4, మే 2014, ఆదివారం

మాన్యత


ఎంతో మానసిక విశ్లేషణ  తో రాధా గారు రాసిన అద్బుతమైన  కధ .

ఎవరి కళ్ళల్లో నైనా అసూయ కనబడిందంటే మనం బాగున్నట్లు. సంతోషం కనబడిందంటే మనం కష్టాల్లో ఉన్నట్లు
ఎంత నిజం ఈ  వాక్యం .  ఈరోజుల్లో చాలా  మంది ఇలానే వున్నారు. 



అమ్మని దహనం చేసి వచ్చాక నాన్న,నేను నట్టింట్లో ఉన్న ఉయ్యాల బల్ల మీద పడుకుని ఉన్నాము. పెద్దక్కయ్య వంటింట్లో నాయనమ్మకి సహాయం చేస్తోంది. తాత మూలన ఉన్న నులక మంచం మీద పడుకుని ఉన్నాడు. తమ్ముడు తాత పక్కన కూర్చుని ఉన్నాడు. చిన్నక్క మేము పడుకున్న ఉయ్యాల బల్ల పక్కనే కూర్చుని చెల్లికి జడలు వేస్తుంది.

ఇప్పుడు దాకా మేం ఏడవడం చూసినది చాలలేదేమో ఇళ్ళకిపోయిభోజనాలుచేసుకోనిమళ్ళీ వచ్చారు ఊళ్ళోని నలుగురైదుగురు. పడుకున్న నాన్న, తాత లేచి కూర్చున్నారు. అందరూ తాత మంచం మీద కూర్చున్నారు. రేపు చిన్న దినం ఎట్లా చేయాలో,ఎవరెవరికి కబురు పంపాలో మాట్లాడుతున్నారు. నాన్నకి,తాతకి ఉచిత సలహాలు చెప్తున్నారు. వాళ్ళని చూస్తే నాకు మండిపోతుంది. వాళ్ళ నోళ్ళు 'పాపం'అంటున్నాయి. కళ్ళల్లో మాత్రం సంతోషం.

నిన్న గాక మొన్న మా పొలం గట్లను దున్ని తన చేలో కలుపుకున్న చలమడూ, ఆడపిల్లలు పెద్దవాళ్ళయ్యారని నీళ్ళు పోసుకోవడానికి దొడ్లో తడికలు అడ్డం పెట్టుకుంటుంటే ‘నీళ్ళు మా ఇంటి వైపుకి రానీయబాకండి,వాటం అటు పెట్టండి’అంటూ కట్టినంతసేపూ అక్కడే కాపలాగా నిలబడ్డ పక్కింటి రామడూ -వీళ్ళా మాకు సలహాలు ఇచ్చేది.

"అబ్బబ్బ!అరవబాకండి. మా అమ్మ ఇక్కడే ఉంది. ఇదిగో నా దగ్గర ఉంది. అరవకుండా అందరూ లేచి వెళతారా వెళ్ళరా" అని అరిచాను వాళ్ళని కోపంగా చూస్తూ. వాళ్ళు నా మాటలకు ఏం జవాబు చెప్పాలో అర్థం కానట్టు మా తాత వైపు, నాన్న వైపు చూశారు. నేను చూసిన చూపులో వాళ్ళ మీద నాకున్న అసహ్యాన్ని కనిపెట్టాడు తాత.

"ఏదో చిన్నపిల్ల. నిద్రలో అమ్మ గుర్తొచ్చినట్టుంది. మళ్ళీ మాట్లాడుకుందాం. ఏమైనా కావాలంటే అడుగుతాంలే రామయ్యా"అని వాళ్ళని పంపించాడు తాత.

అప్పుడు నాకు పదిహేనేళ్ళు. ఎవరి కళ్ళల్లో నైనా అసూయ కనబడిందంటే మనం బాగున్నట్లు. సంతోషం కనబడిందంటే మనం కష్టాల్లో ఉన్నట్లు అని ఆ వయసులోనే నాకు అర్థం అయింది. అప్పుడే ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. ప్రతి వాడి కళ్ళల్లో నేనన్నా,నా కుటుంబం అన్నా అసూయ కనబడాలి. దాని కోసం ఏమైనా చేస్తాను. ఎంత కష్టమైనా భరిస్తాను.
***

చదువుకుంటాను గాని గొప్పగా చదవాలని పెద్ద ఆసక్తి ఏమీ ఉండేది కాదు నాకు ఇంతకుముందు. ఇప్పుడు ఎలాగైనా 10 వ తరగతిలో స్టేట్ ర్యాంక్ కొట్టేయాలి. అందరి కళ్ళల్లో అసూయని చూడాలి -అంతే -రాత్రింబవళ్ళూ మరో ధ్యాస లేకుండా చదువుకుంటున్నాను.

నాన్న ఇల్లు విడిచి పెట్టి వెళ్ళాడు. కుటుంబ భారమంతా తాత మీద పడింది. ఊళ్ళో వాళ్ళ కళ్ళల్లోని సంతోషాన్ని భరించలేక నాన్న మీద అసహ్యం కలిగింది. మంచంలోదిగులుగాకూలబడిపోయినతాతకి నేనే ధైర్యం చెప్పాను. పేద్ద నాపసానిగా మాట్లాడుతున్న నన్ను చూసి అశ్చర్యపోయాడు. నా కళ్ళల్లో ఉన్న పట్టుదలని తదేకంగా చూశాడు. ఎక్కడనుండి వచ్చిందో అంత ధైర్యం -ఒక్క ఊపున మంచం మీద నుండి లేచి "ఎంత కష్టంచేసైనాసరే నిన్ను చదివిస్తాను మాన్యతా" అన్నాడు తాత.

నాకు10 వ తరగతిలో స్టేట్ ర్యాంక్ వచ్చింది. అందరి కళ్ళల్లో అసూయ. నా మనసు మెట్టమొదటిసారిగా గర్వంతో ఉయ్యాల లూగింది. 'ఇదే కావాలి నాకు. దీని కోసం ఏమైనా చేస్తాను' మరోసారి అనుకున్నాను గట్టిగా.

పదవ తరగతిలో మా ఊళ్ళో చాలా మంది ఫెయిల్ అయ్యారు. అందరూ ఫెయిల్ అయిన సబ్జెక్ట్ లలో డౌట్లు ఉన్నాయిచెప్పమని అడుగుతున్నారు. ఎందుకు చెప్పాలి ఊరికే? ‘ప్రైవేట్ చెప్తాను ఫీజు ఇస్తేనే’అన్నాను. ఆ సెలవల్లో ఫెయిల్ అయిన వాళ్ళే కాక చాలా మంది నా దగ్గరకి ట్యూషన్ కి వచ్చారు. అందరి దగ్గరా ఫీజులు వసూలు చేశాను. ఆసంపాదనతోపాటు తాత మరికొంత డబ్బు వేసి నా కాలేజీ ఫీజు కట్టాడు.

***

ఊళ్ళో వాళ్ళ కళ్ళల్లో బాగా చదువుతానని అసూయ కనబడుతుంది కాని నా బట్టలను చూసి వ్యంగ్యంగా"ఇదేమిటే మాన్యా! మీ తాత టౌన్లో కాలేజీకి పోయే పిల్లకి మంచి బట్టలు కూడా కొనియ్యలేకపోతే ఎట్టా"అని సాగదీస్తూ అడుగుతుంటే కోపం వస్తోంది. ఇంట్లో పరిస్థితులు నాకు మంచి బట్టలు కొనిచ్చే విధంగా లేవని నాకు తెలుసు. ఎలాగైనా సంపాదించాలి. కాలేజీలో మా క్లాసులో చదివే పిల్లల గురించి ఆరా తీశాను. ఎవరు మొద్దులో- ఆ మొద్దులు కూడా ఎవరు బాగా డబ్బున్న వాళ్ళో కనిపెట్టి వాళ్ళతో స్నేహం చేయసాగాను.

ఈ సారి డౌట్ లు తీర్చినా,రికార్డులు రాసిపెట్టినా డబ్బు అడగకుండా డ్రస్ లు గిఫ్టుగా ఇవ్వమని అడిగాను. వాళ్ళ ఇళ్ళకు వెళ్ళినపుడు వాళ్ళ అమ్మలకి వంటింట్లో సహాయం చేసి వాళ్ళ అభిమానాన్ని చూరగొన్నాను. వీలైనంత వరకూ వాళ్ళ ఇళ్ళల్లోనే భోజనాలు కానిచ్చేదాన్ని. అలా భోంచేస్తున్నపుడు నాకో ఆలోచన కలిగింది.

"మా ఇంట్లో మేము పచ్చళ్ళు,పొడులూ,వడియాలూ పెట్టి అమ్ముతాం ఆంటీ. తెచ్చివ్వనా? " అన్నాను. ఎవర్ని అడిగినా "అలాగే మాన్యా. తప్పకుండా తీసుకురా" అన్నారు అందరూ. "చాలా మంది అడుగుతున్నారండీ. అంత పెద్ద మొత్తంలో పెట్టాలంటే కొంచెం అడ్వాన్స్ కావాలి ప్లీజ్"అన్నాను తెలివిగా. అందరూ అడ్వాన్స్ లు ఇచ్చారు. ఇంట్లో ఏడవ తరగతి వరకూ చదివి మానేసిన పెద్దక్క, పదవ తరగతి ఫెయిల్ అయి ఇక చదవను అని కూర్చున్న చిన్నక్కల సహాయం తో నాన్నమ్మ వ్యాపారం మొదలు పెట్టింది. వాళ్ళు పెట్టిన పచ్చళ్ళు నా స్నేహితుల తల్లులే కాదు ఇంకా వాళ్ళ స్నేహితులూ,వాళ్ళ ఇంటి చుట్టు పక్కల వాళ్ళూ కొంటున్నారు. మా లెక్చరర్స్ కి చెప్పొచ్చు కాని వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని అడగలేము కదా అనుకుని వాళ్ళకి చెప్పలేదు.

మాకు ఉండటానికి 5ఎకరాలు పొలం ఉంది కాని ఏమి వేసినా నష్టమే వస్తుంది. తాత దిగులు పడసాగాడు. మా ఊళ్ళో భవానీ వ్యవసాయం గురించి బాగా తెలిసిన వాడు. ఏ కాలంలో ఏ పంటలు వేస్తే లాభమో అతనికి బాగా తెలుసు. "భవానీ ఏం పంటలు వేస్తే నువ్వూ అవే వెయ్ తాతా మన పొలంలో"అని చెప్పాను.భవానీ దగ్గర పని చేసే వెంకటేశు గాడికి పచ్చళ్ళూ, సంగటీ పెట్టి మంచి చేసుకున్నాము. భవానీ పొలంలో ఏం వేయబోతున్నాడో తెలివిగా మాట్లాడి రాబట్టేదాన్ని. తాతా ,నేను మాట్లాడుకుని ఆ పంటలే వేసేవాళ్ళం.

ఇంటర్ లో కాలేజీ ఫస్ట్ వచ్చాను. డిగ్రీలో చేరడానికి ఇప్పుడు నాకు డబ్బు ఇబ్బందేమీ లేదు. పచ్చళ్ళు బాగా పోతున్నాయి. షాపుల నుంచి, హోటళ్ళ నుంచి ఆర్డర్స్ సంపాదించాను. ఒక్కోసారి పెళ్ళిళ్ళకి కూడా సప్లై చేస్తున్నాము. తాతకి కూడా పొలంలో ఆదాయం బాగానే వస్తుంది. తమ్ముడు నాలాగే పట్టుదల కలిగిన వాడు. 10 వ తరగతికి వచ్చాడు. వాడి సహాయంతో ప్రైవేట్లు ఇంకా ఎక్కువ మందికి చెప్తున్నాను. కాలేజీకి వెళ్ళి రావడానికి,పచ్చళ్ళ ఆర్డర్ల కోసం స్కూటీ కొనుక్కున్నాను.

***

నేను చాలా అందంగా ఉంటాను. నా అందానికి ఇంకా మెరుగులు దిద్దుకొని డిగ్రీలో అడుగుపెట్టాను. ఇక్కడ నా అందమే నాకు ప్లస్ పాయింట్ అని నాకు తెలుసు. మగ పిల్లలతోస్నేహంగామాట్లాడటం అలవాటు చేసుకున్నాను. ఇక ఆడపిల్లలతో ఎవరికేం కావాలో తెలుసుకుని వాళ్ళకు తగ్గట్లుగా మాట్లాడతాను. ఒక స్థిరమైన అభిప్రాయాన్ని ఏర్పరుచుకొని దాన్నే పట్టుకుని వేళ్ళాడటం కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది నేను ఉన్నతంగా బ్రతకడం. డబ్బు కోసం నా కుటుంబం ఇబ్బంది పడకూడదు - అంతే- 'అదే నాకు కావాల్సింది. దాని కోసం నేనేమైనా చేస్తాను' అనిమరోసారి అనుకున్నాను.

సాగర్ గాడు ఈ మధ్య ఏదో ఒక రకంగా మాట్లాడుతున్నాడు. వీడు నామీద ప్రేమ పెంచుకుంటున్నట్లున్నాడు. ఇక రెండు మూడు రోజుల్లో నాకు "నిన్ను ప్రేమిస్తున్నాను"అని చెప్తాడని వాడి కళ్ళు చూసి గ్రహించాను. సాగర్ గురించి ఎంక్వయిరీ మొదలు పెట్టాను. పల్లెటూరు నుండి వచ్చాడు. ఇద్దరు అన్నలు. ఉన్న పొలాన్ని పంచుకుంటే వీడికి5 ఎకరాలు కూడా రాదు. వీడి చదువూ అంతంత మాత్రమే. వీడిని చేసుకుంటే - ఛీ!ఛీ!తలుచు కోవడానికి కూడా నాకు అసహ్యమే. ఏమీ బయట పడకుండా సాగర్ ని చూడగానే ఏదో పెద్ద పనిలో ఉన్నట్లు,దేని గురించో ఆలోచిస్తున్నట్లు సీరియస్ గా ముఖం పెట్టడం చేయసాగాను.

పెద్దక్కకి మంచి సంబంధం వచ్చింది. కలెక్టర్ ఆఫీసులో గుమాస్తా. పెద్ద కట్నం ఏమీ లేకుండానే ఆమె నెమ్మదితనం,పనితనం చూసి కావాలని అడిగారు. పెళ్ళయ్యాక మా ఊళ్ళోనే వేరే ఇల్లు తీసుకుంది. బావ ఆఫీసుకి వెళ్ళాక ఇంటికి వచ్చి పచ్చళ్ళు పెడుతుంది. పచ్చళ్ళ వ్యాపారం బాగా పెరిగింది. తాత,నాన్నమ్మలు బాగా ఆరోగ్యంగా ఉండాలి. అందరి కంటే ఎక్కువ కాలం బ్రతకాలి. అమ్మకి మందులు, బలమైన తిండి ఇప్పించలేక చనిపోయిన సంగతి నేను ఎన్నటికీ మర్చిపోలేను. కాలేజీ నుండి వచ్చేప్పుడు వాళ్ళకి కావలసినవి తెచ్చి పెట్టేదాన్ని. తమ్ముడికి నేనే ఇన్స్పిరేషన్. 10 వ తరగతిలో స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు మా ఊళ్ళో ‘ఆ మాన్యతని చూడండిరా. చిన్న పిల్ల అయినా బాధ్యతని ఎట్టా భుజాల మీదకు వేసుకుందో’అంటారు. అందరి కళ్ళల్లో అసూయ. 'అదే నాకు కావాల్సింది. దాని కోసం నేనేమైనా చేస్తాను' మరోసారి అనుకున్నాను.

***

"మాన్యా!లత,మధు సినిమాకి వెళుతున్నారు. మనం కూడా వెళదామా" అని సాగర్ అడిగాడు. మధు చాలా అందగాడు. కోటీశ్వరుడు. కార్లల్లో కాలేజీకి వచ్చేవాళ్ళల్లో మధు ఒకడు. చాలా బాగా చదువుతాడు. నాకు పోటీ అతనే. మధు లతని ప్రేమిస్తున్నాడా? లేకపోతే సినిమాకి ఎందుకు ప్లాన్ చేస్తారు? కనిపెట్టడం ఎంతసేపు? వాళ్ళ కళ్ళు చూస్తే తెలియదా -నేరుగా మధు సీట్ దగ్గరకి వెళ్ళాను. నేను మధు దగ్గరకి వెళ్ళడం చూసిన లత ఆసక్తిగా పక్కనుండి చూస్తుంది.

"మధూ! సినిమాకి ప్లాన్ చేశావుట. ఎవరెవరు వస్తున్నారు? ఏం సినిమాకి వెళదాం?”అని క్యాజువల్ గా అడిగాను. ఓరగా లత వైపు చూస్తూ “ఇంకా ఏం అనుకోలేదు మాన్యా. చూద్దాంలే”అన్నాడు.
నాకర్థం అయింది. ఇప్పుడిప్పుడే వాళ్ళిద్దరి మధ్యా ఏదో మొగ్గ తొడుగుతోందని. లాభ నష్టాలు ఆలోచించే నా మనస్సు మధుని నావైపుకి తిప్పుకోమంది.

అవకాశాన్ని ఎలా చేజిక్కించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. తర్వాత రోజు సాగర్ "మాన్యా!ఫ్రెండ్ షిప్ డేకి మధు లతకి ఇవ్వాలని భలే గ్రీటింగ్ కొన్నాడు. నేను కూడా నీ కోసం అలాంటి గ్రీటింగ్ కొనాలనుకుంటున్నా" అన్నాడు. "ఏం గ్రీటింగ్ అది"అని అడిగాను అనాసక్తతను నటిస్తూ. "పూలు అందించే చేతుల గ్రీటింగ్. ఎంత బావుందో" అన్నాడు.

"చూడు సాగర్! నాకు ఇలాంటివి నచ్చవు. దయచేసి నన్ను అలా అనుకోకు. నేను నీకు చెల్లెలిని అనుకో"అన్నాను. వాడి ముఖం ఎలా మారిందో కూడా చూడకుండా గ్రీటింగ్ కార్డ్స్ షాప్ కి పరిగెత్తాను.

పూలు అందించే చేతుల గ్రీటింగ్ కార్డు కొన్నాను. రేపే ఫ్రెండ్ షిప్ డే. రేపటి దాకా ఆలశ్యం చేయడం వల్ల మధు తను కొన్న గ్రీటింగ్ లతకి ఇవ్వొచ్చు. అది జరగకూడదు. సాయంత్రమే మధుని కలుసుకున్నాను.

"మధూ!రేపు నేను కాలేజీకి రాను. చిన్నక్కకి పెళ్ళి చూపులు. నాకు నువ్వంటే ఎంతో ఇష్టం. మన స్నేహం చిగురించాలనే ఆశతో ఈ గ్రీటింగ్ నీ కోసం" అంటూ ఆ గ్రీటింగ్ ఇచ్చాను. గ్రీటింగ్ ని కవర్లో నుండి తీసి చూసిన మధు కళ్ళు అనందంతో వెలిగాయి.

"వావ్!మాన్యా!. నేను కూడా ఇలాంటి గ్రీటింగ్ కార్డే కొన్నాను" అన్నాడు.

"అవునా! నా కోసమేనా? అబ్బ!మధూ! మనిద్దరి టేస్ట్స్ ఎంత బాగా కలిశాయి. ఏదీ చూపించు. నాకిప్పుడే ఇవ్వు" అని గారాలు పోయాను మధు పైన వాలుతూ.

తడబడిపోయిన మధు "ఇప్పుడొద్దులే. రేపు నేను మీ ఇంటికి వచ్చి ఇస్తాను సరేనా! " అన్నాడు.

"ఎందుకు నన్ను చూడాలనా" అన్నాను మరింత కవ్వింపుగా -అంతే మధు నా ప్రేమలో పడిపోయాడు.

తర్వాత రోజు గ్రీటింగ్,పూలు,పండ్లతో సహా మా ఊరు వచ్చాడు. కారు మా ఇంటి ముందు ఆగడం చూసిన జనం కళ్ళల్లో ఎంత కుళ్ళో! వచ్చింది ఎవరో తెలుసుకోవాలని ఎంత ఆత్రమో.

'ఎవరే మాన్యా వచ్చిందీ కార్లో'అని ఆరా తీయడం. మా ఇంట్లో వాళ్ళని ఇప్పటికే ఎన్నో సార్లు అడిగి ఉంటారని నాకు తెలుసు. మా వాళ్ళకి తెలియదు. తెలిసినా చెప్పరు. 'మా మాన్యని అడగండి' అంటారు. "మా చిన్నక్కకి సంబంధం వచ్చింది కదా! వాళ్ళ చుట్టాలు లెండి" అని చెప్పాను.

***

చిన్నక్కకి పెళ్ళయింది. బావ కంప్యూటర్ ఇంజనీర్. కట్నం లేకుండా చిన్నక్క అందానికి మెచ్చి పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళయినవెంటనేహైదరాబాద్కివెళ్ళిపోయింది. నాయనమ్మకిపనిఎక్కువయింది. ఆమెకిరెస్ట్కావాలి. పచ్చళ్ళురుబ్బడానికి,పొడులుకొట్టడానికివెంకటేశుపెళ్ళాన్నిపెట్టాను. దానికిసినిమాలపిచ్చి.
వారానికిరెండుమూడుసార్లుపనిఎగ్గొట్టిటౌన్కిసినిమాలకివెళుతుంది.దాన్నిటౌన్ కివెళ్ళకుండాఆపడానికిటి.వికొనుక్కొచ్చాను.
వంటింటికి,ముందుగదికిమధ్యఉన్నఅలమరాపగలకొట్టించిఎటుకావాలంటేఅటుతిప్పుకునేట్లుగాటి.విపెట్టించాను. టి.వి.చూస్తూఎంతపనిచెప్పినాకిక్కురుమనకుండాచేస్తుంది.వెంకటేశపెళ్ళాన్నిమాఇంటికిరాకుండాచేయాలనిఎంతమందిప్రయత్నించారోనాకుఅదిచెప్పేది. ఇప్పుడికఇదిమాఇల్లువదిలిపెట్టదు. బాగాపనిలోకుదురుకుంది.దానికిబదులుగావెంకటేశు కొడుక్కి ఫీజు లేకుండా ప్రైవేటు చెప్పి 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేట్లు చేశాను.

తమ్ముడుకాలేజీలోచేరాడు. చెల్లితొమ్మిదవ తరగతికివచ్చింది. నాకుమధుకిమధ్యప్రేమగాఢంఅయింది. డిగ్రీఫైనలియర్పరీక్షలుదగ్గరకొచ్చాయి.ఈపనులవత్తిడిలో,ప్రేమమత్తులోచదువువెనకపడింది. మధుకిబాగాచదువుకోవాలనిచెప్పాను. ప్రయివేట్లుచాలావరకుతమ్ముడిచేత,చెల్లెలిచేతచెప్పించిబాగాచదువుకోసాగాను.డిగ్రీలోగోల్డ్మెడల్సాధించాను. బిజినెస్మేనేజ్మెంట్లోచేరాను.

***


మధుతోనాపెళ్ళిజరగాలంటే, అతడిపేరెంట్స్మాపెళ్ళికిఒప్పుకోవాలంటేఫాల్స్ప్రిస్టేజ్చూపించాలి-తప్పదు. పొలం లోన్ పెట్టించి,బ్యాంక్లోఉన్నడబ్బుతీసి,బావలదగ్గరకొంతఅప్పుచేసిపెద్దఇల్లుకట్టించాను. ఇంటిలోపలగదుల్లోసామాన్లులేకపోయినాహాలులోమాత్రం సోఫాసెట్,పెద్దటి.వి,ఫ్లవర్వాజ్లతోఅలంకరించాను.

మధుతల్లిదండ్రులనితీసుకునిమాఇంటికివచ్చాడు.మధునాన్నపెద్దబిజినెస్మాగ్నెట్.చాలాతెలివైనవాడని కనిపెట్టాను.నాఅందం,చదువు,ముఖ్యంగానాకళ్ళల్లోపట్టుదలగమనించాడు. ఒక్కమాటకూడామాట్లాడకుండాపెళ్ళికిఒప్పుకున్నాడు.

రంగరంగవైభవంగాజరిగిననాపెళ్ళికివచ్చినఊరివాళ్ళు,మా క్లాస్ స్మేట్స్అందరికళ్ళల్లోఅసూయనిచూసిననేను'ఇదేనాకుకావలిసింది. దీనికోసంనేనేమైనాచేస్తాను' అనిమరోసారిఅనుకున్నాను.

ఇప్పుడునేనుకోటీశ్వరుడికోడలినేకానిఆఇంటిమీదనాకుఅధికారంరావడానికి,నిజంగాఆకోట్లునాకుఅందడానికినేనుచాలాకష్టపడాలనినాకుతెలుసు. హనీమూన్లోనాఅందాన్నిఆరబోసినాభర్తనుపూర్తిగానావాడినిచేసుకున్నాను.మధునామాటగీటుదాటడు. ఇకమామగారిఅభిమానాన్నిసంపాదించాలి.

తమ్ముడినిఇంజనీరింగ్లోచేర్పించాను.చెల్లి పదవతరగతి60%తోఏదోఫస్ట్క్లాస్లోపాసయింది. సెకండ్క్లాస్వచ్చినట్లయితేమళ్ళీఅందరికళ్ళల్లోసంతోషంచూడవలసివచ్చేది. ఫస్ట్క్లాస్లోపాస్అయిందిఅంతేచాలుఅనుకున్నాను.

మామగారుచేసేవ్యాపారాల్లోజీడిపప్పునిఎక్స్పోర్ట్చేసేవ్యాపారంబాగాలాభాలనుఆర్జించిపెడుతోందనిగమనించాను. జీడిపప్పుతోపచ్చళ్ళుకూడాప్యాక్చేసిపంపడానికిమామగారినిఒప్పించిలక్షలరూపాయలుపెట్టుబడిగాపెట్టి'నాయనమ్మపికిల్స్'అనేపేరుతోలైసెన్స్సంపాదించాను. నాదశతిరిగింది.విపరీతంగాఆర్డర్స్రాసాగాయి. దేశ  విదేశాల్లోనాయనమ్మపికిల్స్కిబ్రాండ్నేమ్వచ్చేసింది. మామగారికిహఠాత్తుగాగుండెపోటురావడంతోడాక్టర్స్రెస్ట్కావాలన్నారు. పూర్తిగానామీదనమ్మకంఉంచినఆయనబిజినెస్వ్యవహారాలన్నీనాకుఒప్పచెప్పారు.

చిన్నబావకిఅమెరికాలోతెలిసినవాళ్ళకంపెనీలో ఉద్యోగం వచ్చేట్లు చేశాను. తాత పూర్తిగా మంచాన పడిపోయాడు. నాయనమ్మ మాత్రం పచ్చళ్ళు కలుపుతానే ఉంది. పెద్దక్కఇప్పుడు మా పచ్చళ్ళ ఎక్స్ పోర్ట్ కంపెనీకి పార్టనర్. అసలు మా పెద్దక్క నాకు ఎంతో సపోర్ట్. ఇంట్లో తాతని,నాన్నమ్మని,పచ్చళ్ళని అంతా మానేజ్ చేసింది అక్కే.చెల్లికి చదువు రాదు అని తెలుసు.అందుకే మధు చిన్నాన్న కొడుక్కి ఇచ్చి పెళ్ళి చేశాను. తమ్ముడికి ఎం.టెక్ పూర్తి అయింది. ఎం.ఎస్ కోసం అమెరికాకి వెళుతున్నాడు.

***

పిల్లలు కావాలని మధు,అత్తగారు పోరు పెడుతున్నారు. పెళ్ళయి అయిదేళ్ళు అయింది. బాధ్యతలు కూడా తీరినట్లే. నేను అనుకున్నది సాధించగలిగాను. ఇప్పుడిక నాకు,నా కుటుంబానికీ ఏ బాధలూ లేవు. పిల్స్ తినడం ఆపేశాను. నాకు ఏడో నెల రాగానే మామగారితో,మధుతో చెప్పి టెక్స్ టైల్స్ కంపెనీ మూసేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ కంపెనీలో పని ఎక్కువ. లాభాలు తక్కువ. ముఖ్యంగా పర్యవేక్షణ చేసేవాళ్ళు లేరనే ఈ నిర్ణయం తీసుకున్నాను. కంపెనీ అమ్మేస్తున్నట్లు నోటీసు పెట్టగానే వర్కర్స్ అందరూ మా బంగళాకి వచ్చారు. అందరి కళ్ళల్లో నీళ్ళు. మామగారు నా వైపు ఏం చేద్దాం అన్నట్లు చూశారు.నాకు వాళ్ళని చూస్తే బాధ కలగలేదు కాని వీళ్ళంతా రకరకాలుగా మాట్లాడతారు. చేయలేక కంపెనీ మూసేసుకున్నారు అని చెప్పుకుంటారని బాధ కలిగింది. అలా అనుకోకూడదు. అది నాకిష్టం ఉండదు.

"సరే-లాభాల్లో మీరు షేర్ తీసుకోండి. కంపెనీని లాభాల దిశగా నడిపించే బాధ్యత మీదే ఇక"అన్నాను. అందరూ సంతోషపడ్డారు. మామగారు మెచ్చుకోలుగా చూశారు నా వైపు.

నాకు అబ్బాయి పుట్టాడు. అమ్మ పేరు వైష్ణవి. ఆ పేరు కలిసేట్లుగా మా అబ్బాయికి విష్ణు అని పేరు పెట్టుకున్నాను. మామగారికి,అత్తగారికి వాడితో బాగా కాలక్షేపం. వాడికి కావలసినవన్నీ వాళ్ళే చూసుకుంటారు. నేను మళ్ళీ పూర్తిగా బిజినెస్ వ్యవహారాల్లో పడిపోయాను.

***

తాతకి బాగా లేదని కబురొచ్చింది. ఊరికి వెళ్ళాను. అందరూ పలకరించే వాళ్ళే. వాళ్ళ కళ్ళల్లో అసూయ లేదు. మెచ్చుకోలు తప్ప. ఆశ్చర్యపడ్డాను. "తాతా!"అని పిలిచాను ఆయన మంచం మీద కూర్చుని. తాత కళ్ళల్లో నీళ్ళు. నా కళ్ళల్లోనూ నీళ్ళే. అవి ఆనంద బాష్పాలని ఇద్దరికీ తెలుసు. తాత నా చేతుల్లో ప్రశాంతంగా కళ్ళు మూశాడు.

తాత దినం మూడు రోజులు వైభవంగా పెళ్ళిలాగా చేశాను. అందరూ నన్ను గౌరవంగా చూసేవాళ్ళే. ఒక్కరి కళ్ళల్లో కూడా నేను అసూయని చూడలేదు. నాకు ఆశ్చర్యం ఎక్కువవుతోంది. నా ఫీలింగ్స్ చెప్పుకోవడానికి నాకెవరూ లేరు. ఎవరితో చెప్పుకోను? అసలు ఎలా చెప్పను?నాకు కావలసింది అందరి కళ్ళల్లో అసూయ. కాని ఇదేమిటి అందరూ సంతోషంగా,గౌరవంగా,మెచ్చుకోలుగా,ఆప్యాయంగా చూస్తున్నారు? ఇది నాలో వచ్చిన మార్పా? లేక వాళ్ళల్లో వచ్చిన మార్పా? నాకెవరు చెప్తారు?

దిగులుగా ఉన్న నన్ను చూసి మధు,తాత కోసం దిగులు పడుతున్నాననుకున్నాడేమో-"పెద్దవాళ్ళయ్యాక చనిపోకుండా ఎలా ఉంటారు మాన్యా"అంటున్నాడు.


ఆరు నూరయినా ఉదయాన్నే లేచి కంపెనీ పనులు చేసుకునే నేను ఆరోజుపది అయినా నా గదిలో నుండి బయటకు రాలేదు. మధు ఆశ్చర్యంగా చూశాడు. "కంపెనీకి వెళ్ళాలనిపించడం లేదా మాన్యా?" అని అడిగాడు. మధు కళ్ళలోకి నిస్తేజంగా చూస్తూ నా భావాలని,నా ఆలోచనలనీ,వాటిని సాధించడం కోసం నేను చేసిన పనులనీ ఆఖరికి గ్రీటింగ్విషయం కూడాదాచకుండాచెప్పాను.

"మధూ!ఇదంతానేను,నాకుటుంబంఉన్నతస్థాయిలోఉండాలనీ, సరైన మందులు ఇప్పించుకోలేక మాఅమ్మకోసం పడ్డ అవస్థ ఇక రాకూడదనిచేశాను. బాధలనుతట్టుకోలేక, బాధ్యతలనుండితప్పించుకోవడానికిఇంట్లోనుండివెళ్ళిపోయిచనిపోయాడోలేదోతెలియకుండాఉన్నమానాన్నబాధ్యతలనునెత్తినవేసుకునిచేశాను. మాతాతకళ్ళల్లోగర్వాన్నిచూడాలనుకునిచేశాను.అయితే నాకు అర్థం కానిది ఏమిటంటే ఇన్నాళ్ళూ మేము ఎదుగుతుంటే అసూయ వ్యక్తం చేసే వాళ్ళ కళ్ళల్లో ఈ రోజు అసూయ స్థానంలో గౌరవం ఎలా వచ్చింది అనే" అన్నాను.

మధు కళ్ళల్లో కలవరం స్పష్టంగా తెలుస్తుంది. నాకు దగ్గరగా వచ్చి మంచం మీద కూర్చున్నాడు. నా వీపు మీద చేయి వేసి నిమురుతూ"మాన్యా!ఏదో ప్రోద్బలం,మోటివ్ లేకుండా మనం మనుషులం సాధారణంగా ఏ పనీ చేయం. ఎదుగుతున్న వయసులో నీకు తగిలిన దెబ్బల వలన నీ ఆర్థిక పరిస్థితులను ఉన్నత స్థాయికి తెచ్చుకోవాలనే పట్టుదల నీలో కలిగింది. సాధించావు. ఈ ప్రయాణంలో కొంతమందికి సహాయాలు,మరికొంత మందికి గాయాలూ చేసి ఉండవచ్చు. అంతవరకు బాగానే ఉంది. కాని మాన్యా! వీటి వెనుక ఉండి నిన్ను నడిపించింది ఎదుటి వాళ్ళల్లో 'అసూయని కలిగించడం'అన్న కోరిక-అది మాత్రం అర్థం లేనిదేమో"అన్నాడు.

"నేను ఎదగడానికి ఆధారమే అది. అర్థం లేనిది ఎలా అవుతుంది"అన్నాను మధు వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ.

"మనం అసూయ పడగలిగేది మనకి దగ్గరగా మన వర్గంలో వాళ్ళని చూసే. మనకన్నా మరీ ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి అసూయ పడటం, మనకన్నా మరీ తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి గర్వపడటం జరగదు మామూలుగా. మీ ఊరి వాళ్ళు నిన్ను చూసి అసూయ పడటానికి అవకాశం పెద్దగా లేదు. వాళ్ళ వర్గం నుండి నువ్వు ఎప్పుడో పైకి తన్నేసుకుని ఎగిరిపోయావు. ప్రస్తుతం నీ స్థాయిలో ఉన్న వారిని నువ్వు గమనిస్తే వాళ్ళ కళ్ళల్లో అసూయని చూడగలవు.ఈ స్థాయినీ మించి నువ్వు మరో స్థాయికి వెళ్ళినపుడు అక్కడా అదే చూస్తావు.నువ్వు వెతుక్కుంటున్నది అదే అయితే నీ ప్రతి వర్గంలోనూ కొంతమంది మనుషుల దగ్గర అది తప్పకుండా దొరుకుతుంది.ఇతరుల మెప్పుకోసమో లేదా అసూయని కలిగించడం కోసమో నువ్వు ఎదిగినప్పుడు ఆ ఎదుగుదల పరిపూర్ణమైనదికాదు. జీవిత చరమాంకంలో 'నేను సాధించిందేమిటి'అని చూసుకుంటే నీకంటూ ఏమీ ఉండదు" నా వైపే చూస్తూ నిదానంగా చెప్తున్న మధు మాటల్లోని నిజాన్ని గ్రహించాను.
ఎందుకునేనెప్పుడూనెగిటివ్గాఆలోచిస్తానో,ఎందుకునాకంటూస్నేహితులులేరోకూడానాకుఅర్థంఅయింది.మధుని కౌగలించుకుని చాలా సేపు ఏడ్చాను. ఒంటరిగా ప్రయాణిస్తున్న నా మనసుకు ఏదోఆలంబనలభించినఅనుభూతికలిగింది.

ఇంతకు ముందు నా ప్రస్తుత స్థాయి వర్గం వారితో కలవలేదు.కలవాలనిప్రయత్నించలేదుకూడా.వీళ్ళను కూడా చూద్దామనే ఆ రోజు సాయంత్రం మధు స్నేహితుడి ఇంట్లో పార్టీకి వెళ్ళాను. ఎప్పుడూ ఏ పార్టీలకీ రాని నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు కాని కాసేపట్లోనే కొంతమంది కళ్ళల్లో ఆశ్చర్యం స్థానంలో అసూయ చోటు చేసుకోవడం గమనించాను.

నాకిప్పుడు ఆ అసూయ సంతోషం కలిగించట్లేదు.
                                                                                                                             _ మండవ  రాధ 
 

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

దేవుడమ్మ


పాపుదేశి ఝాన్సీ గారు  గ్రామీణ  మహిళ  ల  జీవితాల  ఆధారంగా  మంచి  కధ లు రాస్తున్నారు . మాండలికాలు  నే
 
మరచిపోతున్న  ఈ రోజుల్లో chittor  యాస లో   చాలా  మంచి కధ రాశారు .


నన్ను మావూర్లో అందురూ దేవుడమ్మంటారు.మామూలుగా పూజబెట్టి పిలిస్తే వొచ్చే దేముడు నా పైనికి రాడు. నాకెప్పుడు దేముడొస్తిందో నాకు తప్ప ఇంగెవురికీ తెల్దు. దేముడ్ని నమ్మనోల్లు నన్ను దొంగ దేవుడమ్మని ఎక్కిరిస్తారు. వోల్లు నన్నట్టా ఎక్కిరిస్తే నాకు భయింగా వుంటుంది. మాయత్త ఇనేస్తిందేమో అని.యాలంటే నాకు దేముడొచ్చింది ఆమెవల్లే. మాయత్త పేరు యెంగట లచ్చిం. నేను ఆమి రెండో కొడుకుని పెల్లిజేసుకోని ఈవూరికొచ్చినా. మాయమ్మోల్లు రోజూ కూలికి బోతేనే రోజూ అంత సంగటి తినేది. మాయత్తోల్లు బాగా వున్నోల్లు.ఈడైతే కూట్నీల్లకు కరువుండదని మాయత్త గయ్యాలిగంపైనా నన్నీఇంట్లో ఇచ్చేసింది మాయమ్మ.

పెల్లి గాక ముందు ఆడతా పాడతా వుంటి మాయమ్మోల్ల ఇంట్లో .. తెల్లార్తో లేసి కళ్ళాపి జల్లి ముగ్గేసి, బోకులు కడిగేసి అంత సద్దాగేసి కూలికి బొయ్యేది… మాయిటాల వొచ్చి వుడుకుడుగ్గా రెణ్ణీల్లు బోసుకోని కడుపుకింత తినేసి అరుగుమింద కుచ్చోని అరుట్లు కొడ్తా నిద్దరబొయ్యేది .

ఆదినం నేను కూలికి పక్కింటి సుబ్బులత్త దెగ్గిరికి బొయ్యింటి . నేను సింతకాయి బొప్పిదీసి ఇసుర్రాయి మింద బెట్టుకోని సుత్తితో కొట్టి కొట్టి కిందేస్తా వుంటే సుబ్బులత్త పండు వొలస్తా వుండాది . అర్రోజు పని జేసేసి ఇంటికి రమ్మని మాయమ్మ జెప్పింది . నన్ను చూసేదానికి పెల్లోల్లు వొస్తావుండారంట.

మద్దేనం మూడు గొడ్తా వుండగానే పల్లి బస్సుకు పెల్లోల్లు వొచ్చేసినారు. మాయత్త , ఆడబిడ్డి , ఆడబిడ్డి మొగుడు , పెండ్లికొడుకు వొచ్చినారు నన్ను జూసేదానికి . నన్ను అట్టా ఇట్టా నడవమని, మాట్టాడమనిజెప్పి నాకు అయిటి లేదని దెల్సుకున్నారు. నాకు వొంటజేశేది వొస్తిందని మాయమ్మ జెప్పింది. వుత్త జల్లి గదా అది.. సద్దినీల్లకే సచ్చిబతకతా వుంటే ఇంగ వొంటేం వొండేది…మాయమ్మ నాగురించి ఏందేందో జెప్పి ఎచ్చులుబోతావుంది. నాకు మాత్తరం వోల్లకు కయ్యలుండాయని,రెండుమూడు జీవాలుండాయని,ఇంట్లో టీవీ గూడా వుందని భలే కులుగ్గా ఉండాది. బొట్టుగట్టిచ్చుకోని ఆయిగా ఆడికి పూడిస్తే సిన్మాల్లో మాదిరి వుండచ్చని కాస్కో నుండా. నాఈడుదే ఎగవీధిలో వుండే సుబ్బక్క.

టీవీ జూద్దారని వోల్లింటికిబోతే పెగ్గిజేస్తా వుంటింది. మిసిను ఆపుజేసేసి దాయాలు ఆడేదానికి రమ్మంటింది.నాకు దాయాలు ఆడేదానికన్నా టీవీ జూసేదే బాగిస్టం. ఎట్టోకట్ట ఈ సమందం కుదిరిపోతే దినామూ టీవీ జూడచ్చు. ఇట్టనుకోని మాయత్తకు కొంచిం నోరని జెప్తే కూడా పెల్లికి వొప్పుకునేసినా. నామొగుడు బాగనే వుండాడు…కొంచిం మనిసి కుర్స. అయితేబొయ్యినాడు…కొరుక్కోనేమన్నా తింటామా…కడుపులో సల్లగుంటే సాలు. కాణిపాకులో పెల్లిజేసుకోని వొచ్చేసినా. బంగారు బొంతాడు,మాయమ్మ గుండ్లకమ్మలు, ఒక రాగి అండా బెట్టించికోని మరేదగా వొచ్చినా ఈడికి.

వొచ్చినాకగదా దెల్సింది నాకు…మాయత్త నోట్లో నోరు బెట్టేంత బుద్దిలేనిపని ఇంగోటి లేదని. మాఇంట్లో తాగేది సద్దినీల్లే ఐనా తిండికోసం ఎప్పుడూ తిట్లుదిన్లా. మాయత్త నోరంటే నోరుగాదది. నామొగుడు వోల్లమ్మ ముందర నోరుగూడా దెరవడు. ఎప్పుడన్నా తెర్సినా నన్ను దిట్టేదానికే. వుత్త దద్దమ్మ. మూడురాత్తుర్లు జరక్కముందే నాకుదెల్సిపొయ్యింది… పెద్దగాండ్లపొయ్యిలోకొచ్చి పడ్నానని.

పెండ్లయ్యిన మర్రోజే మాయత్త మా మొగుడూపెళ్ళాలు పొణుకోనుండారని గూడా సూడకుండా పొరకతో దెమదెమా తలుపును గొడ్తా సెత్తదోస్తా వుండాది. పంజేసుకుంటా కొడ్తావుండాదేమో అనుకోని మల్లా ముడుక్కోని పొణుకున్నా. నేను లేశి బైటికొచ్చేదాకా ఆడ్నే తోస్తా వుండాది. లేశొస్తానే “అప్పుడే లేసేస్తివా…బాయికాడికి బొయ్యి రెండు బిందెలు నీల్లుదెచ్చి అండాలోబోసి నీల్లకిందట్ట మంటెయ్యి..బిన్నిగా నీల్లుబోసుకోని దీప్ము బెట్టెయ్యి. మల్లి మనిద్దురూ అన్నం జేసుకుందారని’’….నవ్వతా నవ్వతా పనంతా నాతోనే జేపిచ్చేసింది మాయత్త.

మెట్నిల్లుగదా… పనిజేస్తే తప్పేవుండాదిలే అని జుట్టు ముడేసుకోని మాయత్త దగ్గిర పొరక దీసుకున్నా. పనంతా అయిపొయ్యినాక వంటింట్లోకి బొయ్యి ఏంజేద్దామత్తా టిపనుకి అంటె సద్దుండాది తాగెయ్యి..కూరేమన్నా జేసుకుందారి మద్దేనానికి అనింది. కొత్తపెల్లికూతురికిఎవురన్నా సద్దిబోస్తారా…? నా నోరట్టా తెరసక పొయ్యింది. ఇంగేం జేసేది…అత్తయ్యి పొయ్యె..వొచ్చి వొకరోజైనా కాలా… ఏంటికి జగడాలేసుకునేదని గొమ్మునైపొయ్నా. ఏదో వొగిటి తినేసి..కూరజేద్దారని పప్పేడుందో ఎతకతా వుండా.. నేందెచ్చిస్తా వుండని చాటెత్తుకోని వొంటిల్లుకానుకోనుండే రూము బీగాలు దీసుకోని లోపలికి బొయ్యింది. నేంగూడా యనకమ్మిడి పొయ్యినా..

లోపలంతా దొంతులు పేర్శి పెట్టిండాది. వొగొయిటే దించి కొంచుం పప్పు, లెక్కేశి నాలుగు మిరక్కాయిలు, తెలగెడ్డ వొల్చి రొండు రెబ్బలు, కొంచుం తిరగబాత సామాను వొక శిబ్బిడిలో యేశి ఇచ్చింది. గొమ్మునే తీస్కోని బైటికొచ్చినా.. నా యెనకాలే వొచ్చేసి మల్లీ బీగాలేసేసింది. బొంతాడుకి బీగాలు తగిలిచ్చుకోనుండాది. అప్పుట్నుంచి ఒక పదేండ్లు ఆ గడపలో సంసారం జెయ్యాలంటే సావే నాకు.

కూల్ది మాదిరి తెల్లారి లేస్తే నడిజాము దాకా పనిజేస్తానే వుండాల. యెప్పుడన్నా యేమారి కుచ్చున్నానంటే లంజల మాటే మాటాడ్తాది మాయత్త. పొరకతో గొట్తా..ఛాటతో గొట్తా…చెప్తో గొట్తా … అంటా కుక్కమింద పిల్లి మింద సాకు బెట్టుకోని తిడ్తానే వుంటాది.

ఇంతాజేసి ఇంట్లో యామన్నా సొంతముందా అంటె అదీలే..నూనెసుక్క, శెనిగ్గింజె గూడా బొంతాడుకుండే బీగాలు దీసి ఇస్తేనే గెతి. ఒకసుక్క నూని జాస్తిబోసి యేవన్నా జేసేస్తే ఇంగంతే. ఈదాట్లు ఆడేస్తాది. జుట్టుబట్టుకోని ఈపుమింద గుద్దిగుద్ది నడుములు ఇరగ్గొటేస్తింది. పనంతా ఐపొయ్యినాక ఎప్పుడన్నా టీవీ ముందర కుచ్చుంటే సాలు…వొచ్చి టీవీ ఆపుజేసేసి యాదోవొగ పనిజెప్తింది. నేనెప్పుడు యేం జెయ్యాలనేది ఐవోరి మాదిరి ఒగదానియెనకాల వొగిటి జెప్తానే వుంటింది. బొట్టుగట్నోడన్నా అన్ని నీల్లు బోస్తాడంటే ..అయ్యోరామ! యెప్పుడూ అమ్మకొంగు బట్టుకోని తిరగతావుంటాడు. సావుకో, దినాలకో వూరికి బొయ్యిందంటే నన్నెట్ట మెడ్తోగొట్టాలో జెప్పిచ్చేసి బోతాది. థూ.. ఈ బతుకు బతికేదానికంటే వడిశాకు మింగి సస్తేనే మేలు. వొగిటికి నలుగురు బిడ్లుండారు..అందురూ అవ్వ సుట్లానే తిరగతా వుంటారు.వీల్లకు నేనో కూలిది…అంతే..

ఆడికో అమాసకో మొగునిపక్కన పొనుకుంటే ఆడాణ్ణే తిరగతా వుంటింది. ఎందురు బిడ్లను కనాలనేది గూడా మాయత్తే జెప్పింది. నెలదప్పినప్పిట్నించి ఒగ మాత్తర మింగింది లేదు… ఆసుపత్రికి బొయ్యింది లేదు. అన్నీ ఇంట్లోనే. నెలదప్పినప్పుడు గానిగాడే పన్లు వొచ్చేస్తే పచ్చి పరిందికాయి తినిపిచ్చేసి కడుపు తీసేస్తింది. కనిండేది నలుగుర్నయితే..పొయ్యిండేది మూడు. వొద్దంటె ఇనేది యొవురు??

పిండాకాపుగ్గూడా …ఎవురు జస్తారా…యాడ దినాలకాడికి పొయ్యి తిందామా అని కాస్కోనుంటావుండా…ఈ ముసిల్ది అట్టగూడా నన్ను తిన్నీకుండా ఆడిగ్గూడా ఎలబారి పూడస్తాది. ఎట్టజచ్చేది??
పంచాయితీలు బెట్టి మాట్టాడిస్తే గూడా లాభంలా…ఇట్టగాదని నేనే నోరు అడ్డమేసుకోని ఎంతమాటోస్తే అంత మాట అనేసేది మొదులుబెట్నా..అట్ట అత్తదగ్గిరా…ఇట్ట మొగుడి దెగ్గిరా ఈపు పగిలిపొయ్యేది. బొట్టుగట్టిన ముండాకొడుకు నలుగురు బిడ్లను కనిచ్చినానన్న అరువు గూడా లేకుండా కుక్కకంటే ఈనంగా ఇదిలిచ్చి కొడ్తా అమ్మను యెనకేస్కోని వొచ్చి ఇంట్లో నుండి పోవయ్ అనె..

యాడికి బొయ్యేది నేను ? మొగుడ్ని వొదిలేసి పుట్టింటికి బోతే పొరకదెబ్బలే… కస్టంవొచ్చిందని మాయమ్మోల్లు కడుపులో బెట్టుకుంటే గూడా వూల్లోల్లు గొమ్మునే వుంటారా ? వయసుకొచ్చిన ఆడది వొంటిగా వుంటే వూర్లో యెదవల కండ్లన్నీ దానిమీదే గదా ? అమ్మగారింట్లో బాగుంటే నేనీడ యెందుకు ఇట్ట సస్తా?
ముసిల్దానికి యాదన్నా మందు బెట్టాల అని, మాయమ్మతో జెప్తే ఎవురో ఐవోరి దెగ్గిర మందు దెచ్చిచ్చింది. మంతరమేసిన ఎండు నిమ్మకాయ పొట్టు .. అత్తకు దెలీకుండా అన్నం లో, కూర్లో కలిపి నలభై ఐదు దినాలు తినిపిచ్చేసినా.అదిగూడా పనిజెయ్యలా..

కాపురానికొచ్చిన పదేండ్లలో నాకు దెల్సిందొగిటే…మాయత్త ఎవురికీ బైపడ్దు. దేవుడొచ్చినోల్లకు…దెయ్యమొచ్చినోల్లకు తప్ప. యింట్లోకి దెయ్యాలు రాకుండా రాగిరేకులు బెట్టిచ్చేది , నిమ్మకాయిలు కట్టిచ్చేది జాస్తి . పిలకాయిలికి వొల్లు బాగలేకపోతే గాలి బట్టుకునేసిందని మెళ్ళో మంత్రించిన దండేసి , దిస్టిదీసి ఎర్నీల్లు మూడు దోవల మద్దెలో బొయిపిస్తింది .

అట్నే వూర్లో యాడ ఎవురికి దేముడు వొంటి మీదికి వొచ్చినా మాయత్త ఆడికి పూడిస్తింది . పూజబెట్టి , కర్పూరం దిగదీసి దేముడు దిగిపోయ్యేదాకా ఆడ్నే వుండేసి వొస్తింది . ఆమికి ఏందన్నా బాదుంటే చెప్పుకోని జవాబులు దీసుకుంటింది . రావుకాలం ,అమావాస్య పూజలు జెయిపిస్తింది . పడవ పడిపొయ్నా ఈపన్లు మాత్రం సచ్చినా నిలపదు . నేను మాయత్తను బైపడిచ్చాలంటే నన్ను దేవుడన్నా పూనాల…లాకపోతే దయ్యమన్నా పట్టుకోవాల.
***
ఆదినం మావూర్లో కొన్నిండ్లు అంటుకునేసినాయి..ఎవురో బీడీ తాగేశి పూరింటిపైన పారేశింటారు…వూరికేదో ఐపొయ్యిందని అందురూ ఎవురికొచ్చిన కతలు వాల్లు చెప్పుకునేస్తావుండారు…మాఇల్లు మిద్దిల్లే …ముందరే ఇంగో సుట్టిల్లుంది…బోదిల్లు. మాయత్త ఫానేసుకోని మిద్దింట్లో పొనుకుంటే నేను నడ్జాము దాకా పంజేసి ఆ సుట్టింట్లో పొనుకోవాల. ఈఇల్లు అంటుకోని కాలిపూల్లేదే అని అనిపిచ్చింది. మాయత్తను బయిపడిచ్చల్లంటే ఇప్పుడైతేనే సరిగ్గా వుంటింది అనుకోని..కాపీబెట్టుకోని వొస్తావొస్తా పొరకపుల్ల వొగిటి అంటిచ్చి బోదలో గుచ్చేసి వొచ్చేసినా.

మాయత్త కాపీదాగతా…ఎవురన్నా శాతబడి జేస్తేనే దెయ్యాలొచ్చి అట్ట ఇండ్లంటిచ్చేస్తాయని జెప్తావుంది. నేనా సుట్టిల్లుని జూస్తా ఇంటావుండా…అంటుకునేసింది. మాయత్త భయిపడింది ఆదినం జూసినా నేను.. నాకప్పుడొచ్చింది పదేండ్లు నాకు గెవనం లేని నొవ్వు. పొండ్లు బిగబట్టుకుంటే కూడా నోరు టకటకా కొట్టుకుంటాండాది. మాయత్త ఈసారి నన్ను జూశేశింది. ఏంటికి మేయ్ అట్ట నవ్వతా వుండావు..మూస్కో ఇంగ అనింది. ఇంకొంచుం గెట్టిగా నొవ్వినా.. ఆదినం కొంపలో గూడా ఎవురూ లేరు. చెయ్యెత్తుకోని కొట్టేదానికి నాదెగ్గిరికి వొచ్చింది. చెయ్యట్నే పట్టుకోని ఇంగా గెట్టిగా నొవ్వినా…నాకు దెయ్యం బట్టేసిందని అరస్తా పరిగెత్తింది బైటికి. నొవ్వినొవ్వి దొక్కనొప్పొచ్చేసి అట్నే పడిపొయ్యి నిద్దరబొయ్యినా. లేసినాక భయిం భయింగా వొచ్చి ఏమైందే నీకు?? గాలేమన్న సోకిందా అనింది. ఏం తెలీనట్టు బిత్తర సూపులు జూసినా..మల్లొక వారం దినాలు….నామీదకు చెయ్యెత్తలా..

ఇంటికెవురన్నా వొస్తే నాకు దెయ్యంబట్టిందని గుసగుసగా జెప్పేది నేను ఇనిండా. వారం దినాలికి మల్లీ పెత్తనం జేసేదానికి జూస్తే నాకింకోసారి దెయ్యమొచ్చి తిక్క కుదిరిచ్చింది. ఇట్టగాదని మాయత్త దయ్యాలొదిలిచ్చే వోల్లను పిల్చుకోనొచ్చి నన్ను సావగొట్టించే పనిబట్టింది. ఆ దెబ్బలు బరించేదానికి నావల్ల గాలా. ఆనాబట్లొచ్చి ఇది మొండిదెయ్యం…బాగా దెబ్బలుబడ్తేగానీ వొదల్దు అని యాపాకులు, యాప సులగ దెచ్చి నేను యాడస్తా, పరిగిత్తా వుంటేగూడా వొదలకుండా యాడివాడ ఇరగ్గొటేస్తా వుండ్రి. నాకు బట్టిండేది శానా మొండిదెయ్యం. మాయత్త దెయ్యం కొంపలోనుండిబోతేనే నాగ్గూడా దెయ్యం వొదిలేది. కొన్నిదినాలు దెబ్బలు వోర్సుకున్నా…ఇంగ నావల్ల గాలా .
దెయ్యాన్ని పంపించేసి మల్లీ కూలి పని మొదులుబెట్నా..దెయ్యాన్ని నావొంట్లోనించి తరిమేసినాక మాయత్త కొంపలో పూజ్జేసేది ఎక్కువైపోయ..నాపని మల్లీ మొదిటికొచ్చేసింది.

ఈతూరి ఇట్టగాదని మాయత్త పూజ్జేసే రెండ్రోజులూ సాయంకాలమైతే వూగడం మొదులుబెట్నా… మల్లీ దయ్యాన్ని తరిమేసే మంత్రగాల్లు వొచ్చేసినారు . యాపమండ తో ఒకదెబ్బ పడిందో లేదో ‘దేముడో దెయ్యమో తెల్దారా నా బట్టల్లారా … అమ్మోరిమిందనే సెయ్యెత్తినారా … మీ బతుకులు అగ్గయ్యి పోతాయిరా ‘ అని ఉరిమి చూసినా . దెబ్బకు నాకాల్లు బట్టుకోని తిరిగి మల్లి సూడకుండా పరిగెత్తినారు నాకొడుకులు. ఈసారి నాకు దేముడొచ్చింది…అమ్మోరు…అంకాలమ్మ. “సేయ్ ఎంగిటీ “అంటే మాయత్త పరిగెత్తుకోనొస్తింది. నాకిప్పుడు కోడ్నికోసి వొండిపెట్టంటే గెంటగొట్టే లోపల గిన్నె నా ముందరుంటింది. నాకిప్పుడు పట్టుకోక గట్టి , బీరువలో బంగారు బొంతాడు తెచ్చి యెయ్మంటే, తెచ్చిచ్చి పూజ గూడా జేస్తింది. నాక్కోప్మొస్తే కర్పూరం చెయ్యిపైన ఎలిగిచ్చేసి దిగదీస్తింది. నేనిప్పుడు మాయత్తకు, నా మొగుడికి దేముడు.

మొన్నీమద్దె మాయత్త పెళ్ళో ఇరగబడి తుంటి ఇరగ్గొట్టుకునింది. మాయత్త బొంతాడు బీగాలు ఇప్పుడు నా తిత్తిలో ఉండాయి. మొగుడు, పిలకాయిలు నాతో బాగనే మాట్టాడ్తా వుండారు. నా ఇంట్లో పెత్తనమంతా నాదే. నాకిప్పుడు పెండ్లయ్యి మల్లీ కొత్తపెల్లికూతురైనట్టు వుండాది. ఇప్పుడీ కొంపంతా నాదే..నన్ను కొట్టేవోల్లు, తిట్టేవోల్లు ఎవురూలేరు. ఇప్పుటికి నెమ్మతైపొయ్యింది నాకు. నా పని నేంజేసుకుంటా..నాకు ఇస్టమొచ్చింది వొండుకోని తింటా..దేముడొచ్చినట్టు నాటకాలు ఎయ్లేక ఇంగ నిలిపేద్దారా అనిపిస్తింది.గానీ నాబతుకు నాగ్గావాలంటే నేనీ పని జెయ్యాల్సిందే.

మా ఇంటికొచ్చిన డాకట్రు జెప్పినాడు…వొల్లు నీరసించిపోతే ఇట్టాంటి దయ్యాలు, దేవుల్లు వొచ్చినట్టు అనిపిస్తిందంట. నేను వీల్ల దెగ్గిర తన్నులు తప్పించుకునేదానికి దేవుడమ్మ అయిపొయ్యినా..

దొంగ దేవుడమ్మనే నేను. కానీ ఈ ఇసయం మన మద్దెనే వుండాల. మాకొంపలో వోల్లకు తెలీగూడ్దు. కస్టమొస్తే వురేసుకునేవోల్లను నేను శానామందినే జూసిండా. నేనుగూడా యాడస్తా నా బతుకింగ ఇంతే అనుకొనింటే ఆరోజుకి యెత్తేసి నామొగుడికి ఇంగో పెల్లాన్ని తెచ్చేసింటాది మాయత్త. ఏదోవొగ యాసమేసి దేవుడిచ్చిన బతుకుని ముగిసిపొయ్యేదాక ఈదల్ల.

పాపుదేశి ఝాన్సీ

30, మార్చి 2014, ఆదివారం

నిర్జనవారధి











సమాజంలో మౌలిక మార్పులు కోరే సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, విప్లవోద్యమం, నక్సల్బరీ ఉద్యమం అనే నాలుగు ఉద్యమాల వారధి కొండపల్లి కోటేశ్వరమ్మగారు. ఈ ఉద్యమాలలోని స్త్రీల పోరాటపటిమకు, వేదనకు కూడా ఆమె ప్రతినిధి. కోటేశ్వరమ్మ మూర్తీభవించిన ఉద్యమ రూపం. “నిర్జన వారధి” కోటేశ్వరమ్మగారి ఆత్మకథ. ఆమె జీవితం చదువుతుంటే ఒక వ్యక్తి జీవితంలో ఇంత దుఃఖం ఉంటుందా అని మనసు ఆర్ద్రమవుతుంది.
ఒడిదుడుకుల జీవితం
''నిర్జన వారధి'' .. ఈ మాట ఏదో అస్పష్టమైన విచారాన్ని తలపిస్తుంది. ఈపేరు వినగానే ఒకరకమైన విషాద దృశ్యం కళ్లముందు కదలాడుతుంది. నాలుగు ఉద్యమాలతో పాటు మూడు తరాలకు వారధి అయినా చివరికి ఆమె ఒంటరిగానే మిగిలిపోయింది. భర్త కొండపల్లి సీతారామయ్యతో ఒడిదుడుగుల అనుబంధం, పిల్లల మరణం లాంటి అనేక ఆటుపోట్లతో నిత్యం సంఘర్షణ అనుభవించిన కోటేశ్వరమ్మ స్వీయ కథే నిర్జన వారధి.
పుస్తకాలే ఆమె నేస్తాలు..
కోటేశ్వరమ్మ బాల వితంతువు. హైస్కూల్ చదువు కూడా లేని ఆమెకు ఆర్థికంగా ఏ ఆలంబనా లేకుండా పోయింది. అయినా ఎవరి సహాయమూ తీసుకోకుండా స్వశక్తితో తన కాళ్లపై తాను నిలబడటానికి నిశ్చయించుకొని, 35ఏళ్ల వయసులో హైదరాబాద్ ఆంధ్ర మహిళా సభలో మెట్రిక్ చదివారు. చదువుకుంటూ తనను తాను పోషించుకున్నారు. అనంతరం ఆమె సాహిత్యం వైపు అడుగేశారు. ఎన్నికష్టాలు ఎదురైనా సాహిత్యమే తనను బతికించిందని, పుస్తకాలే తన నేస్తాలని, అక్షరాలే తనకు ఆరోగ్యానిస్తాయని కోటేశ్వరమ్మ చెబుతారు.
ముందుమాటలో..
'' జ్ఞాపకాలను తట్టి లేపితే కన్నీటి ఊట ఉబికి వచ్చే జీవితం నాది. ఆ కన్నీటి ప్రవాహాన్నే కథగా మలిచాను. నా జీవిత కథ చదివిన పాఠకులు ఇది సంఘ శ్రేయస్సు కొరకు రాయబడిందనుకుంటే సంతోషిస్తాను. నా కథ మనిషిలోని మంచిని ఏ కొంచెమైనా పెంచుతుందనుకుంటే నా శ్రమ ఫలించిందనుకుంటాను. ఇన్నేళ్ల నా బ్రతుకు వృథా కాలేదని తెలిసి తృప్తిపడతాను'' అని కోటేశ్వరమ్మ 'నిర్జన వారధి' ముందుమాటలో తెలిపారు.
సత్యవతి విశ్లేషణ
'నిర్జన వారధి'ని కొండపల్లి సత్యవతి విశ్లేషించారు. 92 సంవత్సరాల వయసులో కోటేశ్వరమ్మ రాసిన ఈ పుస్తకం ప్రజలకు అందుబాటులోకి రావడం అదృష్టమన్నారు. కోటేశ్వరమ్మ జీవితంలోని సంఘర్షణను ఈ పుస్తకంలో పొందుపరిచారని తెలిపారు. తన జీవితంలోని బాధలకు ఎక్కడా ఎవరినీ నిందించని గొప్ప వ్యక్తిత్వం కోటేశ్వరమ్మదని పేర్కొన్నారు. ఈ పుస్తకం చదివితే ఆమె వ్యక్తితం ఎంతో ఉన్నతంగా కనిపిస్తుందని తెలిపారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎక్కడా తొణకని స్వభావం కోటేశ్వరమ్మదని కొనియాడారు. ఈ పుస్తకం చదివే వరకు ఆమె జీవితంలో ఇంత విషాదం ఉందని ఎవరికీ తెలియదన్నారు. తనను వదిలేసిన భర్త తిరిగి కొన్నేళ్ల తర్వాత రమ్మని పిలిస్తే ఎంతో హుందాగా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారని సత్యవతి వివరించారు.
ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా జీవిత పోరాటాన్ని సాగిస్తున్న కోటేశ్వరమ్మ జీవితం భావితరాలకు 'వారధి' గా నిలుస్తుంది. 

ఫై వ్యాసం 10 టీవీ  నుంచి  తీసుకోనపడింది.

నా అభిప్రాయం :

 
ఈరోజు లో చిన్న చిన్న విషయాలకే అనేకమంది ఆత్మహత్యలు  చేసుకుంటున్నారు. కోటేశ్వరమ్మ  గారి జీవిత చరిత్ర ఎంతోమందికి ఆదర్శం అవుతున్ది. 
 
 
అడుగడుగునా కోటేశ్వరమ్మ గారి జీవితం లో కష్టాలు ఎన్ని వచ్చిన  ఆమె పదేపదే పైకి ఎగసే ఫీనిక్స్‌ పక్షి లానే
మొక్కవోని ఆత్మవిశ్వాసం  తో జీవించారు. 
 
 
భర్త కొండపల్లి సీతారామయ్యతో విభేదాలు ఒంటరిని చేస్తే 36 ఏళ్ళ వయసులో మెట్రిక్ పాసయ్యి  జాబు తెచుకున్నరు. 
 
కరుణ, చంద్ర  వీరి  పిల్లలు. రమేష్ ( అల్లుడు) మరణం తరువత కరుణ ఆత్మహత్య. చంద్ర ఎన్కౌంటర్. అ ఫై తల్లి మరణం . 
ఒక  మనిషికి ఎన్ని బాధల అనిపిస్తున్ది. 
 
కొండపల్లి సీతారామయ్య గారి చివరి రోజుల్లో ఆయన్ని కలవమని మిత్రులు ఒత్తిడి తెచ్చినపుడు తన అయిష్టతని వ్యక్తం చేస్తూ ‘ఆయన పాలిటిక్స్‌ ఆయనవి నా పాలిటిక్స్‌ నావి’ అని అనుకోగల ఆత్మవిశ్వాసం కోటేశ్వరమ్మగారిది. ఆఖరిదశలో కోటేశ్వరమ్మతో కలిసుండాలన్న ఆకాంక్షను సీతారామయ్య వ్యక్తం చేసినపుడు ‘యాజ్‌ ఎ ఫ్రెండ్‌గా ఉండటం వేరు. ఈ భార్యాభర్తల గొడవ నాకొద్దు’ అని సున్నితంగా తిరస్కరిస్తారు.
కోటేశ్వరమ్మ గారి జీవితంలోని పలువిషాద సంఘటనలు కంటతడి పెట్టించి మనసుని ఆర్ద్రం చేస్తాయి. అయితే అది నిస్సహాయ దుఃఖం, నిరుపయోగశోకం కాదు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 





 

22, మార్చి 2014, శనివారం

ఊగులోడు - ఆర్.రాఘవరెడ్డి




ప్రకాశం జిల్లా గ్రామీణ మాండలికం లో  రాఘవ రెడ్డి గారు రాసిన హాస్య కధ మీ కోసం. 



వాడ్నందరూ 'ఊగులోడు' అంటున్నారంటే అనకేం జేస్తారు. అది చిన్న పని గానీ, పెద్ద పనిగానీ, ఒక పట్టాన తెగనియ్యడు, తెల్లారనియ్యడు. ఏ విషయమైన సరే, ఎట్టాంటి నిర్ణయమైన సరే ఎనక్కీ ముందుకీ, ముందుకీ ఎనక్కీ, ఊగిసలాడతానే ఉంటాడు.

వారం రోజుల కిందటొకరోజు ఎప్పుట్లాగానే గొడుగు, నీళ్ళసీసా తీసుకోని బరెగొడ్లిప్పుకోని చేనుకి పోతన్నాడు. మిట్టచేను దాటాడు. అల్లంత దూరంలో ఎనికపాటోళ్ళ ఏపచెట్టు ఉందనంగా ఎనకనించెవరో తోసినట్లు ముందుకి తూలాడు. మందు ఎక్కువైనోడిలాగా తూలుకుంటా తూలుకుంటా రెండడుగులేసి గెనెం మీద ఆమేన కూలబడ్డాడు.

చెట్టు నీడన కూర్చోనున్న రాజయ్య ఇది చూసి పరుగెత్తుకుంటా వచ్చాడు. "ఏమైందిరా... వచ్చే వచ్చే వాడివి అట్టా కూలబడిపోయ్యావు..." అంటా పైకి లేపి బుగ్గలు తట్టాడు. ఊగులోడు కళ్ళు తెరిచి పైకి లేచి రెండడుగులు ముందుకేసి మళ్ళీ పడిపోయాడు. దూరంగా కాలవకట్టన గొడ్లు మేపుకుంటన్నోళ్ళు కూడా వచ్చి చుట్టూ మూగారు. ఊగులోడ్ని మోసుకొచ్చి చెట్టు నీడన పడుకోబెట్టారు. ముఖాన కాసిని నీళ్ళు జల్లారు.

కాసేపటికి కళ్ళు తెరిచాడు. "ఏంది మావా"
"ఏందిరా"

"ఎట్టాగుందిరా"
అందరూ ఒకేసారి ఆదుర్దాగా అడుగుతున్నారు. ఎవరో మంచి నీళ్ళు తెచ్చిచ్చారు. రెండు మూడు గుటకలేశాడు. అంతలోనే లేచి పక్కకొచ్చి వాంతి చేసుకున్నాడు. "కళ్ళకేమి అగపడ్డం లేదు .... అంతా తెల్లగా బూజరగా ఉంది" అంటా కూర్చుండి పోయాడు.

'కూడు తినకుండా పొలం బయలుదేరాడేమో'

'నీరసమ్మీద కళ్ళు తిరిగినట్టుంది'
'వాతం కమ్మినట్టుంది'... తలా ఒక రకంగా ఊహిస్తున్నారు. రాజయ్య సీసాలోని చల్లటి నీళ్ళు తెచ్చి మొహం కడిగాడు.

"ఇప్పుడు కనపడతందంట్రా?"
"కనపడతంది మావా" ఊగులోడు నీరసంగా చెప్పాడు.

మాయిటేళ ఇంటికి పొయ్యేటప్పుడు జొన్నకోసుకెళ్ళాలని బండికట్టుకొనొచ్చిన సుబ్బారెడ్డిని కేకేశారు. గెనాల మీద ఎగిరెగిరిపడతా బండి ఊళ్ళోకి వేగంగా పోతంది. ఊగులోడి గుండె అంతకన్నా ఎక్కువగానే ఎగిరెగిరిపడతా ఉంది. అంతకన్నా వేగంగా కొట్టుకుంటా ఉంది.

ఊగులోడికసలే భయమెక్కువ. ఏ చిన్న సమస్య వచ్చినా కంగారు పడిపోతాడు. ఇట్టయిద్దేమో అట్టయిద్దేమో అని అవకముందే బెంబేలు పడుతుంటాడు. ఇప్పుడిట్లా తూలుడొచ్చి పడిపోవడానికి కారణమేందో అర్ధం కాక గుబులు పట్టుకుంది. జెరెం, గిరం ఏమీ లేకపాయే. ఇప్పుడు ఉన్నట్టుండి ఇట్టా ఎందుకయినట్టు? కొంపదీసి ఫిట్సేమో ...? ఆ మాట అనుకోటానికే భయం పుట్టింది.

తనకిష్టం లేని, మనసుకి కష్టం కలిగించే సంగతుల్ని గుర్తుకు తెచ్చుకోవడం కూడా ఇష్టముండదు ఊగులోడికి. వాటిని కావాలనే మర్చిపోతాడు. జ్ఞాపకాల పెట్టెలో ఎక్కడో అట్టడుక్కి వాటిని తోసేస్తాడు. ఎప్పుడన్నా ఆ ఆలోచనలొచ్చినా ... ఎంబట్నే మనసుకి మరేదో విషయం మీదకి మళ్ళించేస్తాడు.
అయితే ఒక్కోసారి కొన్ని ఆలోచనలు ఎదురు తిరుగుతాయి. ఏం వద్దనుకుంటాడో అవే గుర్తుకొస్తుంటాయి. ఆ రాత్రీ అట్లానే జరిగింది ఊగులోడికి. “ఛ! మనకేం లేదులే. మూర్చలేదు. ఏం లేదు. అదయితే నోటెంట నురుగు రావటం, గుప్పిళ్ళు బిగబట్టడం ఉంటై గదా. ఏదో, మామూలుగా కళ్ళు తిరిగినయ్యంతే” అని తనకు తాను చెప్పుకుని పడుకున్నాడు. కాని నిద్రపడితేగా. రాత్రంతా ఏదో గుబులు.

తనూ నిద్రపోలేదు, భార్యనీ నిద్రపోనియ్యలేదు. ఆ పిల్ల పెళ్ళయిన పదేళ్ళుగా ఊగులోడి యవ్వారం చూస్తానే ఉంది . పిల్లల్లేరనేగానీ మొగుడే ఒక చిన్న పిల్లోడా అమ్మాయికి. నిజానికి ఊగులోడు చానా తెలివైనోడు. ఏ విషయమైనా సరే విభజించీ విడగొట్టీ పీసు పీసు జేసి పాయింట్లు లాగుతుంటాడు. వీడి ‘లా’ పాయింట్లకి జవాబు చెప్పలేక 'ఒట్టి పెడనాయాల్రా ఈడు' అంటుంటారు ఊళ్ళోవాళ్ళు.

చిన్నప్పుడే నాన్న చనిపోయినా పొలం పనులన్నీ అమ్మే చూసుకుంటా బడికి పంపించింది. పక్కూళ్ళో హైస్కూలుకి రోజూ పది మైళ్ళు నడిచి వెళ్ళొచ్చేవాడు. బాగా చదివేవాడు. పదో తరగతి స్కూలు ఫస్టోచ్చాడు కూడా. పరీక్షలు జరుగుతుండగానే అమ్మకి జబ్బుచేసి ఆసుపత్రిలో చేరడం, తరవాత ఆమె చనిపోవడంతో ఊగులోడి చదువాగిపోయింది. నాలుగేళ్ళపాటు తనింట్లోనే పెట్టుకుని కూతుర్నిచ్చి పెళ్ళి చేశాడు మేనమామ. పెళ్ళినాటిని ఊగులోడికి నిండా ఇరవై కూడా లేవు. ఆ పిల్లకి మైనారిటీ కూడా తీరలేదు. 'మీ నాన్నని ఇప్పుడైనా అరెస్టు చేయించొచ్చు ఈ పాయింటు మీద' అని అప్పుడప్పుడు ఆ పిల్లని ఆట పట్టిస్తుంటాడు.

ఆ అమ్మాయి తనంత తెలివయింది కాదని ఊగులోడి అభిప్రాయం. కానీ ధైర్యంలో మాత్రం తనకంటే పది రెట్లు మేలని వాడికి ఖచ్చితంగా తెలుసు. ఒకటికి మించిన మార్గాలున్న సమస్య ఏదైనా వచ్చిందా... ఊగులోడికి చచ్చేచావొచ్చిందన్న మాటే. అసలు ముందు కాసేపు ఏం తోచదు. బ్లేడు లాగిన మడిచెక్కలాగా మైండంతా ఖాళీగా అయిపోద్ది. అట్లా చెయ్యాలా ఇట్లా చెయ్యాలా అని అట్లా ఇట్లా కాదు అనీ ... మూడు పొద్దులు, మూడు రాత్రులు అదే పనిగా ఆలోచిస్తానే ఉంటాడు.

ఈ లోపు ముప్ఫై మూడు సార్లు 'ఏం చేద్దామంటావే' అని భార్యనడుగుతాడు. ఆ అమ్మాయికి తెలిసిన విషయాల్లో ఆమె సలహాలడుగుతాడు. తెలియని విషయాల్లో కూడా అట్లానే అడుగుతాడు. 'నీ ఇష్టం' అంటేనేమో "నా ఇష్టం సరే, నీ ఇష్టమేందని గదా అడుగుతుంది. నీకొక అభిప్రాయముండదా..." అంటా 'లా' పాయింట్లు దీస్తాడు. సరే ... ఏదో తనకు తోచింది చెబుతుందా, 'అట్టెట్టయిద్ది, ఇట్టెట్టయిద్ది' అని మళ్ళా తగులుకుంటాడు. ఆ అమ్మాయి చెప్పినట్లు చేసి ఆ పని కొంచం అటూ ఇటూ అయిందంటే, "ఛ ... నువట్లా చెప్పబట్టి గదా ఇప్పుడిట్లా అయ్యింది" అని కొన్ని రోజుల పాటు సణిగినోడు సణిగినట్టే ఉంటాడు.

ఉదయం చేనికాడ తను పడిపోవడం గురించి కూడా తనకు తోచిన రక రకాల భయాలన్నీ పెళ్ళాంతో చెప్పాడు. అన్నిట్నీ కొట్టిపారేసిందా పిల్ల. "పొట్టలో బాగాలేదని పొద్దున్నే ఏం తినకుండా పొలం బోతివి. చిరచిరలాడే ఎండకి కళ్ళు తిరిగి పడిపోయ్యావంతే" అని ఎప్పట్లాగానే ఊగులోడికి ధైర్యమిచ్చింది.

'అంతే అంతే' అనుకోని కళ్ళు మూసుకొని పడుకుంటాడు, అంతలోకే సీసాలోంచి భూతం బయటకొచ్చినట్టు ఏదో ఒక అనుమానం. భార్యని లేపుతాడు.
"మరి... కళ్ళకేమీ అగపడకుండా తెల్లగా బూజరగా ఉండటమేంది ఒక నిమిషం సేపు?..."

"నీరసమ్మీద పడిపోతే అట్లాగే ఉండిద్దిలే..."

"ఛ. స్పృహ తప్పి పడిపోవటానికీ, కళ్ళు కనపడక పోవటానికీ సంబంధమేందే...?"

ఆమె తన పాత జవాబే మళ్ళీ ఇంకాస్త గట్టిగా చెబితే వినాలని వాడి కోరిక. ఆ అమ్మాయి గోడమీద టైం చూసి వాడివైపు తిరిగి ఆవులిస్తూ "సరే, రేపు ఒంగోలు... డాక్టరు దగ్గరకి వెళ్ళొద్దాంలే" అంది.

"ఛ! డాక్టరు దగ్గరకెందుకే ... వాళ్ళు ఏదేదో చెబుతారు. ఏదో కళ్ళు తిరిగుంటయ్యంతేలే. పడుకో పడుకో ... అర్ధరాత్రి అవతంది" అంటా పడుకున్నాడు.
తెల్లారి లేచి గుబులు గుబులుగానే బరగొడ్లకాడ బాగు చేశాడు. భార్య పాలు పిండింది. పోయి కేంద్రానికి పోసొచ్చాడు. నాలుగు రోజులు గడిచిపోయినయ్. ఏమవుద్దో ఏమవుద్దోనన్న భయం కాస్త తగ్గుతా వుంది. ఎంబట్నే కంగారు పడి ఆసుపత్రికి పరుగెత్తనందుకు సంతోషిస్తున్నాడు.

ఈ రోజు పాల కేంద్రం కాడ అరుగు మీద కూర్చోని పేపరు చదువుతున్నాడు. లోపలెక్కడో అంతరాత్మలో అణచిపెట్టుకున్న భయం పేపర్లో ఆ వార్త చూసి చప్పున పైకి తన్నుకొచ్చింది. ఆ రోజు ప్రపంచ మూర్ఛరోగుల దినమంట! ఆ సందర్భంగా ఎవరో డాక్టరు, ఆ రోగం గురించి పేపర్లో రాశాడు. నోటంబడి నురుగులు రావడం, గుప్పిళ్ళు బిగబట్టడం లాంటి లక్షణాలు లేకుండా కూడా ఫిట్స్ రావొచ్చంట. కొద్ది సమయం పాటు కళ్ళకేమి అగపడకుండా ఉండడం కూడా మూర్ఛ లక్షణాల్లో ఒకటంట.

ఒక్కసారిగా ఊగులోడి వాలకమే మారిపోయింది. ఉషారుగా పేపరు తీసుకున్నోడల్లా చప్పున చల్లారిపోయ్యాడు. మెదలకుండా పేపరు మడతేసి అక్కడ పెట్టి ఇంటికి బయలుదేరాడు. అలవాటయిన దారిగుండా అలవాటయిన కాళ్ళు ఇంటికేసి సాగి పోతన్నయ్యేగాని, ఊగులోడి మనసులో ఏడేడు సముద్రాలు ఎగిరెగిరి పడుతున్నాయి.

ఇంటికొచ్చేసరికి భార్య పేపరు చదువుతా ఉంది. ఊగులోడిని చూసి చదివే చదివే పేపరు మడిచేసి పక్కింట్లో ఇచ్చేసొచ్చింది. ఒళ్ళంతా చెమట్లు పట్టిన మొగుణ్ణి చూసి ఎందట్లా ఉన్నావని అడిగింది. పేపర్లో తను చదివిన వ్యాసం గురించి చెప్పాడు. ఊగులోడు వచ్చేసరికి తనూ పేపర్లో చదువుతున్నది ఆ వ్యాసమేనని, అది చూస్తే ఇంకా కంగారు పడతాడేమోనని హడావుడిగా వాళ్ళ పేపరు వాళ్ళకి ఇచ్చోచ్చాననీ చెప్పింది.

నిజానికా వ్యాసంలో ఫిట్స్ అంటే ఇప్పుడు భయపడాల్సిందేమీ లేదనీ, మందులు వాడుకుంటా ఉంటే శాశ్వతంగా అదుపులో ఉంచుకోవచ్చనీ రాశారు. కానీ, ఊగులోడికి ఫిట్స్ అనే మాటే భయం పుట్టిస్తంది. భరించరానిదిగా ఉంది. ఎల్లకాలం మందులు వాడుకుంటా ఉండాల్సిరావటమనే ఊహే నచ్చట్లేదు. 'ఎక్కడికి పోవాలన్నా ఎవరో ఒకరు తోడుండాలి గదా' అని అనుకుంటంటేనే ఏడుపొస్తంది. ఊగులోడి కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. 'మళ్ళీ మొన్నట్లాగే కళ్ళు కనబడ్డం లేదు నాకు' అన్నాడు. "ఏం లేదులే... నువ్వు భయపడుతున్నావ్... కళ్ళు తుడుచుకో" అంటూ వాడిని దగ్గరకు తీసుకుని మంచం మీద కూర్చోబెట్టి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. తాగాడు.

అప్పటికప్పుడే ఆసుపత్రికి ఒంగోలు బయల్దేరారు. ఒంగోలులో ముందు తమకు తెలిసిన తమ ఊరి డాక్టరొకాయనుంటే ఆయన దగ్గరకి పోయారు. ఆయన ముక్కు, చెవులు, గొంతు డాక్టరు. ఆయనొక పిచ్చి మారాజు. హైస్కూలు పిలకాయలందరికీ ఊరకేనే వైద్యం చేస్తాడు. ఎడాపెడా టెస్టులేమీ రాయడు. 'మనూరి డాక్టరు గదా. ఫిట్స్ డాక్టరు ఎవరికయినా చెప్పి తక్కువ ఖర్చుతో చూపిస్తాడేమో. టెస్టు చేపిచ్చుకుంటే అటో ఇటో తేలిపోద్ది' అనుకున్నాడు ఊగులోడు.

ఆయన ఆప్యాయంగా పలకరించి అంతా విని "ఏం ఉండదులే... నీరసం వల్ల కళ్ళు తిరిగుంటయ్యంతే" అన్నాడు. "ఒక్కసారి నరాల డాక్టరు దగ్గరికి పోయి టెస్టు చేయించుకుంటే మంచిదేమోనని వచ్చామ"న్నాడు.

"ఎందుకూ... ఏం పని లేదా ఏంది? ఇదిగో, ఈ బిళ్ళలు ఒక పదిరోజులు పాటు ఏసుకుంటా బలమైన తిండి తింటే చాలు. నేను గూడా మనూరికే వస్తన్నా. నా కారులో పోదాం రాండి" అని ఎంబట పెట్టుకుని ఊరికి తీసుకుపోయాడు.

ఊగులోడికి ఒక రకంగా సంతోషంగా ఉంది. ఒక రకంగా అసంతృప్తిగా ఉంది. ‘అంతలావు డాక్టరు అంత ధైర్యం చెబుతున్నాడంటే అంతే అయుండాల. ఈ టెస్టులనీ, ఈ టెస్టులనీ డబ్బులొదిలించుకోలేదు, ఇంకా నయం’ అని సంతోషం. ‘ఎదవ డబ్బులు, పోతే పోయినియ్ ... టెస్టు చేయించుకొనుంటే అనుమానం తీరిపోయి మనసుకి శాంతిగుండేది గదా” అని అసంతృప్తి.

ఆ సాయంత్రం పంచాయితీ అరుగు మీద కూర్చోనున్నప్పుడు ఊళ్ళో ఎలిమెంట్రీ స్కూల్లో పని చేసే 'మారుతీసారు' పలకరించాడు. "బాగాలేదంట గదా. ఏంది సంగతి?" అన్నాడు. ఊగులోడు కతంతా చెప్పాడు. అంతా విని "ఒకసారి గుంటూరు పోయి మంచి 'న్యూరాలజిస్ట్' ని కలిస్తే ఎందుకైనా మంచిదేమో, కరెంటు వైరుల్లో కనెక్షన్ లూజయినప్పుడు లైట్లు ఆరిపోయి వచ్చినట్లే ... తలలో నరాల్లో ఏదైనా లూజు కనెక్షనుండి అప్పుడప్పుడు నీకు ఏదైనా కనపడకుండా ఉంటుందేమో" అన్నాడు. దెబ్బకి చచ్చాడు ఊగులోడు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టయింది.

అసలే ఒక అనుమానంతోనే సతమతమవతంటే తల్లో ఏదో నరాల జబ్బేమో అని కొత్త డౌటు రేగిందిప్పుడు. ఆ సారు చెప్పిన ఉదాహరణ గుర్తొచ్చినప్పుడల్లా ఆ కొత్త డౌటు కూడా నిజమయ్యే అవకాశం బాగా ఎక్కువగానే ఉన్నకనపడతంది. 'ఎంతైనా మాస్టారు గదా. సరిగ్గా సరిపొయ్యే ఉదాహరణతో బలే అర్ధమయ్యేట్టు చెప్పాడు' అనుకున్నాడు

ఆ పూట పొద్దు పోయిందాకా ఆ అరుగు మీదే గమ్మున కూర్చోనుండిపోయాడు. మళ్ళీ మళ్ళీ వచ్చి వాలే చీకటీగల్లాగా రకరకాల ఆలోచనలు మనసులో ముసురుకుంటున్నాయ్. అట్లానే కూర్చోని, కూర్చోని ఎప్పటికో లేచి కొంపకి చేరాడు. "రేపు పొద్దున్నే బయల్దేరి గుంటూరు పోయొస్తా. 'వనితా సూపర్ స్పెషాల్టీస్' లొ అన్నీ టెస్టులు బాగా చేస్తారంటా. మారుతీ సార్ చెప్పాడు"

* * *

స్టేషన్ లో రైలు దిగి ఆటో ఎక్కి ఆసుపత్రికి చేరుకున్నాడు. 'వనితా సూపర్ స్పెషాల్టీస్' బోర్డు చదివాడు. రకరకాల రోగాల పేర్లు, వాటికెదురుగా డాక్టర్ల పేర్లు. ఆ రోగాల్లో సగానికి పైగా పేర్లు తనకి తెలియనివే. మెట్లెక్కి లోపలకొచ్చాడు. 'పర్లేదు. రద్దీ తక్కువగానే ఉంది' అనుకున్నాడు. "ఓపిలు రాసేది ఎక్కడ సార్?" ఎవర్నో అడిగాడు. 'ఇక్కడ ఒపీలు రాయరు. ఇది కేవలం పరీక్షలు చేసే బిల్డింగే. అదుగో. ఆ ఎదురుగా ఉంది. అదీ అసలు హాస్పటల్"

అక్కడకి వెళ్ళిన ఊగులోడు ఆ మెట్ల దగ్గర అట్లానే నిలబడిపోయాడు నోరు తెరుచుకోని. తాను దిగొచ్చిన రైల్వే స్టేషన్ కంటే కూడా ఈ ఆసుపత్రే ఎక్కువ హడావుడిగా ఉంది. ఆ జనం మామూలుగా లేరు. 'కొలుపులప్పుడు, తిరునాళ్ళప్పుడు కూడా మానూళ్ళో ఇంత రద్దీగా ఉండదేమో' అనుకున్నాడు.

వొచ్చేవాళ్ళు, పొయ్యేవాళ్ళు, మూలిగేవాళ్ళు, ముక్కేవాళ్ళు, కుర్చీల్లో కూర్చొని టీవీలు చూసే వాళ్ళు, నడవలేకుండా ఉన్నవాళ్ళని చక్రాల మంచాల మీద పొణుకోబెట్టుకొని తోసుకుపొయ్యేవాళ్ళు... –మెల్లగా అడుగులు ముందుకేసాడు. ఎటు వెళ్ళాలో, ఎక్కడ 'ఒపీ' రాస్తారో ఏమి అర్ధమవలేదు. 'ఎనక్కి తిరిగి చూడకుండా ఇట్నించిటే పారిపోదామా?' అనిపించిందొక్క క్షణం.

కొంచం స్థిమితపడి ఒక అద్దాల కౌంటరు దగ్గరకెళ్ళి “"ఒపీలు రాసేదెక్కడండీ?" అనడిగాడు. ఆ అద్దాల వెనకాల ఆమె కంప్యూటర్ మీంచి చూపు తిప్పకుండానే అడిగింది. "ఏం కంప్లయింటు?"

"లూజు కనెక్షన్" అప్రయత్నంగా అనేశాడు మారుతీసారు మాటలు మనసులో తల్చుకుంటున్న ఊగులోడు. "ఆ ...?" ఇప్పుడు తలెత్తిందా అమ్మాయి.

"నరాల డాక్టరుని కలవాలమ్మా?"

"అయితే ఇక్కడే. రెండు వందల రూపాయలివ్వండి" ఇచ్చాడు. పేరు, ఊరు, వయసు కంప్యూటర్లో రాసుకుంది.

'నాకు కార్డేమి ఇవ్వలేదు' గుర్తు చేశాడు.

"అదిగో, ఆ పదమూడో నంబరు గది ముందుకెళ్ళి కూర్చోండి. మీ ఫైలు అక్కడికే తీసుకొచ్చి ఇస్తారు."

"నా నంబరెంతమ్మా?" అని అడిగాడు.

"యాభై రెండు"

'వామ్మో! 51 మంది అయిపోయ్యేడదెప్పుడు ... నా వంతు వచ్చేదెప్పుడు.. సరే, కానియ్ – రోట్లో తలపెట్టినాక రోకలి పోటుకి భయపడితే ఎట్లా' అనుకొని పదమూడో నంబరు రూము దేవులాడుకుంటూ బయల్దేరాడు.

కొంచం ముందుకెళ్ళి కుడివైపు తిరిగింతర్వాత కనపడిందా రూము. తలుపు మీద 'డా. పి. మమతా, న్యూరాలజిస్ట్' అని బోర్డు రాసుంది. రూం ఎదురుగ్గా ఉన్న కుర్చీలన్నీ నిండిపోయున్నాయి. ఎత్తుగా అమర్చి ఉన్న టివీలో 'రబ్బరు గాజులు రబ్బరు గాజులు' అని పాట వస్తంది. అసలు ఆసుపత్రుల్లో టీవీలెందుకో ఊగులోడికర్ధంకాదు. ఇక్కడ కొచ్చేది బాధలతో ఉన్నవాళ్ళు గదా... ఇక్కడ ఇట్లా టీవీలు పెట్టుకుని వాటిల్లో పాటలు, సినిమాలు చూసుకుంటా నర్సులు కూర్చోనుంటే 'మీ చావు మీరు చావండి. మాకేంది?' అని అంటన్నట్లే అనిపించదూ?

అవతలోళ్ళు పట్టించుకోటల్లేదని తెలిసినప్పుడు బాధలు భయాలు ఇంకా ఎక్కువగా అనిపిస్తాయి గదా కష్టాల్లో ఉన్నవాళ్ళకి!

కూర్చోడానికి లేకపోయేసరికి అక్కడే అటూ ఇటూ తిరిగి చూస్తున్నాడు. ఒక పక్కన పెద్ద 'వెంకటేశ్వరస్వామి' బొమ్మ పెట్టి ఉంది. ఊగులోడు దణ్ణం పెట్టుకున్నాడు. అన్ని పరీక్షల్లో తనకు ఏ జబ్బు లేదనే రావాలని, అట్లాగొస్తే కొండ కొచ్చి గుండు కొట్టించుకుంటానని మనసులోనే మొక్కుకున్నాడు. మళ్ళీ అంతలో 'అసలు ఆసుపత్రుల్లో దేవుడి బొమ్మలు పెట్టడమేందా' అనుకొన్నాడు. ఆలోచిస్తా ఉంటే అసలు కారణం తట్టింది. వైద్యం ఫలించి జబ్బు తగ్గితేనేమో తామే దేవుళ్ళమనొచ్చు. తగ్గక పోతే మాత్రం 'మాదేముందీ, అదిగో, అంతా ఆ దేవుడి లీల' అనొచ్చు. అక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచీ ఊగులోడిలో కలుగుతున్న అసహనం ఈ ఆలోచనలతో ఇంకా ఎక్కువవడం మొదలు పెట్టింది.

అంతలో ఒక నర్సొచ్చి తన పేరు పిలిచింది. వెళితే ఊరంతా వెడల్పున్న ఒక ఫైలు చేతిలో పెట్టింది. అంత లావు ఫైలు తన చేతుల్లో చూసినాక తనకేమీ రోగం లేదని చెప్పినా కూడా ఊళ్ళో ఎవరూ నమ్మరేమో అనుకున్నాడు. చేంతాడంత రోగాల జాబితా రాసినా కూడా ఆ ఫైల్లో ఇంకా చోటు మిగిలే ఉంటుందనిపించింది.

నంబర్లవారీగా రూంలోకి పిలుస్తున్నారు. ముగ్గురైపోయారు. తన నంబరొచ్చే సరికి ఎట్టలేదన్నా మజ్జానమయిద్దని లెక్కేసుకున్నాడు. గోడలు, గోడల మీద బోర్డులు అన్నీ చూడ్డం మొదలు పెట్టాడు. పదమూడో నంబరు రూం గోడ బయట ఒక బోర్డు పెట్టి ఉంది. ’ఐన్ స్టీన్ ‘, ‘న్యూటన్’, ‘అలెగ్జాండర్’ – వీళ్ళంతా తమకున్న మూర్ఛరోగాన్ని జయించిన వాళ్ళే. మందుల బలం కంటే మానసిక బలంతో వాళ్ళు దాన్ని సాధించారు.’

'తనకే అట్లాంటి పరిస్థితొస్తే తను మానసిక బలం చూపించగలడా? అంత మానసిక బలమే ఉంటే అసలు ఇప్పుడిక్కడికి రానేరాడేమో! పెద్దగా రోగం లక్షణాలేమీ కనపడకపోయినా లేని పోనీ అనుమానాలు పెట్టుకుని వొచ్చాడేమో! ఇప్పుడైనా ఏం పోయింది. పోతే పోయింది రెండొందలు. ఇంటికెల్తే....'

కాసేపు మనసు అటూ ఇటూ ఊగిసలాడింది. అంతలోకి మారుతీసార్ గుర్తొచ్చాడు. ఆయనన్నట్లు లూజు కనెక్షనై, నయం చేయించుకోవడం ఆలస్యమయితే సీరియస్సయిపోద్దెమోననిపించింది. ‘సరే, కానియ్’ అనుకున్నాడు. భార్యని తోడు తెచ్చుకోకుండా ఒక్కడే రావడం పొరపాటయిపోయిందని చింతించాడు.

కొంచం అలా వరండా చివరకు నడిచాడు. అక్కడ గోడకి నిలువెత్తు ఫోటో పెట్టి ఉంది. 'డాక్టరోళ్ళ నాన్నేమో!' ఆ ఫోటో కింద రాసుంది. "స్వాతంత్ర్య సమర యోధులు, తామ్రపత్ర గ్రహీత, ప్రముఖ కాంట్రాక్టరు శ్రీ డా. వంగవరపు వెంకటరామారావు". 'స్వాతంత్ర్య సమర యోధుడు మరి కాంట్రాక్టరెట్లా అయ్యోడో..! ఆ రోజుల్లో మంచోళ్ళు కూడా కాంట్రాక్టులు చేస్తుండేవాళ్ళేమో!'

* * *

'నంబర్ 50' నర్సు పిలిచింది. ఇంకో రెండు పేర్లు అయిపోతే తనదొస్తుంది. తలుపు తీసేటపుడు, వేసేటపుడు లోల్నుంచీ కుర్ర డాక్టరొకాయన కనబడుతున్నాడు. 'డాక్టర్ మమత దగ్గర చూయించుకోవాలని గదా తను ఒపీ రాయించుకుంది. వీడెవడు?' అని అనుమానమొచ్చింది. ఆ విషయమే వాకిలి దగ్గర పీట మీద కూర్చున్న నర్సుని అడిగితే ఆమె చెప్పింది. "ముందు ఈ చిన్న డాక్టరు చూస్తారు. చూసి ఏమేం టెస్టులు చేయించుకోవాలో రాసిస్తారు. వెళ్ళి ఆ టెస్టులు చేయించుకొనొచ్చాక అప్పుడు పెద్ద డాక్టరమ్మగారు చూస్తారు."

అంతలో లోపలికి పిలుపొచ్చింది. వెళ్ళాడు. "ఆ. ఆఖరుసారి ఎప్పుడు ఎటాక్ కనబడింది?" అనడిగాడు డాక్టరు. "అసలు తనకొచ్చింది ఎటాకో, కాదో తెల్సుకోవాలనొస్తే ఎప్పుడు ఎటాకని అడుగుతాడేందిరా ఈడు?" అనుకున్నాడు ఊగులోడు. మొత్తం జరిగిందంతా చెప్పాడు. అనుమానం మీద వచ్చానన్నాడు. ఆ డాక్టరు ఊ అన్లేదు, ఆ అన్లేదు... అర్ధమెందో తెలియకుండా తలూపాడు. పేపరొకటి తీసుకుని బరా బరా ఏదో గీకాడు.

కాగితం చేతిలో పెట్టి 'నెక్ట్స్' అంటూ బెల్లు కొట్టాడు. "ఏంది సార్ ఏం కాయితం, ఏం చెయ్యాలి నేనిప్పుడు?" అని అడిగాడు ఊగులోడు. "బయట నర్సు చెప్తుంది. పొండి" అన్నాడు. బయటకొస్తే ఆమె చెప్పింది. "11వ నంబరు కౌంటరు దగ్గరికి పోయి ఈ కాయితం ఇవ్వండి. వాళ్ళు ఎంత డబ్బులివ్వాలో చెబుతారు. డబ్బులిచ్చేసి రశీదు తీసుకోండి." 'అది ఏం కాయితం? ఆ కౌంటరెక్కడుంది' అని అడగబోతున్నంతలోనే ఆమె హడావుడిగా లోపలికి పోయింది.
చిన్నప్పుడు సింగరకొండ తిరనాల్లో తప్పిపోయినప్పుడు ఎట్లా అనిపించిందో ఇప్పుడూ అట్లానే అనిపిస్తుంది ఊగులోడికి. ఆ వరండాలో ఇట్నుంచి అటు ఎక్కడ చూసినా 11 వ నెంబరు కౌంటరు కనబడలేదు. ఇదంతా చూస్తున్న ఒకాయన ఆ కౌంటరు పై అంతస్తులో ఉంది, పొమ్మని చెప్పాడు. మెట్లెక్కి పైకెళ్ళాడు.
'ఇన్వెస్టిగేషన్, బిల్లింగ్ కౌంటర్' అని ఎర్రక్షరాలతో రాసిన బోర్డుందక్కడ. ఆ కౌంటర్ దగ్గర చేంతాడంత 'క్యూ'లు రెండు ఉన్నాయి. క్యూలో నిలబడి తన ముందున్నాయన్ని అడిగాడు. "ఈ కాగితంలో రాసినయ్యేంట"ని. "మనం చేయించుకోవాల్సిన టెస్టులండీ. ఈ టెస్టుల తాలూకూ బిల్లు ఇక్కడ కట్టేసి ఆ ఎదురుగ్గా ఉన్న బిల్డింగులో కెళ్తే అక్కడ టెస్టులు చేస్తారు" ఈ విషయం రూంలోకి వెళ్ళకముందే తనకు నర్సు చెప్పింది గదా అని అప్పుడు గుర్తుకొచ్చింది.

క్యూ మహా రద్దీగా ఉంది. ఊగులోడి మనసు అంతకంటే రద్దీగా ఉంది. ఏం టెస్టులు రాశాడో, ఎంత బిల్లవుద్దో అని ఆలోచిస్తున్నాడు. అక్కడ గోడకి రంగు రంగుల బోర్డులు తగిలించున్నాయి. 'వనితా సూపర్ స్పెషాలిటీస్ వారి బంపర్ ఆఫర్. కంప్లీట్ బాడీ చెకప్ ... అసలు ధర రు. 2,290. మీ కోసం తగ్గింపు ధర రు.1000 మాత్రమే. రు. 7,500 ఖరీదైన డయాబెటిక్ టోటల్ చెకప్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో రు. 5000 మాత్రమే.'

ఈ బోర్డులు చూసిన ఊగులోడికి మతిపోయింది. మేదరమెట్ల బస్టాండు ముందు చక్రాల బండి పెట్టుకొని "ఏ వస్తువైన పది రూపాయలే" అని అరిచే మస్తాను గుర్తొచ్చాడు. 'ఈ చెకప్పులేంది... ఈ ధరలేంది... ఈ డిస్కౌంట్ లేంది....' ఊగులోడికి ఆ ఆస్పత్రి బందిపోటు దొంగల హెడ్డాఫీసులాగా కనపడసాగింది.

కౌంటర్ లో కంప్యూటర్ ముందు కూర్చున్న అమ్మాయి ఊపిరాడకుండా పనిచేస్తంది. డబ్బులు కట్టలు కట్టలు తీసుకుని సొరుగులో పెట్టుకుంటంది. టకటకా రశీదులు కొట్టిస్తంది. అయినా ఆ వేగం సరిపోవట్లేదు. ముగ్గురు నలుగురు తోసుకోనొచ్చి ఒకేసారి కౌంటర్ రంధ్రంలో చేతులు పెట్టారు. నా డబ్బులు ముందు తీసుకోమంటే నావి ముందు తీసుకోమని గొడవ పెడుతున్నారు.

ముందు నన్ను దోచుకొమంటే ముందు నన్ను దోచుకోండని బతిమలాడుకుంటన్నట్లు ఉంది. ఇంతలో కౌంటర్లోని అమ్మాయి గట్టిగా ఒక్క కసురు కసిరింది. "లైన్లో రాండయ్య, లైన్లో వస్తేనే దోచుకొనేది. ముందొచ్చినోళ్ళనే ముందు దోచుకొంటాం. వెనకొచ్చినోళ్ళను ముందు దోచుకోమంటే ఎట్లా కుదురుద్ది?" అని కోప్పడుతున్నట్లుగా ఉంది.

ఊగులోడి వంతు వచ్చింది. "3906 రూపాయలివ్వండి" అందామె అతని చేతిలోని కాయితం చూసి. డబ్బులిచ్చి రశీదు తీసుకుని బయటకొచ్చి ఎదురుగ్గా ఉన్న టెస్టులు చేసే బిల్డింగ్ లోకి పరుగెత్తుకెళ్ళాడు.

అక్కడా జనం తిరనాలగానే ఉన్నారు. ఏ టెస్టు ఎక్కడ చేస్తారో, ఎవరెటు వెళ్ళాలో చెప్పేవాళ్ళెవరూ లేరు. ఎందుకు లేరో ఊగులోడీకర్ధమయింది. ముందుగానే కట్టించేసుకున్నారు కాబట్టి వాళ్ళకి బాధేమి లేదు. తాపీగా ఉన్నారు. డబ్బులు కట్టేశారు కాబట్టి టెస్టులు చేయించుకోవాల్సిన జనానికి ఆదుర్దా.
ఎట్లాగో కనుక్కుని టెస్టులు చేసే దగ్గరకు పోయాడు. రక్తపరీక్షకు రక్తమిచ్చాడు. ఒంటేలు పరీక్షకు బుడ్డి తీసుకొని పోయి నింపుకొచ్చాడు. తల స్కానింగ్ తీసే రూం దగ్గరకొచ్చాడు. అక్కడ ఎవ్వరూ లేరు. 'వీళ్ళెప్పుడొస్తారు' అని ఎవర్నడిగినా ఎవరూ ఏమి చెప్పట్లేదు. ఏం జెయ్యాలో అర్ధం కాక అటూ ఇటూ తిరుగుతుంటే 'అంత లోకి ఆ ఇఇజీ పరీక్ష చేయించుకొని రాండి' అని చెప్పాడు రక్త పరిక్ష కౌంటరులో కూర్చున్న అబ్బాయి.

ఆ పరిక్ష చేసే గది కింద అండర్ గ్రౌండ్ లో ఉంది. మెట్లు దిగి కిందికెళ్ళాడు. ఆ గది బయట బెంచీ మీద అప్పటికే నలుగురు కూర్చుని ఉన్నారు. వెళ్ళి పక్కనే కూర్చున్నాడు. 'తలక పోసుకున్నావా?' అని అడిగాడు పక్కన కూచున్నాయన. "పోసుకోలా" నూనె రాసుకున్న తలను తడుముకుంటూ చెప్పాడు ఊగులోడు. "ఈ పరిక్ష చెయ్యాలంటే తలలో జిడ్డుండకూడదంట. అదిగో, ఆ పక్కన బాత్రూముల దగ్గర ఆయా ఉంటది. ఎంటికలమటికి షాంపూతో కడుగుద్ది పో" అని చెప్పాడు. బాత్రూముల కెల్లి పోయే సరికి ఆయమ్మ ఎదురొచ్చింది. "ఏందయ్యా తలకపోయాల్నా?" అంది. ఆమెను చూస్తే ఊగులోడికి ప్రాణం లేచొచ్చింది. ఆ ఆస్పత్రిలో అడుగు పెట్టింతర్వాత 'ఫలానా పని కావాలా' అని దయగా అడిగిన మొట్టమొదటి మనిషి ఆమే!

తలక పోసుకోనొచ్చి పరిక్ష చేసే గది బయట కూర్చొని ఆరబెట్టుకున్నాడు. ఒక గంటకి తన వంతొచ్చింది. తలంతా ఏదో బంకలాంటిది పూసి క్లిప్పులు పెట్టి ఒక అరగంట సేపు ఏదో మిషను కింద పడుకోబెట్టారు. ఒక రిపోర్టు ఇచ్చారు. అది ఒక పెద్ద పుస్తకం లాగా ఉంది. పేజీల నిండా ఏంటియ్యో ఎగుడుదిగుడు గీతలే.

తలకి పూసిన బంక పోవాలంటే మళ్ళీ షాంపూతో కడుక్కోవాల్సిందేనని చెప్పారు. ఆయమ్మ సాయంతో తల శుభ్రంగా కడుక్కున్నాడు. "ఒక పది రూపాయలియ్యయ్యా ...." అనడిగిందామె. 20రూపాయలు తీసి ఆమె చేతిలో పెట్టి మెట్లెక్కి పైకొచ్చాడు. తల స్కానింగ్ చేయించుకుని ఆ రిపోర్ట్ కూడా తీసుకున్నాడు. అక్కడ కూడా ఏదో పెద్ద యంత్రం కింద పడుకోబెట్టారు. అలా పడుకున్నప్పుడు పై నుంచి మిషనేదో దిగుతుంటే... ఏ భూతమో వచ్చి గుండెల మీద కూర్చుని నొక్కెస్తున్నట్లు ఉంది ఊగులోడికి.

పరధ్యానంగా రిపోర్టులన్నీ తీసుకుని మెయిన్ ఆసుపత్రిలోనికొచ్చాడు. పదమూడో నంబరు గది ముందుకొచ్చాడు. తనలాగే పొద్దున చిన్న డాక్టరుకి చూయించుకుని టెస్టులన్నీ చేయించుకొనొచ్చి పెద్ద డాక్టరు గారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారందరూ. ఒక కుర్చీ ఖాళీగా కనబడ్డంతో దాంట్లో కూలబడ్డాడు.

ఊగులోడి మనసంతా గందరగోళంగా ఉంది. తను అనవసరంగా తొందరపడి వచ్చాడేమో అని పదే పదే అనిపించసాగింది. రిపోర్టులన్నీ చూసి ఏం చెబుతారో అని భయం వేస్తంది. 'ఏమీ లేకపోయినా ఏదో రోగముందని చెబుతారేమో. ఎట్లారా నాయనా' అనుకుంటున్నాడు. 'ఇక్కడ కాలు పెట్టిందగ్గర్నించి ఎటు చూసినా వ్యాపారమే గదా కనపడింది' అని మాటి మాటికీ అనుకుంటన్నాడు.

పక్క కుర్చీలో కూర్చున్నాయన ఆ పక్కనాయనతో చెప్తున్న మాటలు చెవుల్లో పడుతున్నాయ్. "దొంగనాయాళ్ళు! తగ్గుద్దని చెప్పి జాయిన్ చేసుకున్నారు. నెల రోజుల్నుంచీ రోజుకి మూడు వేల రూపాయల కాడికి బిల్లు వేసి తీరా ఇప్పుడు 'లాభం లేదు, తీసుకెళ్ళిపొండి' అంటన్నారు. 'మనం ఏం చేసినా ఇంకో నెల రోజుల కంటే బతకడు' అని ఊళ్ళో ఎమ్బీబియ్యెస్ డాక్టరు చెబితే వినకుండా ఇక్కడికి తీసుకొచ్చి నిలువునా మోసపోయాం."

ఊగులోడి బుర్ర గిర్రున తిరిగిపోతంది. 'ఒకేల ఆ రిపోర్టుల్లో నిజంగానే తన తలలో ఏదో తేడా ఉందనోస్తే..?' 99 పాళ్ళు ఏ తేడా ఉండదనే అనిపిస్తంది. ఒక పాలు అట్టాంటిదేమైనా ఉంటే కనబడకుండా ఏం ఉండదు గదా. అప్పుడే చూసుకోవచ్చు. అసలు పక్కనే ఉన్న మేదరమెట్లకు పోయి మామూలు డాక్టరుకి చూయించుకోకుండా ఈ ‘సంతాసుపత్రి’కి రావడమే పెద్ద తప్పు.

"నెంబరు 50" రూము బయటకొచ్చి నర్సు పిలుస్తా ఉంది. ఇంకో రెండు నంబర్లు పిలిస్తే తన వంతొస్తుందనగా ఊగులోడు మెల్లగా లేచాడు. సంచి తీసుకోని మెట్లు దిగి బయటకొచ్చి ఆటో ఎక్కాడు. స్టేషనుకొచ్చి ఊరెళ్ళే రైలెక్కాడు.

(నవ్యవీక్లీ డిసెంబరు 2010 సంచికలో ప్రచురితం)