3, నవంబర్ 2013, ఆదివారం

నా  మీద నీకు ప్రేమ వుంటే

ఆనందాన్ని పంచుకుంటే అది రెట్టింపు అవుతుంది. దుఃఖాన్ని పంచుకుంటే అది సగమవుతుంది. ఎవరితోనూ పంచుకోని దుఃఖం ఏమవుతుంది? కొండల్లా పెరుగుతుంది. నిజానికి ప్రతి ఒక్కరికీ ఎవరో ఒకరితో తమ దుఃఖాన్ని పంచుకోవాలనే ఉంటుంది. కానీ, అలా ఒకరి ముందు తమ జీవితాన్నంతా పరిచి, తమ దుఃఖాన్నంతా పంచుకుందామని చూస్తే కచ్ఛితంగా ఓదార్పే లభిస్తుందన్న గ్యారెంటీ ఏమిటి ? అలాంటి వ్యక్తుల హృదయ సంవేదనలకు ప్రతిరూపంగా 'ఆప్ కీ పర్‌ఛాయియా' అనే సినిమాలోని ఈ పాట వినిపిస్తుంది.
రాజా మెఁహదీ అలీ ఖాన్ రచించిన ఈ గీతాన్ని మదన్ మోహన్ స్వరబద్దం చేశారు. స్వర సామ్రాజ్ఞిని లతా మంగేష్కర్ ఈ గీతాన్ని అద్భుతంగా ఆలపించారు.

అగ ర్ ముఝ్‌సే మొహబ్బత్ హై,ముఝే సబ్ అప్‌నే గమ్ దేదోఇన్ ఆంఖోంకా హర్ ఏక్ ఆసూఁముఝే మేరే క సమ్ దేదో / అగర్ ముఝ్ స/( నా మీద నీకు ప్రేమే ఉంటే- నీ బాధలన్నీ నాకు ఇచ్చేసెయ్నీ క ళ్లల్లోని ప్రతి అశ్రువును- నా మీద ఒట్టు నాకు ఇచ్చేసెయ్)

మానవ హృదయం సుఖ సంతోషాలకూ, వేదనలకూ, క్షోభలకూ వేదిక కదా! ప్రేమించిన వారు వారి సంతోషాల్ని పంచుకున్నట్లే దుఃఖాల్నీ పంచుకోవాలి కదా! అలా కాకుండా, నీ ఏడ్పు నువ్వు ఏడ్వు. నేను నీ జీవితంలోకి ప్రవేశించింది నీ ఏడుపును భరించడానికి కాదని ప్రియురాలో, అర్థాంగో అంటే ఏమిటి అర్థం? నీకున్న ప్రేమతో నాకెంత వైభోగ మైన జీవితాన్ని ఇస్తావో ఇవ్వు...అంతే తప్ప మిగతావేవీ వద్దు. అంటే ఇంకేముంది? నీ నుంచి కలిగే ప్రయోజనాలు పంచుకోవడానికే అయితే దారిన పోయే ఎవరైనా నీ దరికి చేరుకుంటారు. ప్రేమించిన వారికీ తేడా ఏముంది? నా మీద అని కాకుండా నిజంగానే నామీద నీకు ప్రేమ ఉంటే నీ బాధల్నీ, నీ కన్నీళ్లనూ నాకు ఇచ్చేసేయ్ అంటోంది ఈ ప్రియరాలు. నిజంగా ఇంత కన్నా పరణతి చెందిన ప్రేమమూర్తి ప్రపంచంలో మరెవరు ఉంటారు?


తుమ్హారా గమ్ కో అప్‌నా గమ్ బనాలూఁ తో కరార్ ఆయేతుమ్హారా దర్ద్ సీనేమే చుపాలూఁ తో కరార్ ఆయేవో హర్ శై జో తుమ్హే దుఖ్ దే ముఝే మేరే సనమ్ దేదో /అగర్ ముఝ్ సే/( నీ బాధల్ని నా భాధలుగా చేసుకుంటే నాకు నిశ్చింతనీ గాయాల్ని నా ఎదలో దాచేసుకుంటే నాకు నిశ్చింతనిన్ను బాధించే ప్రతి విషయాన్నీ ఓ ప్రియతమా నాకు ఇచ్చేసెయ్)

నువ్వు నా కోసం నిర్మించిన భవంతిలో విహరించడం ద్వారానో, నా కోసం తెచ్చిన ఆభరణాలను ధరించడం వ ల్లనో కాదు . నీ బాధల్ని నా బాధలుగా స్వీకరించడంలోనే నా మనసుకు నిశ్చింత, ప్రశాంతత అనే ప్రియురాలు. నీ గాయాల్ని తనలోకి ఒంపుకోవడంలోనే తన జన్మకు సార్థకత అనే ప్రియురాలు ప్రేమకు అసలు సిసలైన ప్రతిరూపం కాదా? సౌఖ్యాలు, సౌకర్యాల కోసమైన వెంపర్లాటలోనే సర్వశక్తులూ కరిగిపోతున్నాయి. 'నువ్వు నాకేం చేశావో చెప్పు..అంటే, నవ్వు మాత్రం నాకేం చేశావని?' అంటూ ఒకరినొకరు ఎద్దేవా చేసుకోవడంలోనే జీవితాలు ముగిసిపోతున్నాయి. ఎన్ని దశాబ్దాలు సహజీవనం చేసినా ఒకే గదిలో జీవించే ఇద్దరు వ్యక్తులు అవుతున్నారే గానీ, రెండు శరీరాలతో జీవించే ఒకే ఆత్మగా ఎదగడం లేదు. అలా ఒక ఉన్నతోన్నత స్థితికి ఎదిగిన ఓ అరుదైన జీవాత్మ ఆలాపనే ఈ గీతం.

శరీకే-జిందగీ కో క్యూఁ శరీకే గమ్ నహీ కర్‌తేదుఖోంకో బాంట్‌కర్ క్యూఁ దుఖోంకో కమ్ నహీ కర్‌తేతడప్ ఇస్ దిల్ కీ థోడీ-సీ ముఝే మేరే సనమ్ దేదో / అగర్ ముఝ్‌సే/( జీవితంలో భాగమైన బాధ ల్ని జీవితంలో ఎందుకు చేర్చుకోరు?బాధల్ని పంచుకుని బాధల్నెందుకు తగ్గించుకోరు?ఓ ప్రియతమా! హృదయపు ఆవేదనలో కొంతైనా నాకు ఇచ్చేసెయ్)

సమస్యలు,సంఘర్షణలే లేని జీవితాన్ని, గాయాలు, వ్యధలూ లేని జీవితాన్ని మనిషి కోరుకుంటాడు. వాటి తాలూకు ఛాయలు కూడా తన జీవితంలోకి రాకూడదనుకుంటాడు. కానీ, జీవితంలో అత్యంత అంతర్భాగమైన వాటిని దరిదాపులోకే రాకూడదనుకుంటే ఎలా? అది అసహజం కదా! అసాధ్యం కదా! అనుకోవడం వల్ల ఏదీ ఆగదు. ప్రపంచంలో ప్రతిదీ మన నియంత్రణలో ఉండదు. అడ్డుకునే ప్రయత్నాలు ఒక పక్కన చేస్తూనే ఉంటాం. అయినా కొన్ని శూలాలు గుండెలోకి దిగుతూనే ఉంటాయి. హృదయాన్ని కుదిపేస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవడం ఒక్కరుగా సాధ్యం కానప్పుడు తన జీవితంలో భాగమైన, తన జీవనయానంలో సహబాటసారియైన ప్రేమమూర్తితో పంచుకోవచ్చు. ఆ వేదనను దుఃఖాన్ని సగమైనా తగ్గించుకోవచ్చు. ఇదేమీ రుణగ్రస్తమైపోవడం ఏమీ కాదు. అలాంటి పరిస్థితులు అవతలి వ్యక్తికి ఎదురైనప్పుడు నువ్వూ ఆ పాత్ర పోషిస్తావు కదా! అందువల్ల బాధల్ని పంచడానికి వెనుకంజ వేయాల్సిన అవసరమేమీ లేదు. కాకపోతే కష్టాల్లో తోడ్పాటును అందించిన వారి పట్ల కృతజ్ఞత కలిగిఉండడం విస్మరించకూడదు. అవకాశం వచ్చినప్పుడు అండగా నిలబడటంలో వెనుకంజ వేయకూడదు.


ఇన్ ఆంఖోంమే న అబ్ ముఝ్ కో కభీ ఆసూఁ నజర్ ఆయేసదా హస్‌తీ రహే ఆంఖే- సదా యే హోట్ ముస్కాయేముఝే సభీ ఆహే, సభీ దర్దో-అలమ్ దేదో / అగర్ ముఝ్‌సే/( నీ కళ్లల్లో ఇంకెప్పుడూ ఈ అశ్రువులు కనిపించకూడదునీ కళ్లెప్పుడూ నవ్వుతూ ఉండాలి- నీ పెదాల మీద ఎల్లప్పుడూ మందహాసమే ఉండాలినీ నిట్టూర్పులు, నీ ఆవేదన లు సమస్తమూ నాకు ఇచ్చేసెయ్)

ఒకడు కాలిపోతేనో, కూలిపోతేనో చూసి ఆనందించే వారే అత్యధికంగా ఉండే లోకంలో నీ కళ్లల్లో అశ్రువులు చూసే పరిస్థితి ఇంకెంప్పుడూ నాకు రాకూడదు. నీ కళ్లల్లో పెదాల్లో మందహాసం తప్ప మరేమీ కనిపించకూడదు అని ఆత్మీయంగా హెచ్చరించే ప్రేమమూర్తి ఎదురైతే, అంతకన్నా ఏంకావాలి? వాస్తవానికి ఒకరి జీవితంలో ముళ్లు పరిచి ఒకరి జీవితాన్ని కంటక ప్రాయం చే సి పొందే సంతోషం కన్నా, ఒకరి జీవితంలో పూలు పరిచి ఒకరి జీవితాన్ని కాంతిమయం చేయడంలో కలిగే ఆనందం వెయ్యి రెట్లు గొప్పది. ఈ మౌలిక సత్యాన్ని గుర్తించలేని మనిషి ఇతరులను ఎలాగూ సంతోషంగా ఉంచడు. కానీ, చివరికి తానూ సంతోషంగా ఉండలేడు. సంతోషాల్ని ఎవరైనా పంచుకుంటారు. కానీ, బాధల్ని పంచుకునేదో నిజమైన బంధం. అదే నిజమైన ఆనందం. ఎన్ని యుగాలుగా గడిచినా ఎందుకో అంతరంగంలో ఈ సత్యం ఎదగడం లేదు. ఎప్పటికైనా శుభపరిణామం వస్తుందని ఆశిద్దాం!

andhrajyothi lo nunchi...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి