30, మార్చి 2014, ఆదివారం

నిర్జనవారధి











సమాజంలో మౌలిక మార్పులు కోరే సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, విప్లవోద్యమం, నక్సల్బరీ ఉద్యమం అనే నాలుగు ఉద్యమాల వారధి కొండపల్లి కోటేశ్వరమ్మగారు. ఈ ఉద్యమాలలోని స్త్రీల పోరాటపటిమకు, వేదనకు కూడా ఆమె ప్రతినిధి. కోటేశ్వరమ్మ మూర్తీభవించిన ఉద్యమ రూపం. “నిర్జన వారధి” కోటేశ్వరమ్మగారి ఆత్మకథ. ఆమె జీవితం చదువుతుంటే ఒక వ్యక్తి జీవితంలో ఇంత దుఃఖం ఉంటుందా అని మనసు ఆర్ద్రమవుతుంది.
ఒడిదుడుకుల జీవితం
''నిర్జన వారధి'' .. ఈ మాట ఏదో అస్పష్టమైన విచారాన్ని తలపిస్తుంది. ఈపేరు వినగానే ఒకరకమైన విషాద దృశ్యం కళ్లముందు కదలాడుతుంది. నాలుగు ఉద్యమాలతో పాటు మూడు తరాలకు వారధి అయినా చివరికి ఆమె ఒంటరిగానే మిగిలిపోయింది. భర్త కొండపల్లి సీతారామయ్యతో ఒడిదుడుగుల అనుబంధం, పిల్లల మరణం లాంటి అనేక ఆటుపోట్లతో నిత్యం సంఘర్షణ అనుభవించిన కోటేశ్వరమ్మ స్వీయ కథే నిర్జన వారధి.
పుస్తకాలే ఆమె నేస్తాలు..
కోటేశ్వరమ్మ బాల వితంతువు. హైస్కూల్ చదువు కూడా లేని ఆమెకు ఆర్థికంగా ఏ ఆలంబనా లేకుండా పోయింది. అయినా ఎవరి సహాయమూ తీసుకోకుండా స్వశక్తితో తన కాళ్లపై తాను నిలబడటానికి నిశ్చయించుకొని, 35ఏళ్ల వయసులో హైదరాబాద్ ఆంధ్ర మహిళా సభలో మెట్రిక్ చదివారు. చదువుకుంటూ తనను తాను పోషించుకున్నారు. అనంతరం ఆమె సాహిత్యం వైపు అడుగేశారు. ఎన్నికష్టాలు ఎదురైనా సాహిత్యమే తనను బతికించిందని, పుస్తకాలే తన నేస్తాలని, అక్షరాలే తనకు ఆరోగ్యానిస్తాయని కోటేశ్వరమ్మ చెబుతారు.
ముందుమాటలో..
'' జ్ఞాపకాలను తట్టి లేపితే కన్నీటి ఊట ఉబికి వచ్చే జీవితం నాది. ఆ కన్నీటి ప్రవాహాన్నే కథగా మలిచాను. నా జీవిత కథ చదివిన పాఠకులు ఇది సంఘ శ్రేయస్సు కొరకు రాయబడిందనుకుంటే సంతోషిస్తాను. నా కథ మనిషిలోని మంచిని ఏ కొంచెమైనా పెంచుతుందనుకుంటే నా శ్రమ ఫలించిందనుకుంటాను. ఇన్నేళ్ల నా బ్రతుకు వృథా కాలేదని తెలిసి తృప్తిపడతాను'' అని కోటేశ్వరమ్మ 'నిర్జన వారధి' ముందుమాటలో తెలిపారు.
సత్యవతి విశ్లేషణ
'నిర్జన వారధి'ని కొండపల్లి సత్యవతి విశ్లేషించారు. 92 సంవత్సరాల వయసులో కోటేశ్వరమ్మ రాసిన ఈ పుస్తకం ప్రజలకు అందుబాటులోకి రావడం అదృష్టమన్నారు. కోటేశ్వరమ్మ జీవితంలోని సంఘర్షణను ఈ పుస్తకంలో పొందుపరిచారని తెలిపారు. తన జీవితంలోని బాధలకు ఎక్కడా ఎవరినీ నిందించని గొప్ప వ్యక్తిత్వం కోటేశ్వరమ్మదని పేర్కొన్నారు. ఈ పుస్తకం చదివితే ఆమె వ్యక్తితం ఎంతో ఉన్నతంగా కనిపిస్తుందని తెలిపారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎక్కడా తొణకని స్వభావం కోటేశ్వరమ్మదని కొనియాడారు. ఈ పుస్తకం చదివే వరకు ఆమె జీవితంలో ఇంత విషాదం ఉందని ఎవరికీ తెలియదన్నారు. తనను వదిలేసిన భర్త తిరిగి కొన్నేళ్ల తర్వాత రమ్మని పిలిస్తే ఎంతో హుందాగా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారని సత్యవతి వివరించారు.
ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా జీవిత పోరాటాన్ని సాగిస్తున్న కోటేశ్వరమ్మ జీవితం భావితరాలకు 'వారధి' గా నిలుస్తుంది. 

ఫై వ్యాసం 10 టీవీ  నుంచి  తీసుకోనపడింది.

నా అభిప్రాయం :

 
ఈరోజు లో చిన్న చిన్న విషయాలకే అనేకమంది ఆత్మహత్యలు  చేసుకుంటున్నారు. కోటేశ్వరమ్మ  గారి జీవిత చరిత్ర ఎంతోమందికి ఆదర్శం అవుతున్ది. 
 
 
అడుగడుగునా కోటేశ్వరమ్మ గారి జీవితం లో కష్టాలు ఎన్ని వచ్చిన  ఆమె పదేపదే పైకి ఎగసే ఫీనిక్స్‌ పక్షి లానే
మొక్కవోని ఆత్మవిశ్వాసం  తో జీవించారు. 
 
 
భర్త కొండపల్లి సీతారామయ్యతో విభేదాలు ఒంటరిని చేస్తే 36 ఏళ్ళ వయసులో మెట్రిక్ పాసయ్యి  జాబు తెచుకున్నరు. 
 
కరుణ, చంద్ర  వీరి  పిల్లలు. రమేష్ ( అల్లుడు) మరణం తరువత కరుణ ఆత్మహత్య. చంద్ర ఎన్కౌంటర్. అ ఫై తల్లి మరణం . 
ఒక  మనిషికి ఎన్ని బాధల అనిపిస్తున్ది. 
 
కొండపల్లి సీతారామయ్య గారి చివరి రోజుల్లో ఆయన్ని కలవమని మిత్రులు ఒత్తిడి తెచ్చినపుడు తన అయిష్టతని వ్యక్తం చేస్తూ ‘ఆయన పాలిటిక్స్‌ ఆయనవి నా పాలిటిక్స్‌ నావి’ అని అనుకోగల ఆత్మవిశ్వాసం కోటేశ్వరమ్మగారిది. ఆఖరిదశలో కోటేశ్వరమ్మతో కలిసుండాలన్న ఆకాంక్షను సీతారామయ్య వ్యక్తం చేసినపుడు ‘యాజ్‌ ఎ ఫ్రెండ్‌గా ఉండటం వేరు. ఈ భార్యాభర్తల గొడవ నాకొద్దు’ అని సున్నితంగా తిరస్కరిస్తారు.
కోటేశ్వరమ్మ గారి జీవితంలోని పలువిషాద సంఘటనలు కంటతడి పెట్టించి మనసుని ఆర్ద్రం చేస్తాయి. అయితే అది నిస్సహాయ దుఃఖం, నిరుపయోగశోకం కాదు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 





 

22, మార్చి 2014, శనివారం

ఊగులోడు - ఆర్.రాఘవరెడ్డి




ప్రకాశం జిల్లా గ్రామీణ మాండలికం లో  రాఘవ రెడ్డి గారు రాసిన హాస్య కధ మీ కోసం. 



వాడ్నందరూ 'ఊగులోడు' అంటున్నారంటే అనకేం జేస్తారు. అది చిన్న పని గానీ, పెద్ద పనిగానీ, ఒక పట్టాన తెగనియ్యడు, తెల్లారనియ్యడు. ఏ విషయమైన సరే, ఎట్టాంటి నిర్ణయమైన సరే ఎనక్కీ ముందుకీ, ముందుకీ ఎనక్కీ, ఊగిసలాడతానే ఉంటాడు.

వారం రోజుల కిందటొకరోజు ఎప్పుట్లాగానే గొడుగు, నీళ్ళసీసా తీసుకోని బరెగొడ్లిప్పుకోని చేనుకి పోతన్నాడు. మిట్టచేను దాటాడు. అల్లంత దూరంలో ఎనికపాటోళ్ళ ఏపచెట్టు ఉందనంగా ఎనకనించెవరో తోసినట్లు ముందుకి తూలాడు. మందు ఎక్కువైనోడిలాగా తూలుకుంటా తూలుకుంటా రెండడుగులేసి గెనెం మీద ఆమేన కూలబడ్డాడు.

చెట్టు నీడన కూర్చోనున్న రాజయ్య ఇది చూసి పరుగెత్తుకుంటా వచ్చాడు. "ఏమైందిరా... వచ్చే వచ్చే వాడివి అట్టా కూలబడిపోయ్యావు..." అంటా పైకి లేపి బుగ్గలు తట్టాడు. ఊగులోడు కళ్ళు తెరిచి పైకి లేచి రెండడుగులు ముందుకేసి మళ్ళీ పడిపోయాడు. దూరంగా కాలవకట్టన గొడ్లు మేపుకుంటన్నోళ్ళు కూడా వచ్చి చుట్టూ మూగారు. ఊగులోడ్ని మోసుకొచ్చి చెట్టు నీడన పడుకోబెట్టారు. ముఖాన కాసిని నీళ్ళు జల్లారు.

కాసేపటికి కళ్ళు తెరిచాడు. "ఏంది మావా"
"ఏందిరా"

"ఎట్టాగుందిరా"
అందరూ ఒకేసారి ఆదుర్దాగా అడుగుతున్నారు. ఎవరో మంచి నీళ్ళు తెచ్చిచ్చారు. రెండు మూడు గుటకలేశాడు. అంతలోనే లేచి పక్కకొచ్చి వాంతి చేసుకున్నాడు. "కళ్ళకేమి అగపడ్డం లేదు .... అంతా తెల్లగా బూజరగా ఉంది" అంటా కూర్చుండి పోయాడు.

'కూడు తినకుండా పొలం బయలుదేరాడేమో'

'నీరసమ్మీద కళ్ళు తిరిగినట్టుంది'
'వాతం కమ్మినట్టుంది'... తలా ఒక రకంగా ఊహిస్తున్నారు. రాజయ్య సీసాలోని చల్లటి నీళ్ళు తెచ్చి మొహం కడిగాడు.

"ఇప్పుడు కనపడతందంట్రా?"
"కనపడతంది మావా" ఊగులోడు నీరసంగా చెప్పాడు.

మాయిటేళ ఇంటికి పొయ్యేటప్పుడు జొన్నకోసుకెళ్ళాలని బండికట్టుకొనొచ్చిన సుబ్బారెడ్డిని కేకేశారు. గెనాల మీద ఎగిరెగిరిపడతా బండి ఊళ్ళోకి వేగంగా పోతంది. ఊగులోడి గుండె అంతకన్నా ఎక్కువగానే ఎగిరెగిరిపడతా ఉంది. అంతకన్నా వేగంగా కొట్టుకుంటా ఉంది.

ఊగులోడికసలే భయమెక్కువ. ఏ చిన్న సమస్య వచ్చినా కంగారు పడిపోతాడు. ఇట్టయిద్దేమో అట్టయిద్దేమో అని అవకముందే బెంబేలు పడుతుంటాడు. ఇప్పుడిట్లా తూలుడొచ్చి పడిపోవడానికి కారణమేందో అర్ధం కాక గుబులు పట్టుకుంది. జెరెం, గిరం ఏమీ లేకపాయే. ఇప్పుడు ఉన్నట్టుండి ఇట్టా ఎందుకయినట్టు? కొంపదీసి ఫిట్సేమో ...? ఆ మాట అనుకోటానికే భయం పుట్టింది.

తనకిష్టం లేని, మనసుకి కష్టం కలిగించే సంగతుల్ని గుర్తుకు తెచ్చుకోవడం కూడా ఇష్టముండదు ఊగులోడికి. వాటిని కావాలనే మర్చిపోతాడు. జ్ఞాపకాల పెట్టెలో ఎక్కడో అట్టడుక్కి వాటిని తోసేస్తాడు. ఎప్పుడన్నా ఆ ఆలోచనలొచ్చినా ... ఎంబట్నే మనసుకి మరేదో విషయం మీదకి మళ్ళించేస్తాడు.
అయితే ఒక్కోసారి కొన్ని ఆలోచనలు ఎదురు తిరుగుతాయి. ఏం వద్దనుకుంటాడో అవే గుర్తుకొస్తుంటాయి. ఆ రాత్రీ అట్లానే జరిగింది ఊగులోడికి. “ఛ! మనకేం లేదులే. మూర్చలేదు. ఏం లేదు. అదయితే నోటెంట నురుగు రావటం, గుప్పిళ్ళు బిగబట్టడం ఉంటై గదా. ఏదో, మామూలుగా కళ్ళు తిరిగినయ్యంతే” అని తనకు తాను చెప్పుకుని పడుకున్నాడు. కాని నిద్రపడితేగా. రాత్రంతా ఏదో గుబులు.

తనూ నిద్రపోలేదు, భార్యనీ నిద్రపోనియ్యలేదు. ఆ పిల్ల పెళ్ళయిన పదేళ్ళుగా ఊగులోడి యవ్వారం చూస్తానే ఉంది . పిల్లల్లేరనేగానీ మొగుడే ఒక చిన్న పిల్లోడా అమ్మాయికి. నిజానికి ఊగులోడు చానా తెలివైనోడు. ఏ విషయమైనా సరే విభజించీ విడగొట్టీ పీసు పీసు జేసి పాయింట్లు లాగుతుంటాడు. వీడి ‘లా’ పాయింట్లకి జవాబు చెప్పలేక 'ఒట్టి పెడనాయాల్రా ఈడు' అంటుంటారు ఊళ్ళోవాళ్ళు.

చిన్నప్పుడే నాన్న చనిపోయినా పొలం పనులన్నీ అమ్మే చూసుకుంటా బడికి పంపించింది. పక్కూళ్ళో హైస్కూలుకి రోజూ పది మైళ్ళు నడిచి వెళ్ళొచ్చేవాడు. బాగా చదివేవాడు. పదో తరగతి స్కూలు ఫస్టోచ్చాడు కూడా. పరీక్షలు జరుగుతుండగానే అమ్మకి జబ్బుచేసి ఆసుపత్రిలో చేరడం, తరవాత ఆమె చనిపోవడంతో ఊగులోడి చదువాగిపోయింది. నాలుగేళ్ళపాటు తనింట్లోనే పెట్టుకుని కూతుర్నిచ్చి పెళ్ళి చేశాడు మేనమామ. పెళ్ళినాటిని ఊగులోడికి నిండా ఇరవై కూడా లేవు. ఆ పిల్లకి మైనారిటీ కూడా తీరలేదు. 'మీ నాన్నని ఇప్పుడైనా అరెస్టు చేయించొచ్చు ఈ పాయింటు మీద' అని అప్పుడప్పుడు ఆ పిల్లని ఆట పట్టిస్తుంటాడు.

ఆ అమ్మాయి తనంత తెలివయింది కాదని ఊగులోడి అభిప్రాయం. కానీ ధైర్యంలో మాత్రం తనకంటే పది రెట్లు మేలని వాడికి ఖచ్చితంగా తెలుసు. ఒకటికి మించిన మార్గాలున్న సమస్య ఏదైనా వచ్చిందా... ఊగులోడికి చచ్చేచావొచ్చిందన్న మాటే. అసలు ముందు కాసేపు ఏం తోచదు. బ్లేడు లాగిన మడిచెక్కలాగా మైండంతా ఖాళీగా అయిపోద్ది. అట్లా చెయ్యాలా ఇట్లా చెయ్యాలా అని అట్లా ఇట్లా కాదు అనీ ... మూడు పొద్దులు, మూడు రాత్రులు అదే పనిగా ఆలోచిస్తానే ఉంటాడు.

ఈ లోపు ముప్ఫై మూడు సార్లు 'ఏం చేద్దామంటావే' అని భార్యనడుగుతాడు. ఆ అమ్మాయికి తెలిసిన విషయాల్లో ఆమె సలహాలడుగుతాడు. తెలియని విషయాల్లో కూడా అట్లానే అడుగుతాడు. 'నీ ఇష్టం' అంటేనేమో "నా ఇష్టం సరే, నీ ఇష్టమేందని గదా అడుగుతుంది. నీకొక అభిప్రాయముండదా..." అంటా 'లా' పాయింట్లు దీస్తాడు. సరే ... ఏదో తనకు తోచింది చెబుతుందా, 'అట్టెట్టయిద్ది, ఇట్టెట్టయిద్ది' అని మళ్ళా తగులుకుంటాడు. ఆ అమ్మాయి చెప్పినట్లు చేసి ఆ పని కొంచం అటూ ఇటూ అయిందంటే, "ఛ ... నువట్లా చెప్పబట్టి గదా ఇప్పుడిట్లా అయ్యింది" అని కొన్ని రోజుల పాటు సణిగినోడు సణిగినట్టే ఉంటాడు.

ఉదయం చేనికాడ తను పడిపోవడం గురించి కూడా తనకు తోచిన రక రకాల భయాలన్నీ పెళ్ళాంతో చెప్పాడు. అన్నిట్నీ కొట్టిపారేసిందా పిల్ల. "పొట్టలో బాగాలేదని పొద్దున్నే ఏం తినకుండా పొలం బోతివి. చిరచిరలాడే ఎండకి కళ్ళు తిరిగి పడిపోయ్యావంతే" అని ఎప్పట్లాగానే ఊగులోడికి ధైర్యమిచ్చింది.

'అంతే అంతే' అనుకోని కళ్ళు మూసుకొని పడుకుంటాడు, అంతలోకే సీసాలోంచి భూతం బయటకొచ్చినట్టు ఏదో ఒక అనుమానం. భార్యని లేపుతాడు.
"మరి... కళ్ళకేమీ అగపడకుండా తెల్లగా బూజరగా ఉండటమేంది ఒక నిమిషం సేపు?..."

"నీరసమ్మీద పడిపోతే అట్లాగే ఉండిద్దిలే..."

"ఛ. స్పృహ తప్పి పడిపోవటానికీ, కళ్ళు కనపడక పోవటానికీ సంబంధమేందే...?"

ఆమె తన పాత జవాబే మళ్ళీ ఇంకాస్త గట్టిగా చెబితే వినాలని వాడి కోరిక. ఆ అమ్మాయి గోడమీద టైం చూసి వాడివైపు తిరిగి ఆవులిస్తూ "సరే, రేపు ఒంగోలు... డాక్టరు దగ్గరకి వెళ్ళొద్దాంలే" అంది.

"ఛ! డాక్టరు దగ్గరకెందుకే ... వాళ్ళు ఏదేదో చెబుతారు. ఏదో కళ్ళు తిరిగుంటయ్యంతేలే. పడుకో పడుకో ... అర్ధరాత్రి అవతంది" అంటా పడుకున్నాడు.
తెల్లారి లేచి గుబులు గుబులుగానే బరగొడ్లకాడ బాగు చేశాడు. భార్య పాలు పిండింది. పోయి కేంద్రానికి పోసొచ్చాడు. నాలుగు రోజులు గడిచిపోయినయ్. ఏమవుద్దో ఏమవుద్దోనన్న భయం కాస్త తగ్గుతా వుంది. ఎంబట్నే కంగారు పడి ఆసుపత్రికి పరుగెత్తనందుకు సంతోషిస్తున్నాడు.

ఈ రోజు పాల కేంద్రం కాడ అరుగు మీద కూర్చోని పేపరు చదువుతున్నాడు. లోపలెక్కడో అంతరాత్మలో అణచిపెట్టుకున్న భయం పేపర్లో ఆ వార్త చూసి చప్పున పైకి తన్నుకొచ్చింది. ఆ రోజు ప్రపంచ మూర్ఛరోగుల దినమంట! ఆ సందర్భంగా ఎవరో డాక్టరు, ఆ రోగం గురించి పేపర్లో రాశాడు. నోటంబడి నురుగులు రావడం, గుప్పిళ్ళు బిగబట్టడం లాంటి లక్షణాలు లేకుండా కూడా ఫిట్స్ రావొచ్చంట. కొద్ది సమయం పాటు కళ్ళకేమి అగపడకుండా ఉండడం కూడా మూర్ఛ లక్షణాల్లో ఒకటంట.

ఒక్కసారిగా ఊగులోడి వాలకమే మారిపోయింది. ఉషారుగా పేపరు తీసుకున్నోడల్లా చప్పున చల్లారిపోయ్యాడు. మెదలకుండా పేపరు మడతేసి అక్కడ పెట్టి ఇంటికి బయలుదేరాడు. అలవాటయిన దారిగుండా అలవాటయిన కాళ్ళు ఇంటికేసి సాగి పోతన్నయ్యేగాని, ఊగులోడి మనసులో ఏడేడు సముద్రాలు ఎగిరెగిరి పడుతున్నాయి.

ఇంటికొచ్చేసరికి భార్య పేపరు చదువుతా ఉంది. ఊగులోడిని చూసి చదివే చదివే పేపరు మడిచేసి పక్కింట్లో ఇచ్చేసొచ్చింది. ఒళ్ళంతా చెమట్లు పట్టిన మొగుణ్ణి చూసి ఎందట్లా ఉన్నావని అడిగింది. పేపర్లో తను చదివిన వ్యాసం గురించి చెప్పాడు. ఊగులోడు వచ్చేసరికి తనూ పేపర్లో చదువుతున్నది ఆ వ్యాసమేనని, అది చూస్తే ఇంకా కంగారు పడతాడేమోనని హడావుడిగా వాళ్ళ పేపరు వాళ్ళకి ఇచ్చోచ్చాననీ చెప్పింది.

నిజానికా వ్యాసంలో ఫిట్స్ అంటే ఇప్పుడు భయపడాల్సిందేమీ లేదనీ, మందులు వాడుకుంటా ఉంటే శాశ్వతంగా అదుపులో ఉంచుకోవచ్చనీ రాశారు. కానీ, ఊగులోడికి ఫిట్స్ అనే మాటే భయం పుట్టిస్తంది. భరించరానిదిగా ఉంది. ఎల్లకాలం మందులు వాడుకుంటా ఉండాల్సిరావటమనే ఊహే నచ్చట్లేదు. 'ఎక్కడికి పోవాలన్నా ఎవరో ఒకరు తోడుండాలి గదా' అని అనుకుంటంటేనే ఏడుపొస్తంది. ఊగులోడి కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. 'మళ్ళీ మొన్నట్లాగే కళ్ళు కనబడ్డం లేదు నాకు' అన్నాడు. "ఏం లేదులే... నువ్వు భయపడుతున్నావ్... కళ్ళు తుడుచుకో" అంటూ వాడిని దగ్గరకు తీసుకుని మంచం మీద కూర్చోబెట్టి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. తాగాడు.

అప్పటికప్పుడే ఆసుపత్రికి ఒంగోలు బయల్దేరారు. ఒంగోలులో ముందు తమకు తెలిసిన తమ ఊరి డాక్టరొకాయనుంటే ఆయన దగ్గరకి పోయారు. ఆయన ముక్కు, చెవులు, గొంతు డాక్టరు. ఆయనొక పిచ్చి మారాజు. హైస్కూలు పిలకాయలందరికీ ఊరకేనే వైద్యం చేస్తాడు. ఎడాపెడా టెస్టులేమీ రాయడు. 'మనూరి డాక్టరు గదా. ఫిట్స్ డాక్టరు ఎవరికయినా చెప్పి తక్కువ ఖర్చుతో చూపిస్తాడేమో. టెస్టు చేపిచ్చుకుంటే అటో ఇటో తేలిపోద్ది' అనుకున్నాడు ఊగులోడు.

ఆయన ఆప్యాయంగా పలకరించి అంతా విని "ఏం ఉండదులే... నీరసం వల్ల కళ్ళు తిరిగుంటయ్యంతే" అన్నాడు. "ఒక్కసారి నరాల డాక్టరు దగ్గరికి పోయి టెస్టు చేయించుకుంటే మంచిదేమోనని వచ్చామ"న్నాడు.

"ఎందుకూ... ఏం పని లేదా ఏంది? ఇదిగో, ఈ బిళ్ళలు ఒక పదిరోజులు పాటు ఏసుకుంటా బలమైన తిండి తింటే చాలు. నేను గూడా మనూరికే వస్తన్నా. నా కారులో పోదాం రాండి" అని ఎంబట పెట్టుకుని ఊరికి తీసుకుపోయాడు.

ఊగులోడికి ఒక రకంగా సంతోషంగా ఉంది. ఒక రకంగా అసంతృప్తిగా ఉంది. ‘అంతలావు డాక్టరు అంత ధైర్యం చెబుతున్నాడంటే అంతే అయుండాల. ఈ టెస్టులనీ, ఈ టెస్టులనీ డబ్బులొదిలించుకోలేదు, ఇంకా నయం’ అని సంతోషం. ‘ఎదవ డబ్బులు, పోతే పోయినియ్ ... టెస్టు చేయించుకొనుంటే అనుమానం తీరిపోయి మనసుకి శాంతిగుండేది గదా” అని అసంతృప్తి.

ఆ సాయంత్రం పంచాయితీ అరుగు మీద కూర్చోనున్నప్పుడు ఊళ్ళో ఎలిమెంట్రీ స్కూల్లో పని చేసే 'మారుతీసారు' పలకరించాడు. "బాగాలేదంట గదా. ఏంది సంగతి?" అన్నాడు. ఊగులోడు కతంతా చెప్పాడు. అంతా విని "ఒకసారి గుంటూరు పోయి మంచి 'న్యూరాలజిస్ట్' ని కలిస్తే ఎందుకైనా మంచిదేమో, కరెంటు వైరుల్లో కనెక్షన్ లూజయినప్పుడు లైట్లు ఆరిపోయి వచ్చినట్లే ... తలలో నరాల్లో ఏదైనా లూజు కనెక్షనుండి అప్పుడప్పుడు నీకు ఏదైనా కనపడకుండా ఉంటుందేమో" అన్నాడు. దెబ్బకి చచ్చాడు ఊగులోడు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టయింది.

అసలే ఒక అనుమానంతోనే సతమతమవతంటే తల్లో ఏదో నరాల జబ్బేమో అని కొత్త డౌటు రేగిందిప్పుడు. ఆ సారు చెప్పిన ఉదాహరణ గుర్తొచ్చినప్పుడల్లా ఆ కొత్త డౌటు కూడా నిజమయ్యే అవకాశం బాగా ఎక్కువగానే ఉన్నకనపడతంది. 'ఎంతైనా మాస్టారు గదా. సరిగ్గా సరిపొయ్యే ఉదాహరణతో బలే అర్ధమయ్యేట్టు చెప్పాడు' అనుకున్నాడు

ఆ పూట పొద్దు పోయిందాకా ఆ అరుగు మీదే గమ్మున కూర్చోనుండిపోయాడు. మళ్ళీ మళ్ళీ వచ్చి వాలే చీకటీగల్లాగా రకరకాల ఆలోచనలు మనసులో ముసురుకుంటున్నాయ్. అట్లానే కూర్చోని, కూర్చోని ఎప్పటికో లేచి కొంపకి చేరాడు. "రేపు పొద్దున్నే బయల్దేరి గుంటూరు పోయొస్తా. 'వనితా సూపర్ స్పెషాల్టీస్' లొ అన్నీ టెస్టులు బాగా చేస్తారంటా. మారుతీ సార్ చెప్పాడు"

* * *

స్టేషన్ లో రైలు దిగి ఆటో ఎక్కి ఆసుపత్రికి చేరుకున్నాడు. 'వనితా సూపర్ స్పెషాల్టీస్' బోర్డు చదివాడు. రకరకాల రోగాల పేర్లు, వాటికెదురుగా డాక్టర్ల పేర్లు. ఆ రోగాల్లో సగానికి పైగా పేర్లు తనకి తెలియనివే. మెట్లెక్కి లోపలకొచ్చాడు. 'పర్లేదు. రద్దీ తక్కువగానే ఉంది' అనుకున్నాడు. "ఓపిలు రాసేది ఎక్కడ సార్?" ఎవర్నో అడిగాడు. 'ఇక్కడ ఒపీలు రాయరు. ఇది కేవలం పరీక్షలు చేసే బిల్డింగే. అదుగో. ఆ ఎదురుగా ఉంది. అదీ అసలు హాస్పటల్"

అక్కడకి వెళ్ళిన ఊగులోడు ఆ మెట్ల దగ్గర అట్లానే నిలబడిపోయాడు నోరు తెరుచుకోని. తాను దిగొచ్చిన రైల్వే స్టేషన్ కంటే కూడా ఈ ఆసుపత్రే ఎక్కువ హడావుడిగా ఉంది. ఆ జనం మామూలుగా లేరు. 'కొలుపులప్పుడు, తిరునాళ్ళప్పుడు కూడా మానూళ్ళో ఇంత రద్దీగా ఉండదేమో' అనుకున్నాడు.

వొచ్చేవాళ్ళు, పొయ్యేవాళ్ళు, మూలిగేవాళ్ళు, ముక్కేవాళ్ళు, కుర్చీల్లో కూర్చొని టీవీలు చూసే వాళ్ళు, నడవలేకుండా ఉన్నవాళ్ళని చక్రాల మంచాల మీద పొణుకోబెట్టుకొని తోసుకుపొయ్యేవాళ్ళు... –మెల్లగా అడుగులు ముందుకేసాడు. ఎటు వెళ్ళాలో, ఎక్కడ 'ఒపీ' రాస్తారో ఏమి అర్ధమవలేదు. 'ఎనక్కి తిరిగి చూడకుండా ఇట్నించిటే పారిపోదామా?' అనిపించిందొక్క క్షణం.

కొంచం స్థిమితపడి ఒక అద్దాల కౌంటరు దగ్గరకెళ్ళి “"ఒపీలు రాసేదెక్కడండీ?" అనడిగాడు. ఆ అద్దాల వెనకాల ఆమె కంప్యూటర్ మీంచి చూపు తిప్పకుండానే అడిగింది. "ఏం కంప్లయింటు?"

"లూజు కనెక్షన్" అప్రయత్నంగా అనేశాడు మారుతీసారు మాటలు మనసులో తల్చుకుంటున్న ఊగులోడు. "ఆ ...?" ఇప్పుడు తలెత్తిందా అమ్మాయి.

"నరాల డాక్టరుని కలవాలమ్మా?"

"అయితే ఇక్కడే. రెండు వందల రూపాయలివ్వండి" ఇచ్చాడు. పేరు, ఊరు, వయసు కంప్యూటర్లో రాసుకుంది.

'నాకు కార్డేమి ఇవ్వలేదు' గుర్తు చేశాడు.

"అదిగో, ఆ పదమూడో నంబరు గది ముందుకెళ్ళి కూర్చోండి. మీ ఫైలు అక్కడికే తీసుకొచ్చి ఇస్తారు."

"నా నంబరెంతమ్మా?" అని అడిగాడు.

"యాభై రెండు"

'వామ్మో! 51 మంది అయిపోయ్యేడదెప్పుడు ... నా వంతు వచ్చేదెప్పుడు.. సరే, కానియ్ – రోట్లో తలపెట్టినాక రోకలి పోటుకి భయపడితే ఎట్లా' అనుకొని పదమూడో నంబరు రూము దేవులాడుకుంటూ బయల్దేరాడు.

కొంచం ముందుకెళ్ళి కుడివైపు తిరిగింతర్వాత కనపడిందా రూము. తలుపు మీద 'డా. పి. మమతా, న్యూరాలజిస్ట్' అని బోర్డు రాసుంది. రూం ఎదురుగ్గా ఉన్న కుర్చీలన్నీ నిండిపోయున్నాయి. ఎత్తుగా అమర్చి ఉన్న టివీలో 'రబ్బరు గాజులు రబ్బరు గాజులు' అని పాట వస్తంది. అసలు ఆసుపత్రుల్లో టీవీలెందుకో ఊగులోడికర్ధంకాదు. ఇక్కడ కొచ్చేది బాధలతో ఉన్నవాళ్ళు గదా... ఇక్కడ ఇట్లా టీవీలు పెట్టుకుని వాటిల్లో పాటలు, సినిమాలు చూసుకుంటా నర్సులు కూర్చోనుంటే 'మీ చావు మీరు చావండి. మాకేంది?' అని అంటన్నట్లే అనిపించదూ?

అవతలోళ్ళు పట్టించుకోటల్లేదని తెలిసినప్పుడు బాధలు భయాలు ఇంకా ఎక్కువగా అనిపిస్తాయి గదా కష్టాల్లో ఉన్నవాళ్ళకి!

కూర్చోడానికి లేకపోయేసరికి అక్కడే అటూ ఇటూ తిరిగి చూస్తున్నాడు. ఒక పక్కన పెద్ద 'వెంకటేశ్వరస్వామి' బొమ్మ పెట్టి ఉంది. ఊగులోడు దణ్ణం పెట్టుకున్నాడు. అన్ని పరీక్షల్లో తనకు ఏ జబ్బు లేదనే రావాలని, అట్లాగొస్తే కొండ కొచ్చి గుండు కొట్టించుకుంటానని మనసులోనే మొక్కుకున్నాడు. మళ్ళీ అంతలో 'అసలు ఆసుపత్రుల్లో దేవుడి బొమ్మలు పెట్టడమేందా' అనుకొన్నాడు. ఆలోచిస్తా ఉంటే అసలు కారణం తట్టింది. వైద్యం ఫలించి జబ్బు తగ్గితేనేమో తామే దేవుళ్ళమనొచ్చు. తగ్గక పోతే మాత్రం 'మాదేముందీ, అదిగో, అంతా ఆ దేవుడి లీల' అనొచ్చు. అక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచీ ఊగులోడిలో కలుగుతున్న అసహనం ఈ ఆలోచనలతో ఇంకా ఎక్కువవడం మొదలు పెట్టింది.

అంతలో ఒక నర్సొచ్చి తన పేరు పిలిచింది. వెళితే ఊరంతా వెడల్పున్న ఒక ఫైలు చేతిలో పెట్టింది. అంత లావు ఫైలు తన చేతుల్లో చూసినాక తనకేమీ రోగం లేదని చెప్పినా కూడా ఊళ్ళో ఎవరూ నమ్మరేమో అనుకున్నాడు. చేంతాడంత రోగాల జాబితా రాసినా కూడా ఆ ఫైల్లో ఇంకా చోటు మిగిలే ఉంటుందనిపించింది.

నంబర్లవారీగా రూంలోకి పిలుస్తున్నారు. ముగ్గురైపోయారు. తన నంబరొచ్చే సరికి ఎట్టలేదన్నా మజ్జానమయిద్దని లెక్కేసుకున్నాడు. గోడలు, గోడల మీద బోర్డులు అన్నీ చూడ్డం మొదలు పెట్టాడు. పదమూడో నంబరు రూం గోడ బయట ఒక బోర్డు పెట్టి ఉంది. ’ఐన్ స్టీన్ ‘, ‘న్యూటన్’, ‘అలెగ్జాండర్’ – వీళ్ళంతా తమకున్న మూర్ఛరోగాన్ని జయించిన వాళ్ళే. మందుల బలం కంటే మానసిక బలంతో వాళ్ళు దాన్ని సాధించారు.’

'తనకే అట్లాంటి పరిస్థితొస్తే తను మానసిక బలం చూపించగలడా? అంత మానసిక బలమే ఉంటే అసలు ఇప్పుడిక్కడికి రానేరాడేమో! పెద్దగా రోగం లక్షణాలేమీ కనపడకపోయినా లేని పోనీ అనుమానాలు పెట్టుకుని వొచ్చాడేమో! ఇప్పుడైనా ఏం పోయింది. పోతే పోయింది రెండొందలు. ఇంటికెల్తే....'

కాసేపు మనసు అటూ ఇటూ ఊగిసలాడింది. అంతలోకి మారుతీసార్ గుర్తొచ్చాడు. ఆయనన్నట్లు లూజు కనెక్షనై, నయం చేయించుకోవడం ఆలస్యమయితే సీరియస్సయిపోద్దెమోననిపించింది. ‘సరే, కానియ్’ అనుకున్నాడు. భార్యని తోడు తెచ్చుకోకుండా ఒక్కడే రావడం పొరపాటయిపోయిందని చింతించాడు.

కొంచం అలా వరండా చివరకు నడిచాడు. అక్కడ గోడకి నిలువెత్తు ఫోటో పెట్టి ఉంది. 'డాక్టరోళ్ళ నాన్నేమో!' ఆ ఫోటో కింద రాసుంది. "స్వాతంత్ర్య సమర యోధులు, తామ్రపత్ర గ్రహీత, ప్రముఖ కాంట్రాక్టరు శ్రీ డా. వంగవరపు వెంకటరామారావు". 'స్వాతంత్ర్య సమర యోధుడు మరి కాంట్రాక్టరెట్లా అయ్యోడో..! ఆ రోజుల్లో మంచోళ్ళు కూడా కాంట్రాక్టులు చేస్తుండేవాళ్ళేమో!'

* * *

'నంబర్ 50' నర్సు పిలిచింది. ఇంకో రెండు పేర్లు అయిపోతే తనదొస్తుంది. తలుపు తీసేటపుడు, వేసేటపుడు లోల్నుంచీ కుర్ర డాక్టరొకాయన కనబడుతున్నాడు. 'డాక్టర్ మమత దగ్గర చూయించుకోవాలని గదా తను ఒపీ రాయించుకుంది. వీడెవడు?' అని అనుమానమొచ్చింది. ఆ విషయమే వాకిలి దగ్గర పీట మీద కూర్చున్న నర్సుని అడిగితే ఆమె చెప్పింది. "ముందు ఈ చిన్న డాక్టరు చూస్తారు. చూసి ఏమేం టెస్టులు చేయించుకోవాలో రాసిస్తారు. వెళ్ళి ఆ టెస్టులు చేయించుకొనొచ్చాక అప్పుడు పెద్ద డాక్టరమ్మగారు చూస్తారు."

అంతలో లోపలికి పిలుపొచ్చింది. వెళ్ళాడు. "ఆ. ఆఖరుసారి ఎప్పుడు ఎటాక్ కనబడింది?" అనడిగాడు డాక్టరు. "అసలు తనకొచ్చింది ఎటాకో, కాదో తెల్సుకోవాలనొస్తే ఎప్పుడు ఎటాకని అడుగుతాడేందిరా ఈడు?" అనుకున్నాడు ఊగులోడు. మొత్తం జరిగిందంతా చెప్పాడు. అనుమానం మీద వచ్చానన్నాడు. ఆ డాక్టరు ఊ అన్లేదు, ఆ అన్లేదు... అర్ధమెందో తెలియకుండా తలూపాడు. పేపరొకటి తీసుకుని బరా బరా ఏదో గీకాడు.

కాగితం చేతిలో పెట్టి 'నెక్ట్స్' అంటూ బెల్లు కొట్టాడు. "ఏంది సార్ ఏం కాయితం, ఏం చెయ్యాలి నేనిప్పుడు?" అని అడిగాడు ఊగులోడు. "బయట నర్సు చెప్తుంది. పొండి" అన్నాడు. బయటకొస్తే ఆమె చెప్పింది. "11వ నంబరు కౌంటరు దగ్గరికి పోయి ఈ కాయితం ఇవ్వండి. వాళ్ళు ఎంత డబ్బులివ్వాలో చెబుతారు. డబ్బులిచ్చేసి రశీదు తీసుకోండి." 'అది ఏం కాయితం? ఆ కౌంటరెక్కడుంది' అని అడగబోతున్నంతలోనే ఆమె హడావుడిగా లోపలికి పోయింది.
చిన్నప్పుడు సింగరకొండ తిరనాల్లో తప్పిపోయినప్పుడు ఎట్లా అనిపించిందో ఇప్పుడూ అట్లానే అనిపిస్తుంది ఊగులోడికి. ఆ వరండాలో ఇట్నుంచి అటు ఎక్కడ చూసినా 11 వ నెంబరు కౌంటరు కనబడలేదు. ఇదంతా చూస్తున్న ఒకాయన ఆ కౌంటరు పై అంతస్తులో ఉంది, పొమ్మని చెప్పాడు. మెట్లెక్కి పైకెళ్ళాడు.
'ఇన్వెస్టిగేషన్, బిల్లింగ్ కౌంటర్' అని ఎర్రక్షరాలతో రాసిన బోర్డుందక్కడ. ఆ కౌంటర్ దగ్గర చేంతాడంత 'క్యూ'లు రెండు ఉన్నాయి. క్యూలో నిలబడి తన ముందున్నాయన్ని అడిగాడు. "ఈ కాగితంలో రాసినయ్యేంట"ని. "మనం చేయించుకోవాల్సిన టెస్టులండీ. ఈ టెస్టుల తాలూకూ బిల్లు ఇక్కడ కట్టేసి ఆ ఎదురుగ్గా ఉన్న బిల్డింగులో కెళ్తే అక్కడ టెస్టులు చేస్తారు" ఈ విషయం రూంలోకి వెళ్ళకముందే తనకు నర్సు చెప్పింది గదా అని అప్పుడు గుర్తుకొచ్చింది.

క్యూ మహా రద్దీగా ఉంది. ఊగులోడి మనసు అంతకంటే రద్దీగా ఉంది. ఏం టెస్టులు రాశాడో, ఎంత బిల్లవుద్దో అని ఆలోచిస్తున్నాడు. అక్కడ గోడకి రంగు రంగుల బోర్డులు తగిలించున్నాయి. 'వనితా సూపర్ స్పెషాలిటీస్ వారి బంపర్ ఆఫర్. కంప్లీట్ బాడీ చెకప్ ... అసలు ధర రు. 2,290. మీ కోసం తగ్గింపు ధర రు.1000 మాత్రమే. రు. 7,500 ఖరీదైన డయాబెటిక్ టోటల్ చెకప్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో రు. 5000 మాత్రమే.'

ఈ బోర్డులు చూసిన ఊగులోడికి మతిపోయింది. మేదరమెట్ల బస్టాండు ముందు చక్రాల బండి పెట్టుకొని "ఏ వస్తువైన పది రూపాయలే" అని అరిచే మస్తాను గుర్తొచ్చాడు. 'ఈ చెకప్పులేంది... ఈ ధరలేంది... ఈ డిస్కౌంట్ లేంది....' ఊగులోడికి ఆ ఆస్పత్రి బందిపోటు దొంగల హెడ్డాఫీసులాగా కనపడసాగింది.

కౌంటర్ లో కంప్యూటర్ ముందు కూర్చున్న అమ్మాయి ఊపిరాడకుండా పనిచేస్తంది. డబ్బులు కట్టలు కట్టలు తీసుకుని సొరుగులో పెట్టుకుంటంది. టకటకా రశీదులు కొట్టిస్తంది. అయినా ఆ వేగం సరిపోవట్లేదు. ముగ్గురు నలుగురు తోసుకోనొచ్చి ఒకేసారి కౌంటర్ రంధ్రంలో చేతులు పెట్టారు. నా డబ్బులు ముందు తీసుకోమంటే నావి ముందు తీసుకోమని గొడవ పెడుతున్నారు.

ముందు నన్ను దోచుకొమంటే ముందు నన్ను దోచుకోండని బతిమలాడుకుంటన్నట్లు ఉంది. ఇంతలో కౌంటర్లోని అమ్మాయి గట్టిగా ఒక్క కసురు కసిరింది. "లైన్లో రాండయ్య, లైన్లో వస్తేనే దోచుకొనేది. ముందొచ్చినోళ్ళనే ముందు దోచుకొంటాం. వెనకొచ్చినోళ్ళను ముందు దోచుకోమంటే ఎట్లా కుదురుద్ది?" అని కోప్పడుతున్నట్లుగా ఉంది.

ఊగులోడి వంతు వచ్చింది. "3906 రూపాయలివ్వండి" అందామె అతని చేతిలోని కాయితం చూసి. డబ్బులిచ్చి రశీదు తీసుకుని బయటకొచ్చి ఎదురుగ్గా ఉన్న టెస్టులు చేసే బిల్డింగ్ లోకి పరుగెత్తుకెళ్ళాడు.

అక్కడా జనం తిరనాలగానే ఉన్నారు. ఏ టెస్టు ఎక్కడ చేస్తారో, ఎవరెటు వెళ్ళాలో చెప్పేవాళ్ళెవరూ లేరు. ఎందుకు లేరో ఊగులోడీకర్ధమయింది. ముందుగానే కట్టించేసుకున్నారు కాబట్టి వాళ్ళకి బాధేమి లేదు. తాపీగా ఉన్నారు. డబ్బులు కట్టేశారు కాబట్టి టెస్టులు చేయించుకోవాల్సిన జనానికి ఆదుర్దా.
ఎట్లాగో కనుక్కుని టెస్టులు చేసే దగ్గరకు పోయాడు. రక్తపరీక్షకు రక్తమిచ్చాడు. ఒంటేలు పరీక్షకు బుడ్డి తీసుకొని పోయి నింపుకొచ్చాడు. తల స్కానింగ్ తీసే రూం దగ్గరకొచ్చాడు. అక్కడ ఎవ్వరూ లేరు. 'వీళ్ళెప్పుడొస్తారు' అని ఎవర్నడిగినా ఎవరూ ఏమి చెప్పట్లేదు. ఏం జెయ్యాలో అర్ధం కాక అటూ ఇటూ తిరుగుతుంటే 'అంత లోకి ఆ ఇఇజీ పరీక్ష చేయించుకొని రాండి' అని చెప్పాడు రక్త పరిక్ష కౌంటరులో కూర్చున్న అబ్బాయి.

ఆ పరిక్ష చేసే గది కింద అండర్ గ్రౌండ్ లో ఉంది. మెట్లు దిగి కిందికెళ్ళాడు. ఆ గది బయట బెంచీ మీద అప్పటికే నలుగురు కూర్చుని ఉన్నారు. వెళ్ళి పక్కనే కూర్చున్నాడు. 'తలక పోసుకున్నావా?' అని అడిగాడు పక్కన కూచున్నాయన. "పోసుకోలా" నూనె రాసుకున్న తలను తడుముకుంటూ చెప్పాడు ఊగులోడు. "ఈ పరిక్ష చెయ్యాలంటే తలలో జిడ్డుండకూడదంట. అదిగో, ఆ పక్కన బాత్రూముల దగ్గర ఆయా ఉంటది. ఎంటికలమటికి షాంపూతో కడుగుద్ది పో" అని చెప్పాడు. బాత్రూముల కెల్లి పోయే సరికి ఆయమ్మ ఎదురొచ్చింది. "ఏందయ్యా తలకపోయాల్నా?" అంది. ఆమెను చూస్తే ఊగులోడికి ప్రాణం లేచొచ్చింది. ఆ ఆస్పత్రిలో అడుగు పెట్టింతర్వాత 'ఫలానా పని కావాలా' అని దయగా అడిగిన మొట్టమొదటి మనిషి ఆమే!

తలక పోసుకోనొచ్చి పరిక్ష చేసే గది బయట కూర్చొని ఆరబెట్టుకున్నాడు. ఒక గంటకి తన వంతొచ్చింది. తలంతా ఏదో బంకలాంటిది పూసి క్లిప్పులు పెట్టి ఒక అరగంట సేపు ఏదో మిషను కింద పడుకోబెట్టారు. ఒక రిపోర్టు ఇచ్చారు. అది ఒక పెద్ద పుస్తకం లాగా ఉంది. పేజీల నిండా ఏంటియ్యో ఎగుడుదిగుడు గీతలే.

తలకి పూసిన బంక పోవాలంటే మళ్ళీ షాంపూతో కడుక్కోవాల్సిందేనని చెప్పారు. ఆయమ్మ సాయంతో తల శుభ్రంగా కడుక్కున్నాడు. "ఒక పది రూపాయలియ్యయ్యా ...." అనడిగిందామె. 20రూపాయలు తీసి ఆమె చేతిలో పెట్టి మెట్లెక్కి పైకొచ్చాడు. తల స్కానింగ్ చేయించుకుని ఆ రిపోర్ట్ కూడా తీసుకున్నాడు. అక్కడ కూడా ఏదో పెద్ద యంత్రం కింద పడుకోబెట్టారు. అలా పడుకున్నప్పుడు పై నుంచి మిషనేదో దిగుతుంటే... ఏ భూతమో వచ్చి గుండెల మీద కూర్చుని నొక్కెస్తున్నట్లు ఉంది ఊగులోడికి.

పరధ్యానంగా రిపోర్టులన్నీ తీసుకుని మెయిన్ ఆసుపత్రిలోనికొచ్చాడు. పదమూడో నంబరు గది ముందుకొచ్చాడు. తనలాగే పొద్దున చిన్న డాక్టరుకి చూయించుకుని టెస్టులన్నీ చేయించుకొనొచ్చి పెద్ద డాక్టరు గారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారందరూ. ఒక కుర్చీ ఖాళీగా కనబడ్డంతో దాంట్లో కూలబడ్డాడు.

ఊగులోడి మనసంతా గందరగోళంగా ఉంది. తను అనవసరంగా తొందరపడి వచ్చాడేమో అని పదే పదే అనిపించసాగింది. రిపోర్టులన్నీ చూసి ఏం చెబుతారో అని భయం వేస్తంది. 'ఏమీ లేకపోయినా ఏదో రోగముందని చెబుతారేమో. ఎట్లారా నాయనా' అనుకుంటున్నాడు. 'ఇక్కడ కాలు పెట్టిందగ్గర్నించి ఎటు చూసినా వ్యాపారమే గదా కనపడింది' అని మాటి మాటికీ అనుకుంటన్నాడు.

పక్క కుర్చీలో కూర్చున్నాయన ఆ పక్కనాయనతో చెప్తున్న మాటలు చెవుల్లో పడుతున్నాయ్. "దొంగనాయాళ్ళు! తగ్గుద్దని చెప్పి జాయిన్ చేసుకున్నారు. నెల రోజుల్నుంచీ రోజుకి మూడు వేల రూపాయల కాడికి బిల్లు వేసి తీరా ఇప్పుడు 'లాభం లేదు, తీసుకెళ్ళిపొండి' అంటన్నారు. 'మనం ఏం చేసినా ఇంకో నెల రోజుల కంటే బతకడు' అని ఊళ్ళో ఎమ్బీబియ్యెస్ డాక్టరు చెబితే వినకుండా ఇక్కడికి తీసుకొచ్చి నిలువునా మోసపోయాం."

ఊగులోడి బుర్ర గిర్రున తిరిగిపోతంది. 'ఒకేల ఆ రిపోర్టుల్లో నిజంగానే తన తలలో ఏదో తేడా ఉందనోస్తే..?' 99 పాళ్ళు ఏ తేడా ఉండదనే అనిపిస్తంది. ఒక పాలు అట్టాంటిదేమైనా ఉంటే కనబడకుండా ఏం ఉండదు గదా. అప్పుడే చూసుకోవచ్చు. అసలు పక్కనే ఉన్న మేదరమెట్లకు పోయి మామూలు డాక్టరుకి చూయించుకోకుండా ఈ ‘సంతాసుపత్రి’కి రావడమే పెద్ద తప్పు.

"నెంబరు 50" రూము బయటకొచ్చి నర్సు పిలుస్తా ఉంది. ఇంకో రెండు నంబర్లు పిలిస్తే తన వంతొస్తుందనగా ఊగులోడు మెల్లగా లేచాడు. సంచి తీసుకోని మెట్లు దిగి బయటకొచ్చి ఆటో ఎక్కాడు. స్టేషనుకొచ్చి ఊరెళ్ళే రైలెక్కాడు.

(నవ్యవీక్లీ డిసెంబరు 2010 సంచికలో ప్రచురితం)

15, మార్చి 2014, శనివారం

అమ్మాయిలూ ఆలోచించండి !



                                                                                                                     —-మండువ రాధ


శైలా! శైలా! మీ ఎంకమ్మత్త నిన్ను రమ్మంటంది” ప్రహరీ గోడకి ఆనుకుని ఉన్న అరుగుమీదకెక్కి కేకలు వేస్తూ నన్ను పిలిచి చెప్పింది నాగరత్నమ్మ.

“ఎందుకంటా? సిగ్గూ, ఎగ్గూ లేకుండా అది నా కూతురిని పిలవమంటే నువ్వెట్టా పిలుస్తున్నావు? పైగా అరిచి చెప్తుంది చూడు నలుగురూ వినలేదని” అంది మా అమ్మ ఈసడింపుగా.

”నాకెందుకులే తల్లా మీ మద్దెన. ‘పాలు పిండుకు రావడానికి కొట్టం సాయ పోతున్నావు గదా! అట్టా మా శైలజని రమ్మని చెప్పు నాగరత్తమ్మా’ అంటే వచ్చా. ఏందో అమెరికా దేశం నుండి కోడలు వచ్చిందంటే చూడాలని ఉండదా? చిన్నప్పుడు ఎత్తుకుని పెంచిన మురిపం ఎక్కడకు పోద్దీ” అనుకుంటా అరుగు దిగి వెళ్ళిపోయింది నాగరత్నమ్మ.

“మురిపం అంటా మురిపం. లేచిపోయింది పోయినట్లుండక ఆస్తి కోసం పుట్టింటి పైనే కేసు వేసింది. మొగుడ్ని వదిలేసి లేచిపోయిన దానికి ఆస్తి ఎట్టా వచ్చిద్దని కోర్టు బాగా బుద్ధి చెప్పింది. అయినా దరిద్రం వదల్లా. కూతురు సక్కరంగా కాపరం చేసిద్దని ఊళ్ళో ఇల్లు కట్టి పోయిందిగా ఆ మహాతల్లి. ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ ఇంటికి చేరింది. 
 తూరుప్పక్క బజారుకి పోదామంటే సిగ్గేత్తంది దీని మొకం చూడలేక” అంది అమ్మ మజ్జిగ చిలుక్కుంటూ.
 
అమ్మ మాటలకి నాకు బాధ కలిగింది. అమ్మ ఆవేదనలో కూడా అర్థం ఉంది. మామని వద్దని లేచిపోయిన ఎంకమ్మత్త ఎవరి ప్రోద్బలంతో మా మీద కేసు వేసిందో, ఎందుకు వేసిందో నాకు అర్థం కాని ప్రశ్న. తాతని ఫోన్లో అడిగాను కాని ‘నువ్వు ఇండియాకి వచ్చినపుడు మాట్లాడుకుందాంలే తల్లీ’ అన్నాడు. అత్తని కలిసినపుడు తప్పకుండా అడగాలి. ‘అమ్మకి తెలియకుండా అత్త దగ్గరకి వెళ్ళాలి ఈరోజు’ అని అనుకున్నాను.
అత్త జ్ఞాపకాలు నా మనస్సు నిండా
                                         
***
మోకాళ్ళ పైదాకా బుట్టబొమ్మ లాంటి గౌనులు కుట్టేది నాకు అత్త. అవి వేసుకుని స్టీలు పెట్టెలో పుస్తకాలు, పలక పెట్టుకుని స్కూలుకి వెళ్ళే నన్ను చూసి ‘నువ్వెవరి పిల్లవే’ అని అడిగే వారు నాకు మామ వరస అయ్యే వారు. ‘ఎంకమ్మత్త కోడలిని’ అనేదాన్ని. ఎప్పుడూ కూడా మా నాన్న పేరో, అమ్మ పేరో చెప్పేదాన్ని కాదు. ‘బాగా చదువుకుని పెద్ద డాక్టర్ వి అవ్వాలి బంగారూ! అమెరికాకి వెళ్ళి పై చదువులు చదవాలి అనేది అత్త.

అత్త భలే బాగుండేది. సినిమాల్లోని భానుమతి లాగా. మోచేతి దాకా ఉండే జాకెట్టూ, జాకెట్టుకి మెడ చుట్టూ అంచూ, పూసలూ వేసి కుట్ట్టుకునేది. ఒంటిపొర పైట వేసుకుని పిన్ను పెట్టుకునేది. అంత అందమైన అత్తని పన్నెండేళ్ళప్పుడే తనకంటే ఇరవై ఏళ్ళు పెద్దవాడైన మామకిచ్చి పెళ్ళి చేశారు. అత్తేమో రాణి లాగా పొడవు, పొడవుకి తగ్గ అందమూ. మామేమో పొట్టి. బుడ్డోడులాగా ఉండేవాడు. అయినా నాయనమ్మకి మనసు ఎట్లా ఒప్పిందో అంత అందమైన కూతురిని అనాకారి తమ్ముడికిచ్చి కట్టపెట్టడానికి? తన పుట్టింటి ఆస్తిని కూడా తనింట్లోనే కలుపుకోవచ్చనో, కూతుర్ని తన దగ్గరే ఉంచుకోవచ్చు అనో చేసి ఉంటుంది. రోజుకో రకంగా అలంకరించుకుని పొగాకు గ్రేడింగ్ కి పోయేది అత్త. అక్కడ ఒక పొగాకు బయ్యర్ తో స్నేహం చేసింది. నాన్నకి, తాతకి తెలిసి, కట్టడి చేసి ఇంట్లో కూర్చో పెట్టారు. కొన్నాళ్ళు బాగానే ఉన్నట్లు నటించి తన నగలన్నీ తీసుకుని పొగాకు బయ్యర్ తో లేచి పోయింది.
అతడైనా సరైన వాడా అంటే అదీ లేదు. అతనికి అప్పటికే పెళ్ళాం, కూతురు ఉన్నారు. ఊళ్ళో అందరూ తాత నాయనమ్మల ముఖం ఎదుటే తుపుక్కు తుపుక్కు మని ఊశారు. నాన్న అయితే చాలా రోజులు బయటికి రాలేకపోయాడు. మామకివేమీ పట్టలేదు. ఆయనకి మొదటినుండీ కూడా పొలమే పెళ్ళాం, గొడ్లే బిడ్డలు. 
 
చాన్నాళ్ళ తర్వాత నేను ఏడో తరగతిలో ఉండగా స్కూలు నుండి వస్తున్న నన్ను దారిలో జువ్వి చెట్టు కింద కలుసుకుంది మా నాయనమ్మ. “మీ అత్తొచ్చిందే. దానికి నిన్ను చూడాలని ఉందంట దా” అని నన్ను చెరువు కట్ట దగ్గరకి తీసుకెళ్ళింది. అబ్బో! ఎంకమ్మత్త ఎంత బాగుందో. అచ్చం పట్నం దొరసాని లాగా ఉంది. మిన్నాగు చర్మం లా ఆమె చర్మం సాయంత్రపు ఎండలో మిల మిలా మెరుస్తుంది. అత్తని చూస్తే అప్పుడు నాకు భలే గర్వం కలిగింది. అత్త తన హాండ్ బ్యాగ్ లో నుండి బంగారు కాగితపు అట్టలో పెట్టిన హల్వా, చేగోడీలు ఇచ్చింది. నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని కన్నీళ్ళు కారుస్తూ వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చేప్పుడు నాయనమ్మఎవరికీ చెప్పొద్దేయ్. మీ అమ్మకి అస్సలు చెప్పబాక తిట్టిద్ది” అంది. చెప్పనని అడ్డంగా తలూపాను.

నేను ఏడునుంచి పదో తరగతికి వచ్చిందాకా అప్పుడప్పుడూ నాయనమ్మతో వెళ్ళి అత్తని కలుస్తూనే ఉన్నాను. అత్త ఎందుకో చాలా దిగులుగా ఉన్నట్లు నాకు తెలుస్తోంది. నాయనమ్మ అత్త వచ్చినప్పుడంతా చక్రాలో, పులిబొంగరాలో, అరెసెలో చేసి నీళ్ళ బిందెలో పెట్టుకుని తెచ్చి కూతురికి పెట్టేది. అమ్మకి నాన్నకి తెలిసినా తెలియనట్లు ఉండేవారు. తాత కూడా మాతో వచ్చి చెరువు కట్టకింద అత్తని కలుసుకునేవాడు. రోజుల్లో అతని గురించో లేక మరేం బాధలో తెలియదు కాని తాతకి, నాయనమ్మకి ఏదో చెప్పి అత్త ఏడుస్తూ ఉండేది. ఒకసారి అత్త ఒక రెండు జళ్ళ పిల్లని వెంటబెట్టుకుని వచ్చింది. అతని కూతురట. పది పన్నెండేళ్ళుంటాయేమో. ఎంత బాగుందో పిల్ల. మూతి బిగించుకుని మా వైపు చూస్తున్న పిల్ల చాలా తెలివైనదని అనిపించింది నాకు. అక్కడ ఉన్న కొద్దిసేపులో అమ్మాయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.రోజా! వదినతో ఆడుకోఅంది అత్త నావైపు చూపిస్తూ. పిల్ల నా వైపు కూడా చూడకుండా కింద పడ్డ చింతకాయలను ఏరుతుంది. వెళ్ళేటప్పుడు మాత్రం అత్తటాటా చెప్పుఅంటే యాంత్రికంగా చెయ్యి ఊపింది. అంతే తర్వాత నేను అత్తని చూడలేదు.

నా పదవ తరగతి తర్వాత అత్త ఇక మా ఊరికి రాలేదు. నాయనమ్మ కూతురి మీద బాగా దిగులేసుకుంది. పొగాకు నారుకి వెళ్ళేవారో, మా ఊరి బయ్యర్లో అత్తని ఒకసారి రాజమండ్రిలో చూశామని, మరోసారి కాకినాడలో చూశామని చెప్పేవారు. చనిపోయే ముందు రాదని తెలిసీ నాయనమ్మ కూతురిని చూసుకోవాలని ఆఖరి నిమిషంలో కూడా ఎదురు చూసింది.

కాలప్రవాహం అత్తని గురించి పూర్తిగా మరిచేట్లు చేసింది. నేను ఎం. ఫైనల్ లో ఉండగా మాకు అత్త నుండి లాయర్ నోటీసు వచ్చింది. ఇంట్లో రోజు తాత మీద, నాన్న మీద అమ్మ అరిచిన అరుపులు ఇప్పటికీ నా చెవుల్లో మోగుతున్నాయి. పుట్ట్టింటి ఆస్తిలో తనకూ హక్కు ఉందనీ, తన భర్త ఆస్తి కూడా తనకే రావాలనీ ఆ నోటీసు సారాంశం. భర్తతో కాపురం చేయకుండా లేచిపోయిందని చెప్పడానికి బోలెడంత మంది సాక్షులు బయలుదేరారు అత్త నోటీసు అయితే ఇచ్చింది కాని వాయిదాలకి రానే లేదుట. కోర్టు ఆమెకి ఆస్తిలో హక్కు లేదని తీర్పు ఇచ్చింది.
నాకు పెళ్ళి సంబంధం వచ్చింది. అత్తకు రావలసిన ఎనిమిదెకరాలూ నాకు కట్నంగా ఇచ్చి నా పెళ్ళి చేశారు. నేను డాక్టర్ ని అవ్వాలనే అత్త కోరిక తీర్చలేకపోయినా నాకు అమెరికాలో పనిచేసే డాక్టర్ మొగుడే దొరికాడు. పెళ్ళయ్యాక నేను అమెరికాకి వెళ్ళిపోయాను. రెండేళ్ళ క్రితం తాతకి ఫోన్ చేసినపుడు అత్త మనూరికి వచ్చిందమ్మా! అని చెప్పాడు. నాకు చెప్పాలని నా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడని ఆయన కంఠంలోని ఆతృత వల్ల అర్థం చేసుకున్నాను. “అత్తకి కట్టించిన ఇంట్లో ఉంటుంది. అత్త పరిస్తితి ఏమీ బాగా లేదు. వ్యవసాయం చేసేటప్పుడు నా చేతుల్లో డబ్బు ఆడేది. పొలం కౌలుకి ఇచ్చాం గా అమ్మా! దాన్ని డాక్టరుకి చూపిద్దామన్నా నా దగ్గర డబ్బు లేదు.

తినడానికి మాత్రం బియ్యం మీ అమ్మకి తెలియకుండా ఇస్తున్నాఅన్నాడు. కళ్ళ నీళ్ళు తిరిగాయి. వెంటనే గుంటూరులో ఉండే నా స్నేహితురాలు విజ్జికి ఫోన్ చేసి దాని ద్వారా తాతకి బ్యాంక్ అక్కౌంట్ ఓపెన్ చేయించి డబ్బు పంపాను. చాలానే పంపాను ఆయన ఏ బాధా పడకుండా. ఈ రెండేళ్ళలో అత్త ఆరోగ్యం బాగయింది. సరియైన తిండి లేకనో, దిగులుతోనో శుష్కించిపోయిన ఆమె తేరుకుంది
 
ఊళ్ళో అందరూ అమ్మతో సహా అత్తని లేవదీసుకుపోయినతను అత్తకి బాగా డబ్బు మిగిల్చి చనిపోయాడని అనుకుంటున్నారనీ, అత్త చేతిలో నాలుగు డబ్బులున్నాయని తెలియడంతో పలకరించే వాళ్ళు ఎక్కువయారనీ తాత సంతోషంగా చెప్పాడు. తాత కూడా ఎవరికీ భయపడకుండా కూతురికీ మంచీ చెడ్డా చూసుకుంటున్నాడంట. మామ మాత్రం తన మేనకోడలి మీద ప్రేమతో అత్త ఎదురైతే పలకరిస్తాడంట.
***
పది గంటలప్పుడు అమ్మ పొలం వెళ్ళాక తాత, నేను అత్త దగ్గరకి వెళ్ళాం. అత్త నన్ను వాటేసుకుని ఏడ్చింది. నాకు ఆమె ఎవరో అనిపించింది. ఈమె మా అత్తేనా అనిపించేట్లుగా మారిపోయింది. నేను ఆమెకి కొత్తగా అనిపించకపోవడానికి కారణం – ఆమె నా ఫొటో చూసి ఉంటుంది. కాని నాకు మా అత్తని చూస్తే చెప్పలేని ఏదో భావం. తెల్లజుట్టుని పీట ముడేసుకుని ఉంది. ఏమయింది ఆ భానుమతి అంత అందం? అందం ఇంత అశాశ్వతమా అనిపించింది.

“ఏంటత్తా! ఇలా అయిపోయావు? ” అన్నాను. అత్త నిర్లిప్తంగా నవ్వింది.
డాక్టర్ దగ్గరకి తీసికెళ్ళకూడదా తాతా” అన్నాను.
రాకపోతే నేనేం చేసేది? ఎందుకులే బాగానే ఉన్నాను అంటుంది ఎన్ని సార్లు రమ్మన్నా” అనుకుంటా బయటికి వెళ్ళిపోయాడు తాత. నేను అత్త జీవితాన్ని గురించి అడుగుతానని ఊహించి మమ్మల్నిద్దరినీ అలా వదిలేసి వెళ్ళిపోయాడని అత్త, నేను గ్రహించాము.

ఎట్టుండేదానివి ఎట్లా అయిపోయావత్తా” అన్నాను.
అత్త కళ్ళల్లో ఆగకుండా కన్నీరు.ఊరుకో అత్తా! అన్నాను.
ఏడుపు ఆపుకుని పైటతో కళ్ళు తుడుచుకుంటూమీ ఆయన బాగున్నారా? నీతో రాలేదే? చాలా మంచి వాడంటగా అమ్మాతాత చెప్పాడు అంది.

“ఔనత్తా! బాగా చూసుకుంటాడు నన్ను. చాలా బిజీ. అమెరికాలో డాక్టరు గదా మరి. నేను నిన్ను చూడాలని ఒక్కదాన్నే వచ్చానత్తా” అన్నాను. నా మాటలకి అత్త కళ్ళల్లో అమిత సంతోషం కదలాడింది. తనకంటూ ఎవరూ ఉండరని భావం కొంత, ఆత్మ న్యూనతా భావం కొంతా ఉన్న వాళ్ళల్లోతన కోసం ఒకరున్నారని తెలిస్తే కలిగే సంతోషమా అది అనిపించింది. ఏమో!? అత్త గురించి నాకు తెలిస్తే నా మాటలకి ఆమెకెందుకంత సంతోషం కలిగిందో చెప్పగలనేమో!

పిల్లల గురించి ఏమీ ఆలోచించలేదా? అంది.
పెళ్ళయి మూడేళ్ళేగా అత్తా. వచ్చే సంవత్సరం చూద్దాంలే. నాకు అమ్మాయి పుడితే చిన్నప్పుడు నాకు కుట్టిచ్చినట్లు బుట్ట బొమ్మ గౌన్లు కుట్టియ్యాలత్తా నువ్వూ!” అన్నాను.

నేను నిన్ను మర్చిపోయానురా బంగారూ! కాని నువ్వు నన్ను మర్చిపోలేదు. నీ మీద ఉండే ప్రేమ నంతా రోజా మీద చూపించాలనుకున్నాను.నువ్వొద్దునీ ప్రేమా వద్దూఅంటూ అది నన్ను అసహ్యంచుకునేది. అది అసహ్యించుకునే కొద్దీ నాకు దాని ప్రేమను సంపాదించుకోవాలని పట్టుదల కలిగేది. ఆఖరికి అది నన్ను బానిసను చేసి ఆడించినా ఏమీ అనలేని స్థితిలో పడ్డాను. బహుశా దాని తండ్రిని తల్లిని విడదీశానన్న బాధ దానికన్నా నాకు ఎక్కువగా ఉండటం వల్లనే నేను అది ఆడించినట్లుగా ఆడానేమో!
అత్త ఇంకా ఏదో చెప్పబోతుంది కాని రోజా ఎవరాఅని ఆలోచిస్తున్న నాకు అత్త చెప్పిన చివరి వాక్యం వినగానే రెండు జళ్ళ క్లవర్ గర్ల్ రోజా గుర్తొచ్చిఇప్పుడెక్కడుందత్తా అమ్మాయి? అన్నాను ఆతృతగాఅరె! ఇన్ని రోజులూ అమ్మాయి అస్సలు గుర్తుకు రాలేదే అనుకుంటూ. వేటగాడి బాణం గుండెల్లో గుచ్చుకున్నప్పుడు పక్షి కళ్ళల్లో కనపడే వేదనకాదు నిస్సహాయత - కాదు కాదు నేను వర్ణించలేను నాకు మాటలు రావుఅలాంటి చూపుతో అత్త నన్ను నిశ్చేష్టపరిచింది. నేను గొంతు పెగుల్చుకుని మాట్లాడబోయేంతలో అత్త లేచి వెళ్ళి మంచం క్రింద నుండి సూట్ కేస్ బయటకి లాగింది. లోపల జిప్ లో నుండి ఒక కవర్ తీసిచదువు. నీకు అన్ని విషయాలూ తెలుస్తాయి” అంది ఏడుస్తూ. ఏడుపు హృదయ విదారకంగా ఉంది. ఆతృతగా కవర్ లో నుండి కాగితాలు బయటకి లాగాను.

                                  
***
ఎంకీ
ఎలా ఉన్నావు? నిజానికి నువ్వు ఎలా ఉన్నావు అని అడగాలని లేదు నాకు. నువ్వు అంటే నాకు అసహ్యం. ఇన్నాళ్ళ తర్వాత కూడా, నా జీవితం నాశనం అవడానికి కారణం నువ్వు కాదునేనేకేవలం నేనేఅని తెలిసే వయసు, అనుభవం వచ్చాక కూడా నువ్వంటే నాకు అసహ్యం తగ్గకపోగా పెరిగింది. మా నాన్న నన్ను, అమ్మని వదిలి వెళ్ళే నాటికి నాకు ఏడేళ్ళు. నాకు పన్నెండేళ్ళప్పుడు మా అమ్మ చనిపోయింది. ఐదేళ్ళలో మా అమ్మ ఏడవని రోజు లేదు అంటే నమ్ముతావా? దానికి కారణం అయిన నీ దగ్గరకి నాన్న నన్ను తీసుకొచ్చాడు. నిన్నుఅమ్మా! అని పిలవాలట. నిన్ను ప్రేమగా మాట్లాడాలని నాన్న కట్టడి చేశాడు. నీ వల్ల మా అమ్మ చనిపోయిందని తెలిసిన దాన్ని నేను నిన్ను అమ్మా అని పిలవడమా? ప్రేమించడమా? ఛీ! ఛీ - నేను అసహ్యించుకుంటున్నానని తెలిసీ నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చూశావు. మా అమ్మ కంటే ఎక్కువగా ప్రేమించావేమో కూడా. కాని నాకు మీ దగ్గరున్నంత కాలం జైల్లో ఉన్నట్లుగా ఉండేది. బయటికి వెళ్ళలేని వయసు. ఏం చేయాలో తెలియని నిస్సహాయత. కసి నాన్న లేనప్పుడు నీ మీద చూపించేదాన్ని. మీ దగ్గర నుండి స్వేచ్ఛగా ఎగిరిపోవడానికి త్వరగా పెద్ద దాన్ని అవాలని కోరుకునే దాన్ని. నా కోరిక తీరింది ఎంకీ. చాలా పెద్ద దాన్నయిపోయాను. త్వరలో లోకం నుండే శాశ్వతంగా వదిలి పోయేంతగా.

మీ గురించి హీనంగా మాట్లాడి స్నేహితుల దగ్గ్గర అభిమానం సంపాదించాను అనుకున్నాను కాని నా జీవితాన్ని గోప్యత లేకుండా ఆరబోసుకుంటున్నానని గ్రహించలేకపోయాను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నా చుట్టూ భ్రమా వలయాలు ఏర్పరుచుకున్న నన్ను వంచించడానికి శరత్ కి ఎక్కువ సమయం పట్టలేదు. వాడికి దుబాయ్ వెళ్ళాలని కోరిక. ప్రేమించానని, పెళ్ళి చేసుకుంటానని, నన్ను కూడా తనతో మీకు దూరంగా దుబాయ్ కి తీసుకెళతానని నన్ను నమ్మించాడు. నమ్మాను ఎంకీ. జంతువులు అమ్మే అంగడి నుండి ఒక పిల్లవాడు వచ్చి పక్షిని కొనుక్కుపోతుంటే ఆ పక్షికెంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలిగింది నాకు. పక్షి మళ్ళీ మరో పంజరంలోకి వెళ్ళబోతుందని ఊహించదు కదా!

నన్ను వాడి మోహం తీరేవరకు అనుభవించి ఈ కంపెనీ వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బుతో దుబాయ్ వెళ్ళిపోయాడు. అయితే వీడు మా నాన్న కంటే చాలా నయం ఎంకీ. వీడికి పెళ్ళాం లేదు. నా లాంటి కూతురూ లేదు. నన్నే మోసం చేశాడు. నా పట్ల కూడా నాకు జాలి కలగడం లేదు. ఎందుకంటే నీలా నేను మరో ఆడదాని జీవితాన్ని, మరో చిన్నపిల్ల జీవితాన్ని నాశనం చేయలేదు. దానికి నేను భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
ఎంకీ నా ఒళ్ళు హూనం అయింది. జబ్బు ముదిరిపోయి ఆఖరి దశకు చేరుకున్నాక నేడో రేపో కుప్పతొట్టి దగ్గరకు విసిరివేయబడతాను. ఇప్పుడు ఈ ఉత్తరం రాయడానికి కారణం నన్ను మీ దగ్గరకి తీసికెళ్ళమని చెప్పడానికి రాయడం లేదు. నువ్వు నాకేమీ చేయక్కర్లేదు. మనిద్దరి జీవితాల గురించి పదిమందికీ తెలియచెయ్యి. పెద్దలు తప్పులు చేసినా మనం మన జీవితాన్ని సరియైన విధంగా మలుచుకోవాలి కాని వాళ్ళు తప్పు చేశారని వాళ్ళ మీద ద్వేషం పెంచుకుని అదే తప్పు మనం చేయడం, మన జీవితాలని నాశనం చేసుకోవడం సబబా అని ఈ అమ్మాయిలను ఆలోచించుకోమంటున్నానని చెప్పు. మీరు ఇప్పుడు చేసే పనుల వల్ల రేపు మీ పిల్లల జీవితాలు ఏమవుతాయో తెలుసుకోమనినువ్వూ నీ జీవితాన్ని విప్పి చెప్పు.

అంతే ఎంకీ, నాలా మరో ఆడపిల్ల జీవితం నాశనం అవకూడదనే ఆవేదనతో ఈ ఉత్తరం రాశా. నిన్ను క్షమించి మాత్రం కాదు. నిన్ను అసహ్యించుకుంటూనే మరణిస్తా.
మరణించాక కూడా నిన్ను క్షమించలేని
నీ రోజా.

ఉత్తరం పట్టుకుని దాని వైపే చూస్తూ మంచంలో కూలబడ్డాను నిస్సత్తువగా. ఎందుకింత అమాయకంగా ఉన్నారు ఈ అమ్మాయిలు. ప్రేమిస్తున్నాను, పెళ్ళిచేసుకుంటాను అని అంటే నమ్మవచ్చు. అంతకంటే మంచి వాళ్ళు దొరకరు అని అనుకుంటే పెళ్ళి చేసుకోవచ్చు. తప్పులేదు. ఎందుకంటే పెళ్ళి తర్వాత ఎక్కువ శాతం మందిలో ప్రేమ కలుగుతుందని, బంధం ఏర్పడుతుందనీ నమ్ముతాం కనుక. కాని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వాళ్ళని నమ్మి ఎలా వెళ్ళిపోతున్నారు? సమాజంలో సాటి స్త్రీలకి జరుగుతున్న అన్యాయాలని చూసి కూడా స్త్రీ మళ్ళీ మళ్ళీ ఎలా మోసపోతుంది? అయినా మనల్ని ఇంతగా నమ్మి వచ్చిన స్త్రీని మోసం చేయడానికి, వంచించడానికి మగవాడికి మనసెలా ఒప్పుతుందో!!?

ఉత్తరం వల్లో, జెట్ లాగ్ వల్లో తెలియలేదు కడుపుని ఎవరో కెలికినట్లుగా వాంతి. దొడ్లోకి పరిగెత్తి వాంతి చేసుకున్నాను. దొడ్డి వాకిట్లో వీరడి సహాయంతో తాళ్ళు పేనుతున్న తాత, ఇంట్లో నుండి అత్త ఇద్దరూ నా దగ్గరకి పరిగెత్తారు. “ఏమయింది తల్లీ!” అన్నాడు తాత ఆందోళనగా. అత్తకి ఏడ్చీ ఏడ్చీ మాట పెగలడంలేదు. వీరడిని పంపి ఫకీరు షాపులో కాఫీ తెప్పించు తాతా! తలనొప్పిగా ఉంది. అమెరికా నుండి వస్తే వారం రోజులు ఇలాగే ఉంటుందని నీకు తెలుసుగా. కంగారేం లేదుఅన్నాను. వీరడు నీళ్ళు తెచ్చి ఇచ్చాడు. శుభ్రం చేసుకుని అత్త, నేను లోపలకి వెళ్ళాం. ఉత్తరం అత్త చేతికిస్తూ తర్వాతేమయింది అన్నట్లుగా ఆమె వైపు చూశాను.

ఉత్తరం వచ్చాక పోస్టల్ అడ్రస్ పట్టుకుని రోజాని అతి కష్టం మీద ఇంటికి తీసుకొచ్చాం. చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అది ఇంటికి వచ్చిన నాలుగు రోజులకే వాళ్ళ నాన్న గుండె ఆగిపోయింది దాన్ని గురించిన ఆలోచనలతో. దాన్నైనా బ్రతికించుకోవాలని డబ్బు కోసం తాతకి, మీ నాన్నకి చాలా ఉత్తరాలు రాశాను. ఆఖరికి సిగ్గు విడిచి మీ అమ్మకి కూడా రాశాను. సమాధానం లేకపోతే నేను నేరుగా మన ఇంటికి రావలసింది. అది చేయకుండా ఆవేశంతో – అది చచ్చిపోతుందన్న భయంతో - లాయరు నోటీసు ఇస్తే డబ్బు పంపుతారని నోటీసు పంపాను. మళ్ళీ మరో తప్పు చేశాను. నా పుట్టింటి వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు నన్ను మొదటిసారి కంటే ఎక్కువగా అసహ్యించుకున్నారు. ‘ఎంకీ! నాకు బ్రతకాలనుందిఅని అది అంటుంటే ఏమీ చేయలేక తల బాదుకుని ఏడ్చాను. వాళ్ళ నాన్న పోయిన కొన్ని రోజులకే అదినన్ను ఎక్కువ బాధించకుండానే - రోజా చనిపోయింది.

బంగారూ! అది కోరిన కోరిక నేను తీర్చలేను. నాకు ఆ శక్తి లేదు. నువ్వే మా ఇద్దరి జీవితాలని గురించి స్త్రీ జాతికి తెలియచేయి. మరో ఆడది మాలా బాధ పడకూడదనే నేను నిన్ను ఈ పని చేయమంటున్నానురా బంగారూ!అంది అత్త.
అత్త మాట్లాడుతుండగానే ఏం చేయాలా అనే నా ఆలోచనలు ఒక రూపు దిద్దుకున్నాయి. “తప్పకుండా తెలియచేస్తానత్తా. కాని అదేంటో మరి కథలు చదివీ, ఇంకొకరి జీవిత అనుభవాలు తెలిసీ కూడా స్త్రీ మోసపోతూనే ఉంది. వంచింపబడుతూనే ఉంది. తెలియచేయడం సంగతి కన్నా ముఖ్యంగా మనం కొంత మందికైనా మన పరిథిలో సహాయం చేద్దామత్తా. నీ పొలానికి చాలా విలువ వచ్చింది. పొలాన్ని అమ్మి తక్కువ ధర ఉన్న చోట స్థలం కొని స్త్రీ సదనం కడదాం. అభాగ్యులని చేరదీసి నీ జీవితాన్ని సార్థకత చేసుకుందువుగానిఅన్నాను.

మెరుస్తున్న కళ్ళతో అత్త నన్ను వాటేసుకుని కిందకు నా కాళ్ళ మీదకు జారింది. “తప్పు అత్తా! పెద్దవాళ్ళు పిల్లల కాళ్ళు పట్టుకోకూడదుఅంటూ అత్తని లేవదీశాను.

మా అమ్మకీ, మా ఊరి వాళ్ళకీ నా పొలాన్ని అత్తకి ఎక్కువ ధరకి అమ్మినట్లుగా చెప్పాను. అత్త ఇప్పుడు స్త్రీ సదనంలోని వారందరికీ తల్లి. ఇప్పుడు అమ్మ కూడా అత్తని బాగా పలకరిస్తుందట. అత్త నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఆమె గొంతులోని సంతోషం వల్ల ఆమె అణువణువులో వెలుగుతున్న మెరుపుని చూడగలుగుతున్నాను.

మా అత్త ఎప్పుడూ మెరుస్తూనే ఉండాలి. నాకు గర్వాన్ని కలిగించాలి - ఇది నా కోరిక.

                                                                                                                              

***

 
 

5, మార్చి 2014, బుధవారం




యామిని

  

ఆకాశం కాస్త మబ్బుపట్టి మిట్ట మధ్యాహ్నమే సాయంత్రంలా అనిపిస్తోంది. చల్లగాలి వీస్తూ ఉండటంతో వాతావరణం తేలిగ్గా ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఆ రోజు ఇంటిలోనే ఉన్నాను. నేను పని చేసుకుంటూ ఉండటంతో నా భార్య మధు పక్క ఫ్లాట్‌లో ఉన్న తన ఫ్రెండ్స్‌తో మాట్లాడటానికి వెళ్ళింది. లాప్‌టాప్ పక్కనపెట్టి కిటికీలో నుండి బయట మెల్లగా కదులుతున్న చెట్లను, ఆ చలికి వణుకుతున్న పక్షులనూ చూస్తూ నిలుచున్నా. ఇంతలో నా సెల్ మ్రోగింది.
“సార్ కూకట్‌పల్లిలో 2 బి.హెచ్.కె. అడిగారు. మీరే కదా.”
“అవును. మీరు శ్రీనివాస్ గారా?”
“అవునండీ. కె.పి.హెచ్.బి.లో ఒక అపార్ట్‌మెంట్ ఉంది. ఫుల్లీ ఫర్నిష్డ్, రెడీ టూ ఆక్యుపై. నేను అడ్రెస్ మెసేజ్ పెడతాను. ఆ అపార్ట్‌మెంట్‌లో 302 వెళ్ళి చూడండి. 301 లో యామిని అనే మేడం ఉంటారు. ఆమె మీకు తాళాలు ఇస్తారు. నేను సాయంత్రం మిమ్మల్ని కలుస్తా” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. ఫోన్ పెట్టేసిన వెంటనే మెసేజ్ వచ్చింది.
నేను, మధుని తీసుకుని కారులో బయలుదేరాను. మధు ఇల్లు ఎలా ఉండాలని తను కోరుకుంటుందో నాకు వర్ణిస్తూ ఉంది. మధ్యమధ్యలో తనకి తెల్సిన వాస్తు విజ్ఞానం ప్రదర్శిస్తూ ఉంది. తనని చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. కాలేజుల్లో ఈ అమ్మాయిలు పోటాపోటీగా చదువుతూ వేరే విషయాలే పట్టించుకోరు. కెరీర్, మార్కులు , రాంకులు తప్ప వేరే విషయాలే మాట్లాడరు. అలాంటిది ఒక్కసారి పెళ్ళయ్యాక కానీ తెలీదు వీళ్ళకు ఎన్నేసి విషయాల మీద అవగాహన ఉంటుందో !!

మధుకి, నాకు పెళ్ళై 6 నెలలు కావొస్తుంది. మేమిద్దరం ప్రేమించి పెళ్ళిచేసుకున్నాం. ఇద్దరం క్లాస్‌మేట్స్. కానీ కాలేజ్‌లో ఉండగా నేను క్లాసులో తక్కువ, మిగిలిన విషయాల్లో ఎక్కువగా ఉండేవాడ్ని. మధు పూర్తిగా సిన్సియర్ స్టూడెంట్. అలాంటిది నన్నెలా ప్రేమించిందో తెలియదు. కాలేజు వదిలి వెళ్ళిపోయిన రెండేళ్ళకి ఒకరోజు ఫోన్ చేసి నన్ను పెళ్ళి చేసుకుంటావా అని అడిగింది. నిజానికి ఈ రెండేళ్ళలో తనెక్కడుందో నాకు, నేనెక్కడున్నానో తనకి తెలియనే తెలియదు. తనకి ఆ రోజు ఇంట్లో పెళ్ళిచూపులు. ఎదురుగా పరిచయంలేని ఒకబ్బాయిని చూస్తూ, తనని పెళ్ళిచేసుకోవాలి అనే ఆలోచన రాగానే తనకి నేను గుర్తొచ్చానంట. ఆ రోజే నా నంబర్ సంపాదించి నాకు ఫోన్ చేసింది. జరిగిన విషయాలు తను అలా చెప్పేసరికి నాకోసమే పుట్టిన తోడనిపించింది. వెంటనే ఒప్పేసుకున్నా.
“చిన్నా, ఆవిడ పేరేంటి?.. చిన్నా ఏం ఆలోచిస్తున్నావ్?” మధు గట్టిగా అరిచింది.

నేను కార్ పార్క్ చేస్తూ ఈ లోకంలోకి వచ్చాను
“ఏం లేదులే. ఏంటి అడిగావ్”
“ఆవిడ పేరేంటి?”
“యామిని”
301 దగ్గరకి వెళ్ళి మధు బెల్ కొట్టింది. నేను బయట నేమ్ బోర్డ్ చూసాను. యామిని ఇలాంటి పేరెందుకు పెట్టుకుంటారో అనిపించింది. పూర్తి పేరు “యామిని నిష్టల”. తలుపు తెరుచుకుంది. ఆమే అనుకుంటా ఏం కావాలి అన్నట్టు చూసింది. మధు విషయం చెప్పింది. ఆమె లోపలికి వెళ్ళి తాళాలు తెచ్చి ఇచ్చింది. మధు, నేను 302 వైపు నడిచాం. మధు ఇళ్ళంతా తిరిగి చూస్తూ ఉంది. నేను బాల్కనీ లోకి వచ్చి అశ్విన్‌కి ఫోన్ చేసాను.

“హ్మ్ చెప్పరా”
“రేయ్ అశ్విన్ యామిని, ఈ పేరు ఎక్కడన్నా విన్నావా?”
“మాంచి అమ్మాయి కనిపించిందా? ఐ మాక్స్ లోనా?, రెస్టరెంట్లోనా?”
“అడిగిన దానికి సరిగ్గా చెప్పుబే”
“ఏమోరా నా గర్ల్‌ఫ్రెండ్స్ లిస్టులో ఆ పేరు లేదు”
“యామిని నిష్టల”
“యామిని నిష్టల.. రేయ్ మన శరత్‌గాడి వైఫ్ పేరు యామిని అనుకుంటా. ఏం ఎందుకు?”
“ఏం లేదు తర్వాత చెప్తా”
నాకు రెండేళ్ళ క్రితం ఎదురైన ఒక చేదు అనుభవం గుర్తొచ్చింది. కొన్నాళ్ళు షికాగోలో ఆన్‌సైట్‌లో గడిపి అప్పుడే ఇండియా వచ్చాను. దాదాపుగా అయిదు సంవత్సరాలుగా కలవని నా ఫ్రెండ్స్ సాగర్,అశ్విన్ ఆ రోజు కలుద్దామని ప్లాన్ చేసారు.
“ఇంకేంటి కబుర్లు. ఎలా ఉన్నాయి బర్గర్ బ్రతుకులు?” అని అడిగాడు అశ్విన్.
“బానే ఉందిరా చీజ్‌లా రిచ్‌గా, జిడ్డుగా రుచి పచి లేకుండా”
“అర్ధమవుతుందిరా నీ బాడీ చూస్తుంటే. అమెరికాలో చీజ్‌కి ఎక్కడ కరువొస్తుందో అని నిన్ను సెలవుల పేరుతో ఇండియా తగిలేసారా?”
“నువ్వసలేం మారలేదురా. ఏంటి ఇంతకీ ప్రోగ్రామ్?”
“ఈ రోజుకయితే నా కొంపకి పోదాం. తర్వాత సంగతి అక్కడ చూద్దాం.”
బయటకి వచ్చి కారెక్కుతుంటే దూరంగా ఎవరో శరత్‌గాడిలా అనిపించి “రేయ్ వాడు మన శరత్‌గాడిలా లేడూ?” అన్నాను.

సాగర్ నా వైపు క్వశ్చన్‌మార్క్ చూపు చూసి “ఏంటిరా నీకు తెలియదా? శరత్ చనిపోయాడుగా.” అన్నాడు.
“ఏ శరత్‌రా, నేను చెబుతున్నది మన క్లాస్‌మేట్ శరత్ గురించి. వాడు నాకు టచ్‌లో ఉన్నాడు నెల క్రితం కూడా నాతో చాట్ చేసాడు. ఇండియా వచ్చాక కలుస్తా అన్నాడు”

” అరె,అవునా? నీకెలా చెప్పలేదు మేమెవరమూ? వాడు చనిపోయి ఇరవై రోజులవుతోంది . సూసైడ్”
“వ్వాట్? “నిర్ఘాంత పోయాను
“ఆర్ యూ సీరియస్? నాతో ఈమధ్యే మట్లాడాడురా.”
“నెల రోజులయ్యింది అంటున్నావుగా. ఇది జరిగి ఇరవై రోజులే అయ్యింది”
“నమ్మలేకపోతున్నా. అయినా సూసైడ్ ఏంటిరా? ఏమయ్యింది వాడికి?” ఇంకా నమ్మలేక పోతున్నాను
“సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటో తెలియటం లేదు. మంచి జాబ్ ఉంది. డూప్లెక్స్ హౌస్ కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్నాడు. అందమైన భార్య ..పెళ్ళయ్యి కనీసం రెండేళ్ళు కూడా కాలేదు”
మనసంతా భారంగా అయిపోయింది. అవే ఆలోచనలతో అశ్విన్ ఇంటికి చేరాం. డిన్నర్ అయ్యాక ముగ్గురం బాల్కనీలో నిల్చున్నాం. ఆలోచనల మధ్యలో నాకొక విషయం గుర్తొచ్చింది. శరత్‌కి కాలేజులో ఉండగా నేనే మెయిల్ ఐడి క్రియేట్ చేసాను. నా పేరే పాస్వర్డ్‌గా పెట్టాను. ఇప్పటికే అదే పాస్వర్డ్ ఉంటుందని గ్యారంటీ లేదు. కానీ ఒకసారి ట్రై చేస్తే అనిపించింది.
“నాకు శరత్ జీమెయిల్ పాస్వర్డ్ తెలుసురా. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా?”
“బ్రతికున్న మనుషుల విషయంలో ఎలాగూ లేదు. కనీసం చనిపోయినవాళ్ళ విషయంలో అయినా కాస్త మర్యాద పాటిద్దాం రా. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించకు! అయినా అయిందేదో అయ్యింది ..ఇవన్నీ ఎందుకిప్పుడు” అన్నాడు సాగర్.
“నాకూ తెలుసుకోవాలని ఉందిరా. ఈ మధ్యవి మెయిల్స్ చూస్తే, ఏదైనా క్లూ దొరుకుతుందేమో! కారణం తెలియొచ్చేమో” అన్నాడు అశ్విన్.

మెయిల్ ఓపెన్ చేసాం. పాస్వర్డ్ మార్చలేదు. రిసెంట్ మెయిల్స్, చాట్స్, ట్రాష్ ఫోల్డర్స్ వెతికినా ఉపయోగపడేలా ఏం కనిపించలేదు. కానీ డ్రాఫ్ట్స్‌లో రెండు మెయిల్స్ ఉన్నాయి. అందులో ఒక మెయిల్‌లో టూ నా మెయిల్ఐడికే ఉంది. ఆతృతగా ముగ్గురం చదవటం మొదలుపెట్టాం.

హాయ్ క్రిష్ణా,
ఎలా ఉన్నావురా? నిన్ను చూసి చాలాకాలమయ్యింది. ఇకముందు చూడనేమో కూడా. అర్ధంకాలేదా? రేపో, ఎల్లుండో తెలుస్తుందేమోలే !!ఎందుకో నీతో మాట్లాడాలనిపించింది. కానీ మాట్లాడితే నా మనసులో ఉన్న విషయాలు చెప్పలేను. అందుకే ఈ మెయిల్ వ్రాస్తున్నా.
నీకు ఎప్పుడు తెలియలేదేమో కానీ నువ్వు నా జీవితంలో చాలా స్పెషల్‌రా. నీకెప్పుడూ చెప్పలేదు కానీ నిన్ను నేను చాలా ఆరాధించే వాడిని! . జీవితంలో కొన్ని ముఖ్యమైన మలుపుల్లో కొందరు వ్యక్తులు ప్రత్యేకంగా మనం తలుచుకోవాల్సిన అవసరం లేకుండానే గుర్తొస్తారు. అందుకేనేమో ఈ రోజు నువ్వు గుర్తొచ్చావ్. చిన్నప్పుడు నేనెప్పుడూ నీలా ఉండాలనుకునేవాడ్ని. వచ్చే జన్మంటూ ఉంటే నీలా పుట్టాలనుకునేవాడ్ని. ఎందుకో నిన్ను చూసిన ప్రతిసారి నా జీవితం కూడా ఇలా ఉంటే బాగుంటుంది కదా అనిపించేది. నీ లైఫ్‌స్టైల్‌లో కనిపించేది. ఒక అందమైన నిర్లక్ష్యం కనిపించేది ! అది నాకెంతో నచ్చేది ! కాని నిజానికి నీకే లైఫ్ విలువ బాగా తెలుసు.
మేమంతా క్లాసులు, పుస్తకాలు అని చచ్చిపోతుంటే నువ్వు హ్యాప్పీగా సినిమా, క్రికెట్ అని తిరిగేవాడివి. ఎగ్జామ్స్ ముందు మాత్రమే చదివేవాడివి. టాప్‌లిస్టులో వచ్చేసేవాడివి. అందుకే ఫ్రెండ్సంతా నీ చుట్టూ తిరిగేవారు. అందరిలానే నేను కూడా నీతోనే ఉండాలనుకునేవాడ్ని. కానీ నా షోడాబుడ్డి కళ్ళద్దాలు, పొట్టి పొట్టి పాంటులు మీకు నచ్చేవి కావు. నేను ఎందుకలా ఉండేవాడినో మీకు తెలియదు. తెలుసుకోవాలి అనేంత మెచ్యురిటీ ఆ వయస్సులో ఎవరికీ ఉండదులే.

నా మీద చాలా జోకులేసుకునేవాళ్ళు కదా. దిస్ డంబో కాంట్ అండర్‌స్టాండ్ అనుకునే వాళ్ళు. అర్ధమయ్యేవిరా, కానీ నాకు అర్ధమవుతుంది అని మీకు తెలిస్తే నేను మీకింకా లోకువైపోతాను. అందుకే ఏం అర్ధంకానట్టు నటించేవాడ్ని. ఐయామ్ గ్లాడ్ ఐ హేడ్ సమ్ ఇగో. మీ ప్రపంచం అమ్మాయిలు, లవ్, గ్రీటింగ్ కార్డ్స్… చాలా అందంగా, రంగుల ప్రపంచం లా ఉండేది. నేను మాత్రం ఎప్పుడూ పుస్తకాలు పట్టుకుని ఏదో ఆలోచిస్తూ… ఎందుకిలా? నేనే ఎందుకిలా? ఇంతవరకూ ఎవరూ అడగలేదు. కానీ నాకు చెప్పాలని ఉంది. ఎవరికి చెప్పాలా అని ఆలోచిస్తుంటే నువ్వు గుర్తొచ్చావ్.

చిల్లులు పడి, జల్లెడలా కనిపించే ఒక పూరి గుడిసెలో పుట్టాను నేను. పండగకో, పుట్టినరోజుకో బట్టలు తియ్యమని అడిగితే కలిసొస్తుందని స్కూల్ యూనిఫామే కొత్త బట్టలుగా తీసేవాడు మా నాన్న, పాపం చిన్న గుమస్తా. కడుపు నిండా తినటం ఎలాగూ లేదు జీవితంలో కనీసం ఒక్కసారైనా కుండ నిండా వండటానికి కూడా నోచుకోలేదు మా అమ్మ.

స్కూల్లో ఉండగా అనుకుంటా ఒకరోజు ఆడుకుని అలసిపోయి ఇంటికి వచ్చాను. అమ్మ అన్నం పెట్టింది. ఆకలితో త్వరగా తినేసి ఇంకొంచెం పెడుతుందేమో అని చూస్తున్నా. అమ్మ నా వైపు చూడలేదు. ఎదురుగా కుండలో అడుగంటిపోయిన అన్నం. ఆకలికి ఇంకొంచెం అన్నం పెట్టమ్మా అని అడగాలనిపించినా అడగలేకపోయాను. అదే చివరిసారి నేను ఆటలకి వెళ్ళటం. ఆకలిని గెలవటానికి మొదట ఆటలు మానేసాను.

అప్పటి నుండి జీవితాన్ని సీరియస్ గా తీసుకోవటం మొదలుపెట్టాను. అందుకేనేమో నా జీవితం చివరి వరకూ సీరియస్ గానే మిగిలిపోయింది. ఎంత ఆలోచించినా బాగా చదవటం తప్ప నా జీవితంలో ఎదగటానికి మరో మార్గం కనిపించలేదు. అందుకే కష్టపడి చదవటం మొదలుపెట్టాను. క్రికెట్, సినిమా, గర్ల్స్..వీటిని ఇష్టపడే స్థోమత నాకు లేదు. వాటికి బదులుగా చదువుని మరింత ప్రేమించాను.

సాధించిన మార్కులు జీవితంలో ఆనందంగా ఎలా బ్రతకాలో నేర్పించకపోయినా ఒక ఉద్యోగాన్నయితే సంపాదించిపెట్టాయి. ఉద్యోగం వచ్చేసాక నేను ఆనందానికి ఇంక ఒకే ఒక్కఅడుగు దూరంలో ఉన్నా అనుకున్నా. అందుకే రిలాక్స్ అవ్వలేదు. తిండి,నిద్ర మానేసి పనిచేసాను. కారు కొన్నాను, ఇల్లు కొన్నాను. పొట్టి ఫేంట్లుపోయి, బ్రాండేడ్ బట్టలొచ్చాయి. షోడాబుడ్డి కళ్ళద్దాలు పోయి కాంటాక్ట్ లెన్స్ వచ్చాయి. చాలా అందమైన చదువుకున్న అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను. నా జీవితం ఒక్కసారిగా రంగులమయం అయిపోయింది. నేను నా జీవితాన్ని మార్చేసుకున్నాను అనుకున్నా, కానీ ఇది పై వాడు వ్రాసిన జీవితం కదా. మారటానికి ఆయన ఒప్పుకోలేదు.
తల తిప్పాను

“మెయిల్‌లో ఇంతవరకే ఉందిరా”
“వాడు ఇంకా ఏదో చెప్పాలనుకున్నాడురా. కానీ ఏదో కారణంతో ఆగిపోయాడు”
“డ్రాఫ్టులో ఇంకో మెయిల్ ఉన్నట్టుంది ఎవరో యామిని కి పర్సనలేమో. చదవటం మంచిదికాదేమోరా” అన్నాను
సాగర్ లాప్‌టాప్ నా చేతి నుండి లాక్కొని చదవటం మొదలుపెట్టాడు.

యామిని,
నేను మీకు చేస్తున్నది న్యాయమో, అన్యాయమో నాకు తెలియదు. నేను బాగా అలసి పోయాను. జీవితంతో ఇక యుద్ధం చేసే ఓపిక లేదు నాకు !! కానీ ఇంతకు మించి నేనేమీ చెయ్యలేకపోతున్నా. .ఆనందమనేది నేను సాధించుకునేది అనుకున్నా ఇంతకాలం. కానీ డెస్టినీ డిసైడ్ చేస్తుందని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. అండ్ దిసీజ్ వాట్ డెస్టిని డిసైడెడ్ ఫర్ మి. నాకు తెలుసు ఇందులో మీ తప్పేమీ లేదు. మిమ్మల్ని కాకుండా మరొకర్ని చేసుకుంటే నా జీవితం బాగుండేదేమో అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇది నా జీవితం! పుట్టటమే దురదృష్ట వంతుడిగా పుట్టానేమో నేను! మన పెళ్ళిలో అందరూ నా అంత అదృష్టవంతుడు లేరని అన్నారు. ఆ రోజు జనాల కళ్ళల్లో అసూయ చూసాను. ఇన్నాళ్ళ నా ప్రార్ధనలకు ఫలంగా ఆ దేవుడు నాజీవితానికిచ్చిన కొత్త వెలుగు మీరే అనుకున్నాను. కానీ నేను మీ జీవితంలో చీకటి నింపుతున్నానని తెలుసుకోలేకపోయాను. మీరు మరొకరిని ప్రేమించారని, మీ ఇష్టం లేకుండా మన పెళ్ళి జరిగిందని నాకు ముందే తెలుసుంటే మీ ఆనందాన్ని దూరం చేసేవాడ్ని కాదు. అప్పటికీ మీరు కోరుకున్నవాడితో మీ పెళ్ళి చేద్దామని మనస్పూర్తిగానే అనుకున్నాను. కానీ మీరే మీ ఫ్యామిలీ పరువుపోతుందని ఆపేసారు.

మీరు కోల్పోయిన ప్రేమకి బదులుగా ప్రపంచమంతా నిండి ఉన్న ప్రేమని మీ కాళ్ళ దగ్గర పెట్టాలనుకున్నాను. మీరు దూరమైందనుకుంటున్న ఆనందాన్ని తెచ్చి మన వాకిట పువ్వులుగా నింపేద్దామనుకున్నాను. కానీ అందుకునేందుకు మీరు సిద్ధంగా లేరు. ఈ ప్రేమలేమితో నేను బ్రతకలేకపోతున్నాను.. తాళి కట్టిన భార్యకి కూడా సొంతంకాలేని ఒంటరి దరిద్రుడ్ని నేను. పెళ్ళికి ముందే మీ మనసు మరొకరి సొంతమైందని తెలిసిన క్షణాన్నే నేను మనసు రాయి చేసుకుని ఉండాల్సిందేమో!

నా జీవితంలో ఆనందానికి ఆస్కారం లేదు. ఎంతకాలం బ్రతికినా పోరాడినా మిగిలేది నిరాశే. ఒంటరిగా పోరాడలేకే మీ చేతుల ఆసరా కావాలని, జీవితాన్ని ఆనందంతో నింపుకోవాలని నా జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానించాను. కానీ ఇప్పటికీ నేను ఒంటరినే. ఇక పోరాడటం నావల్ల కాదు. కనీసం మీ జీవితమైనా మార్చలనుకున్నాను. అదీ కుదరలేదు. ఏం చెయ్యలేని నిస్సహాయతతో వెళ్ళిపోతున్నా. మీకు చివరగా ఒకే ఒక్క సహాయం చెయ్యగలుగుతున్నా. మీరు ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తే, మీకు ఇబ్బంది కలగకుండా మొత్తం నా ఆస్తులన్నీ అన్నీ మీ పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేసాను.

ఇది ఎవరినో ద్వేషిస్తూ కాదు. నన్ను నేను ద్వేషిస్తూ, నాకు నేను వేసుకుంటున్న శిక్ష.
బై ఫరెవర్

ముగ్గురి కళ్ళలో నీళ్ళు నిండాయి. ” ఆమెను వదల కూడదురా. ఈ మెయిల్ చాలు ఆమె చేసిన అన్యాయం ప్రూవ్ చెయ్యటానికి. పదండిరా అంతు చూద్దాం!! ఇష్టం లేనప్పుడు ఎందుకురా చేసుకుంది?” అన్నాడు సాగర్ ఆవేశంగా.
“వాడు ఈ రెండు మెయిల్స్ రాసి కూడా …పంపలేదు అంటే వాడుపోయాక వాడి వల్ల ఎవరికీ ఇబ్బంది రాకూడదు అనుకున్నాడు. అదే వాడి చివరి కోరిక. పోయినవాడు ఎలాగూ తిరిగి రాడు. ఇప్పుడు మనం అల్లరిచేస్తే, అల్లరిపాలయ్యేది ఆ అమ్మాయి మాత్రమే కాదు, పదిమందిలో శరత్‌గాడి చావే నవ్వులపాలవుతుంది. అందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు. చనిపోయిన తర్వాత వాడికిలాంటి అవమానం అవసరమా? ఇక్కడితో వదిలేద్దాం” అని అప్పటికి చెప్పాను కానీ చాలాకాలం ఆ ఆలోచనలు నన్ను వదల్లేదు.

వెనుక తలుపుకొట్టిన చప్పుడికి వెనక్కితిరిగి చూసాను. తలుపు దగ్గర నిల్చుని పలకరింపుగా నవ్విందామె. మధు వెళ్ళి మాట కలిపింది. వాటర్ సప్లై గురించి, పనివాళ్ళ గురించి వాకాబు చేసింది. “కాఫీ త్రాగుతూ మాట్లాడొచ్చు రండి” అని వాళ్ళింటికి పిలిచింది. ఇష్టం లేకపోయినా మర్యాద కోసం వెళ్ళాను. ఇంటిలో దండ వేసిన పెద్ద ఫోటో ఫ్రేమ్‌లో శరత్ నా వైపే చూస్తున్నట్టుగా అనిపించింది.

“మిమ్మల్ని ఎక్కడో చూసినట్టనిపిస్తుంది. మీది ఏ ఊరు?” అని అడిగిందామె. మధు మా వివరాలు చెప్పింది.
“శరత్ కాలేజ్ ఫోటోల్లో చూసుంటారు నన్ను” కావాలనే చెప్పాను. శరత్ ఫోటో చూసాక ఎందుకో కంట్రోల్ కోల్పోయాను నేను.

“శరత్ మీకు తెలుసా?”
ఆమె అప్పటికే నా ప్రవర్తనలోనూ, బాడిలాంగ్వేజ్‌లోనూ తిరస్కార భావాన్ని గ్రహించిందని తెలుస్తూనే ఉంది. నాకు కావాల్సింది కూడా అదే. ఆమె చేసిన తప్పులకి ఏ దేవుడూ వెయ్యని శిక్ష నేనే వేసెయ్యాలన్నంత ఆవేశం నా ఆలోచనల్లో పరిగెడుతుంది. ఆ నిమిషానికి చాలా రెస్ట్‌లెస్ ఫీలింగ్ నన్ను తొందరపెడుతుంటే మర్యాద అనే ముసుగుని తీసి పక్కన పడేసాను.
“వాడు ఎందుకు చనిపోయాడో కూడా తెలుసు”
నన్నెప్పుడూ అలా చూడని మధు కంగారుగా “క్రిష్ణా, దేవుడిగది చూడలేదు వెళ్దామా?” అని లేచింది.
“యామిని అంటే రాత్రి కదా. రాత్రిని ప్రేమించి జీవితాన్ని చీకటి చేసుకున్న పిచ్చోడు వాడు” అని కసిగా అనేసి నేను కూడా లేచాను. ముక్కూ మొహం తెలీని ఒక వ్యక్తి తో అలా మాట్లాడవచ్చో లేదో ఆ క్షణాన ఆలోచించలేదు. ప్లెయిన్ గా ప్రశాంతంగా అమాయకంగా ఉండే శరత్ మరిక లేడనే వాస్తవం మాత్రమే నా మనసు నిండా, మెదడు నిండా ఆక్రమించింది !

ఆమెకు నా ఆవేశం అర్ధంకావటానికి, అర్ధమయ్యాక అందులో నుండి తేరుకోవటానికి కొంత సమయం పట్టింది. ఈలోగానే నేను,మధు గడప దాటి బయటకి వచ్చేసాం.
“ఒక్క నిమిషం” అని ఆమె పిలిచింది. ఆగాలనిపించకపోయినా ఆగాను. మధుకి కంగారు ఎక్కువయ్యింది.
“మీకేం తెలుసో ఎలా తెలుసో నాకు తెలియదు. మీకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ శరత్‌కి అన్యాయం జరిగిందని మీరు బాధపడుతున్నారంటే ఆయన మీకు ఎంత మంచి ఫ్రెండో అర్ధమవుతుంది. నావల్లే ఇది జరిగింది అని చెప్పగలిగారంటే మీకేం తెలుసో నాకర్ధమయ్యింది” అని మధు వైపు చూసింది. నేను దూరంగా నిలబడి చూస్తున్నాను.
“శరత్ ఈయనతో ఎప్పుడూ ఏం చెప్పలేదు” అని మెల్లగా చెప్పింది మధు.
“చెప్పటానికి తనకి మాత్రం ఏం తెలుసు” అని నిర్లిప్తంగా నవ్విందామె.
“ఒకరోజు ఉదయం కాలేజికి వెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చేసరికి. ఇంట్లో ఎవరో తెలియని ఒకబ్బాయి సోఫాలో కూర్చుని ఉన్నాడు. కొనుక్కోబోయే ప్రాపర్టీని తనిఖీ చేస్తున్నట్టుగా, పట్టి పట్టి నన్నే చూస్తున్న ఒక కుటుంబం, మా ఇంటిలో నేనే అపరిచితురాలిలా అనిపించింది ఆ క్షణం. ఏంటనడిగితే పెళ్ళి చూపులన్నారు. ఒక పది నిమిషల తర్వాత నా గదిలోకి వెళ్ళిపొమ్మన్నారు. బయట ఏవో మాట్లాడుకున్నారు. అబ్బాయికి పెద్ద ఉద్యోగం,లంకంత ఇల్లు,కారు,పైసా కట్నంలేదు. అంతే పెళ్ళి నిశ్చయించేసి ఉదయానికి ముహుర్తాలు కూడా ఖాయం చేసారు. పెళ్ళి హడావుడి మొదలయిపోయింది. అందరూ పెళ్ళి పనిలో బిజీ. నాతో ఎవరూ ఏం మాట్లాడలేదు.


నా మనసులో ఉన్న వ్యక్తి గురించి , కనీసం అమ్మకైనా చెప్పాలనుకున్నాను
“ఛీ నోర్ముయ్యి” అని తన నోరు నొక్కుకుని, నా గొంతు నొక్కేసింది అమ్మ.
“మంచబ్బాయమ్మా నీ అదృష్టం” అని చెబుతున్న నాన్నతో, “కాపురం మంచిగా ఉండాలంటే ఇద్దరు మనుషులూ మంచోళ్ళయితే సరిపోదు నాన్నా” అని చెప్పాలనుకున్నా, కానీ నేనేమి మాట్లాడకుండా అమ్మ జాగ్రత్తపడింది.
మధుగారూ, మీకు తెలియంది కాదు. ఆడపిల్లలు స్వేచ్ఛగా బ్రతుకుతున్నట్టే కనిపిస్తారు కానీ కళ్ళకు కనిపించని గొలుసేదో మన మెడకు చుట్టుకుని మనల్ని నియంత్రిస్తూనే ఉంటుంది. ప్రేమగా పెంచుకునే కుక్కపిల్లకి మనకి ఆ గొలుసొక్కటే తేడా. అది గొలుసు కాదు పరువు, నియంత్రణ కాదు బాధ్యత అని నమ్మించటమే ఆడపిల్లను పద్దతిగా పెంచటం. పద్దతిగా పెరిగిన నేను తలొంచాను. అసలు అంతకంటే ఏమి చేయాలో నాకు తెలియలేదు. ఆలోచించే శక్తిని నా మెదడు ఈ హటాత్పరిణామం తో పూర్తిగా కోల్పోయింది

నేనొచ్చి కలుస్తా అని ఒకడు కాలేజి గార్డెన్లో సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఎదురుచూస్తూ ఉంటే, వాడితో ఒక్కమాట చెప్పే అవకాశం కూడా లేకుండానే నా పెళ్ళి జరిగిపోయింది. నా కోసం, నేను కలలుకన్న జీవితం కోసం ఏడ్చే ప్రివిలేజ్ ఎలానూ లేదు. కానీ నిర్ధాక్షిణ్యంగా నేను ఒకడ్ని మోసం చేసాను. వాడి గురించి ఏడ్వాలి కదా. నా చేతులతో నేను నాశనం చేసిన వాడి జీవితం గురించి ఏడ్వాలి కదా. కానీ నాకు ఆ అవకాశం కూడా లేకపోయింది.
పెళ్ళయిన మరుక్షణం నుండీ శరత్ నామీద విపరీతమైన ప్రేమ చూపించారు. ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. నా దగ్గర నుండి కూడా అంతే ప్రేమ ఎక్స్‌పెక్ట్ చేసారు. ముందురోజు వరకూ ఒకర్ని ప్రేమించి తనే జీవితం అనుకుంటున్న మనసుని ఒక్కసారిగా మార్చటం ఎలా? అలా అని నటించలేను. మోసం చేస్తున్నానేమో అని బాధ మరో పక్క. నరకం అనుభవించాను. దానికంటే చావు చాలా చిన్నది.

యామినిగా చచ్చి శరత్ భార్యగా నేను బ్రతకాలంటే నాకు కొంత టైమ్ కావాలి. కానీ శరత్ నాకు ఆ అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు. జరిగింది ఒక యాక్సిండెట్ అనుకుని మరిచిపోదామనుకున్నా. యాక్సిడెంట్‌లో చెయ్యో, కాలో పోతే ఆ విషయం డైజెస్ట్ చేసుకోవటానికి, అలవాటు చేసుకోవటానికి కొంత టైమ్ పడుతుందిగా. నేను అలాంటి హీలింగ్‌లో ఉండగా శరత్‌కి నా ప్రేమ గురించి తెలిసింది. ఆయన ఒక్కసారిగా కృంగిపోయారు. రోజుల తరబడి తన గదిలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ గడిపారు.

ఒకరోజు నువ్వు ప్రేమించిన అబ్బాయితో పెళ్ళి చేసేస్తా అని చెప్పారు. నాకు విరక్తిగా అనిపించింది. రెక్కలు కత్తిరించేసిన పక్షికి పంజరమే రక్ష, పంజరం నుండి వదిలేస్తా అంటే ఏమనగలుగుతుంది? ఆయన ధోరణి చూసి మనసు విప్పి మాట్లాడాలనుకున్నా. “ఫలానా వ్యక్తితోనే వ్రాసిపెట్టి ఉందని తెలిస్తే ఏ ఆడపిల్ల మరో వ్యక్తిని ప్రేమించదు. ఆ తెలియనితనమే నాది కూడా. ఈ సమస్య నుండి బయటపడటానికి నాకు కావల్సిందల్లా కాస్త టైమ్, అర్ధంచేసుకునే తోడు” అని చెప్పాలనుకున్నాను. కానీ మాటల్లో నా ప్రేమ పస్తావన వచ్చిన ప్రతిసారి ఆయన దెబ్బతిన్న పక్షిలా అయిపోయేవారు. లోకమంతా కలిసి తననే మోసంచేసిందన్నట్టుగా డిప్రెస్ అయ్యేవారు. నేనేమనుకుంటున్నానో తెలుసుకునే ప్రయత్నం తనెప్పుడూ చెయ్యలేదు. అందుకే ముభావంగా ఉండటం అలవాటు చేసుకున్నాను. రోజూ కన్‌ఫ్యూజ్డ్‌గా కనిపించేవారు. ఏం మాట్లాడాలన్నా తనని బాధ పెడుతున్నానేమోనని భయం, గిల్టీ. తన నిశ్శబ్ధం నిరాశ అనుకున్నానే కానీ, ఇలాంటి నిర్ణయానికి సన్నద్దం చేసుకుంటున్నారనుకోలేదు. ఈలోపే అంతా జరిగిపోయింది.

ఆమె గొంతు కాసేపు మూగబోయింది. మధు కళ్ళు చెలమలయ్యాయి. నేను నిస్సహాయంగా నిలబడిపోయాను.
“తనకి జరిగిన అన్యాయానికి కారణంగా నన్ను నిందిస్తున్నారు. నాకు జరిగిన అన్యాయానికి ఎవరిని నిందించాలి? తొందరపడి నన్ను బెదిరించి పెళ్ళి చేసి ఇప్పుడు నిస్సహాయంగా చూస్తున్న అమ్మా నాన్నలనా?? ప్రేమ కావాలి కావాలి అని తపించి నాకు ఏ తోడుని ప్రేమని మిగల్చకుండా వదిలేసి వెళ్ళిపోయిన శరత్‌నా?”
యామిని తన కంటనీరు కళ్ళుదాటి బయటకు వస్తుందని గుర్తించగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది. మధు, నేను ప్రాణంలేని శిలల్లా నిలబడిపోయాం.

అనంతమైన సాగరఘోషకు అలలు, అంతులేని ఆమె దుఃఖానికి కన్నీళ్ళే సాక్ష్యం !!

 నా అభిప్రాయం : 

కాస్త ఓపిగ్గా ఎదురు చూస్తే కాలం మాన్పేగాయాలు మాత్రం చాలానే ఉంటాయ్.

ఈరోజు ల్లో  అ కాస్త సహనం మనషుల్లో ఉండటం లేదు.   ఈ కధ  లో శరత్  తన జీవితం తో యుద్ధం  చేశాడు కాని మద్యలో నే ఆపేసాడు అ యుద్దన్ని.

"మనిషి జీవితంలో ‘యుద్ధం’ అనివార్యం. అవసరాల కోసం... అవకాశాల కోసం... గుర్తింపు కోసం... బంధాల రక్షణ కోసం... బాధ్యతల నిర్వహణ కోసం... సమరం సాగించాల్సిందే. ఇలా మనిషి జీవితం నిత్య కురుక్షేత్రం. "



 

1, మార్చి 2014, శనివారం



వినిపించే గొంతుల వెనక తలుపులు తెరవని హృదయాలు



  'రయిక ముడి ఎరుగని బతుకు’ మీద పుస్తక పరిచయం

కధ 2012లో ఈ సారి కధలన్నీ ఆణిముత్యాలే. చాలా వరకు చదివిన కధలే. నాకిష్టమైన ‘రయిక ముడి ఎరుగని బతుకు’ కధ చూసి సంబర పడిపోయాను. ఈ కధలో ఒక ఆడబతుకు ఉంది. దానిలో అగాధమైన దుఃఖం ఉంది. ఆ దుఃఖానికి రమేశు భాష్యం ఉంది. ఆ భాష్యం అతని కరిగిన గుండె నుండి స్రవించిన జీవధార. అందులో కొన్ని సంవత్సరాల వెనుక దాదాపు ప్రతి ఇంట్లో బోడి తలలతోనూ, తుంటి దోపుతోనూ కనబడి; ఆ ఇంటి సుఖశాంతులకు, సౌకర్యాలకు పనిముట్లుగా మారిన ‘మొగుడు చచ్చిన’ ఆడోళ్ళ అలిఖత వేదన ఉంది. వాళ్ళ కూడూ, గుడ్డే కాదు; జ్ఞానం, దేహం కూడ నిరాకరించిన క్రూరత్వం నుండే చలం ప్రవక్తగా పుట్టాడు. ఇప్పుడు రమేశు అదే బాట పట్టాడు.

ఎనిమిదో ఏటనే భర్తను పోగొట్టుకొని విధవరాలైన కన్నెమ్మను, పూజలు (డిజైన్) లేని కారికం గుడ్డతో కుట్టించిన రెండుపావళ్లు, రెండు రయికలతో చుట్టింటికి (వంటిల్లు) పరిమితం చేసారు. “తొలిముట్టుకు మూడునెలల ముందు కన్నతల్లిని పోగొట్టుకొనింది. మారుతల్లి ఆ ఇంటికి వస్తానే కన్నెమ్మ చేత ఎర్రకోకను కట్టించి, రయికను విప్పించింది. అప్పుడు ఎడమయిపొయిన రయిక మరలా ఆయమ్మ ఒంటిని తాకనే లేదు. పాముపడగ నీడలో కప్ప బతికినట్టు బతికింది మారుతల్లి ఒడిలో కన్నెమ్మ. కూచుంటే తప్పు, నిలబడితే తప్పు, నోటినిండా నవ్వితే తప్పు, గొంతెత్తి మాట్లాడితే తప్పు, కడుపుకు కావలసింది అంత తింటే తప్పు, కన్నారా కునికితే తప్పు.”

అలాంటి కన్నెమ్మను నిండు యవ్వనంలో మడేలు మురుగుడు వలచాడు. కన్నెమ్మ బతుకులో వసంతం వచ్చింది. “మర్రిమాను కింద ఆ గబ్బు చీకటిలో మురుగడి పక్కన చేరి ఒళ్లంతా వెలుగును నింపుకొనేది కన్నెమ్మ.” మురుగుడు తెచ్చిన జిలేబినీ ఒకరికొకరు తినిపించుకొంటుండగా వెనుకనుండి గొడ్డలి తో పొడిచి అతని ప్రాణం తీసాడు తమ్ముడు రాజిరెడ్డి. ఏమీ ఎరగనట్లు భార్యతో, కన్నెమ్మతో అత్తారింటికి చేరాడు. ఆ రోజు నుండి కడదాక, కన్నెమ్మ బతుకు పొంత కడవ బతుకయ్యి వదినె పుట్టింటికి ఊడిగం చేయటంలోనే గడిచిపోయింది. “అయిదు బారల ఎర్రప్రసను కోకను తుంటిదోపు (మొగుడు చనిపోయిన వాళ్లు కుచ్చిళ్లు పోయకుండా కట్టే కట్టు) కట్టుకొని, ఇంకొక కోకను చుట్టి చంకలో పెట్టుకొని వాళ్ల వెనకాలనే కన్నెమ్మ కూడా ఈ ఇల్లు కడప తొక్కింది”
ఎవరీ కన్నెమ్మ?

“కన్నెవ్వ మా మేనత్త ఆడబడుచు. ఆ ఇంట్లో పని చేయడం తప్ప ఎవరితో మాట్లాడటం నేను చూడలేదు, నా బాల్యంలో. ఎవరూ లేనప్పుడు నన్ను దగ్గరకు లాక్కొని ముద్దులు పెట్టుకొనేది.” అప్పుడు ఆమె కంట్లో తడికి సమాధానం స.వెం. రమేశుకు ఆమె ఎత్తుబడి (కర్మకాండలు) తరువాత తల్లి నుండి తెలిసింది.

ఈ కధ కాలం యాబ్భై అరవై యేళ్ళ క్రితమయి ఉండాలి. తెలుగు దేశాన ఉత్తరాదిన పుట్టిన చలం దక్షిణాన ఉన్న చదువురాని కన్నెమ్మను చేరలేదు. మడేలు మురగడితో ఆమె అనుభవానికి చాలా మూల్యం చెల్లించింది. ఈ దేశంలో పెళ్ళై భార్యలు ఉన్నఅన్ని వయసుల మగవాళ్ళు కూడా యధేచ్చగా, సునాయాసంగా కొనుక్కోగల, క్రీడించగల అతి చౌకైనా శృంగారం; యవ్వనంలో ఉన్న వితంతువు కన్నెమ్మకు నిషేధం. సహజాతిసహజమైన ఆమె మేని దాహం, ఆమె అనాధ మనసు కోరిన స్నేహం తన ప్రియ ప్రాణాన్ని బలిగొని ఆమెను కడదాక జీవన్మృతురాల్ని చేసింది.

ఇలాంటి ఇతివృత్తంతో కధలు కొన్ని వేలు వచ్చి ఉంటాయి. ఇక సినిమాలు చెప్పనక్కరలేదు. అందులో చాలా వరకు మనకు సంబంధం లేని లోకాల్లో, పరాయి వ్యక్తుల గురించి విన్నట్లు, చూసినట్లు ఉంటుంది. కాని రమేశు కధ నడక అసాధారణంగా ఉంటుంది. ఒక మగ రచయిత స్త్రీ పాత్రను సృష్టించినపుడు; ఆమె అంతరంగ ఆవిష్కరణ, కృతిమత్వం లేకుండా, బండతనం లేకుండా మాటలకందించటం కత్తి మీద సామే. అందుకోసం ఆడవాళ్ళ వగపు పట్ల దయ, ఔదార్యం ఉంటే సరిపోదు. వాళ్ళ హృదయపు లోతులను సృజించగలగాలి. వాళ్ళ గుండె చప్పుళ్ళు వినగలగాలి. వాళ్ళ మనసు సంవేదనలను భ్రాంతులు, భ్రమలు అంటించకుండా నికార్సుగా మన పరం చేయ గలగాలి. ఆ పని రమేశు అత్యధ్భుతంగా చేసి కూర్చున్నాడు ఈ కధలో.

ప్రకృతి లోని అన్ని జీవ రాశుల సృష్టి కార్యాలను అంగీకరించే మనుషులచేత; ఒక స్త్రీ మోహాన్ని, వాంఛనీ అంతే సహజంగా ఆమోదింపచేయటం సులభమైన పని కాదు. అందుకే మనుషులు అందుకోలేనీ, అందుకొన్నా అంగీకరించిన ఆడదాని దేహ కాంక్షలను మట్టితో చెప్పించాడు రమేశు. “ఎవరికీ పట్టనట్టు, ఊరంతా కలిసి వెలేసినట్టు ఆ మూలన పడి ఉండే నా దగ్గరకు పోతయ్య వచ్చి, నన్ను తాకి చూసినాడు. ఎన్నో నాళ్ల తరువాత ఒక మగోడి చెయ్యి తగిలేసరికి ఎంత నెమ్మది పడినానో. నీకు నేను ఉండానులే తొప్పర (బాధ) పడవద్దు అన్నట్టు నన్ను నిమిరినాడు. రెండు చేతుల నిండుగా నన్ను జవురుకొని జల్లలో పండుకోవెట్టి, ఇంటికి తీసుకొని వచ్చినాడు. ఈ కానగమాను కింద చోటు చూపించినాడు. ఈ పొద్దో రేపో నాకొక కొత్త బతుకును ఇవ్వపోతా ఉండాడు.” అని నల్లమట్టి కుమ్మరి పోతయ్య స్పర్శకు పులకరించి పోతూ చెబుతుంది. “ఎవరు ఏమన్నా అనుకోండి, ఈ మాటను చెప్పే తీరాల. కుమ్మరోడి కింద తొక్కుడు పడిన చేరుమన్ను బతుకే బతుకు. ఆ ఇమ్ము (సుఖం) చవికొన్న వాళ్లకే తెలుస్తాది. కొవ్విన పుంజుకోడి కొప్పరించి మిందకు వస్తే ఒదిగి తోవ చూపిస్తాదే పెట్టకోడి, అట్ట మెదిగి పోయినాను పోతయ్య కాళ్ల కింద నేను.”

వస్తువులు తమను మనుషులుగా వ్యక్తీకరించుకోవటం ఈ కధకు గల ప్రత్యేకత. కధ జరుగుతున్న స్థలంలో, కాలంలో తను లేని లోటును పూడ్చటానికి, రచయిత అక్కడ వున్న గృహ పరికరాల ద్వార కధను చెప్పించాడు. కడుపులో దాచుకొన్న క్షోభని, బ్రతుకంతా నోరు విప్పి చెప్పని కన్నెమ్మ కధను చెప్పుకొన్నది పొంతకడవ, ఎత్తు బొట్ట, దొంతిగుడవ,బియ్యం జల్లెడ, చింకి చాప, రాగి చెరవ, అంబటి బాన, ఊదర బుర్ర, తూకు వెళుకు (తూర్పు వెలుగు). “ఇంకా సాకలి సొలుపు తీరలేదా” అనే దెప్పిపొడుపు మాట వెనుక అంతరార్ధం అంచలంచలుగా చెప్పుకొన్నాయి ఈ వస్తువులు. మధ్యలో ‘అయ్యో కూతురా, మడేలుకు ఒళ్లు అప్పగించేసిందా కన్నెమ్మ’ అన్న ఊదర బుర్రను తీవ్రంగా మందలించాయి. ‘ఒసే ముయ్యే. మనుసులు నిన్ను ఊది ఊది, వాళ్ల లోపలి కువ్వాళం అంతా నీలో చేరిపొయినట్టు ఉండాది.’ అని ఎకసెక్కం చేసాయి. ఆమె దుఃఖాన్నీ తమ సొంతంగా భావించి వల వలా ఏడ్చాయి. పొంత కడవ మాత్రం ఆమె కధ విన్న తరువాత తల్లడిల్లిపోయింది. ‘పగలు పొద్దుగూకులూ కాగికాగి కాలిపోయే నాకు, కడకు మిగిలేది మసే కదా. పండగపూట కూడా పొంతకడవకు అంత పసుపూకుంకుమా పెట్టరే. ఇంటిల్లిపాదికీ ఇంత ఊడిగం చేసే నన్ను, కడాన ఉలవరించుకొని పొయిననాడు దిబ్బలోనే కదా వేసేది. ఓటి మంగలానికి ఉండే మతింపు కూడా పొంతకడవకు ఉండదే.. నా బతుకు మాదిర బతుకే కదా ఆయమ్మది కూడా.’ అని తల పోసి వగచింది.

మేనల్లుడు కూడ ‘సాకలి సొలుపు తీరితే కదా’ అనగానే దినమంతా కూడూనీళ్ళు ముట్టకుండా అర్ధరాత్రి పుట్టినింటి నుండి తెచ్చుకొన్న రాగిచెరవను కావలించుకొని పొగిలి పొగిలి ఏడుస్తుంది కన్నెమ్మ. ఆ ఏడుపును చూసిన పొంతకడవ తను కూడ ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చి చుక్క పుట్టే పొద్దుకు పగిలిపోతుంది.

‘ఓస్ ఆడోళ్ళు చేసే ఎలాంటి పనైనా మేము చేసేయగలం’ అనే అహంకారం ఎంత అమానుషమో, ‘ఆడది ఎంత పనైనా తన కుటుంబం కోసమే కదా చేసేది’ అంటూ దాన్ని సహజ సూత్రంగా స్వీకరించటం కూడా అంతే అన్యాయం. స్త్రీ శ్రమని ఉపరితలం నుండి చూడటం, తేలిక చేయటం ఇక్కడే మొదలౌతుంది. ప్రతిపని మర నొక్కి చేసే రోజులు కావవి. నడుమును విల్లులా వంచాలి, భుజ కండరాలను పూర్తి స్థాయిలో ఉపయోగ పెట్టాలి. చేతులు, కాళ్ళు నిరంతరం శ్రమించాలి. పొద్దు పొడిచింది మొదలు, ఊరు గురకలు పెట్టేవరకు ఎడతెరిపిలేని, సృజనాత్మకత లేని వెట్టి చాకిరి అది. ‘దేవత, అనురాగమయి, త్యాగమయి’ పిలుపులు మాత్రమే (అదీ పొదుపుగా) భత్యంగా వచ్చే దగాకోరు దోపిడి. (కన్నెమ్మకు ఆ జీతం, భాగ్యం కూడ లేవనుకోండి). రచయిత చుట్టింట్లో పీట వేసుకొని దినమంతా కూర్చొన్నా కూడ ఆ శ్రమను అంత సజీవంగా అక్షరాల్లో పెట్టటం అసాధ్యం. ఒక రోజులో ఒక స్త్రీ చేసే కష్టాన్ని రచయిత తను కూడ చేసి ఉంటేనే అలా రాయగలడు అన్పిస్తుంది ఆ వర్ణన చదివితే. ఆ భాగం మాత్రం మీరు చదవాల్సిందే.

ఇక రచయిత భాషా, వస్తుపరిజ్ఞానం అపరిమితం. గతంలో విరివిగా వాడి, ఇప్పుడు సాహిత్యంలోను, మ్యూజియం లోనూ మాత్రమే కనిపిస్తున్న గ్రామీణ శ్రమలను, వస్తుసంపదను ఆయన మన కళ్ళకు కట్టించాడు. ముఖ్యంగా కుమ్మరి కుండలు చేసిన చేసే వైనం మన ముందు సాక్షాత్కరింపచేసాడు.

“మరునాడు తెల్లవారి లేచి మబ్బు (తొక్కి పెట్టిన మట్టి ముద్ద) పక్కనే సారెను పెట్టి, సారెను గిరగిర తిప్పుతా దాని మీద నన్ను పెట్టి చేతి ఒడుపును చూపించినాడు. ఆ ఒడుపుకు పులకరించిపొయిన నా ఒళ్ళు తీరుతీరున సాగింది. నేను పంతెను అయినాను, పటువను అయినాను, పాలడ, పాలిక, మూకుడు, జల్లి మూకుడు, చట్టి, అటిక, రాళ్లటిక, గండివార్పు అటిక, బుడిగ, గిడిగ, పిడత, ముంత, దుత్త, పంటి, చల్లపంటి, సవక పంటి, కడవ, కలి కడవ, పొంత కడవ, బాన, చాకలి బాన, లోవ, గుడువ, బొట్ట, తొట్టి, మంగలము,పంటసాల, గుమ్మి, కులిమి, గాదె, గోలెము… ఒక తీరు కాదు ఒక తెన్ను కాదు, వాడు చేతిలో ఏమి మరులమందు పెట్టుకొని నన్ను ముట్టుకొన్నాడో, నేను ఇన్ని పెడలుగా పొడలు కట్టినాను.” ఇవి మట్టి చేత రచయిత పలికించిన పలుకులు.

నెళవు (పరిచయం), పసను (రంగు), రెయ్యికోళ్ళు(కీచురాళ్ళు), ఇర్లనాటికో వెల్లనాటికో (అమావాస్యకో పౌర్ణమికో), కడంగి (ప్రయత్నించి), ఉల్లము (మనసు) లాంటి అచ్చతెలుగు పదాలు పాఠకులను ఉర్రూతలూగిస్తాయి.
ఈ కధను స్మరించుకొంటున్న సందర్భంలో కధ గురించి కొందరి అభిప్రాయాలు కూడ ఉటంకిస్తే బాగుంటుందనిపించింది.

“వినిపించే గొంతుల వెనక తలుపులు తెరవని హృదయాలు,కనిపించే చిత్రం చాటున మూసుకు పోయిన కళ్ళని చూసి నమ్మకాల దారపు పోగులు తెగిపోతున్నసమయంలో, తాను నమ్మినదాన్ని శ్వాసించి, జీర్ణించి, అనుభవించి వ్యక్తీకరించే కృషి చేస్తున్నాడు రమేష్. పిచుకల కధలుతోనో, రయికముడి ఎరుగని బ్రతుకుల వ్యధలనో తన గొంతుకతో వినిపించాడు.కొత్త వడ్లతో చేసిన మొలక బియ్యం సారం అనుభవిస్తున్నత ఆనందం వుంది రమేశ్ కథలలో.” రమేశ్ కధల గురించి ఒక పాఠకురాలు హరిత అభిప్రాయం.

“ఒకమనిషిని మరొక మనిషి చెప్పుచేతల్లో పెట్టుకోడానికి ఆ మనిషిలో ఒక లోపాన్ని వెతికి దాన్ని తురుఫు ముక్కలా వాడుకుని ఆమెని ఆ ఒక్క మాటతో కుప్పకూలేలా చెయ్యడం అనే రాజకీయం ఎంతకాలంగానో నడుస్తూనే వుంది . మానవజీవితావసరమైన ఒకానొక సుఖాన్ని ఒక లిప్త కాలం అనుభవించడం నేరం అయిపోయిన అస్వతంత్ర కన్నెమ్మ అనగా ఎంత? ఏడ్చి ఏడ్చి పొంతకుండ పగిలిపోయింది .కన్నెమ్మ ఇంకా ఎంతకాలం అట్లా కన్నీళ్ళు ఇగరబెట్టుకుంటూ బ్రతకాలి? జీవితం, తిండి ,వస్తువులు.అన్నిటా స్థానీయత తొణికిసలాడే కథ. ‘రవిక ముడి ఎరగని బ్రతుకు’ అక్షరాలను దృశ్యాలుగా మలిచే చిత్రకారుడు రమేష్ .పాఠకులని తన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయించే మాంత్రికుడు.అచ్చతెలుగు అతని స్వంతం.” -సత్యవతి పి. (రచయిత్రి)

“అది ఒక కన్నీటి గాధ.’రయిక ముడి ఎరుగని బ్రతుకులు’ లో నా చిన్నప్పటి మహనీయ స్త్రీమూర్తులు ఎందరో నా మనసులో మెదిలాడారు.వేకువనే లేచి గబగబ అన్నం వండి, పొద్దున్నే పిల్లలకింత పెట్టి తానింత టిపినులో పెట్టుకొని పొలం కూలీకి పరుగులు తీసిన అమ్మ,గర్భాశయ కేన్సర్ తోనే ఇంటిల్లిపాదికీ వండివార్చిచాకిరీ చేసిన అమ్మమ్మ,తలజడ వేసుకోటం మాని, ముడి తోనే దూది ఉన్ని నేకి తనవాళ్ళ కడుపులు నింపిన నాయనమ్మ,ఎన్నని చెప్పేది ఎందరిని తలుచుకునేది?ఆ దృశ్యాలెన్నో రమేశ్ మన కళ్ళకు కట్టాడు.”- నూర్ భాషా రహంతుల్లా (డిప్యూటి కలెక్టర్, విజయవాడ).

మట్టిని తవ్వితే మాణిక్యాలు దొరుకుతాయి. పల్లెటూర్లలో నులకమంచాల్లో ముడుచుకొని ఉన్న ముసలమ్మలను కదిలిస్తే నాణ్యమైన జీవితాలు లభిస్తాయి. ఎటొచ్చి వినదగ్గ వారే వినాలి.రాయదగ్గ వారే రాయాలి. మరుగున పడ్డ, మసిగుడ్డలుగా మారిన మహోన్నత స్త్రీ మూర్తుల చీకటి గాధలను, ధవళ హృదయాలను సమస్త లోకానికి ఎరిక పర్చవా రమేశు! నీ సత్యమైన తీక్షణ దృష్టితో,నీ కధనా కౌశలంతో, నీ విశిష్ట భాషా పరిజ్ఞానంతో!