుమనే సద్దుతో పొరక ఒకటి నా పక్కనుంచే పోయింది.‘చా ఏంది ఇంత కునుకు పట్టేసిందే’ ఆవలిస్తా అనుకున్నాను. కత్తిరిపెట్టక ముందు చిత్తిరి నెలలో పగలు చిమచిమలాడినా పొద్దు పడమటికి వంగేసరికి చల్లంగా పైరగాలి మల్లతాది. కానగమాను కింద పండుకొన్న నేను ఆగాలి వల్లనే ఏమో ఇట్ట తూగినాను.

నిన్నటివరకూ నా బతుకు బతుకే కాదు. పాతూరు ఆరేటమ్మ గుడి పక్కన ఎండకు ఎండతా వానకు నానతా మంచులో మునగతా బతికినాను. ఆ పక్కనే చేలల్లో ఉండే నా తోడపుట్టులు కూడా ఎసరక (ప్రకృతి) లో ఎండినానే వాళ్లే. కానీ వాళ్ల బతకుకు ఒక గురి (లక్ష్యం) ఉండాలి కదా. ఎండినా నానినా ఏడాదికి పుట్ల పుట్ల పంటలను పండించి నలుగురి కడుపులూ నింపుతారు. అందుకూ తగనట్టు గుడిపక్కన పడిఉండినాను నేను.

నిన్న మాపుసేపులో ఒంటెద్దుబండి ఒకటి జిల్లను తగిలించుకొని వచ్చి నా పక్కన నిలపడింది. ఆ బండిలో నుంచి పోతయ్య దిగినాడు. ఎవరికీ పట్టనట్టు, ఊరంతా కలిసి వెలేసినట్టు ఆ మూలన పడి ఉండే నా దగ్గరకు వచ్చి, నన్ను తాకి చూసినాడు. ఎన్నో నాళ్ల తరువాత ఒక మగోడి చెయ్యి తగిలేసరికి ఎంత నెమ్మది పడినానో. నీకు నేను ఉండాను లే తొప్పర (బాధ) పడవద్దు అన్నట్టు నన్ను నిమిరినాడు. రెండు చేతుల నిండుగా నన్ను జవురుకొని జల్లలో పండుకోవెట్టి, ఇంటికి తీసుకొని వచ్చినాడు. ఈ కానగమాను కింద చోటు చూపించినాడు. ఈ పొద్దో రేపో నాకొక కొత్త బతుకును ఇవ్వపోతా ఉండాడు.

‘పోతన్నా పొంతకడవ ఒకటి కావా లన్నా’ అంటా వచ్చింది ఒకామె.

‘ఇదిగో ఈడ ఉండాయి చూడు రాజక్కా’ అంటా ఒక మూలన బోర్లించి ఉండే కడవలను చూపించినాడు ఆ వచ్చినామెకు పోతయ్య.

వాటిని కొంచెంసేపు తిరగేసి మరగేసి చూసి ‘ఇంకొంచెం పెద్దవి, నల్ల కడవలు లేవా పోతన్నా, ఈ ఎర్రవి నాలుగునాళ్లకే ఉలవరించుకొని పోతాయి’ అనింది రాజక్క.

‘అట్టాంటి కడవ కావాలంటే నాలుగునాళ్లు ఉండు రాజక్కా. పాతూరు ఆరేటమ్మ గుడి కాడ దొరికింది నల్ల చేరుమన్ను. కడవలకు వాటమయిన మట్టి అది. ఆ కానగమాను కింది ఉండాది చూడు. ఈ పొద్దే దానిని తొక్కి మబ్బు లేస్తాను’ నన్ను చూపిస్తా అన్నాడు పోతయ్య.

ఆ మాటతో నా దగ్గరకు వచ్చి, నన్ను చేతితో తాకి చూసి ‘ఆహా ఎట్టాంటి మట్టి దొరికింది పోతన్నా నీకా, సరే కానీ పదినాళ్లు ఎట్నో సర్దుకొంటానులే. సవకపంటితో రెండు పంట్ల నీళ్లు పట్టాలన్నో’ అంటా తిరుక్కొనింది రాజక్క.

ఈ పొద్దే తొక్కి మబ్బేస్తాను అనిన పోతయ్య మాటను రాజక్క నమ్మేసి పోయింది కానీ నేను మటుకు నమ్మలేదు. నల్ల చేరుమన్ను కడవగానో చట్టిగానో మారాల అంటే మాటలా!

ఇంకొక మూడునాళ్లు ఎర్రటి ఎండలో నన్ను బాగా ఎండనిచ్చినాడు పోతయ్య. నాలుగోనాడు పొద్దు పడమటకు వంగిన వెనుక నా దగ్గరకు వచ్చి నన్ను తాకి చూసి, తనివిగా తల ఆడించినాడు. జల్లించి పెట్టుకొన్న సన్నటి కరిపేటి ఇసకను ఒక గంపడు తెచ్చి నేల మింద పోసి, ఆ ఇసక మిందకు నన్ను చేర్చినాడు. నా మింద చెరవల నీళ్లు పోసి తొక్కడం మొదలు పెట్టినాడు. నడుమ నడుమ సన్న ఇసకను కొంచెం కొంచెం చల్లుకొంటా, నీళ్లను చిలకరించుకొంటా తొక్కతా ఉండాడు.

ఎవరు ఏమన్నా అనుకోండి, ఈ మాటను చెప్పే తీరాల. కుమ్మకోడి కింద తొక్కుడు పడిన చేరుమన్ను బతుకే బతుకు. ఆ ఇమ్ము (సుఖం) చవికొన్న వాళ్లకే తెలుస్తాది. కొవ్విన పుంజుకోడి కొప్పరించి మిందకు వస్తే ఒదిగి తోవ చూపిస్తాదే పెట్టకోడి, అట్ట మెదిగి పోయినాను పోతయ్య కాళ్ల కింద నేను. పొద్దు పిట్ట పడమటి గూట్లో ముడుక్కొనే వరకూ తొక్కి, అంతా ఉడ్డ తోసి మబ్బువేసి పైన రవన్ని నీళ్లు చిలకరించిపోయినాడు పోతయ్య.

మరునాడు తెల్లవారి లేచి మబ్బు (తొక్కి పెట్టిన మట్టి ముద్ద) పక్కనే సారెను పెట్టి, సారెను గిరగిర తిప్పుతా దాని మీద నన్ను పెట్టి చేతి ఒడుపును చూపించినాడు. ఆ ఒడుపుకు పులకరించిపొయిన నా ఒళ్ళు తీరుతీరున సాగింది. నేను పంతెను అయినాను, పటువను అయినాను, పాలడ, పాలిక, మూకుడు, జల్లి మూకుడు, చట్టి, అటిక, రాళ్లటిక, గండివార్పు అటిక, బుడిగ, గిడిగ, పిడత, ముంత, దుత్త, పంటి, చల్లపంటి, సవక పంటి, కడవ, కలి కడవ, పొంత కడవ, బాన, చాకలి బాన, లోవ, గుడువ, బొట్ట, తొట్టి, మంగలము, పంటసాల, గుమ్మి, కులిమి, గాదె, గోలెము… ఒక తీరు కాదు ఒక తెన్ను కాదు, వాడు చేతిలో ఏమి మరులమందు పెట్టుకొని నన్ను ముట్టుకొన్నాడో, నేను ఇన్ని పెడలుగా పొడలు కట్టినాను.

నడిపొద్దుకు సారెను నిలిపి, అంత ముద్ద తిని వచ్చి, మా ముందు కూచుని సలపతో తట్టి తట్టి వెలుపు చేసి తీర్చినాడు. అడుసుచట్టిలోని తడిగుడ్డ అద్దుకొంటా దిద్దుకొన్నాడు మమ్మల్ని. ఆ వెనుక ఆరారునాళ్లు నీడలోనే ఆరపెట్టి, ఒకనాటి మాపున ఆరిన మమ్మల్ని ఆములో పేర్చి మంటపెట్టినాడు. ఆ రెయ్యి అంతా కాలి కాలి ఎర్రపడి మన్నాడు మాపటికి చల్లపడి నల్లపడినాము మేము. ఆములో నుంచి పొంతకడవ అయి బయటకు వచ్చిన నేను కరిమబ్బు పసను (రంగు) లో కరకు తేలి, తాకితే చాలు టంగుటంగుమని మోగతా ఉండాను.

అన్నమాటను రెన్నాళ్లు దాటినా నన్ను మిన్నగా చేసి రాజక్క ఇంటికి చేర్చినాడు పోతయ్య. ఒక మంచి పూట చుట్టింటిలోని రెండు పొయ్యిల నడుమన నన్ను కుదురుగా కూచోపెట్టింది రాజక్క. నానిండా రెండు పంట్ల నీళ్లు పోసి, నాకు చెరొక పక్కన ఉండే రెండు పొయ్యిలనూ రగిల్చింది. ఆ పొద్దుతో మొదలయింది నా పొంత కడవ బతుకు. పొద్దున్నే పొద్దు పుట్టుకముందే మొదలుపెట్టి పొద్దు మునిగిపోయిన వెనుక ఎంతో పొద్దు వరకూ కాగతోనే ఉండాను నేను.

ఆ చుట్టింటిలో ఒక మూలగా ఒదిగి నిలిచి ఉండే నాలుగు అడుగుల ఎత్తు బొట్ట (చిన్న గాదె) తో నాకు తొలి నెళవు (పరిచయం) కలిగింది. నేను ఆ ఇంట్లో అడుగుపెట్టిన తొలినాటి రెయ్యి, ఆడవాళ్లు కూటికుండనూ కూరాకుచట్టినీ చక్కపెట్టేసి, చుట్టింటి తలుపును మూసుకొని పొయిన తరువాత ‘ఏ ఊరు అమ్మీ నీ పుట్టినిల్లు’ అని పలుకరించింది ఆ బొట్ట.

‘పాతూరు ఆరేటమ్మ గుడి కాడ అక్కా’ మారు పలికినానను.

‘అట్నా ఆ పక్కన్నే రాగవరెడ్డోళ్ల కయ్య ఉండాది కదా. ఆ కయ్యకు ఆనుకొని ఉండే పొరంబోకే నేను పుట్టిన చోటు. ఆ పొరంబోకులో వెలగమాను ఒకటి ఉండింది. రాలిన వెలగపండ్లను ఏరుకొని తిన్నవాళ్లు అందరూ, అబ్బ ఏమి తీపు ఈ మానుపండూ, గడ్డ బిర్రు అట్టాంటిది, అంటా నన్ను పొగడే వాళ్లు. ఆ మాను బాగుండాదా’ ఏనాటి గురుతులతో తవ్వుకొంటా అనింది బొట్టక్క.

‘ఎప్పటి మాటక్కా నువ్వు చెప్పేది. రాగవరెడ్డి కొడుకులు వెలగమానును కొట్టేసి, పొరంబోకును చదరపెట్టి వాళ్ల కయ్యల్లో కలుపుకొని పదైదుఏళ్లు అయిపొయింది’ చెప్పినాను.

‘అయ్యో అట్నా, ఆ చోటు నుంచి నేను ఈ ఇంటికి వచ్చి ఇరవయి ఏళ్లకు పైపడింది. అందుకే ఆ ఎడాటాలు (విషయాలు) ఏవీ నాకు తెలవదు’ అంటా నిట్టూర్చింది బొట్టక్క.

‘అది సరే కాని అక్కా, ఈ ఇంట్లో ఎందరు ఉంటారు, ఏమి ఈ ఇంటి వయినము’ అని అడిగాను. ఆ ఇంటి గుట్టుమట్టులను తెలుసుకోవాలనే తపనతో. నా అడకతో ఆ ఇంటికతను ఎత్తుకొనింది బొట్టక్క.

‘ఇంట్లో వాళ్లు పదిమంది ఇంటికి వచ్చిపోయే చుట్టుపక్కాలు పదిమందీ, పొద్దుకు ఇరుపదుల విస్తర్లు మడిచే ఇల్లు ఇది. పనిపాటల వాళ్లు తిరిపెము ఎత్తుకొనేవాళ్లూ ఇంకొక పదిమంది ఎట్టా ఉండనే ఉంటారు. ఇంత కాపురాన్ని ఒంటి చేత్తో ఈడుచుకొని వస్తుండే పెద్దాయన పేరు వీరారెడ్డి. పేరుకే పెద్దాయన, నిన్నమొన్ననే ముప్పయిని దాటినవోడు. ఆయన పెండ్లము పేరు ఆదిలచ్చుమమ్మ. అణకువ కలిగిన ఆలూమొగుళ్లు వాళ్లు ఇద్దరూ. పదిమంది కడుపులను నింపే ఆ తల్లి కడుపును నింపలేదు పైవాడు.

‘అట్టయితే పొద్దున ఇల్లంతా తిరుగాడతా ఉండిన ఆ నలుగురు బిడ్డలు ఎవరక్కా’ మాటకు అడ్డం పడతా అడిగాను.

వాళ్లను బిడ్డలు అంటావేంది అమ్మీ, ఒక్కొక్కడూ గాడిద మాదిర ఎదిగి ఉంటే. పెద్దోడికి పద్దెనిమిది ఏళ్లు నిండినాయి. కడగోటి ఆడబిడ్డకు పదినిండి పది నెలలు దాటింది. వాళ్లు రాజమ్మ కడుపున పుట్టినవాళ్లు. ఆది లచ్చుమమ్మకు ఆడపడుచు ఆ రాజమ్మ. వీరారెడ్డికి అక్క అవుతాది. ఈ ఇంటి పెత్తనమంతా ఆ అమ్మదే. నేను ఈ ఇంటికి వచ్చిన కొత్తలో రాజమ్మకు పెళ్లి అయింది. తెక్కబా (దక్షిణాన) ఉండే కలసపూడి అనే ఊర్లో ఇచ్చినారు ఆమెను’ చెప్పింది బొట్టక్క.

‘రాజమ్మ వాళ్ల ఇంటాయన ఈ ఊరికి ఇల్లిటము వచ్చినాడా అక్కా’

‘లేదమ్మీ, రాజమ్మే కలసపూడి కాపురానికి పొయింది. అక్కడ ఏమి జరిగిందో ఎరగము. పెళ్లయిన మూడో ఏడే చంకన ఒక బిడ్డా చేతన ఒక బిడ్డా వేసుకుని పుట్టినింటికి వచ్చేసింది. ఆయమ్మ వెనకాలనే తోకమ్మిడ నారాయణా అంటా ఆయమ్మ మొగుడు రాజిరెడ్డి కూడా వచ్చేసినాడు. అయిదు బారల ఎర్రప్రసను కోకను తుంటిదోపు (మొగుడు చనిపోయిన వాళ్లు కుచ్చిళ్లు పోయకుండా కట్టే కట్టు) కట్టుకొని, ఇంకొక కోకను చుట్టి చంకలో పెట్టుకొని వాళ్ల వెనకాలనే కన్నెమ్మ కూడా ఈ ఇల్లు కడప తొక్కింది’

‘కన్నెమ్మ ఎవరక్కో, నా కంట పడనే లేదే’ బొట్టక్క మాటకు అడ్డం తగలతా అడిగాను.

‘అయ్యో కూతురా, ఆ తల్లిని చూడలేదు అంటావు ఏంది, తెల్లవారింది మొదలుకొని రెండు కాళ్లు ఒక్క దగ్గర పెట్టుకోకుండా పరుగులు తీస్తా పది పనులూ అందుకొంటా ఉండిందే ఆయమ్మే కదా కన్నెమ్మ అంటే’ చెప్పింది.

‘అవునవును చూసినానక్కో తుంటి దోపులో ఎర్రకోకను కట్టుకొని పగలంతా నా దగ్గర్నే కదా నడుములు విరిగేటట్టు పనిచేసింది. ఆయమ్మేనా కన్నెమ్మ అంటే’ అన్నాను.

‘రయికముడి ఎరగని బతుకు కదా ఆ తల్లిది’ నిట్టూరస్తా అంటా ఉండాది అంతలోనే జాముకోళ్లు కూసినాయి. ఆ కూతను విని ‘పండుకో అమ్మీ పొద్దున్నే లెయ్యాల కదా’ ఆవరిస్తా అనింది బొట్టక్క.

నాకు కంటిమిందకు కునుకు రాలేదు. బొట్టక్క అనిన ‘రయికముడి ఎరగని బతుకు’ అన్నమాట నా కుదురును ఎడంగా పెట్టేసింది. మొగుడు చచ్చిపోయిన ఆడవాళ్లు రయికలు వేసుకోరు. ఇప్పుడంటే నాళ్లు మారిపొయి వేసుకొంటా ఉండారు కానీ అప్పటి వాళ్లు అట్టాంటివి ఎరగరు. అంతెందుకు ఈ ఇంట్లోనే మొగుడు చచ్చినవాళ్లు ఇద్దరు ఉండారు కదా. రాజక్క విడవ లేదు, కన్నెమ్మ తొడగలేదు.

తలపోతల్లో మునిగిపోయిన నేను ఎప్పుడు కునికినానో తెలవదు, ‘చేయ్‌ లెయ్యట్ట’ అన్న కసిరింపులో ఉలిక్కిపడి లేచినాను. నా పక్కనే వెచ్చంగా పండుకొని ఉండిన పిల్లి మెల్లింగా లేచి నీలిగి, మియావ్‌ అంటా అవతలకు పొయింది. పిల్లిని తరిమిన కన్నెమ్మ రెండు పొయ్యిల్లోని బూడిదను చేటలోకి తీసుకొని పొయి దిబ్బలో పోసి వచ్చింది. నాలో అడుగున మిగిలిన చేరెడు నీళ్లను పారపోసి నన్ను అట్టట్ట కడిగి, తిరిగి కుదుట్లో కూచోపెట్టింది. నా గొంతు వరకూ రెండు పంట్ల నీళ్లను తెచ్చిపోసింది. తబ్బెడు అల్లి చిదుగులనూ సందెడు సవక ఇరుగు (కట్టె) లనూ తెచ్చి నాముందు పేర్చి పెట్టింది. గూట్లోని నిప్పుపెట్టిని ఎత్తుకొని ఊగించి పుడకలు ఉండాయో లేదో చూసి దానినీ నాముందు పెట్టింది.

ఆ వెనక వెలుపలకు పొయి కసువులు కళ్లాపులు ముగించుకొని, కమికెడు ఆవుపేడను తెచ్చి పొయ్యిగడ్డను అలికింది. పొయ్యి పక్కన ఉండే వార్పు గడ్డను కూడా అలికింది. వార్పు గడ్డకు పక్కన ఉండే దాలి దగ్గరకుపొయి, దాలి కడవను దించి, దాలిలోని బూడిద కచికలను ఏరి దాగిరిలో పెట్టింది. గబ్బెడు ఆవు పిడకలను తెచ్చి దాలిలో పేర్చింది. పాల కడవను కుంకాసి గుల్లతో గీకి, నారవాకుతో రుద్ది కడిగింది. కడిగిన పాల కడవను దాలిమీద పెట్టింది.

పెద్దపొయ్యిని రగిలించి, పొయ్యి మింద మంగలాన్నిపెట్టి మంగలంలో పడి పచ్చపెసలు పోసింది. రగులుకొన్న పొయ్యిలో నాలుగు ఇరుగులను పెట్టింది. రాజమ్మ తెచ్చిన పాలముంతను అందుకొని, ముంతలోని పాలను కడవలో పోసి, పొయ్యిలోనుంచి నిప్పు కణికను ఎత్తి దాలిలో వేసింది.

మంగలం ఉడుకెక్కి పెసలు పటపట లాడినాయి. తాటితెడ్డుతో కలియపెడతా ఆ పటపటలను అణిచింది. వేగిన పెసలను పుటికలోకి వంచి, మంగలంలో ఇంకొక పడి పెసలను పోసింది. ఇట్ట ఇరస పెసలను వేయించింది.

పెసలను వేయిస్తా వేయిస్తానే నిట్టాడి పక్కన చుట్టకుదురు పెట్టి, కుదురుమీద చల్లపంటిని పెట్టింది. పంటి సన్నమూతిలో నుంచి కవ్వాన్ని లోపలకు వదిలి, కవ్వము కామకూ నిట్టాడికీ కలపతా కన్నితాడును చుట్టింది. అప్పుడు వచ్చిన ఆదిలచ్చుమమ్మ కన్నితాడును పట్టుకొని సర్రుబుర్రుమంటా చల్ల చిలికింది. చల్ల సర్రుబుర్రుపాటకు మంగలంలో కదలతా ఉండే తెడ్డు దరువు వేసింది.

ఇరస పెసలను వేయించి మంగలాన్ని దించి, అదే పొయ్యిమింద వెన్నదుత్తను పెట్టి, మంటను తగ్గించింది. సన్న మంటమింద దుత్తలోని వెన్న చిటపటలాడతా ఉంటే బయట పనోళ్లమింద రాజమ్మ పటపటలు మొదలయినాయి.

‘మోవ్‌ పొద్దన్నే పెసలకు ఏమి తొందర వచ్చింది, అంబలి కలుపు మా, తాగేసి పనులకు పోవాల కదా’ అంటా బయటనుంచి అరిచింది రాజమ్మ.

‘ఇద్దో కలపతా ఉండా’ అంటా మంగలాన్ని వార్పు గడ్డమింద పెట్టి, పెసల పుటికను బొట్ట పక్కకు చేర్చి, అంబటి బాన దగ్గరకు పొయింది. బానలో నుంచి అయిదారు పట్టెళ్ల అంబలిని పటువలోకి తీసుకొని, ఆ అంబట్లో చెంబుడు చల్లా రెండు చెంబుల నీళ్లూ పోసి, చారెడు ఉప్పు వేసి కలిపింది. రాచిప్పలోని నారదబ్బ ఊరగాయలను అపకడు ఎత్తి మూకుడులో పెట్టి రాజమ్మను పిలిచింది. వచ్చిన రాజమ్మ అంబలి పటువ మింద ఊరగాయ మూకుడును పెట్టుకొని పనోళ్లకు పోసే దానికి పెరడులోకి పొయింది.

‘అత్తా అత్తా చద్దికూడు వెయ్యత్తా’ అంటా రాజమ్మ పిలకాయలు పిలపిలమంటా చుట్టింట్లోకి వచ్చినారు. నిన్న రెయ్యి గండి అటికలో ఊరేసిపెట్టిన కూటిలో పిడికెడు ఉప్పువేసి పిసికి, నీళ్లను పిండి తట్టల్లో పెట్టి పిలకాయల ముందు పెట్టింది. పిడతల్లోకి కూటినీళ్లను వంచి నలుగురి పక్కనా పెట్టింది. పిలకాయలు కూడు తిని కూటినీళ్లు తాగి బయటకు పొయినారు. వాళ్లు తినిన ఎంగిలి తట్టలను కడిగి దబ్బిళించి (బోర్లించి), తిరగలి దగ్గరకు వచ్చింది.

బొట్ట పక్కన ఈతాకు చదురును (చాపలాగా చిన్నదిగా నలుచదరంగా అల్లినది) పరిచి, దానిమింద తిరగటి రాళ్లను ఎత్తి పెట్టింది. పక్కనే పెసలపుటికను పెట్టుకొనింది. పైరాతి కుడి గూబ్బి తొలి (రంధ్రము) లో చ్‌… చ్‌… చ్‌… అంటా పిడిని కొట్టింది. తిరగటి వాయిలో పెసలను పోస్తా చుట్టు చుట్టుకూ ఎడమగుబ్బను లేపతా విసరతా ఉంటే, పెసలు బేడలయి చదురు మింద చలచల రాలినాయి.

అడ్డెడు పెసలను విసిరి లేచింది కన్నెమ్మ. మిగిలిన పెసలను పుటికలోనే ఉండనిచ్చి, బొట్ట పక్కన ఉండే దొంతి గుడువమింద పుటికను పెట్టింది. తిరగలి రాళ్లను ఎత్తి బొట్టసందుకు తోసి, చదురులోని బేడలను చేటలోకి ఎత్తుకొనింది. చదురును విదిలించి చుట్టి, చూరుగోడమింద పెట్టింది. చేటలోని బేడలను కొద్ది కొద్దిగా చొళవ (మూతి సన్నగా ఉండే చేట) లోకి తీసుకొని చెరిగి పొట్టు ఎగరకొట్టింది. చెరిగిన పప్పును ఒక పటువలోకి ఎత్తి పటువమింద సిబ్బిని మూసింది.

పొయ్యిమింద కాగిన నేతి దుత్తను ఎత్తి ఉట్టిమింద పెట్టి, పొయ్యిని రగిలించి కూడి కడవలో ఎసరు పెట్టింది. ఎసరు మరిగే లోపల రెండు పడుల బియ్యాన్ని నీళ్లలో పోసి కడిగి, గాలించింది. నానిన బియ్యాన్ని ఎసట్లో పోసింది. చిన్నపొయ్యిని ముట్టించి, దానిమింద పప్పుచట్టిని పెట్టి, చట్టిలో తవ్వెడు పెసలపప్పునూ గుప్పెడు ఎండు మిరపకాయలనూ అరచేరెడు దనియాలనూ వేసి, తపిలెడు నీళ్లను పోసింది. రెండు ఎరగడ్డ (ఉల్లిపాయ) లను తరిగి పప్పులో వేసింది.

కూటి ఎసరు నురుగు కడతా ఉండగా ఆ చిట్టుడుకు నీళ్లను నిలువు చెంబులోకి ముంచుకొని, చిటికెడు ఉప్పు కలుపుకొని ఊదుకొంటా తాగింది. అర ఉడుకు ఉడికిన కూటిలో అరతపిలెడు కలినీళ్లను పోసింది. ఉడికిన కూటి కడవను దించి వార్పుగడ్డమింద పెట్టింది. వార్పు గడ్డకు దిగువన కుదుట్లో గంజివార్పు అటికను పెట్టి, కూటి కడవ మింద జల్లి మూకుడును మూసి, కడవకు అటిక మిందకు వార్చింది. జల్లిమూకుడు జారకుండా ఆనుకొయ్యను నిలపెట్టింది.

కూటి కడవను దించిన పొయ్యిమింద సంగటి కడవను ఎక్కించి, ఎసరు పెట్టి, ఎసట్లో పుంజెడు తైదు పిండిని విదిలించింది. పడి నూకలను గాలించి, పొంగువచ్చిన ఎసట్లో పోసింది. చిన్నపొయ్యి మింద ముక్కాలు వాసి ఉడికిన పప్పులో గుప్పెడు మావిడి వరుగును వేసి, మూకుడును ఓరగా మూతపెట్టి, మంటను తగ్గించింది. అరవాసి ఉడికిన నూకలకడవలో రెండు పడుల తైదుపిండిని పోసి, మూకుడుతో మూసింది.

ఉడికిన పప్పును దించి, చేరెడు ఉప్పు చిటికెడు పసుపూ వేసి ముద్దకవ్వం (పప్పు గుత్తి) తో ఎణిపింది. ఎణిగిన పప్పులో నిలువు చెంబుడు నీళ్లు పోసింది. పొయ్యిమింద తిరుగపోత అటికనుపెట్టి, అడుగుకాలిన అటికలో అంతే కొంచెం చమురును విడిచి, పుడిసెడు వడిమిని చమురులోకి వదిలింది. చిటపటమని వడిమి వేగిన వెనుక రెండు రెబ్బల కరింపాకును దూసి వేసి పప్పును తిరుగపోసింది.

సంగటి కడవ మింది మూతను తీసి, ఉడికిన పిండిని తెడ్డుతో బాగా కెలికింది. అత్తి కొయ్యతో చేసిన సంగటి పలకను నేలకు వాల్చి కడవను పలక పక్కన్నే పెట్టుకొనింది. మరిగిన పప్పుపులుసు చట్టిని దించి వార్పు గడ్డమింద పెట్టి, కూటికడవను వార్పులేపి పులుసు చట్టి పక్కనే పెట్టింది. రెండు పొయ్యిల్లోని ఇరుగులను ఆరిపింది.

సంగటి బొప్పిని (టేబుల్‌ టెన్నిస్‌ బేట్‌ లాగా ఉంటుంది) ఎత్తుకొని, అపకను అందుకొని సంగటి కడవ దగ్గరకు పొయింది. గొంతు కూచుని, అపకతో కడవలోని సంగటిని ఎత్తి బొప్పిలో వేసుకొని చేతితో తడతా ముద్దలు కట్టింది. కట్టిన ముద్దలను సంగటి పలక మింద పేర్చింది.

రాచిప్పలోని చింతకాయ తొక్కును ఎత్తుకొని, నాలుగు ఎండు మిరపకాయలను పొయ్యి నిప్పుల్లో కాల్చుకొని, వాటి రెండిటినీ సనికిలి మింద పెట్టి నూరి, ఆ ఊరుపిండిని పిడతలోకి తీసుకొనింది.

కాపుకూటి పొద్దుకు కడుపులు పట్టుకొని వచ్చిన పదిమందికీ పదిముద్దలు పెట్టి, తట్టలు చెంబులు తోమిపెట్టి, తానూ అంత ముద్దను తినింది కన్నెమ్మ. అప్పుడు అయినా అంతసేపు కునుకుతాది ఏమో అని చూసినాను. ఆ తల్లికి అంత తీరిక ఉన్నట్టు లేదు. నా బతుకు మాదిర తీరికలేని బతుకే ఉన్నట్టు ఉండాది ఆయమ్మది కూడా.

అణగపెట్టి ఉంచిన మోదగ ఆకులను ముందర వేసుకొనింది. ఎండపెట్టి సన్నగా చీల్చుకొన్న చీకర పుల్లలను కూడా తెచ్చిపెట్టుకొనింది. ఆకు మింద ఆకు పెట్టి, పుల్లతో చిటుక్కుమని పొడిచి, పుల్లను పటుక్కుమని విరిచి… ఆకులను కుట్టడం మొదలుపెట్టింది.

వాములను తిరిగి తిరిగి వాయినీ కసువులను గిలికి గిలికి కడుపునూ నింపుకొన్న కోళ్లు మాపుసేపున మేపులు చాలించి గూళ్లకు మళ్లినాయి. కన్నెమ్మ కూడా కుట్టిన ఆకుల్ని తిరగటిరాయికింద అణగపెట్టి, విడి ఆకుల్ని ఎనుపుడు తట్టలోకి ఎత్తిపెట్టి లేచింది. పుంజెడు ముగ్గుపిండితో బెళుకు (దీపం) బుడ్ల మసిని తుడిచింది. చుట్టింట్లో ఒకటీ నట్టింట్లో ఒకటీ బెళుకులను వెలిగించి దిమ్మలమింద పెట్టింది. కోళ్లను పట్టి గంపల కింద కప్పి పెట్టింది. పిల్లులు గంపలను తోయకుండా ఉండేదానికని గంపలమింద బొంతరాళ్లను పెట్టింది.

పొయ్యి ముట్టించి ఎసరుపెట్టి కూడు వండింది. చింతపండును పిసికి, జిలకర మిరియాలను నూరి, ఎచ్చిపచ్చిగా నాలుగు తెల్లపాయలను దంచి, అన్నీ కలిపి చట్టెడు చారు కాసింది. పొద్దు మునిగినాక అందరకూ తలా అంత ముద్ద పెట్టి, కుక్కకు పిల్లికి కడుపుమంట చల్లార్చి, అప్పుడు ఆయమ్మ ఒక్క పిడచ కూటిని నోటికి వేసుకొనింది. లచ్చుమమ్మా రాజమ్మా, పైపనులూ కయ్యపనులూ చూసుకొనే సాకుతో చుట్టింటి తట్టుకే రావడము లేదు. కన్నెమ్మకి మటుకు ఈ చుట్టిల్లే కైలాసంగా ఉండాది. కుండా చట్టీ ఎగకట్టిపెట్టి ఆయమ్మ కునికేసరికి ఈ ఇల్లేకాదు ఊరే గురకలు పెడతా ఉండాది. ఊరి గురకు రెయ్యికోళ్లు (కీచురాళ్లు) వంతపాడతా ఉండాయి.

‘ఆయమ్మ ఏందక్కా ఆ మాదిరిగా నడుములు యించుకొంటా ఉండాదే’ అచ్చెరపోతా అన్నాను బొట్టక్కతో.

‘అమ్మీ ఈ ఒక్కనాటికీ అట్ట అంటా ఉండాదే, ఇరవయి ఏళ్లుగా ఆ తల్లి అట్ట చేస్తానే ఉండాది. పైగా సూటిపోటు మాటలను పడతానే ఉండాది’ అనింది బొట్టక్క.

‘ఆయమ్మను ఎవరక్కా అట్ట మాట్లాడేది’ వెక్కస పడతా అన్నాను.

‘ఎవరంటే రాజమ్మ కదా. ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ అయిదారు ఏళ్ల ముందు వరకూ కూడా కన్నెమ్మను దెప్పి దెప్పి పొడస్తానే ఉండింది రాజమ్మ. ఎప్పుడన్నా ఒకనాడు ఒళ్ళు సరిలేక పని రవంత జాగు అయితే చాలు, ఏమి తల్లీ ఆ చాకలి సొలుపు ఇంకా తీరలా, అంటా కసిగా తిట్టేది రాజమ్మ. ఆ మాటను విన్నప్పుడు కన్నెమ్మ నా చాటుకు వచ్చి వలవల ఏడిచేది. ఆ తిట్టును నా బొట్ట చెవులతో ఎన్ని నూర్ల తూర్లు విన్నానో నాకే తెలవదు’ చెప్పింది బొట్టక్క.

‘నేను ఆపొద్దు పెరట్లో ఉండినాను. కడవలు చట్లు ముందరవేసుకొని కసువూ బూడిదా కలిపి మమ్ముల్ని తోమతా ఉండాది కన్నెమ్మ. అంతకు ముందునాడు నిప్పట్లు (అరిసెలు) కాలస్తా ఉండగా చమురు చింది చెయ్యిబొబ్బలు ఎక్కి ఉండాది కన్నెమ్మకు. ఆ బొబ్బల చేతిని ఊదుకొంటానే తోమతా ఉండాది మమ్మల్ని. ఏ చట్టి కావలసి వచ్చిందో బిరబిర పెరట్లోకి వచ్చిన రాజమ్మ, ఇంకా తోమతోనే ఉండావా నీకు ఆ చాకలి సొలుపు తీరితే కదా, అని విసురుగా అనింది. ఆ పక్కనే నిలబడి ఉండిన రాజిరెడ్డిని చూడలేదు రాజమ్మ. ఆ మాటలు రాజిరెడ్డి చెవిన పడినాయి.

ఎంత కావరమే నీకు, అంటా గబుక్కున పెండ్లాము దగ్గరకు వచ్చి చెంపక పట్టి ఒక్కటి పీకినాడు రాజిరెడ్డి. అంతే రాజమ్మ పెద్దంగా ఏడస్తా, చేసిన లంజరికాలు చేసినోళ్లు ఏమో పున్నపూసలాగా (అమాయ కంగా) ఉండిపోయినారు. తీరుగా బతకతా ఉండే నాబోటి దానికే కదా తన్నులూ పెట్లూ, అంటా లోపలికి పోయింది. తూ, నీకు చావు కూడా రాలేదేమే ముండా, అని అక్కమింద ఊసేసి రాజిరెడ్డి కూడా ఇంట్లోకి పొయ్యేసి నాడు. ఆ పొద్దు కన్నెమ్మ కార్చిన కళ్లనీళ్లతో నా ఒళ్లు కడుక్కొన్నాను’ నిప్పట్ల పలక మా మాటల నడుమ దూరుతా అనింది.

‘రాజిరెడ్డి బతికి ఉండినన్నాళ్లు రాజమ్మ అట్నీ చేసింది. మొగుడు చచ్చి పొయిన వెనుక కొంచెం తగ్గింది కానీ ఇప్పుడు కూడా ఇర్లనాటికో వెల్లనాటికో (అమావాస్యకో పౌర్ణమికో) ఒకసారి దెప్పతానే ఉంటాది’ అంబటి తెడ్డు అందుకొనింది.

‘రాజిరెడ్డి ఎప్పుడు చచ్చిపోయినా డక్కా’ అడిగాను నేను.

‘ఆయన చచ్చిపొయ్యి తొమ్మిదేళ్లు దాటింది అనుకొంటా’ అనింది దొంతి గుడువ.

‘అవునవును అప్పుడు ఆయన కూతురుకు ఏడాది నిండి ఉండాది అంతే. అబ్బ… ఒగ్గాళపు చావు అంట కదా అది’ అంగలార్చతా అనింది రోకటిబండ.

‘ఆ మందల (విషయం) నన్ను చెప్పనియ్యండి. రాజిరెడ్డి చచ్చిపొయిన పదోనాడు అమ్మలక్కలు నలుగురూ తాళువారము (వరండా) లో కూచుని ఆ చావును గురించి చెప్పుకొంటా ఉంటే వినిన దానిని నేను’ అడ్డం వస్తా అనింది అలికిన చేట.

‘చెప్పు చెప్పు’ అంటా గోజారింది ఊదరబుర్ర.

‘అంతకు ముందు నాలుగయిదు ఏళ్లుగా రాగవరెడ్డి వాళ్లకీ రాజిరెడ్డికీ కయ్య (పొలం) ఎల్లరాయి దగ్గర తగువు రగలతా ఉండింది. రాగవరెడ్డి కొడుకులకు ఏడలేని ఆబ. నేలంతా వాళ్లకీ కావలనేది వాళ్ల మిడిమేలపు కోరిక. అప్పటికి వీరారెడ్డికి పెళ్లి కాలేదు అనుకొంటాను….’

‘అనుకొనేది ఏంది అమ్మీ. రాజిరెడ్డి చచ్చిపోయిన రెండేళ్లకు కదా వీరారెడ్డికి పెళ్ళయింది. అప్పటికి ఇరవయి రెండో ఇరవయి మూడో ఉండి ఉంటాయి వీరారెడ్డికి’ చేట మాటకు అడ్డం తగలతా చెప్పింది తిరగలి.

‘అవునక్కా, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాల. రాజిరెడ్డి ఈ కడప తొక్కి వచ్చేటప్పటికి పసి పిలగాడుగా ఉండాడు వీరారెడ్డి. రాజిరెడ్డి వచ్చిన ఏడాది లోపల్నే వీరారెడ్డి వాళ్ల నాయన తీరిపోయినాడు. మగదిక్కులేని కాపురాన్ని ఎద్దు మాదిర కదా ఈడిచింది ఆ రాజిరెడ్డి’ అటకమింద నుంచి వంత పలికింది ఇత్తడి బిందె.

‘ఆన్నెనక (తరువాత) ఏమి అయ్యిం దో చెప్పచేటక్కా’ బతిమాలినాను నేను.

‘ఏమయింది అని అడగతా ఉండావా కూతురా, అవకూడనిదే అయింది. వీరారెడ్డి వాళ్లు పుంజి కయ్యను కలిపేసుకోవాలని నూరారు తీర్లుగా కడంగి (ప్రయత్నించి) నారు రాగవరెడ్డి కొడుకులు. రాజిరెడ్డిని ఎదిరించి ఆ పనిని చేయలేక పోయినారు. ఒకనాడు వరదయ్యపాళెంకుపొయి పనిచూసుకొని పొద్దుపొయిన వెనుక ఊరికి తిరుక్కోన్నాడు రాజిరెడ్డి. గూడలోరి పాళెం దాటినాక వస్తాదే చిట్టడివి, ఆ అడవిలో కాపు కాసినారు రాగవరెడ్డి కొడుకులు. ఇది ఎరగని రాజిరెడ్డి ఆ చీకట్లో అడివితోవ ఎక్కినాడు. అంతే అడివిలోనే రాజిరెడ్డిని మట్టగించేసినారు. ఆ ఒగ్గాళాన్ని వింటా ఉంటేనే నాకు ఒళ్లు జలదరించిపొయిందమ్మా. మూతినంతా మొచ్చుకత్తితో చెక్కేసినారంట. గుండెలమింద గడ్డపారతో పొడిచిన పోటు, పిడికెడంత తూటు అయి పడిందంట. గొడ్డళ్లతో కీలుకీలూ నరికినారంట…

‘చాలక్కో చాలు, ఇంక నేను వినలేను’ అంటా అడ్డం పడినాను నేను.

‘అమ్మలక్కలు ఈ చావును గురించి మాట్లాడుకొనేటప్పుడు చేటతోపాటు నేను కూడా అక్కడే ఉండినాను. మీరు నమ్మినా, నమ్మక పోయినా ఒక మాట మటుకు చెప్పాల. నన్ను చేతపట్టుకొని బియ్యం జల్లిస్తా ఉండిన కన్నెమ్మ ఆ మాటల్ని వింటా లోలోపలే నవ్వు కొనింది. నవ్వి ఊరుకోలేదు, చేసు కొన్నోళ్లకు చేసుకొన్నంత అని మెల్లిగా గొణుక్కొనింది’ బియ్యం జల్లెడు అందుకొని అనింది.

‘అవును, తమ్ముడు చచ్చిపోయినాడు అని తెలిసినప్పుడు, నలుగురికోసం నారాయణా అంటా నాలుగుబొట్లు కార్చింది కానీ ఆయమ్మ గుండెలు బాదుకొని ఏడవలేదు’ మూలన నిలబడి ఉండే చింకిచాప పలికింది.

‘ఆ తల్లి ఉల్లములో ఏమి దాపరికాలు ఉండాయో ఎవరికి ఎరుక’ నిట్టూరస్తా అనింది బొట్టక్క. ఆ మాట తరువాత కొంచెంసేపు ఎవరమూ ఏమీ మాట్లాడలేదు. అలికిడే లేని ఆసేపులో చిమట ఈల మటుకు గియ్యిమంటా ఉండాది. నా కడుపులో పంటెడునీళ్లు ఒదిగి ఉన్నట్టు ఆ తల్లి కడుపులో ఎన్ని గుట్లు అణిగి ఉండాయో!

‘ఆ దాపరికము నాకు తెలుసును తల్లులారా, ఇంక నేను దాచలేను, నా గుండెలు పగిలిపోతా ఉండాయి, నేను చెప్పేస్తాను అమ్మల్లారా’ అంటా ఏడుపు గొంతుతో ఎలుగెత్తింది సోరణం (కిటికీ) దగ్గర ముడుచుకొని పండుకొని ఉండే రాగి చెరవ.

ఆ అరుపుతో ఉలిక్కిపడి సోరణం పక్కకు చూసినాను. సోరణంలోనుంచి చుక్కలవెలుగు చొచ్చుకొని వచ్చి ఆ చెరవమింద పడతా ఉండాది. మసక వెలుగులో ఒళ్లంతా చొట్టలు పడిన ఆ చెరవ వడవడ వణకతా కనిపించింది నాకు. రవంతసేపటికి తెపరాయించుకొని గొంతు విప్పింది చెరవ.

‘అమ్మల్లారా మీకు అందరికీ నేను ఎవరో తెలుసు. అయినా కొత్తగా వచ్చిన ఆ పొంత కడవ కోసం చెప్తా ఉండాను. అమ్మీ కలసపూడి నుంచి కన్నెమ్మతోపాటు వచ్చిన దానిని నేను. కలసపూడికి పదిమైళ్ల దవ్వులో కంచి ఉంటాది. ఆ ఊరివాళ్లు మంచికీ చెబ్బరకీ కంచికే పోతారు. కన్నెమ్మకు రెండేళ్ల ఈడు అప్పుడు ఆ బిడ్డకు గజ్జెలు కొనాలని కంచికి వచ్చి, గజ్జెలతో పాటు నన్నూ కొని కలసపూడికి తీసుకొని పొయినారు వాళ్ల పెద్దవాళ్లు. ఆ పొద్దునుంచీ కన్నెమ్మ బతుకును చూస్తానే ఉండాను నేను.

కన్నెమ్మ పుట్టిన రెండేళ్లకు పుట్టినాడు రాజిరెడ్డి. ఈ పాడు కాపు కొంపల్లో పనికిమాలిన వాడుక ఒకటి ఉండేది. సొత్తులు పోతాయని ఎన్ని ఏళ్లయినా కనిపెట్టుకొని ఉండి మేనరికాలే తీసుకొనేవాళ్లు. కన్నెమ్మకు ఎనిమిదోఏట వాళ్ల మేనమామతో పెళ్లి అయిపొయింది. అప్పుడు పెళ్లికొడుకు ఈడు ఎంత అనుకొన్నారు, ముప్పయికి దగ్గర పడతా ఉండాది.’

‘అయ్యయ్యో ఆ తల్లిదండ్రులకు ఎట్ట ఒప్పిందమ్మా’ తాప్పర (బాధ) పడతా అనింది అంబటి బాన.

‘అప్పుడే ఏమయింది అక్కా, ఇంక ముందు జరిగింది వినండి. పెళ్లి అయిన రెండో నెలలో కయ్యల్లోకి కాపలాకు పొయిన కన్నెమ్మ మొగుడిని కట్టిడిపాము కరిచేసింది. ఊరు కన్ను తెరిచే పొద్దుకు ఆయన కన్ను మూసేసినాడు. తెల్లవారేటప్పటికి కన్నెమ్మ బతుకు తెల్లవారిపొయింది.

మొగుడు చచ్చి పడుంటే ఏడవవు ఏమే ముండా అంటా వచ్చిన చుట్టరాలు అంతా ఒకటి మొట్టింది ఆ బిడ్డను. ఆ ఈడులో మొగడంటే చావంటే ఏమి తెలుస్తాది. ఒక్కొక్క దెబ్బకూ ఎక్కిళ్లుపెట్టి ఏడిచింది. అన్నిటికన్నా గోడు పదమూడోనాడు జరిగింది తల్లుల్లారా, ఆ మందలను ఈ పాడునోటితోనే చెప్పాల్సి వస్తుండాది. ఎనిమిదేళ్ల కన్నెమ్మకు పెద్ద ముత్తయిదువ మాదిర పసుపుకుంకుమలు పూసి, పచ్చపసను కోకను కట్టి, చేతుల నిండా గాజులు తొడిగినారు. ఇదంతా ఒక ఆట అనుకొనింది ఏమో, కన్నెమ్మ కిలకిలా నవ్వింది. ఆ నవ్వులను విని చుట్టపక్కాలు గోడుగోడున ఏడిచినారు.

మడేలు చెంగన్న మడుగులు పరుస్తా ఉంటే ఆ మడుగుల మింద నడిపించుకొని ఏటి దగ్గరకు తొడకొని పొయినారు కన్నెమ్మను. నేను కూడా ఆ గుంపులోని ఒకరి చేతిలో ఉండినాను. మడుగులు పరిచేటప్పుడు చెంగన్నకు తోడుగా ఆయన కొడుకు మురుగడు కూడా ఉండినాడు. నూనూగు మీసాల ఈడు ఆ మురుగడిది. కన్ను ఆర్పకుండా కన్నెమ్మనే చూస్తా మడుగులు పరిచినాడు మురుగడు.

ఆ ఏటికట్టమింద ఎర్రటి ఎండలో కూచోపెట్టి, నలుగురు ముండమోపులు కలిసి కన్నెమ్మను ముండమొయించినారు. అప్పుడు ఏడిచింది గుక్కపట్టి ఆ బిడ్డ. ఆ ఏడుపు విని ‘పారే ఏరే కొంచెంసేపు నిలిచిపోయింది’ చెప్తా ఉండే చెరవ గొంతు కొతుకుపడి నిలిచిపొయింది. వింటా ఉండే మా గుండెలు అలిసిపొయినాయి. ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపొయినాము అందరమూ. తెప్పరిల్లిన చెరవ మరలా చెప్పడం మొదలుపెట్టింది.

‘కన్నతల్లి బతికినన్నినాళ్లూ కన్నెమ్మను కడుపులో పెట్టుకొని సాకింది. అబ్బమటుకు ఎదురుపడినప్పుడు అంతా చీ పక్కకుపోయే ముండా అని కసిరేవాడు. పూజలు (డిజైన్‌) లేని కారికం గుడ్డతో కుట్టించిన రెండుపావళ్లు రెండు రయికలతో ఏడు గడిచిపొయ్యేది కన్నెమ్మకు. పగలు పొద్దుగూకులూ చుట్టింట్లో ఒక మూల ఒదిగి కూచుని ఉండేది. బయటకు పోవాలని ఉండినా ఎవరు ఏమి అంటారు అని వణికి చచ్చేది.

కసి తీర్చుకొనేదానికే కన్నెమ్మను పుట్టించినట్టు ఉండాడు ఆ కసుమాళపు కడవలి (దైవం). కన్నెమ్మ తొలిముట్టుకు మూడునెలల ముందు కన్నతల్లిని పోగొట్టుకొనింది. ఇంకొక మూడునెలలకు మారుతల్లి ఆ ఇంటికి వచ్చింది. వస్తానే కన్నెమ్మ చేత ఎర్రకోకను కట్టించి, రయికను విప్పించింది. అప్పుడు ఎడమయిపొయిన రయిక మరలా ఆయమ్మ ఒంటిని తాకనే లేదు.

పాముపడగ నీడలో కప్ప బతికినట్టు బతికింది మారుతల్లి ఒడిలో కన్నెమ్మ. కూచుంటే తప్పు, నిలబడితే తప్పు, నోటినిండా నవ్వితే తప్పు, గొంతెత్తి మాట్లాడితే తప్పు, కడుపుకు కావలసింది అంత తింటే తప్పు, కన్నారా కునికితే తప్పు. ఇట్నే నాళ్లు గడిచినాయి, ఇట్నే ఏళ్లు గడిచినాయి.

చితచితమనే చిత్తవాన తరి(కాలం)లో ఒకనాడు, గుడ్డలమూటను మోసుకొని పోతాపోతా కాలుజారిపడి సడుగును విరగకొట్టుకొనింది చాకలివాళ్ల చెల్లమ్మ. తల్లిపనిని తలకు ఎత్తుకొన్నాడు మడేలు మురుగడు. ఇది జరిగినప్పటికి మురుగడికి ముప్పయి దాటి ఉండాయి. కన్నెమ్మ కాలువాసి (పావువంతు) బతుకును కడతేర్చుకొని ఉండాది. కన్నెమ్మ తమ్ముడయిన రాజిరెడ్డికి పెళ్లయి, రాజమ్మ తొలిచూలు మగబిడ్డడిని కని మలిచూలు కానుపుకు పుట్టినింటికి పొయి ఉండాది.

పొద్దు గూడును సరుదుకొంటా ఉండగా చలవగుడ్డల మూటను మోసుకొని రాజిరెడ్డి వాళ్ల ఇంటికి వచ్చినాడు మడేలు మురుగడు. కయ్యల్లోకి పొయిన కన్నెమ్మ మారుతల్లి అప్పటికి ఇంకా ఇల్లు చేరలేదు.

అమ్మా చలవగుడ్డలు వచ్చినాయి వచ్చి ఎంచుకోండి, తాళువారములో మూటను దించతా పిలిచినాడు మురుగడు. ఆ కూత కన్నెమ్మ చెవిన పడింది. పడమ టింట్లో ఉండిన కన్నెమ్మ తాళు వారములోకి వచ్చింది. కవురు కవురు చీకటిలో రయికముడి ఎరగని కన్నెమ్మని చూసి వెప్పరపొయినాడు మురుగడు. గుడ్డుల లెక్కను కూడా చూడకుండా గిరుక్కున తిరుక్కొని పొయ్యేసినాడు. అన్నెనక ఎట్ట జరిగిందో తెలవదు కానీ కొన్నాళ్లకు వాళ్ళ ఇద్దరికీ ఒద్దిక కుదిరింది.

‘అయ్యో కూతురా, మడేలుకు ఒళ్లు అప్పగించేసిందా కన్నెమ్మ’ వెక్కసంగా అనింది ఊదరబుర్ర.

‘ఒసే ముయ్యే. మనుసులు నిన్ను ఊది ఊది, వాళ్ల లోపలి కువ్వాళం అంతా నీలో చేరిపొయినట్టు ఉండాది. మడేలు అయితే ఏమి మనిసి కాడా’ కనలుగా పలికినాను నేను. పోతయ్య చెయ్యి తగిలేదాకా నా బతుకు కూడా అట్టాంటిదే కదా. ఒంటిబతుకు బతికినవాళ్లకు తెలుస్తాది ఆ అగచాటు ఏందో.

‘అది కాదులే అక్కా, అంత చొక్కం (పవిత్రం)గా ఉండిన తల్లి మలుకువ (అపవిత్రం) అయిపోయిందే అని అట్ట అన్నాను’ మాటను వెనుకేసుకొస్తా అనింది ఊదరబుర్ర. దానితో నాకు ఒళ్లు మండిపొయింది.

‘చా చా ఇంత అగడుగా మాట్లాడతా ఉండావే, నీది ఏమి బతుకు. అవునులే ఇనుముకు అంతకన్నా మంచి మాటలు ఎట్ట వస్తాయి’ చీదరింపుగా అన్నాను.

‘అమ్మీ నువ్వు గమ్మునుండు. దాని నోరే అట్టాంటిది. ఎప్పుడూ మనుసుల నోర్లలో నోరుపెట్టి ఉంటాది కదా. అందుకే దాని నోరు కూడా మనిసినోరు మాదిర అయి పొయింది. దానిని మేము ఎవరమూ పట్టించుకోము. నువ్వు పట్టించుకోవద్దు’ అంటా నన్ను అమతి (శాంత) పరిచింది బొట్టక్క.

‘ఏందక్కా గమ్మున ఉండేది. అన్నేళ్లు ఒంటిబతుకు బతికిన ఆ తల్లికి అంత తోడు దొరికిందిలే అనుకోకుండా కారుకూతలు కూస్తా ఉండాదే అది’ అంబటి బాన నా కనలును అందుకొంటా అనింది.

‘తల్లుల్లారా తప్పయిపొయింది, మన్నించండి అమ్మా’ అని వేడుకొనింది ఊదరబుర్ర.

‘అన్నెనక ఏమయిందో చెప్పక్కా’ అడిగింది ఉట్టిమింద నుంచి వెన్నదుత్త, ఆ అడకతో కన్నెమ్మ కతను తిరిగి అందుకొనింది చెరవ.

‘ఆయమ్మ బతుకులోకి ననకారు (వసంతం) వచ్చింది అక్కల్లారా. రెయ్యి ఊరంతా మాటుమణిగిన వెనుక తూకు వెళుకు (హరికేన్‌ లాంతర్‌)ను చేతపట్టుకొని బయలుదేరేది కన్నెమ్మ. ఊరికి వక్కణపు తట్టు ఉండే యాగాతమ్మ గుడి కాడకి పొయి, ఆ తల్లికి మొక్కి, ఆ తల్లి దగ్గర ఉండే గాజులను వేసుకొని, బొట్టు పెట్టుకొని, మురుగడు తెచ్చి ఇచ్చిన గజ్జెలను కాళ్లకు తగిలించుకొని, గల్లుగల్లుమంటా నడిచి అక్కడికి దాపునే ఉండే చిట్టడివిలోకి పొయ్యేది. ఆ అడివిలో ఉండే పెద్ద మర్రిమాను కింద మురుగడు కాచుకొని ఉండేవాడు. కన్నెమ్మ నేరుగా మర్రిమాను దగ్గరకు పొయి, వెళుకును తగ్గించి కిందపెట్టి, మాను తొర్రలో దాచిపెట్టిన గోగునార పట్టలను తీసి కింద పరిచేది. మర్రిమాను కింద ఆ గబ్బు చీకటిలో మురుగడి పక్కన చేరి ఒళ్లంతా వెలుగును నింపుకొనేది కన్నెమ్మ.’

పోతయ్య కాలుచేతులు తగిలిన ఆ రెండునాళ్లు గురుతుకు వచ్చి నిలువెల్లా పులకరింత పుట్టింది నాకు.

‘ఈ కత అంతా నీకు ఎట్ట తెలుసక్కా’ అటకమింది ఇత్తడిబిందె అడిగింది.

‘అడివిలో జరిగిన ఈ కతకు కనుకాపు (సాక్షి) తూకు వెళుకు. పగటిపూట ఆ వెళుకే అంతా చెప్పేది నాకు’ – మారుపలికి మరలా కతలోకి పొయింది చెరవ.

‘ఇట్టనే ఆరేడు నెలలు గడిచినాయి. కానుపుకోసం పుట్టినింటికి పొయి ఉండిన రాజమ్మ మూడునెలల కొడుకుతో కలసపూడికి వచ్చింది. అప్పటికే పొక్కిపోవిడి (వదంతి) ఒకటి ఊరంతా పొక్కి ఉండాది. ఊరివేలుపు యాగాతమ్మ నడిరెయ్యిలో గజ్జెలు కట్టుకొని తిరుగుతా ఉండాదంట, ఎవరూ రెయ్యిపూట ఇల్లుదాటి బయటకు పోకూడదంట అనే పోవిడి అది. మడేలు మురుగడే ఆ పోవిడిని పుట్టించినాడు. దానితో పొద్దుగూట్లో పడీ పడక ముందే ఊరి తలుపులు మూతపడిపోతా ఉండాయి.

పుట్టింటినుంచి తిరిగి వచ్చిన రాజమ్మకు కన్నెమ్మను చూస్తానే ఏదో అరగలి (సందేహం) కలిగింది. ఎందుకంటే కన్నెమ్మ మొకంలో అంతకుముందు ఎప్పుడూ లేని ఒక మెరుపునూ ఒక సొలుపు (పారవశ్యం)నూ రాజమ్మ చూసింది. ఆడది కదా, అందులోనూ మగతోడు ఎరిగిన ఆడది. నాలుగోనాటికే గుట్టును కనిపెట్టేసింది రాజమ్మ. వెంటనే మొగుడి చెవిలో తన అరగలిని ఊదేసింది.

ఇదేందో తేల్చుకోవలసిందే అనుకొన్నాడు రాజిరెడ్డి. ఒకనాడు వాడుకగానే నడిరెయ్యిలో లేచి తూకువెళుకును ఎత్తుకొని బయలుదేరింది కన్నెమ్మ. అక్కకు అరగలి రాకుండా వెంటపడినాడు రాజిరెడ్డి. మర్రి మాను వరకూ పొయి జరిగింది చూసేసి వెనుతిరిగినాడు. ఇంత గొప్ప కాపురంలో పుట్టి చాకలివాడికి కొంగు పరస్తాదా ఈ లంజముండ అనుకొని ఉడికిపొయినాడు. కనలుతో రగిలిపొయినాడు. అయితే ఆ పొద్దు అంతా ఏమీ ఎరగనట్టు ఉండి పొయినాడు.

రెండోనాడు గడ్డపారను చేతపట్టుకొని మర్రిమాను దగ్గర చీకట్లో కాపు కాసినాడు. నడిరెయ్యి దాటిన వెనుక మురుగడూ కన్నెమ్మా మాను కిందకు వచ్చినారు. ఆ పొద్దు మురుగడు కంచి నుంచి జిలేబిపొట్లం తెచ్చినాడు. జిలేబిని ఒకరికొకరు తినిపించుకొంటా ఉండారు. అదిచూసి ఇంక నిలవలేకపొయినాడు రాజిరెడ్డి. వెనుకనుంచి వచ్చి మురుగడి వీపులో ఒక్కపోటు పొడిచినాడు.

ఆ పోటుకు వెర్రికేకపెట్టి అట్నే ముందుకు ఒరిగిపొయినాడు మురుగడు. ఆ పొద్దులో అక్కడ తమ్ముడిని చూసిన కన్నెమ్మ వెలవరపొయింది. వెంటనే తెపరాయించుకొని ‘ఆయన్ను వదిలెయ్యి తమ్ముడా’ అని బావురుమంటా రాజిరెడ్డి కాళ్లను చుట్టేసింది. ‘చీ పో లంజా’ అంటా అక్కని విదిలించి కొట్టి, మురుగడిని ఇంకొకపోటు పొడిచినాడు. మూడోపోటుకు మురుగడిని మట్టగించేసి, వెళుకును ఎత్తుకొని కన్నెమ్మ జుట్టు పట్టుకొని బరబర ఈడుచుకొంటా ఇల్లు చేరినాడు రాజిరెడ్డి.

రెయ్యి మర్రిమాను కింద, యాగా తమ్మ మడేలు మురుగడిని పొడిచి చంపేసిందంట అనే పొక్కిపోవిడి ఊరంతా గుప్పుమనింది. దానిని రాజిరెడ్డే పుట్టించినట్టు ఉండాడు. ఏమీ ఎరగనట్టు ఆ వెనుక పదినాళ్లకు ఆ ఊరును విడిచి ఈ ఊరు చేరుకొన్నాడు రాజిరెడ్డి. ఆ పొద్దు నుంచి ఈ పొద్దు దాకా ఆయమ్మ బతుకు పొంత కడవ బతుకయి, ఈ ఇంటికి ఊడిగం చేస్తా ఉండాది. అది తల్లులారా రయికముడి ఎరగని ఆ తల్లి కత’ నిట్టూరస్తా నిలిపింది రాగిచెరవ.

‘అక్కల్లారా నన్ను పొరకతో కొట్టండి. అట్టాంటి తల్లిని పట్టుకొని అన్ని మాటలు అన్నానే’ వలవల ఏడస్తా అనింది ఊదరబుర్ర. బుర్ర ఒకటే కాదు, కతను విని కన్నీరు కార్చని ఉరువే లేదు ఆ చుట్టింటిలో.

కన్నెమ్మ కత నన్ను తొలిచేసింది. నా బతుకు మాదిర బతుకే కదా ఆయమ్మది కూడా. పగలు పొద్దుగూకులూ కాగికాగి కాలిపోయే నాకు, కడకు మిగిలేది మసే కదా. పండగపూట కూడా పొంతకడవకు అంత పసుపూకుంకుమా పెట్టరే. ఇంటిల్లిపాదికీ ఇంత ఊడిగం చేసే నన్ను, కడాన ఉలవరించుకొని పొయిననాడు దిబ్బలోనే కదా వేసేది. ఓటి మంగలానికి ఉండే మతింపు కూడా పొంతకడవకు ఉండదే… ఇట్ట ఏదేదో తలపోస్తా ఏ పొద్దులోనో కునికినాను.

‘చేయ్‌ లెయ్యట్ట’ అన్న అరుపుతో ఉలిక్కిపడి లేచినాను. చుక్క పొడిచేసినట్లు ఉండాది, కన్నెమ్మ చుట్టింటిలోకి వచ్చేసింది. పనివెంట పనిని అందుకొని చేస్తా ఉండాది.

‘అత్తా చద్దికూడు వెయ్యి’ అంటా చుట్టింటిలోకి వచ్చినాడు రాజక్క పెద్దకొడుకు. బలే తిమురు (అహంకారం) పట్టినవాడు ఆ పిల్లగాడు.

‘ఉండు అబయా ఇంకా కలపలేదు’ అనింది కన్నెమ్మ.

తెలిసి అన్నాడో తెలియక అన్నాడో ‘ఎందుకు కలపతావులే, నీకు ఇంకా చాకలి సొలుపు తీరితే కదా’ అన్నాడు గబుక్కున. ఆ మాట చెళామని తగిలినట్లు ఉండాది, ఒక్క అంగన వాడి దగ్గరకు పొయి చెంప చెళ్లుమనిపించింది కన్నెమ్మ. అప్పుడే చుట్టింటి కడప దగ్గరకు వచ్చిన రాజమ్మ కంట్లో పడింది ఈ నడితి (సంఘటన). అంతే కయ్యిమంటూ లేచి అనరాని మాటలను అని ఆడపడుచును కడిగిపోసింది రాజమ్మ.

ఆ తిట్లను ఉలుకూపలుకూ లేకుండా వింటా ఉండిపోయింది కన్నెమ్మ. పగలంతా చుట్టిల్లు దాటిపోలేదు, మెతుకు ముట్టలేదు. ‘ఏమి తినలేదు’ అని ఆ తల్లిని అడిగినవాళ్లు ఒక్కరు లేరు ఆ ఇంటిలో. రెయ్యి కూడా చుట్టింటిలోనే ఉండిపొయింది కన్నెమ్మ. నడిరెయ్యి దాటిన వెనుక పుట్టినింటి రాగిచెరవను అబ్బిళించు (కౌగలించు) కొని పొగిలి పొగిలి ఏడిచింది. ఆ ఏడుపును విని నేను తట్టుకోలేకపోయినాను. నేను కూడా ఎక్కిళ్లు పెట్టి ఏడిచినాను. ఏడిచి ఏడిచి చుక్కపుట్టే పొద్దుకు పగిలిపొయినాను.