4, జనవరి 2014, శనివారం



నిదురించే తోటలోకి ఒక సూఫీ కెరటం!



ప్రసిద్ధ మలయాళీ రచయిత రామనున్ని నవల “సూఫీ చెప్పిన కథ” శీర్షికతో ఎల్. ఆర్. స్వామి అనువాదంలో ఈ నెల సారంగ బుక్స్ ప్రచురణగా వెలువడుతుంది. ఈ పుస్తకం ఆగస్ట్ 30 వ తేదీ నుంచి హైదరాబాద్ లోని నవోదయ బుక్స్ లోనూ, అమెజాన్ లోనూ, సారంగ బుక్స్ వెబ్ సైట్ లోనూ అందుబాటులో వుంటుంది. ఈ నవల విడుదల సందర్భంగా కల్పనా రెంటాల ఈ నవలకి రాసిన ముందు మాటని ‘సారంగ’ పాఠకులకు అందిస్తున్నాం.



సూఫీ పరంజ కథ సినిమా నించి ఒక దృశ్యం
సూఫీ పరంజ కథ సినిమా నించి ఒక దృశ్యం
 
 
‘సూఫీ పరాంజే కథ’ సినిమాకు అవార్డ్‌ వచ్చినప్పుడు నేను మొదటిసారిగా కె.పి.రామనున్ని పేరు విన్నాను. సూఫీ సంప్రదాయం, సూఫీ యోగులు, వారి బోధనలు, వారి జీవిత విధానం గురించి అప్పటికే కొంత తెలిసి ఉన్న నాకు ‘సూఫీ చెప్పిన కథ’ అన్న పేరు వినగానే ఏవేవో పుర్వస్మతులు మేల్కొన్నాయి. ఎలాగైనా ఆ సినిమా చూడాలని, ఆ నవల చదవాలని ఎంతో ప్రయత్నించాను. అమెరికాలో నాకు ఏ మలయాళీ సాహిత్యాభిమాని కనిపించినా ఈ నవల గురించి అడిగేదాన్ని. అందరూ మంచి నవల అని చెప్పిన వాళ్ళే కానీ ఇంగ్లీష్‌ అనువాదం ఎవరి దగ్గరా దొరకలేదు. ఒక దశలో మలయాళ సాహిత్యం చదవటానికి ఆ భాష నేర్చుకుందామన్న అత్యుత్సాహంలోకి కూడా వెళ్లకపోలేదు. ఏమైతేనేం ఇవేవీ జరగలేదు. తాత్కాలికంగా సూఫీ చెప్పిన కథ కోసం నా అన్వేషణ సగంలో అలా అక్కడ ఆగిపోయింది.
సూఫీ చెప్పిన ఆ కథ ఏమిటో చదవాలని ఒళ్ళంత కళ్ళు చేసుకొని నేను చూసిన ఎదురుచూపులు ఓ రోజు ఫలించాయి. అది కూడా ఓ కలలా జరిగింది. మలయాళ సాహిత్యాన్ని మూలభాష నుంచి నేరుగా అందమైన తెలుగుభాషలోకి అనువాదం చేసే ప్రముఖ అనువాదకుడు, స్వయంగా కథకుడు ఎల్‌. ఆర్‌. స్వామి. ఆయన ఇటీవల అనువాదం చేసిన ‘పాండవపురం’ నవల తెలుగువారిని మలయాళ సాహిత్యానికి మరింత దగ్గర చేసింది.
ఆ పుస్తకం గురించి పత్రికల్లో చదివి ఎల్‌.ఆర్‌. స్వామిగారికి ఫోన్‌ చేశాను. మాటల సందర్భంలో ఆయన చేసిన అనువాదాలు ఇంకేమైన ప్రచురణకు సిద్ధంగా వున్నాయా? అని అడిగినప్పుడు ఆయన నోటి నుంచి ‘సూఫీ చెప్పిన కథ’ పేరు విన్నాను. ఒక్కసారిగా ఒళ్ళు ఝల్లుమంది. వెంటనే మరో ఆలోచన లేకుండా ఆ పుస్తకాన్ని‘సారంగ పబ్లికేషన్స్‌’ ప్రచురిస్తుందని, వెంటనే ఆ అనువాదం పంపించమని కోరాను. ఎల్‌. ఆర్‌. స్వామి చేసిన ‘సూఫీ చెప్పిన కథ’ అనువాదం కంపోజ్‌ అయి నా దగ్గరకు వచ్చేసరికి రెండు నెలలు పట్టింది. కానీ ఈలోగా నాకు ఆస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ లైబ్రరీలో రూపా అండ్‌ కో వారు ప్రచురించిన “What the Sufi said” పుస్తకం దొరికింది. ఎన్‌. గోపాలకృష్ణన్‌, ప్రొ. ఈషర్‌ సహాయంతో చేసిన ఆ అనువాదం చదివాక నా మనసు కుదుటపడ్డది. కానీ ఇంగ్లీష్‌లో కంటే మూలభాష నుంచి నేరుగా వచ్చిన తెలుగు అనువాదం చదవాలని ఎంతగానో ఆరాటపడ్డాను. తెలుగులో ఆ నవల చదువుతున్నప్పుడు ఒక్కో వాక్యం దగ్గర ఆగిపోయేదాన్ని. ఒక్కో వాక్యంలోనూ ఎంతో గూఢార్థంతో నిండి ఉన్న కవిత్వం కనిపించింది. రామసున్ని రాసిన కవిత్వ వచనం చదువుతూ నన్ను నేను మర్చిపోయాను. ఇంగ్లీష్‌ అనువాదం చదివినప్పుడు కథలోనూ, కథనంలోనూ ఎన్నో సందేహాలు. ఏదో అర్థం కాలేదనిపించింది. అది భాషాపరమైన సమస్య కాబోలు అనుకున్నాను. కానీ తెలుగు అనువాదం చదివాక కానీ నవల గొప్పతనం పూర్తిగా అర్థంకాలేదు.

 
జీవితం అంటే ఇది అని ఎవరైనా చెపితే అర్థమయ్యేది కాదు. జీవితాన్ని ఎవరికి వారు జీవించాల్సిందే. అయినా కొన్ని పుస్తకాలు జీవితమంటే ఏమిటో, ఎలా జీవిస్తే ఆ జీవితానికి ఓ సార్థకత కలుగుతుందో వివరిస్తాయి. ‘సూఫీ చెప్పిన కథ’ అలాంటి నవల. మొదలుపెట్టిన క్షణం నుంచి నవల ఎక్కడా ఆపకుండా చదివించింది. నవల పూర్తయ్యాక ఎంతో అర్థమయిందన్న అనుభూతితో పాటు, మరెంతో అర్థం కావాల్సి ఉందనిపించింది. జీవితం గూఢార్థాన్ని ఒక్కో పొర వొలిచి చూపించిన అనుభూతి పుస్తకం చదువుతున్నంత సేపూ మనకి కలుగుతుంది. సముద్రపుటోడ్డున అమ్మవారు, లేదా ఓ బీవి వెలిసిందన్న వార్త విని అది చూడటానికి వెళ్ళిన ఒక హిందువు చేయి పట్టుకొని సముద్రతీరం దగ్గరకు తీసుకొని వెళ్ళి సూఫీ చెప్పిన కథ ఇది. ఈ నవల ఇతివృత్తం ఇది అని చెప్పటం కన్నా చదవటం మంచిది. ఇదొక మామూలు నవల కాకుండా ఒక మంచి నవల ఎందుకయిందో తెలియాలంటే నవలను ఎవరికి వారు చదివి తెలుసుకోవాల్సిందే. నవలలో చర్చించిన ముఖ్య అంశాలను రేఖా మాత్రంగా సృశిస్తే నవల గొప్పతనం అర్థం చేసుకోవటం సులువవుతుందన్న ఉద్దేశ్యంతో ఒకటి రెండు విషయాలు మాత్రం ప్రస్తావిస్తాను. తర్కం, వాస్తవికత ఈ రెండింటి మీద మాత్రమే ఆధారపడితే సత్యాన్వేషణ సాధ్యం కాదు. హృదయంలో ప్రేమ, కరుణ లాంటి గుణాలున్నప్పుడే సత్యాన్వేషణ సార్ధకమవుతుంది. వాస్తవికతను అర్థంచేసుకునే క్రమంలో హేతువు అన్నది ఎప్పుడూ ద్వితీయాంశమే అవుతుంది అన్నది ప్రధానంగా రామనున్ని ఈ నవలలో చర్చించారు. సృష్టిలోని ప్రతి ఒక్కటి కేవలం తర్కం, వాస్తవికతల మీద మాత్రమే ఆధారపడి ఉండవని, ప్రతి ఒక్కదాన్ని ఆ రెండింటితో మాత్రమే ముడి పెట్టి చూడలేమని, అలా చేయటం కూడా ఒక రకమైన మూఢ విశ్వాసమే నంటారు నవలలో రచయిత ఒకచోట.
కే. పి. రామనున్ని
కే. పి. రామనున్ని
* * *
స్తీ, పురుష దేహాల మధ్య కేవలం ఆకర్షణ, లైంగిక సంబంధం ఒక అనుబంధాన్ని నిర్వచించలేవు. అంతకుమించిన అనురాగం, ఒక ఆత్నీయానుబంధం లేకపోతే అది కేవలం దేహ సంబంధంగా మాత్రమే మిగిలిపోతుంది. కార్తి, మమ్ముటిల మధ్య ఒక ఆకర్షణ వుంది. ఒక తెగింపుతో కూడిన సాహసం ఇద్దరి మధ్యా వుంది. కార్తీ కోసం ఏమైనా చేయటానికి సిద్ధపడ్డాడు మమ్ముటి. చివరకు ఆమె కోసం తన ఇంట్లో అమ్మవారి గుడిని కూడా కట్టించి ఇచ్చాడు. మతం మారిన కార్తికి ఆ మతమార్పిడి కేవలం ఒక సాంప్రదాయిక తంతుగా మాత్రమే మిగిలింది. ఆమెలో తాను చిన్ననాటి నుంచి వింటూ, చూస్తూ, అనుభవిస్తూ వచ్చిన అమ్మవారు భగవతి మీద ప్రేమ లేశమాత్రమైనా తగ్గలేదు. అమ్మవారు కేవలం రాతి విగ్రహం కాదు, అది రక్తాన్ని స్రవించే ఒక హృదయమున్న దేవత అని కార్తి స్వానుభవంతో తెలుసుకుంది. తల్లి కరుణాంతరంగాన్ని తన హృదయంలో నిలుపుకుంది. కార్తి మొదటిసారి ఋతుమతి అయినప్పుడు తనలోంచి ఓ వెల్లువలా సాగుతున్న రక్తస్రావాన్ని చేపపిల్లలు ఆనందంతో తాగుతుంటే మైమర్చిపోయింది. మరో సందర్భంలో అమ్మవారి గదిలోకి వెళ్ళినప్పుడు మొదటిసారిగా తనలోని స్త్రీత్వాన్ని అమ్మవారి సమక్షంలో కార్తి అర్థం చేసుకుంది. తనను తాను అమ్మవారిలో చూసుకుంటూ ఇద్దరి మధ్యా ఓ అభేదాన్ని అనుభవించింది.
తన శరీరం ఏమిటో, అందులో కలిగే స్పందనలు ఏమిటో తెలుసుకున్న తర్వాత శారీరక అనుభవం అనేది ఒక పశ్చాత్తాపమో, తప్పో కాదని, అది రెండు ఆత్మల సంయోజనం అని కార్తికి అర్థమయింది. తననొక దేవతలాగా కాకుండా ఒక స్తీగా తన కళ్ళల్లో కళ్ళు పెట్టి, నిర్భయంగా, నిర్భీతిగా తన శరీరం లోపలి అణువులను కూడా స్పర్శించగలిగిన మమ్ముటితో అందుకే కార్తి అలా నడిచి వెళ్లిపోగలిగింది. తన మేనమామకు తనమీద ప్రేమతో పాటు తన శరీరం పట్ల ఉన్న ఒక కాంక్షను కూడా కార్తి గుర్తించగలగింది. అయినా ఆమెకు అతని మీద కోపం లేదు ప్రేమ తప్ప. అతన్ని తన వక్షాలకు ఓ తల్లిలా అదుముకొని సాంత్వన పరచాలని కోరుకుంది. అందరూ తననొక దేవతగా చూడటాన్ని అర్థం చేసుకొని తనలో ఆ దేవీ తత్త్వమైన కరుణను, ప్రేమను తనకు తాను దర్శించుకోగలిగింది. అందుకే ఆమె చేయి తాకితే నొప్పులు మాయమైపోయేవి. ఆమె సమక్షంలో అందరికీ ఒక ప్రశాంతత అనుభవమయ్యేది. అయితే అప్పటివరకూ ఆమెను ఒక అందమైన స్తీగా మాత్రమే చూసిన మమ్ముటికి ఈ మార్పు అర్థం కాలేదు. ఆమె సమక్షంలో అతనిలోని పురుషసంబంధమైన కోర్కెలు తిరోగమించాయి. తనకు భౌతికంగా, మానసికంగా మమ్ముటి దూరం అవటాన్ని గమనించింది కార్తి. అతను మరో చిన్న కుర్రాడితో లైంగిక సంబంధం ఏర్పర్చుకోవటాన్ని కూడా ఆమె తెలుసుకుంది. అమ్మవారు కరుణిస్తే అనుగ్రహం. ఆగ్రహిస్తే విధ్వంసం అన్నట్లు తనను మోసం చేసిన పిల్లవాడిని తనే ఒక కాళిక అయి హతమార్చింది. చివరకు సముద్రంలో కలిసిపోయింది కార్తి. జాలర్లకు ప్రాణదానం చేసి వారి దృష్టిలో ఓ అమ్మవారిగా నిలిచింది. మేలేప్పురంతరవాడలో అమ్మవారిగా ఉండాల్సిన కార్తి, పొన్నని గ్రామంలోని హిందూ, ముస్లింలిద్దరికీ ఓ అమ్మవారిగా, ఒక బీవిగా వారి హృదయాల్లో కలకాలం నిలిచిపోయింది.
 
నవల మొత్తంలో కార్తి పాత్ర పాఠకుల మనసులో ఓ ప్రత్యేక స్థానంలో నిలిచిపోతుంది. కార్తి పాత్ర అంత సులువుగా అర్థమయ్యే పాత్ర కాదు. ఆమె మనందరి లాగా ఓ మామూలు వ్యక్తా? లేక అసాధారణ శక్తులున్నాయా? అనే సందేహం నవల చదువుతున్నంత సేపూ మనల్ని వెన్నాడుతూ ఉంటుంది. అందరూ ఆమెను దైవాంశ సంభూతురాలిగా చూస్తుంటారు. కానీ మమ్ముటికి మాత్రం ఆమె సౌందర్యం తెలిసినట్లుగా ఆమె హృదయం, అందులోని ప్రేమ అర్థంకావు. కార్తి ప్రవర్తన, కొన్ని సంఘటనల్లో ఆమె ప్రవర్తించిన తీరు, మరీ ముఖ్యంగా అమీర్‌ని ఆమె చంపేయటానికి గల కారణం, అలాగే చివర్లో జాలర్లకు ఆమె ప్రాణదానం చేయటం … ఇలా ఎన్నో విషయాల్లో కార్తి మనకు అర్థంకాని ఓ చిత్తరువుగా మిగిలిపోతుంది. నవల చదువుతుంటే ఎన్నో చిక్కుముడులు విడిపోయిన అనుభూతి, కానీ అంతలోనే మరెన్నో చిక్కు ముడులు కళ్ళ ముందు కనిపిస్తాయి.
నవల పూర్తయ్యాక కూడా అనేకానేక సందేహాలు మనల్ని వెంటాడతాయి. కొత్త కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. కొన్ని కొత్త సందేహాలతో కూడిన ఆలోచనలు మనల్ని అస్థిమితపరుస్తాయి.అనేక కొత్త దారుల్లోకి మన ఆలోచనలు ప్రయాణిస్తాయి. ఈ నవలలో రామనున్ని ఎక్కడా కూడా ఏ సందేహాలకు, ఏ సంశయాలకు సమాధానాలు ఇచ్చే పని చేయలేదు. మన మనసుల్లో రేకెత్తే ప్రతి ప్రశ్న వెనుక ఉండే అసంబద్ధతను అలవోకగా, ఎంతో సహజంగా, నేర్పుగా చిత్రించారు. నవల ముగిసిన తర్వాత కూడా మన మనసు స్థిమితపడదు. ఎన్నో చిక్కుముడులు మన ముందు నిలిచి ఉంటాయి. తర్కంతో ఈ నవలను అర్థం చేసుకోవాలనుకోవటం వృధా ప్రయత్నమే అవుతుంది. నవలలోని చాలా సంఘటనల వెనుక ఉన్న హేతువు మన మామూలు అవగాహనకు అందదు. సులభంగా విడివడలేని ఆ చిక్కుముడులే నవలకు కొత్త అందాన్ని ఇచ్చాయి. విభిన్నమైన కథ, చిక్కనైన కథనం రెండూ కూడా నవల చదువుతున్నంత సేపూ పాఠకులను మరో ఊహాత్మక లోకంలో విహరింపచేస్తాయి. వారి మనసులను, ఆలోచనల్ని పదును పెడతాయి. జీవితమనేది రెండు రెళ్ళ నాలుగు అన్నంత సులభమైన లెక్క కాదని మనసుకు పడుతుంది. ప్రేమ, కరుణ లేని మతవిశ్వాసం మూఢవిశ్వాసంతో సమానమని అర్థమవుతుంది.
* * *
తెలుగు సాహిత్యాభిమానులకు మలయాళ సాహిత్యం అంటే ఒక విధమైన ఆరాధన, అభిమానం. మలయాళ సమాజం, అక్కడ అందమైన ప్రకృతి, అక్కడ కులవ్యవస్థ, ఎన్నో శతాబ్దాలుగా బలంగా ఉన్న మాతృ స్వామ్య వ్యవస్థ, వీటినన్నింటిని ప్రతిబింబించే అద్భుతమైన సాహిత్యం తెలుగు సాహిత్యాభిమానులకు ప్రాణప్రదాలు. దక్షిణాది భాషల సాహిత్యం, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, జీవన విధానం ఒకదానికొకటి ఎంతో సన్నిహితంగా ఉంటూనే వైవిధ్యంగా కూడా ఉంటాయి. మలయాళ సాహిత్యం అనగానే తెలుగువారికి తగళి శివశంకర్‌పిళ్లై, కమలాదాస్‌, అయ్యప్ప ఫణిక్కర్‌, కురూప్‌, ఎం.టి.వా సుదేవ నాయర్‌, లలితాంబికా అంతర్జనం, వైకవు మహమ్మద్‌ బషీర్‌ వీళ్ళందరూ గుర్తుకు వస్తారు. వీళ్ళ సాహిత్యం గురించి తెలుగు పాఠకులు ఎంతో అభిమానంతో మాట్లాడుకుంటారు. ఇప్పుడు వారి అభిమాన రచయితల కోవలోకి కె.పి.రామనున్ని కూడా చేరుతున్నారు. ఈ ‘సూఫీ చెప్పిన కథ’ నవలతో రామనున్ని తెలుగు పాఠకులకు పరిచయం కాబోతున్నారు. ఎన్నో భాషల్లోకి ఈ నవల అనువాదమయ్యాక ఆలస్యంగా ఇప్పుడు తెలుగులోకి కూడా వస్తోంది. ఇంత ఆలస్యంగా తెలుగులోకి రావటం కొంత విచారకరమే అయినా ఇప్పటికైనా ఎల్‌.ఆర్‌. స్వామి అనువాదం చేయటం వల్ల తెలుగువారికి ఒక కొత్త మలయాళ రచయిత పరిచయం కావటం నిజంగా శుభవార్త.  

కల్పనా రెంటాల గారు ఈ వివరణ ఇంత బాగా  రాసాక ఇంకా ఇంతకంటే బాగా ఎవ్వరం రాయలేము. ఈ సినిమా చూడాలని అనుకునేవారు youtube  లో చూడవచ్చు. మలయాళం లో నే వున్ది. 
 



 
 
 
 
 
 
 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి