22, మార్చి 2014, శనివారం

ఊగులోడు - ఆర్.రాఘవరెడ్డి




ప్రకాశం జిల్లా గ్రామీణ మాండలికం లో  రాఘవ రెడ్డి గారు రాసిన హాస్య కధ మీ కోసం. 



వాడ్నందరూ 'ఊగులోడు' అంటున్నారంటే అనకేం జేస్తారు. అది చిన్న పని గానీ, పెద్ద పనిగానీ, ఒక పట్టాన తెగనియ్యడు, తెల్లారనియ్యడు. ఏ విషయమైన సరే, ఎట్టాంటి నిర్ణయమైన సరే ఎనక్కీ ముందుకీ, ముందుకీ ఎనక్కీ, ఊగిసలాడతానే ఉంటాడు.

వారం రోజుల కిందటొకరోజు ఎప్పుట్లాగానే గొడుగు, నీళ్ళసీసా తీసుకోని బరెగొడ్లిప్పుకోని చేనుకి పోతన్నాడు. మిట్టచేను దాటాడు. అల్లంత దూరంలో ఎనికపాటోళ్ళ ఏపచెట్టు ఉందనంగా ఎనకనించెవరో తోసినట్లు ముందుకి తూలాడు. మందు ఎక్కువైనోడిలాగా తూలుకుంటా తూలుకుంటా రెండడుగులేసి గెనెం మీద ఆమేన కూలబడ్డాడు.

చెట్టు నీడన కూర్చోనున్న రాజయ్య ఇది చూసి పరుగెత్తుకుంటా వచ్చాడు. "ఏమైందిరా... వచ్చే వచ్చే వాడివి అట్టా కూలబడిపోయ్యావు..." అంటా పైకి లేపి బుగ్గలు తట్టాడు. ఊగులోడు కళ్ళు తెరిచి పైకి లేచి రెండడుగులు ముందుకేసి మళ్ళీ పడిపోయాడు. దూరంగా కాలవకట్టన గొడ్లు మేపుకుంటన్నోళ్ళు కూడా వచ్చి చుట్టూ మూగారు. ఊగులోడ్ని మోసుకొచ్చి చెట్టు నీడన పడుకోబెట్టారు. ముఖాన కాసిని నీళ్ళు జల్లారు.

కాసేపటికి కళ్ళు తెరిచాడు. "ఏంది మావా"
"ఏందిరా"

"ఎట్టాగుందిరా"
అందరూ ఒకేసారి ఆదుర్దాగా అడుగుతున్నారు. ఎవరో మంచి నీళ్ళు తెచ్చిచ్చారు. రెండు మూడు గుటకలేశాడు. అంతలోనే లేచి పక్కకొచ్చి వాంతి చేసుకున్నాడు. "కళ్ళకేమి అగపడ్డం లేదు .... అంతా తెల్లగా బూజరగా ఉంది" అంటా కూర్చుండి పోయాడు.

'కూడు తినకుండా పొలం బయలుదేరాడేమో'

'నీరసమ్మీద కళ్ళు తిరిగినట్టుంది'
'వాతం కమ్మినట్టుంది'... తలా ఒక రకంగా ఊహిస్తున్నారు. రాజయ్య సీసాలోని చల్లటి నీళ్ళు తెచ్చి మొహం కడిగాడు.

"ఇప్పుడు కనపడతందంట్రా?"
"కనపడతంది మావా" ఊగులోడు నీరసంగా చెప్పాడు.

మాయిటేళ ఇంటికి పొయ్యేటప్పుడు జొన్నకోసుకెళ్ళాలని బండికట్టుకొనొచ్చిన సుబ్బారెడ్డిని కేకేశారు. గెనాల మీద ఎగిరెగిరిపడతా బండి ఊళ్ళోకి వేగంగా పోతంది. ఊగులోడి గుండె అంతకన్నా ఎక్కువగానే ఎగిరెగిరిపడతా ఉంది. అంతకన్నా వేగంగా కొట్టుకుంటా ఉంది.

ఊగులోడికసలే భయమెక్కువ. ఏ చిన్న సమస్య వచ్చినా కంగారు పడిపోతాడు. ఇట్టయిద్దేమో అట్టయిద్దేమో అని అవకముందే బెంబేలు పడుతుంటాడు. ఇప్పుడిట్లా తూలుడొచ్చి పడిపోవడానికి కారణమేందో అర్ధం కాక గుబులు పట్టుకుంది. జెరెం, గిరం ఏమీ లేకపాయే. ఇప్పుడు ఉన్నట్టుండి ఇట్టా ఎందుకయినట్టు? కొంపదీసి ఫిట్సేమో ...? ఆ మాట అనుకోటానికే భయం పుట్టింది.

తనకిష్టం లేని, మనసుకి కష్టం కలిగించే సంగతుల్ని గుర్తుకు తెచ్చుకోవడం కూడా ఇష్టముండదు ఊగులోడికి. వాటిని కావాలనే మర్చిపోతాడు. జ్ఞాపకాల పెట్టెలో ఎక్కడో అట్టడుక్కి వాటిని తోసేస్తాడు. ఎప్పుడన్నా ఆ ఆలోచనలొచ్చినా ... ఎంబట్నే మనసుకి మరేదో విషయం మీదకి మళ్ళించేస్తాడు.
అయితే ఒక్కోసారి కొన్ని ఆలోచనలు ఎదురు తిరుగుతాయి. ఏం వద్దనుకుంటాడో అవే గుర్తుకొస్తుంటాయి. ఆ రాత్రీ అట్లానే జరిగింది ఊగులోడికి. “ఛ! మనకేం లేదులే. మూర్చలేదు. ఏం లేదు. అదయితే నోటెంట నురుగు రావటం, గుప్పిళ్ళు బిగబట్టడం ఉంటై గదా. ఏదో, మామూలుగా కళ్ళు తిరిగినయ్యంతే” అని తనకు తాను చెప్పుకుని పడుకున్నాడు. కాని నిద్రపడితేగా. రాత్రంతా ఏదో గుబులు.

తనూ నిద్రపోలేదు, భార్యనీ నిద్రపోనియ్యలేదు. ఆ పిల్ల పెళ్ళయిన పదేళ్ళుగా ఊగులోడి యవ్వారం చూస్తానే ఉంది . పిల్లల్లేరనేగానీ మొగుడే ఒక చిన్న పిల్లోడా అమ్మాయికి. నిజానికి ఊగులోడు చానా తెలివైనోడు. ఏ విషయమైనా సరే విభజించీ విడగొట్టీ పీసు పీసు జేసి పాయింట్లు లాగుతుంటాడు. వీడి ‘లా’ పాయింట్లకి జవాబు చెప్పలేక 'ఒట్టి పెడనాయాల్రా ఈడు' అంటుంటారు ఊళ్ళోవాళ్ళు.

చిన్నప్పుడే నాన్న చనిపోయినా పొలం పనులన్నీ అమ్మే చూసుకుంటా బడికి పంపించింది. పక్కూళ్ళో హైస్కూలుకి రోజూ పది మైళ్ళు నడిచి వెళ్ళొచ్చేవాడు. బాగా చదివేవాడు. పదో తరగతి స్కూలు ఫస్టోచ్చాడు కూడా. పరీక్షలు జరుగుతుండగానే అమ్మకి జబ్బుచేసి ఆసుపత్రిలో చేరడం, తరవాత ఆమె చనిపోవడంతో ఊగులోడి చదువాగిపోయింది. నాలుగేళ్ళపాటు తనింట్లోనే పెట్టుకుని కూతుర్నిచ్చి పెళ్ళి చేశాడు మేనమామ. పెళ్ళినాటిని ఊగులోడికి నిండా ఇరవై కూడా లేవు. ఆ పిల్లకి మైనారిటీ కూడా తీరలేదు. 'మీ నాన్నని ఇప్పుడైనా అరెస్టు చేయించొచ్చు ఈ పాయింటు మీద' అని అప్పుడప్పుడు ఆ పిల్లని ఆట పట్టిస్తుంటాడు.

ఆ అమ్మాయి తనంత తెలివయింది కాదని ఊగులోడి అభిప్రాయం. కానీ ధైర్యంలో మాత్రం తనకంటే పది రెట్లు మేలని వాడికి ఖచ్చితంగా తెలుసు. ఒకటికి మించిన మార్గాలున్న సమస్య ఏదైనా వచ్చిందా... ఊగులోడికి చచ్చేచావొచ్చిందన్న మాటే. అసలు ముందు కాసేపు ఏం తోచదు. బ్లేడు లాగిన మడిచెక్కలాగా మైండంతా ఖాళీగా అయిపోద్ది. అట్లా చెయ్యాలా ఇట్లా చెయ్యాలా అని అట్లా ఇట్లా కాదు అనీ ... మూడు పొద్దులు, మూడు రాత్రులు అదే పనిగా ఆలోచిస్తానే ఉంటాడు.

ఈ లోపు ముప్ఫై మూడు సార్లు 'ఏం చేద్దామంటావే' అని భార్యనడుగుతాడు. ఆ అమ్మాయికి తెలిసిన విషయాల్లో ఆమె సలహాలడుగుతాడు. తెలియని విషయాల్లో కూడా అట్లానే అడుగుతాడు. 'నీ ఇష్టం' అంటేనేమో "నా ఇష్టం సరే, నీ ఇష్టమేందని గదా అడుగుతుంది. నీకొక అభిప్రాయముండదా..." అంటా 'లా' పాయింట్లు దీస్తాడు. సరే ... ఏదో తనకు తోచింది చెబుతుందా, 'అట్టెట్టయిద్ది, ఇట్టెట్టయిద్ది' అని మళ్ళా తగులుకుంటాడు. ఆ అమ్మాయి చెప్పినట్లు చేసి ఆ పని కొంచం అటూ ఇటూ అయిందంటే, "ఛ ... నువట్లా చెప్పబట్టి గదా ఇప్పుడిట్లా అయ్యింది" అని కొన్ని రోజుల పాటు సణిగినోడు సణిగినట్టే ఉంటాడు.

ఉదయం చేనికాడ తను పడిపోవడం గురించి కూడా తనకు తోచిన రక రకాల భయాలన్నీ పెళ్ళాంతో చెప్పాడు. అన్నిట్నీ కొట్టిపారేసిందా పిల్ల. "పొట్టలో బాగాలేదని పొద్దున్నే ఏం తినకుండా పొలం బోతివి. చిరచిరలాడే ఎండకి కళ్ళు తిరిగి పడిపోయ్యావంతే" అని ఎప్పట్లాగానే ఊగులోడికి ధైర్యమిచ్చింది.

'అంతే అంతే' అనుకోని కళ్ళు మూసుకొని పడుకుంటాడు, అంతలోకే సీసాలోంచి భూతం బయటకొచ్చినట్టు ఏదో ఒక అనుమానం. భార్యని లేపుతాడు.
"మరి... కళ్ళకేమీ అగపడకుండా తెల్లగా బూజరగా ఉండటమేంది ఒక నిమిషం సేపు?..."

"నీరసమ్మీద పడిపోతే అట్లాగే ఉండిద్దిలే..."

"ఛ. స్పృహ తప్పి పడిపోవటానికీ, కళ్ళు కనపడక పోవటానికీ సంబంధమేందే...?"

ఆమె తన పాత జవాబే మళ్ళీ ఇంకాస్త గట్టిగా చెబితే వినాలని వాడి కోరిక. ఆ అమ్మాయి గోడమీద టైం చూసి వాడివైపు తిరిగి ఆవులిస్తూ "సరే, రేపు ఒంగోలు... డాక్టరు దగ్గరకి వెళ్ళొద్దాంలే" అంది.

"ఛ! డాక్టరు దగ్గరకెందుకే ... వాళ్ళు ఏదేదో చెబుతారు. ఏదో కళ్ళు తిరిగుంటయ్యంతేలే. పడుకో పడుకో ... అర్ధరాత్రి అవతంది" అంటా పడుకున్నాడు.
తెల్లారి లేచి గుబులు గుబులుగానే బరగొడ్లకాడ బాగు చేశాడు. భార్య పాలు పిండింది. పోయి కేంద్రానికి పోసొచ్చాడు. నాలుగు రోజులు గడిచిపోయినయ్. ఏమవుద్దో ఏమవుద్దోనన్న భయం కాస్త తగ్గుతా వుంది. ఎంబట్నే కంగారు పడి ఆసుపత్రికి పరుగెత్తనందుకు సంతోషిస్తున్నాడు.

ఈ రోజు పాల కేంద్రం కాడ అరుగు మీద కూర్చోని పేపరు చదువుతున్నాడు. లోపలెక్కడో అంతరాత్మలో అణచిపెట్టుకున్న భయం పేపర్లో ఆ వార్త చూసి చప్పున పైకి తన్నుకొచ్చింది. ఆ రోజు ప్రపంచ మూర్ఛరోగుల దినమంట! ఆ సందర్భంగా ఎవరో డాక్టరు, ఆ రోగం గురించి పేపర్లో రాశాడు. నోటంబడి నురుగులు రావడం, గుప్పిళ్ళు బిగబట్టడం లాంటి లక్షణాలు లేకుండా కూడా ఫిట్స్ రావొచ్చంట. కొద్ది సమయం పాటు కళ్ళకేమి అగపడకుండా ఉండడం కూడా మూర్ఛ లక్షణాల్లో ఒకటంట.

ఒక్కసారిగా ఊగులోడి వాలకమే మారిపోయింది. ఉషారుగా పేపరు తీసుకున్నోడల్లా చప్పున చల్లారిపోయ్యాడు. మెదలకుండా పేపరు మడతేసి అక్కడ పెట్టి ఇంటికి బయలుదేరాడు. అలవాటయిన దారిగుండా అలవాటయిన కాళ్ళు ఇంటికేసి సాగి పోతన్నయ్యేగాని, ఊగులోడి మనసులో ఏడేడు సముద్రాలు ఎగిరెగిరి పడుతున్నాయి.

ఇంటికొచ్చేసరికి భార్య పేపరు చదువుతా ఉంది. ఊగులోడిని చూసి చదివే చదివే పేపరు మడిచేసి పక్కింట్లో ఇచ్చేసొచ్చింది. ఒళ్ళంతా చెమట్లు పట్టిన మొగుణ్ణి చూసి ఎందట్లా ఉన్నావని అడిగింది. పేపర్లో తను చదివిన వ్యాసం గురించి చెప్పాడు. ఊగులోడు వచ్చేసరికి తనూ పేపర్లో చదువుతున్నది ఆ వ్యాసమేనని, అది చూస్తే ఇంకా కంగారు పడతాడేమోనని హడావుడిగా వాళ్ళ పేపరు వాళ్ళకి ఇచ్చోచ్చాననీ చెప్పింది.

నిజానికా వ్యాసంలో ఫిట్స్ అంటే ఇప్పుడు భయపడాల్సిందేమీ లేదనీ, మందులు వాడుకుంటా ఉంటే శాశ్వతంగా అదుపులో ఉంచుకోవచ్చనీ రాశారు. కానీ, ఊగులోడికి ఫిట్స్ అనే మాటే భయం పుట్టిస్తంది. భరించరానిదిగా ఉంది. ఎల్లకాలం మందులు వాడుకుంటా ఉండాల్సిరావటమనే ఊహే నచ్చట్లేదు. 'ఎక్కడికి పోవాలన్నా ఎవరో ఒకరు తోడుండాలి గదా' అని అనుకుంటంటేనే ఏడుపొస్తంది. ఊగులోడి కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. 'మళ్ళీ మొన్నట్లాగే కళ్ళు కనబడ్డం లేదు నాకు' అన్నాడు. "ఏం లేదులే... నువ్వు భయపడుతున్నావ్... కళ్ళు తుడుచుకో" అంటూ వాడిని దగ్గరకు తీసుకుని మంచం మీద కూర్చోబెట్టి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. తాగాడు.

అప్పటికప్పుడే ఆసుపత్రికి ఒంగోలు బయల్దేరారు. ఒంగోలులో ముందు తమకు తెలిసిన తమ ఊరి డాక్టరొకాయనుంటే ఆయన దగ్గరకి పోయారు. ఆయన ముక్కు, చెవులు, గొంతు డాక్టరు. ఆయనొక పిచ్చి మారాజు. హైస్కూలు పిలకాయలందరికీ ఊరకేనే వైద్యం చేస్తాడు. ఎడాపెడా టెస్టులేమీ రాయడు. 'మనూరి డాక్టరు గదా. ఫిట్స్ డాక్టరు ఎవరికయినా చెప్పి తక్కువ ఖర్చుతో చూపిస్తాడేమో. టెస్టు చేపిచ్చుకుంటే అటో ఇటో తేలిపోద్ది' అనుకున్నాడు ఊగులోడు.

ఆయన ఆప్యాయంగా పలకరించి అంతా విని "ఏం ఉండదులే... నీరసం వల్ల కళ్ళు తిరిగుంటయ్యంతే" అన్నాడు. "ఒక్కసారి నరాల డాక్టరు దగ్గరికి పోయి టెస్టు చేయించుకుంటే మంచిదేమోనని వచ్చామ"న్నాడు.

"ఎందుకూ... ఏం పని లేదా ఏంది? ఇదిగో, ఈ బిళ్ళలు ఒక పదిరోజులు పాటు ఏసుకుంటా బలమైన తిండి తింటే చాలు. నేను గూడా మనూరికే వస్తన్నా. నా కారులో పోదాం రాండి" అని ఎంబట పెట్టుకుని ఊరికి తీసుకుపోయాడు.

ఊగులోడికి ఒక రకంగా సంతోషంగా ఉంది. ఒక రకంగా అసంతృప్తిగా ఉంది. ‘అంతలావు డాక్టరు అంత ధైర్యం చెబుతున్నాడంటే అంతే అయుండాల. ఈ టెస్టులనీ, ఈ టెస్టులనీ డబ్బులొదిలించుకోలేదు, ఇంకా నయం’ అని సంతోషం. ‘ఎదవ డబ్బులు, పోతే పోయినియ్ ... టెస్టు చేయించుకొనుంటే అనుమానం తీరిపోయి మనసుకి శాంతిగుండేది గదా” అని అసంతృప్తి.

ఆ సాయంత్రం పంచాయితీ అరుగు మీద కూర్చోనున్నప్పుడు ఊళ్ళో ఎలిమెంట్రీ స్కూల్లో పని చేసే 'మారుతీసారు' పలకరించాడు. "బాగాలేదంట గదా. ఏంది సంగతి?" అన్నాడు. ఊగులోడు కతంతా చెప్పాడు. అంతా విని "ఒకసారి గుంటూరు పోయి మంచి 'న్యూరాలజిస్ట్' ని కలిస్తే ఎందుకైనా మంచిదేమో, కరెంటు వైరుల్లో కనెక్షన్ లూజయినప్పుడు లైట్లు ఆరిపోయి వచ్చినట్లే ... తలలో నరాల్లో ఏదైనా లూజు కనెక్షనుండి అప్పుడప్పుడు నీకు ఏదైనా కనపడకుండా ఉంటుందేమో" అన్నాడు. దెబ్బకి చచ్చాడు ఊగులోడు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టయింది.

అసలే ఒక అనుమానంతోనే సతమతమవతంటే తల్లో ఏదో నరాల జబ్బేమో అని కొత్త డౌటు రేగిందిప్పుడు. ఆ సారు చెప్పిన ఉదాహరణ గుర్తొచ్చినప్పుడల్లా ఆ కొత్త డౌటు కూడా నిజమయ్యే అవకాశం బాగా ఎక్కువగానే ఉన్నకనపడతంది. 'ఎంతైనా మాస్టారు గదా. సరిగ్గా సరిపొయ్యే ఉదాహరణతో బలే అర్ధమయ్యేట్టు చెప్పాడు' అనుకున్నాడు

ఆ పూట పొద్దు పోయిందాకా ఆ అరుగు మీదే గమ్మున కూర్చోనుండిపోయాడు. మళ్ళీ మళ్ళీ వచ్చి వాలే చీకటీగల్లాగా రకరకాల ఆలోచనలు మనసులో ముసురుకుంటున్నాయ్. అట్లానే కూర్చోని, కూర్చోని ఎప్పటికో లేచి కొంపకి చేరాడు. "రేపు పొద్దున్నే బయల్దేరి గుంటూరు పోయొస్తా. 'వనితా సూపర్ స్పెషాల్టీస్' లొ అన్నీ టెస్టులు బాగా చేస్తారంటా. మారుతీ సార్ చెప్పాడు"

* * *

స్టేషన్ లో రైలు దిగి ఆటో ఎక్కి ఆసుపత్రికి చేరుకున్నాడు. 'వనితా సూపర్ స్పెషాల్టీస్' బోర్డు చదివాడు. రకరకాల రోగాల పేర్లు, వాటికెదురుగా డాక్టర్ల పేర్లు. ఆ రోగాల్లో సగానికి పైగా పేర్లు తనకి తెలియనివే. మెట్లెక్కి లోపలకొచ్చాడు. 'పర్లేదు. రద్దీ తక్కువగానే ఉంది' అనుకున్నాడు. "ఓపిలు రాసేది ఎక్కడ సార్?" ఎవర్నో అడిగాడు. 'ఇక్కడ ఒపీలు రాయరు. ఇది కేవలం పరీక్షలు చేసే బిల్డింగే. అదుగో. ఆ ఎదురుగా ఉంది. అదీ అసలు హాస్పటల్"

అక్కడకి వెళ్ళిన ఊగులోడు ఆ మెట్ల దగ్గర అట్లానే నిలబడిపోయాడు నోరు తెరుచుకోని. తాను దిగొచ్చిన రైల్వే స్టేషన్ కంటే కూడా ఈ ఆసుపత్రే ఎక్కువ హడావుడిగా ఉంది. ఆ జనం మామూలుగా లేరు. 'కొలుపులప్పుడు, తిరునాళ్ళప్పుడు కూడా మానూళ్ళో ఇంత రద్దీగా ఉండదేమో' అనుకున్నాడు.

వొచ్చేవాళ్ళు, పొయ్యేవాళ్ళు, మూలిగేవాళ్ళు, ముక్కేవాళ్ళు, కుర్చీల్లో కూర్చొని టీవీలు చూసే వాళ్ళు, నడవలేకుండా ఉన్నవాళ్ళని చక్రాల మంచాల మీద పొణుకోబెట్టుకొని తోసుకుపొయ్యేవాళ్ళు... –మెల్లగా అడుగులు ముందుకేసాడు. ఎటు వెళ్ళాలో, ఎక్కడ 'ఒపీ' రాస్తారో ఏమి అర్ధమవలేదు. 'ఎనక్కి తిరిగి చూడకుండా ఇట్నించిటే పారిపోదామా?' అనిపించిందొక్క క్షణం.

కొంచం స్థిమితపడి ఒక అద్దాల కౌంటరు దగ్గరకెళ్ళి “"ఒపీలు రాసేదెక్కడండీ?" అనడిగాడు. ఆ అద్దాల వెనకాల ఆమె కంప్యూటర్ మీంచి చూపు తిప్పకుండానే అడిగింది. "ఏం కంప్లయింటు?"

"లూజు కనెక్షన్" అప్రయత్నంగా అనేశాడు మారుతీసారు మాటలు మనసులో తల్చుకుంటున్న ఊగులోడు. "ఆ ...?" ఇప్పుడు తలెత్తిందా అమ్మాయి.

"నరాల డాక్టరుని కలవాలమ్మా?"

"అయితే ఇక్కడే. రెండు వందల రూపాయలివ్వండి" ఇచ్చాడు. పేరు, ఊరు, వయసు కంప్యూటర్లో రాసుకుంది.

'నాకు కార్డేమి ఇవ్వలేదు' గుర్తు చేశాడు.

"అదిగో, ఆ పదమూడో నంబరు గది ముందుకెళ్ళి కూర్చోండి. మీ ఫైలు అక్కడికే తీసుకొచ్చి ఇస్తారు."

"నా నంబరెంతమ్మా?" అని అడిగాడు.

"యాభై రెండు"

'వామ్మో! 51 మంది అయిపోయ్యేడదెప్పుడు ... నా వంతు వచ్చేదెప్పుడు.. సరే, కానియ్ – రోట్లో తలపెట్టినాక రోకలి పోటుకి భయపడితే ఎట్లా' అనుకొని పదమూడో నంబరు రూము దేవులాడుకుంటూ బయల్దేరాడు.

కొంచం ముందుకెళ్ళి కుడివైపు తిరిగింతర్వాత కనపడిందా రూము. తలుపు మీద 'డా. పి. మమతా, న్యూరాలజిస్ట్' అని బోర్డు రాసుంది. రూం ఎదురుగ్గా ఉన్న కుర్చీలన్నీ నిండిపోయున్నాయి. ఎత్తుగా అమర్చి ఉన్న టివీలో 'రబ్బరు గాజులు రబ్బరు గాజులు' అని పాట వస్తంది. అసలు ఆసుపత్రుల్లో టీవీలెందుకో ఊగులోడికర్ధంకాదు. ఇక్కడ కొచ్చేది బాధలతో ఉన్నవాళ్ళు గదా... ఇక్కడ ఇట్లా టీవీలు పెట్టుకుని వాటిల్లో పాటలు, సినిమాలు చూసుకుంటా నర్సులు కూర్చోనుంటే 'మీ చావు మీరు చావండి. మాకేంది?' అని అంటన్నట్లే అనిపించదూ?

అవతలోళ్ళు పట్టించుకోటల్లేదని తెలిసినప్పుడు బాధలు భయాలు ఇంకా ఎక్కువగా అనిపిస్తాయి గదా కష్టాల్లో ఉన్నవాళ్ళకి!

కూర్చోడానికి లేకపోయేసరికి అక్కడే అటూ ఇటూ తిరిగి చూస్తున్నాడు. ఒక పక్కన పెద్ద 'వెంకటేశ్వరస్వామి' బొమ్మ పెట్టి ఉంది. ఊగులోడు దణ్ణం పెట్టుకున్నాడు. అన్ని పరీక్షల్లో తనకు ఏ జబ్బు లేదనే రావాలని, అట్లాగొస్తే కొండ కొచ్చి గుండు కొట్టించుకుంటానని మనసులోనే మొక్కుకున్నాడు. మళ్ళీ అంతలో 'అసలు ఆసుపత్రుల్లో దేవుడి బొమ్మలు పెట్టడమేందా' అనుకొన్నాడు. ఆలోచిస్తా ఉంటే అసలు కారణం తట్టింది. వైద్యం ఫలించి జబ్బు తగ్గితేనేమో తామే దేవుళ్ళమనొచ్చు. తగ్గక పోతే మాత్రం 'మాదేముందీ, అదిగో, అంతా ఆ దేవుడి లీల' అనొచ్చు. అక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచీ ఊగులోడిలో కలుగుతున్న అసహనం ఈ ఆలోచనలతో ఇంకా ఎక్కువవడం మొదలు పెట్టింది.

అంతలో ఒక నర్సొచ్చి తన పేరు పిలిచింది. వెళితే ఊరంతా వెడల్పున్న ఒక ఫైలు చేతిలో పెట్టింది. అంత లావు ఫైలు తన చేతుల్లో చూసినాక తనకేమీ రోగం లేదని చెప్పినా కూడా ఊళ్ళో ఎవరూ నమ్మరేమో అనుకున్నాడు. చేంతాడంత రోగాల జాబితా రాసినా కూడా ఆ ఫైల్లో ఇంకా చోటు మిగిలే ఉంటుందనిపించింది.

నంబర్లవారీగా రూంలోకి పిలుస్తున్నారు. ముగ్గురైపోయారు. తన నంబరొచ్చే సరికి ఎట్టలేదన్నా మజ్జానమయిద్దని లెక్కేసుకున్నాడు. గోడలు, గోడల మీద బోర్డులు అన్నీ చూడ్డం మొదలు పెట్టాడు. పదమూడో నంబరు రూం గోడ బయట ఒక బోర్డు పెట్టి ఉంది. ’ఐన్ స్టీన్ ‘, ‘న్యూటన్’, ‘అలెగ్జాండర్’ – వీళ్ళంతా తమకున్న మూర్ఛరోగాన్ని జయించిన వాళ్ళే. మందుల బలం కంటే మానసిక బలంతో వాళ్ళు దాన్ని సాధించారు.’

'తనకే అట్లాంటి పరిస్థితొస్తే తను మానసిక బలం చూపించగలడా? అంత మానసిక బలమే ఉంటే అసలు ఇప్పుడిక్కడికి రానేరాడేమో! పెద్దగా రోగం లక్షణాలేమీ కనపడకపోయినా లేని పోనీ అనుమానాలు పెట్టుకుని వొచ్చాడేమో! ఇప్పుడైనా ఏం పోయింది. పోతే పోయింది రెండొందలు. ఇంటికెల్తే....'

కాసేపు మనసు అటూ ఇటూ ఊగిసలాడింది. అంతలోకి మారుతీసార్ గుర్తొచ్చాడు. ఆయనన్నట్లు లూజు కనెక్షనై, నయం చేయించుకోవడం ఆలస్యమయితే సీరియస్సయిపోద్దెమోననిపించింది. ‘సరే, కానియ్’ అనుకున్నాడు. భార్యని తోడు తెచ్చుకోకుండా ఒక్కడే రావడం పొరపాటయిపోయిందని చింతించాడు.

కొంచం అలా వరండా చివరకు నడిచాడు. అక్కడ గోడకి నిలువెత్తు ఫోటో పెట్టి ఉంది. 'డాక్టరోళ్ళ నాన్నేమో!' ఆ ఫోటో కింద రాసుంది. "స్వాతంత్ర్య సమర యోధులు, తామ్రపత్ర గ్రహీత, ప్రముఖ కాంట్రాక్టరు శ్రీ డా. వంగవరపు వెంకటరామారావు". 'స్వాతంత్ర్య సమర యోధుడు మరి కాంట్రాక్టరెట్లా అయ్యోడో..! ఆ రోజుల్లో మంచోళ్ళు కూడా కాంట్రాక్టులు చేస్తుండేవాళ్ళేమో!'

* * *

'నంబర్ 50' నర్సు పిలిచింది. ఇంకో రెండు పేర్లు అయిపోతే తనదొస్తుంది. తలుపు తీసేటపుడు, వేసేటపుడు లోల్నుంచీ కుర్ర డాక్టరొకాయన కనబడుతున్నాడు. 'డాక్టర్ మమత దగ్గర చూయించుకోవాలని గదా తను ఒపీ రాయించుకుంది. వీడెవడు?' అని అనుమానమొచ్చింది. ఆ విషయమే వాకిలి దగ్గర పీట మీద కూర్చున్న నర్సుని అడిగితే ఆమె చెప్పింది. "ముందు ఈ చిన్న డాక్టరు చూస్తారు. చూసి ఏమేం టెస్టులు చేయించుకోవాలో రాసిస్తారు. వెళ్ళి ఆ టెస్టులు చేయించుకొనొచ్చాక అప్పుడు పెద్ద డాక్టరమ్మగారు చూస్తారు."

అంతలో లోపలికి పిలుపొచ్చింది. వెళ్ళాడు. "ఆ. ఆఖరుసారి ఎప్పుడు ఎటాక్ కనబడింది?" అనడిగాడు డాక్టరు. "అసలు తనకొచ్చింది ఎటాకో, కాదో తెల్సుకోవాలనొస్తే ఎప్పుడు ఎటాకని అడుగుతాడేందిరా ఈడు?" అనుకున్నాడు ఊగులోడు. మొత్తం జరిగిందంతా చెప్పాడు. అనుమానం మీద వచ్చానన్నాడు. ఆ డాక్టరు ఊ అన్లేదు, ఆ అన్లేదు... అర్ధమెందో తెలియకుండా తలూపాడు. పేపరొకటి తీసుకుని బరా బరా ఏదో గీకాడు.

కాగితం చేతిలో పెట్టి 'నెక్ట్స్' అంటూ బెల్లు కొట్టాడు. "ఏంది సార్ ఏం కాయితం, ఏం చెయ్యాలి నేనిప్పుడు?" అని అడిగాడు ఊగులోడు. "బయట నర్సు చెప్తుంది. పొండి" అన్నాడు. బయటకొస్తే ఆమె చెప్పింది. "11వ నంబరు కౌంటరు దగ్గరికి పోయి ఈ కాయితం ఇవ్వండి. వాళ్ళు ఎంత డబ్బులివ్వాలో చెబుతారు. డబ్బులిచ్చేసి రశీదు తీసుకోండి." 'అది ఏం కాయితం? ఆ కౌంటరెక్కడుంది' అని అడగబోతున్నంతలోనే ఆమె హడావుడిగా లోపలికి పోయింది.
చిన్నప్పుడు సింగరకొండ తిరనాల్లో తప్పిపోయినప్పుడు ఎట్లా అనిపించిందో ఇప్పుడూ అట్లానే అనిపిస్తుంది ఊగులోడికి. ఆ వరండాలో ఇట్నుంచి అటు ఎక్కడ చూసినా 11 వ నెంబరు కౌంటరు కనబడలేదు. ఇదంతా చూస్తున్న ఒకాయన ఆ కౌంటరు పై అంతస్తులో ఉంది, పొమ్మని చెప్పాడు. మెట్లెక్కి పైకెళ్ళాడు.
'ఇన్వెస్టిగేషన్, బిల్లింగ్ కౌంటర్' అని ఎర్రక్షరాలతో రాసిన బోర్డుందక్కడ. ఆ కౌంటర్ దగ్గర చేంతాడంత 'క్యూ'లు రెండు ఉన్నాయి. క్యూలో నిలబడి తన ముందున్నాయన్ని అడిగాడు. "ఈ కాగితంలో రాసినయ్యేంట"ని. "మనం చేయించుకోవాల్సిన టెస్టులండీ. ఈ టెస్టుల తాలూకూ బిల్లు ఇక్కడ కట్టేసి ఆ ఎదురుగ్గా ఉన్న బిల్డింగులో కెళ్తే అక్కడ టెస్టులు చేస్తారు" ఈ విషయం రూంలోకి వెళ్ళకముందే తనకు నర్సు చెప్పింది గదా అని అప్పుడు గుర్తుకొచ్చింది.

క్యూ మహా రద్దీగా ఉంది. ఊగులోడి మనసు అంతకంటే రద్దీగా ఉంది. ఏం టెస్టులు రాశాడో, ఎంత బిల్లవుద్దో అని ఆలోచిస్తున్నాడు. అక్కడ గోడకి రంగు రంగుల బోర్డులు తగిలించున్నాయి. 'వనితా సూపర్ స్పెషాలిటీస్ వారి బంపర్ ఆఫర్. కంప్లీట్ బాడీ చెకప్ ... అసలు ధర రు. 2,290. మీ కోసం తగ్గింపు ధర రు.1000 మాత్రమే. రు. 7,500 ఖరీదైన డయాబెటిక్ టోటల్ చెకప్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో రు. 5000 మాత్రమే.'

ఈ బోర్డులు చూసిన ఊగులోడికి మతిపోయింది. మేదరమెట్ల బస్టాండు ముందు చక్రాల బండి పెట్టుకొని "ఏ వస్తువైన పది రూపాయలే" అని అరిచే మస్తాను గుర్తొచ్చాడు. 'ఈ చెకప్పులేంది... ఈ ధరలేంది... ఈ డిస్కౌంట్ లేంది....' ఊగులోడికి ఆ ఆస్పత్రి బందిపోటు దొంగల హెడ్డాఫీసులాగా కనపడసాగింది.

కౌంటర్ లో కంప్యూటర్ ముందు కూర్చున్న అమ్మాయి ఊపిరాడకుండా పనిచేస్తంది. డబ్బులు కట్టలు కట్టలు తీసుకుని సొరుగులో పెట్టుకుంటంది. టకటకా రశీదులు కొట్టిస్తంది. అయినా ఆ వేగం సరిపోవట్లేదు. ముగ్గురు నలుగురు తోసుకోనొచ్చి ఒకేసారి కౌంటర్ రంధ్రంలో చేతులు పెట్టారు. నా డబ్బులు ముందు తీసుకోమంటే నావి ముందు తీసుకోమని గొడవ పెడుతున్నారు.

ముందు నన్ను దోచుకొమంటే ముందు నన్ను దోచుకోండని బతిమలాడుకుంటన్నట్లు ఉంది. ఇంతలో కౌంటర్లోని అమ్మాయి గట్టిగా ఒక్క కసురు కసిరింది. "లైన్లో రాండయ్య, లైన్లో వస్తేనే దోచుకొనేది. ముందొచ్చినోళ్ళనే ముందు దోచుకొంటాం. వెనకొచ్చినోళ్ళను ముందు దోచుకోమంటే ఎట్లా కుదురుద్ది?" అని కోప్పడుతున్నట్లుగా ఉంది.

ఊగులోడి వంతు వచ్చింది. "3906 రూపాయలివ్వండి" అందామె అతని చేతిలోని కాయితం చూసి. డబ్బులిచ్చి రశీదు తీసుకుని బయటకొచ్చి ఎదురుగ్గా ఉన్న టెస్టులు చేసే బిల్డింగ్ లోకి పరుగెత్తుకెళ్ళాడు.

అక్కడా జనం తిరనాలగానే ఉన్నారు. ఏ టెస్టు ఎక్కడ చేస్తారో, ఎవరెటు వెళ్ళాలో చెప్పేవాళ్ళెవరూ లేరు. ఎందుకు లేరో ఊగులోడీకర్ధమయింది. ముందుగానే కట్టించేసుకున్నారు కాబట్టి వాళ్ళకి బాధేమి లేదు. తాపీగా ఉన్నారు. డబ్బులు కట్టేశారు కాబట్టి టెస్టులు చేయించుకోవాల్సిన జనానికి ఆదుర్దా.
ఎట్లాగో కనుక్కుని టెస్టులు చేసే దగ్గరకు పోయాడు. రక్తపరీక్షకు రక్తమిచ్చాడు. ఒంటేలు పరీక్షకు బుడ్డి తీసుకొని పోయి నింపుకొచ్చాడు. తల స్కానింగ్ తీసే రూం దగ్గరకొచ్చాడు. అక్కడ ఎవ్వరూ లేరు. 'వీళ్ళెప్పుడొస్తారు' అని ఎవర్నడిగినా ఎవరూ ఏమి చెప్పట్లేదు. ఏం జెయ్యాలో అర్ధం కాక అటూ ఇటూ తిరుగుతుంటే 'అంత లోకి ఆ ఇఇజీ పరీక్ష చేయించుకొని రాండి' అని చెప్పాడు రక్త పరిక్ష కౌంటరులో కూర్చున్న అబ్బాయి.

ఆ పరిక్ష చేసే గది కింద అండర్ గ్రౌండ్ లో ఉంది. మెట్లు దిగి కిందికెళ్ళాడు. ఆ గది బయట బెంచీ మీద అప్పటికే నలుగురు కూర్చుని ఉన్నారు. వెళ్ళి పక్కనే కూర్చున్నాడు. 'తలక పోసుకున్నావా?' అని అడిగాడు పక్కన కూచున్నాయన. "పోసుకోలా" నూనె రాసుకున్న తలను తడుముకుంటూ చెప్పాడు ఊగులోడు. "ఈ పరిక్ష చెయ్యాలంటే తలలో జిడ్డుండకూడదంట. అదిగో, ఆ పక్కన బాత్రూముల దగ్గర ఆయా ఉంటది. ఎంటికలమటికి షాంపూతో కడుగుద్ది పో" అని చెప్పాడు. బాత్రూముల కెల్లి పోయే సరికి ఆయమ్మ ఎదురొచ్చింది. "ఏందయ్యా తలకపోయాల్నా?" అంది. ఆమెను చూస్తే ఊగులోడికి ప్రాణం లేచొచ్చింది. ఆ ఆస్పత్రిలో అడుగు పెట్టింతర్వాత 'ఫలానా పని కావాలా' అని దయగా అడిగిన మొట్టమొదటి మనిషి ఆమే!

తలక పోసుకోనొచ్చి పరిక్ష చేసే గది బయట కూర్చొని ఆరబెట్టుకున్నాడు. ఒక గంటకి తన వంతొచ్చింది. తలంతా ఏదో బంకలాంటిది పూసి క్లిప్పులు పెట్టి ఒక అరగంట సేపు ఏదో మిషను కింద పడుకోబెట్టారు. ఒక రిపోర్టు ఇచ్చారు. అది ఒక పెద్ద పుస్తకం లాగా ఉంది. పేజీల నిండా ఏంటియ్యో ఎగుడుదిగుడు గీతలే.

తలకి పూసిన బంక పోవాలంటే మళ్ళీ షాంపూతో కడుక్కోవాల్సిందేనని చెప్పారు. ఆయమ్మ సాయంతో తల శుభ్రంగా కడుక్కున్నాడు. "ఒక పది రూపాయలియ్యయ్యా ...." అనడిగిందామె. 20రూపాయలు తీసి ఆమె చేతిలో పెట్టి మెట్లెక్కి పైకొచ్చాడు. తల స్కానింగ్ చేయించుకుని ఆ రిపోర్ట్ కూడా తీసుకున్నాడు. అక్కడ కూడా ఏదో పెద్ద యంత్రం కింద పడుకోబెట్టారు. అలా పడుకున్నప్పుడు పై నుంచి మిషనేదో దిగుతుంటే... ఏ భూతమో వచ్చి గుండెల మీద కూర్చుని నొక్కెస్తున్నట్లు ఉంది ఊగులోడికి.

పరధ్యానంగా రిపోర్టులన్నీ తీసుకుని మెయిన్ ఆసుపత్రిలోనికొచ్చాడు. పదమూడో నంబరు గది ముందుకొచ్చాడు. తనలాగే పొద్దున చిన్న డాక్టరుకి చూయించుకుని టెస్టులన్నీ చేయించుకొనొచ్చి పెద్ద డాక్టరు గారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారందరూ. ఒక కుర్చీ ఖాళీగా కనబడ్డంతో దాంట్లో కూలబడ్డాడు.

ఊగులోడి మనసంతా గందరగోళంగా ఉంది. తను అనవసరంగా తొందరపడి వచ్చాడేమో అని పదే పదే అనిపించసాగింది. రిపోర్టులన్నీ చూసి ఏం చెబుతారో అని భయం వేస్తంది. 'ఏమీ లేకపోయినా ఏదో రోగముందని చెబుతారేమో. ఎట్లారా నాయనా' అనుకుంటున్నాడు. 'ఇక్కడ కాలు పెట్టిందగ్గర్నించి ఎటు చూసినా వ్యాపారమే గదా కనపడింది' అని మాటి మాటికీ అనుకుంటన్నాడు.

పక్క కుర్చీలో కూర్చున్నాయన ఆ పక్కనాయనతో చెప్తున్న మాటలు చెవుల్లో పడుతున్నాయ్. "దొంగనాయాళ్ళు! తగ్గుద్దని చెప్పి జాయిన్ చేసుకున్నారు. నెల రోజుల్నుంచీ రోజుకి మూడు వేల రూపాయల కాడికి బిల్లు వేసి తీరా ఇప్పుడు 'లాభం లేదు, తీసుకెళ్ళిపొండి' అంటన్నారు. 'మనం ఏం చేసినా ఇంకో నెల రోజుల కంటే బతకడు' అని ఊళ్ళో ఎమ్బీబియ్యెస్ డాక్టరు చెబితే వినకుండా ఇక్కడికి తీసుకొచ్చి నిలువునా మోసపోయాం."

ఊగులోడి బుర్ర గిర్రున తిరిగిపోతంది. 'ఒకేల ఆ రిపోర్టుల్లో నిజంగానే తన తలలో ఏదో తేడా ఉందనోస్తే..?' 99 పాళ్ళు ఏ తేడా ఉండదనే అనిపిస్తంది. ఒక పాలు అట్టాంటిదేమైనా ఉంటే కనబడకుండా ఏం ఉండదు గదా. అప్పుడే చూసుకోవచ్చు. అసలు పక్కనే ఉన్న మేదరమెట్లకు పోయి మామూలు డాక్టరుకి చూయించుకోకుండా ఈ ‘సంతాసుపత్రి’కి రావడమే పెద్ద తప్పు.

"నెంబరు 50" రూము బయటకొచ్చి నర్సు పిలుస్తా ఉంది. ఇంకో రెండు నంబర్లు పిలిస్తే తన వంతొస్తుందనగా ఊగులోడు మెల్లగా లేచాడు. సంచి తీసుకోని మెట్లు దిగి బయటకొచ్చి ఆటో ఎక్కాడు. స్టేషనుకొచ్చి ఊరెళ్ళే రైలెక్కాడు.

(నవ్యవీక్లీ డిసెంబరు 2010 సంచికలో ప్రచురితం)

2 కామెంట్‌లు: