23, నవంబర్ 2013, శనివారం



మునెమ్మ ప్రతీకారం...
మునెమ్మ నవల 2008లో ప్రచురితమైంది. రచయిత డాక్టర్ కేశవరెడ్డి.

కథా విషయం:–

మునెమ్మ పల్లెటూరి పడుచు. జయరాముడు ఆమె భర్త. అతను మొరటుదనం, కరుకుదనం కలిగిన మనిషి. తనకు తోచింది తప్ప ఎవరి మాటా వినే రకం కాదు.

మునెమ్మ అత్తవారింట కాపురానికి వచ్చిన రోజే పుట్టిన బొల్లిగిత్త అంటే ఆమెకూ, కుటుంబ సభ్యులకే కాదు, ఆ ఊరి వారందరికీ ఇష్టమే. వీధిలో పోతూ ఉంటే జయరాముణ్ణీ, బొల్లిగిత్తనూ రామలక్ష్మణులనేవారు. బొల్లిగిత్తను తమ బిడ్డగా భావించి మునెమ్మ జయరాములిద్దరూ తమ చేతి మీద దాని బొమ్మ పచ్చ పొడిపించుకుంటారు. ఆ బొల్లిగిత్త వారి జీవనాధారం కూడా.

ఒకరోజు బొల్లిగిత్త మునెమ్మ మీదకు రెండు కాళ్లతో లేచి లైంగిక చేష్ట లాంటిది ప్రదర్శించటం చూసిన జయరాముడు రెచ్చిపోయి పారతో దాడి చేస్తాడు. చావబాదినా బొల్లిగిత్తపై కోపం తగ్గక దాన్ని సంత (పరస)లో అమ్మేసి కొత్త గిత్తను కొంటానని అక్కణ్ణించి ఆవేశంగా వెళిపోతాడు. ఈ సన్నివేశంతోనే కథ మొదలవుతుంది. ఈ కథ అంతట్నీ మనకు చెప్పేది జయరాముడి దూరపు చుట్టమైన సినబ్బ.

జయరాముని తల్లి సాయమ్మ బొల్లిగిత్తను జయరాముడు చావబాదాడని మునెమ్మ ద్వారా తెలుసుకుంటుంది. జయరాముణ్ణి తిడుతుంది. అతనికి ఈ మొండితనమూ, అకారణంగా కోపం తెచ్చుకోవటము లాంటి లక్షణాలన్నీ అతని తండ్రి (తన భర్త) దొరసామి నుంచే వచ్చాయంటుంది.

సాయమ్మ భర్త దొరసామి తాగుబోతు, వ్యక్తిత్వ పరంగా మొరటువాడు, ఎవరికీ తలవంచడు. నాటకాలంటే ఆసక్తి లేకపోయినా ఆ హడావుడిని ఇష్టతాడు. ఊళ్లో నాటకాలొస్తే దొరసామి భార్య సాయమ్మ తన పట్టుచీరను అతనికి తెలియకుండా నాటకాలవాడికి ద్రౌపది వేషం కోసమని ఇస్తుంది. దొరసామి తన భార్య చీర పరాయి మగవాడు కట్టుకోవడాన్ని భరించలేక ఆవేశానికి లోనై నాటకాల వాణ్ణి కత్తితో నరికి చంపుతాడు. జైలుపాలవుతాడు. అక్కడ కూడా తోటి ఖైదీలతో గొడవలు పడుతూ, అధికారుల్ని ఎదిరిస్తూ, ఒక రోజు కొందరు ఖైదీలతో కలిసి జైలు నుండి పారిపోతాడు. వారిలో కొంతమంది పోలీసు కాల్పుల్లో చనిపోతారు. వాళ్లలో దొరసామి ఉన్నదీ లేనిదీ ఎవరూ నిర్థారించి చెప్పకపోవటంతో ఎప్పటికీ అతని ఆచూకీ తెలియకుండా పోతుంది. సాయమ్మ మాత్రం భర్త బుద్ధులు తన కొడుక్కీ రాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఈ కథనంతా ఆమె సినబ్బతో నెమరు వేసుకుంటుంది.

ప్రస్తుతంలోకి వస్తే... ఇంటికి వచ్చిన జయరాముడు సంతకి బొల్లిగిత్తను అమ్మడానికి తీసుకు వెళ్తున్నట్టు చెప్తాడు. సాయమ్మ మొదట వ్యతిరేకిస్తుంది గానీ, మునెమ్మ పట్ల బొల్లిగిత్త ప్రవర్తించిన తీరు తెలుసుకున్నాకా, అమ్మేయటమే మంచిదంటుంది.

పొరుగూరిలోని పశువుల సంత దాకా తన ప్రయాణ ప్రణాళిక ఏమిటన్నది మొత్తం జయరాముడు ఆ రాత్రి తన తల్లికి చెప్తాడు. ఒంటరిగా కాకుండా, పశువుల దళారి తరుగులోడిని కూడా వెంటబెట్టుకు వెళ్తున్నట్లు చెప్తాడు.

అలా వెళ్లినవాడు రెండ్రోజులైనా తిరిగి రాకపోయేసరికి సాయమ్మ, మునెమ్మ కంగారు పడతారు. ఇంతలో మునెమ్మకు కల వస్తుంది. దాని ఆధారంగా తన భర్త బతికి లేడనే నిర్ణయానికి వస్తుంది. పైగా మరుసటి రోజు బొల్లిగిత్త ఒంటరిగా ఇంటికి తిరిగి వస్తుంది. దాని కొమ్ముకున్న సంత చీటీ అనే ఒక్క ఆధారాన్నీ పట్టుకుని మునెమ్మ భర్త కోసం బయల్దేరుతుంది. వెళ్తూ సినబ్బ (మనకు కథ చెప్తున్న పాత్ర)ను కూడా వెంటబెట్టుకు వెళ్తుంది.

దళారి తరుగులోణ్ణి ఆరా తీస్తుంది. అతని మాటల్లో తడబాటును బట్టి అతను చెప్తున్నది అబద్ధమని మునెమ్మకు రూఢీ అవుతుంది. పూటకూళ్ల ముసలి దంపతులను, సంత సంచాలకుణ్ణి, సంతలో కల్లుపాక యజమానినీ విచారించిన తర్వాత, తన భర్త జయరాముడు బొల్లిగిత్తను పశువుల వైద్యం చేసే మందులోడికి అమ్మినట్టు తెలుసుకుంటుంది మునెమ్మ. సినబ్బతో కలిసి అతని ఊరు రామినాయుడు పల్లెకు వెళ్తుంది. అక్కడికి చేరే సరికి మందులోడు మరణశయ్య మీద ఉంటాడు. ఆవుకి వైద్యం చేయబోతే కొమ్ము విసిరిందని అతని భార్య అబద్ధం చెపుతుంది. అసలే చావుబతుకుల్లో ఉన్న మందులోడు మునెమ్మ ఎడం చేతి మీద బొల్లిగిత్త పచ్చబొట్టు చూసి భయంతో చచ్చిపోతాడు. దాంతో బొల్లిగిత్తే మందులోడి చావుకి కారణమని మునెమ్మ అనుమానిస్తుంది. తర్వాత అతని పెద్ద కొడుకు ద్వారా నిజం తెలుసుకుంటుంది మునెమ్మ. మందులోడూ తరుగులోడూ ఇద్దరూ కలిసి తన భర్తని చంపేశారని ఖాయపర్చుకుంటుంది. ఇక మిగిలిన తరుగులోడిపై మునెమ్మ ఎలా ప్రతీకారం తీర్చుకుందన్నదే ముగింపు.

నా అభిప్రాయంలో మునెమ్మ:–

కథ ప్రారంభంలో మునెమ్మ పాత్ర అమాయకంగా కనిపించినా, భర్త హంతకుల్ని వెతికే క్రమంలో ఆమె ఎక్కడ లేని మొండి ధైర్యాన్ని, ప్రవర్తనలో పరిణతినీ ప్రదర్శిస్తుంది. భర్త ఇక లేడు అనే భావనే ఆమెలో అంతకుముందు లేని ఈ నిబ్బరాన్నీ, నేర్పరితనాన్నీ కల్పించాయనిపిస్తుంది. నాకు ఇక ఎవరూ లేరు అనే భావన రాగానే ప్రతి స్త్రీలోనూ మొండిధైర్యం ప్రవేశిస్తుంది.

మునెమ్మ తనలోని అనుమానాలను చూపుల ద్వారా తెలుపుతుందే కానీ, మనసు విప్పి ఎవరితోనూ పంచుకోదు. మాట్లాడిన కాసిని మాటల్లోనూ తాత్త్విక ధోరణి తొంగి చూస్తుంది. ఆ మాటలు ఎక్కడా పల్లెపడుచు మాటలుగా మనకు అనిపించవు.
“కాలు దీసి వీధిలో పెడితే దారి దానంతట అదే తెలుస్తుంది. భూమ్మీదికి వచ్చే ముందు ఎలాటి బతుకు బతుకుతాం? ఎక్కడ బతుకుతాం? ఇవన్నీ ఆలోచించే వచ్చామా?”
“అడుగుదాం. సమయమొచ్చినపుడు గొంతు మీద కాలేసి అడుగుదాం. చేప కోసం గాలం వేసినప్పుడు బెండు తైతక్కలాడగానే గాలాన్ని లాగుతామా? బెండు నీళ్ళలో మునిగినప్పుడు గదా గాలాన్ని లాగుతాం.”
ఇలాంటి తాత్త్విక ధోరణీ, ఈ అరుదైన పోలికలూ మునెమ్మవా, లేక రచయితవా అనే సందేహం కలుగుతుంది.

కానీ ఆమె ఇలా ఎంత అరుదైన ఉపమానాలు వాడినా, ఎంత లోతైన తాత్విక ధోరణి ప్రదర్శించినా, ఆమె మాటల్లోని యాస వల్ల మనం కాస్త సులువుగానే సమాధాన పడతాం. కానీ కథను మనకు చెప్పే సినబ్బ విషయంలో అలా సమాధాన పడలేం. అతని మాట తీరూ, అతను వాడే పదజాలమూ, కథను నేర్పుగా వెనకా ముందులు చేసి చెప్పటం... వీటి వల్ల మనకు కథ చెప్పేది ఒక పల్లెటూరి యువకుడని అనిపించదు. బాగా విజ్ఞానవంతుడెవరో చెప్తున్నట్టు అనిపిస్తుంది.
“వాస్తవ జగత్తులోని సంఘటనలు మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చివేయడం మనం చూసినదే. అలాగే స్వప్న జగత్తులో జరిగిన సంఘటనలు కూడా జీవిత దృక్పథాన్ని మార్చివేయగలవని నేను చెప్పగలను. అందుకు మునెమ్మే సాక్ష్యం. స్వప్నంలో ఆమె చూసిన దృశ్యాలు ఆమెలోని ప్రతి అణువునూ కుదిపి వేశాయి. స్వప్నానంతరం ఆమె కార్చిన కన్నీళ్ళు, ఆమెలోని సకల సందిగ్ధతలను, సకల సంశయాలను, సకల జడత్వాలను కడిగి వేశాయి.”
ఇలా సాగుతుంది సినబ్బ కథనం. మునెమ్మకు రచయిత తన ఉపమానాల్ని మాత్రమే అరువిచ్చాడు. సినబ్బకు తన శైలి కూడా అరువిచ్చేశాడని అనిపిస్తుంది. ఈ శైలి కథా వాతావరణానికి నప్ప లేదు. సినబ్బ కూడా మునెమ్మలా యాసలో మాట్లాడి ఉంటే కథకు బాగా నప్పేదేమో అనిపిస్తుంది. ఇలాంటివి కొన్ని లోటుపాట్లుగా అనిపించినా కథలో ఉత్కంఠ కారణంగా మనం మనసులోనే సమాధాన పడుతూ చదువుకుంటూ పోతాం. పైగా ఈ రచన మేజికల్ రియలిజం అనే ధోరణి ఆధారంగా రాసిందని అన్నారు గనుక, ఇలాంటి పొసగని అంశాలు ఎన్నో ఆ పేరు మీద చెల్లిపోతాయి.

భర్త హంతకుల్ని చంపటమే భర్తకు తాను చేసే అంత్యక్రియలుగా భావిస్తుంది మునెమ్మ. పట్టుదలగా వాళ్లని వెంటాడి తుదముట్టిస్తుంది. ప్రతీకారం కోసం ఆమె ప్రయాణమే ఈ నవల.

ఈ సమీక్ష పుస్తకం.నెట్‌లో ప్రచురితం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి